జింజర్ కుకీస్(Christmas Special)

 

 

కావలసిన పదార్ధాలు:

వెన్న (బటర్)        -     200 గ్రాములు
కేస్టర్‌ చక్కెర          -    125 గ్రాములు
మైదాపిండి            -    250 గ్రాములు
అల్లంపొడి             -    2 టీస్పూనులు
దాల్చినపొడి          -    ½ టీస్పూను

 

తయారుచేసుకునే విధానం:

* ముందుగా వెన్నని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ వెన్న మరీ గడ్డకట్టుకుపోయి కానీ, కరిగిపోయి కానీ ఉండకుండా చూసుకోవాలి.

* ఇప్పుడు కేస్టర్‌ చక్కెని (caster sugar) తీసుకుని వెన్నలో బాగా కలపాలి. రెండూ బాగా కలిసిపోయి మెత్తగా మారేంతవరకూ కలుపుతూనే ఉండాలి.

* ఇలా తయారుచేసుకున్న పదార్థానికి పిండిని జోడించాలి. పిండిని కలుపుతుండగానే అల్లంపొడినీ, దాల్చినపొడినీ కూడా కలపాలి.

* ఇప్పుడు ఈ మొత్తం పదార్థాన్నీ శుభ్రమైన బల్ల మీదకి చేర్చాలి. మీ చేతులు కూడా శుభ్రంగా ఉన్నాయో లేదో గమనించుకోండి.

* బల్ల మీదకి చేర్చిన పిండిని చేతులతో ఒత్తుతూ అవసరం అయితే కాస్తంత నీటిని కూడా చిలకరించాలి. అలా చిలకరిస్తూ పిండిని ముద్దలా తయారుచేసుకోవాలి.

* ఇప్పుడు ఆ పిండి మొత్తాన్నీ ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి పెట్టుకోవాలి. ఇలా చుట్టిన పిండిని ఫ్రీజర్‌లో ఓ రెండు గంటలు ఉంచాలి.

* రెండు గంటల తరువాత ఫ్రీజర్‌లోంచి గట్టిపడిన పిండిని బయటకు తీసి, దానిని బటర్‌ పేపర్‌లో ఉంచాలి. దానిని అప్పడాల కర్రతో కానీ రోలింగ్ పిన్‌తో కానీ ఒత్తాలి. పిండి ఒక అర అంగుళం మందానికి చేరుకునేదాకా ఇలా ఒత్తుతూనే ఉండాలి.

* ఇలా ఒత్తిన పిండిని వేర్వేరు ఆకారాలలో కత్తిరించుకోవాలి. మిగతా పిండిని కూడా ఒత్తుతూ కావల్సిన ఆకారాలలోకి మార్చుకోవాలి.

* ఇప్పుడు మన దగ్గర వేర్వేరు ఆకారాలలో ఉన్న పిండిని ఓవెన్‌లో 170 డిగ్రీల వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. అంతే రుచికరమైన జింజర్‌ కుకీస్‌ రెడీ! వీటిలో మీరు కూడా క్రిస్‌మస్‌కు స్వాగతం చెప్పేయండి.