పనీర్ - పెప్పర్ ఫ్రై

 


పనీర్ వంటకాలు అటు రైస్ లోకి ఇటు చపాతీలోకి రెండిటిలోకి చాలా మంచి కాంబినేషన్. అందుకే మిరియాల ఘాటు పనీర్ కమ్మదనం రెండింటిని కలుపుతూ చేసే ఈ పనీర్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం.


కావాల్సిన పదార్థాలు:


పనీర్ - 1 కప్పు

కాప్సికం - 1/4 కప్పు

ఉల్లిపాయ - 1/4 కప్పు

టమాటా ప్యూరి - 1/2 కప్పు

మిరియాలు - 1స్పూన్

సోంపు - 1/4 స్పూన్

జీలకర్ర - 1 స్పూన్  

వెల్లుల్లి రెబ్బలు - 2

 

తయారి విధానం:

ముందుగా కాప్సికం, ఉల్లిపాయల్ని ముక్కలు తరిగి పెట్టుకోవాలి. మిరియాలు, సోంపు రెండిటిని కలిపి పొడి చేసి ఉంచుకోవాలి. టమాటా ప్యూరి కూడా రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనే వేసి కాగాకా జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. అందులో టమాటా ప్యూరి వేసి పచ్చి వాసన పోయేదాకా ఉంచాలి. అందులో ఉప్పు పసుపు జతచేసి తరిగిన ఉల్లిపాయ, కాప్సికం ముక్కలు కూడా వేయాలి. అవి 3 నిమిషాలు వేగాకా అందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న మిరియాలు, సోంపు పొడిని వేయాలి. అన్నీ వేగాకా అందులో పనీర్ ముక్కలు వేసి  మూతపెట్టి సన్నని మంట మీద 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే మూత తీసేసరికి  కమ్మని వాసనతో కలర్ ఫుల్ గా తయారయిన పనీర్ పెప్పర్ ఫ్రై మీ ముందు రెడీగా ఉంటుంది.

    - కళ్యాణి