కచోరి

 

 

కచోరి చూడటానికి మన పూరీలా ఉంటుంది. కానీ లోపల స్టఫ్ తో దాని రుచే మారిపోతుంది. పైగా దానిని మైదాతో చేస్తారు. లోపల పెట్టే ఫిల్లింగ్ ను బట్టి కచోరి రుచి మారుతుంది. ఆలు దగ్గర నుండి మనకి నచ్చిన రకరకాల మసాలాలు కూరలతో ఈ కచోరీలు చేసుకోవచ్చు. అయితే మూంగ్ దాల్ తో కచోరీలు చేయడం ఫేమస్. అవి రుచిగా కూడా ఉంటాయి. ఈరోజు ఆ కచోరీ తయారీ గురించి చెప్పుకుందాం. ఈ కచోరీల తయారీకి కావలసిన పదార్థాలు  ఇవి...

 

* మైదా           - 1 గ్లాస్

*  నెయ్యి          - ౩ స్పూస్

*  వంట సోడా      - చిటికెడు

*  ఉప్పు             - తగినంత

*  పెసరపప్పు     - పావుకప్పు

*  శెనగపిండి       - ౩ స్పూస్

*  ధనియాలపొడి   - కొద్దిగా

*  కారం               - రుచికి తగినంత

*  పసుపు        - చిటికెడు

*  కొత్తిమీర        - తగినంత

*  పుదీనా         - తగినంత

*  మామిడిపొడి - చిటికెడు

*  సోంపు            - 1 స్పూస్

*  నూనె             - తగినంత

*  మంచినీరు       - తగినంత

తయారీ విధానం..

1. ముందుగా మైదా, ఉప్పు,  వంట సోడా, నెయ్యి తగినంత నీరు పోసి పూరీల పిండిలా కలపాలి .

2. పెసరపప్పుని కొంచం ఉడికించి పెట్టుకోవాలి .

౩. ఒక బాణలిలో రెండు స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాకా ముందుగా సోంపు వేసి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేయాలి.

4. అది కాస్త వేగాకా శనగపిండితో పాటు ధనియాలపొడి, కారంపొడి, పసుపు, మామిడిపొడిలను కూడా కలిపి బాగా వేయించలి.

5. అ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసి దించే ముందు ఉప్పు వేసి కలిపి దించేయాలి. కచోరిలో నింపే మిశ్రమం సిద్దం అయినట్టే.

6. మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక్కొక్క ఉండని చేతిలోకి తీసుకొని బొటన వేలితో మద్యలో కచోరి మాసాలాని నింపాలి. ఆ తర్వాత  ఆ మాసాలాని పూర్తిగా అంచులతో మూసేయాలి.

7. లోపల మసాలా, పైన మైదా ఉన్న ఈ  ముద్దని వేళ్లతో నెమ్మదిగా వత్తుతూ వెడల్పుగా చేసి వేడి వేడి నూనెలో వేసి వేయిస్తే కచోరి సిద్దమయినట్టే పుదీనా చట్నీ, స్వీట్ చట్నీలతో తింటే బాగుంటుంది.

8. కచోరిల పొంగి మధ్యలో మసాలా తగులుతూ రుచిగా వుంటుంది. కావాలంటే వేగిన కచోరిల పైన చిన్న కన్నం చేసి అందులో స్వీట్ చట్నీ, పెరుగు కొంచం పుదీనా వేసి సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

 

--రమ