అటుకులతో లడ్డు (కృష్ణాష్టమి స్పెషల్)

 

 

కావాల్సిన పదార్ధాలు:-

అటుకులు               - 1కప్పు
బెల్లం                     - 3/4 కప్పు
నెయ్యి                    - 4 చెంచాలు
డ్రై ఫ్రూట్స్                - పావుకప్పు
గుల్ల శెనగపప్పు        - కొద్దిగా 1/4 కప్పు
కొబ్బరి                   - కొద్దిగా
ఇలాచీ పొడి             - కొద్దిగా

 

తయారీ విధానం...

* ముందుగా బాణలిలో అటుకులు కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

* ఇప్పుడు అదే మూకుడులో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ బాదం, పిస్తా, కాజూ వేయించుకోవాలి.

* బెల్లం సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఈలోగా అటుకులు కాస్త చల్లారతాయి.

* మిక్సీ తీసుకొని ముందుగా గుల్ల శెనగపప్పు వేసి కొద్దిగా నలగగానే అటుకులను వేసి తిప్పాలి. వెంటనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అన్నీ మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండగానే తీసి ఎండుకొబ్బరి తురుము కలపాలి. (ఎండుకొబ్బరి తురుము అయితే అలానే కలిపేసుకోవచ్చు.. పచ్చి కొబ్బరి తురుము అయితే ఒకసారి వేయించి కలుపుకోవాలి).

* చివరిలో బెల్లం తురుము, ఇలాచీ పొడి, నెయ్యి వేసి చేతితో మెదుపుతూ ఉండలు చుట్టుకోవాలి.

* బెల్లం తగ్గించి.. పచ్చి ఖర్జూరం ముక్కలు వేసి కూడా ఈ ఉండలు తయారు చేసుకోవచ్చు.

ఇవి కృష్ణునికి అష్టమిరోజు నైవేద్యంగా సమర్పించి..మీరూ తిని ఆనందించండి.. చాలా రుచిగా ఉంటాయి ఈ లడ్డూలు..

 

-భారతి