RELATED NEWS
NEWS
రండి అండగా నిలబడదాం... కృష్ణ కుటుంబానికి బాసటగా నిలుద్దాం.. : నాట్స్ పిలుపు

కృష్ణమూర్తి సూరె(భరణి)... ఎన్నో ఆశలతో, ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వచ్చారు. న్యూజెర్సీలోని ఎడిసన్ లో నివాసం ఏర్పరచుకున్నారు. ప్రుడెన్షియల్ కంపెనీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజర్ గా చేరారు. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ప్రాణాంతకమైనప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కృష్ణను వెంటాడింది. కొన్నాళ్ల పాటు క్యాన్సర్ తో పోరాడి 2015 అక్టోబర్ 18న కన్నుమూశారు.

కృష్ణ ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. అమెరికా వెళ్లాలనే కలను సాకారం చేసుకుని కుటుంబ బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు. తన నేపథ్యం ఏంటో తెలుసు కాబట్టి ఎన్నడూ గొప్పలకు పోకుండా సామాన్యుడిగా, మనిషిగా మరొకరికి సాయం చేయడమే పరమార్థం అనే భావనతో మెలిగారు. అమెరికాలో తెలుగు కమ్యూనిటీ తరపున జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా, చురుగ్గా పాల్గొన్నారు. సిలికానాంధ్ర మనబడిలో ఉపాధ్యాయునిగా కూడా చేశారు.




ఇంటికొస్తే భార్య కుమారి సూరె, పదేళ్ల పాప శృతిజ, ఐదేళ్ల స్మరణ్ తోనే లోకం. అలాంటిది, కృష్ణ తమ మధ్య లేడని తెలిసే సరికి అంతులేని ఆవేదన, అనిశ్చితి ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడనే కఠిన వాస్తవాన్ని జీర్ణం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, కృష్ణ కుటుంబాన్ని మానసికంగా, ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు వారిగా, ప్రవాస భారతీయులుగా ప్రతి ఒక్కరిపైనా ఉంది. పుట్టిన ఏ మనిషీ అనాథ కాడు. ఓ మనిషి వెళ్లిపోయినంత మాత్రాన ఉన్నవాళ్లు అనాథలుగా మారకూడదు. ఆ ఆత్మస్థైర్యం, ధైర్యం కల్పించాల్సింది మనమే.

 ఓదార్పు ఊరటనివ్వొచ్చు. కుటుంబం నిలబడాలంటే మాత్రం మనిషికి మనిషి సాయంగా నిలబడాలి. అందుకే, మనమంతా కలిసి కృష్ణ కుటుంబానికి తోచినంత ఆర్థిక సాయం చేద్దాం.




 ఉత్తర అమెరికా తెలుగు సంఘం... సిలికానాంధ్ర మన బడి, ఇతర తెలుగు అసోసియేషన్ల సహాయంతో కృష్ణమూర్తి సూరె కుటుంబానికి అండగా నిలబడింది. ఇదే సందర్భంలో కృష్ణ కుటుంబానికి మరింత ఆర్థిక సాయం కోసం ఈ-మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా, పత్రికా ముఖంగా విరాళాలు సేకరించాల్సిందిగా నాట్స్ విజ్ఞప్తి చేస్తోంది. తెలుగువారికి సాయం చేయడమే పరమావధిగా పనిచేస్తున్న నాట్స్... కృష్ణ కుటుంబానికి ఎంతో అండదండల నిచ్చింది.  ఈ బాధ్యత అందరి వంతు కూడా. అందుకే, ప్రతి ఒక్క తెలుగువారు కూడా కృష్ణ కుటుంబానికి అండగా నిలబడాలని నాట్స్ కోరుతోంది.

TeluguOne For Your Business
About TeluguOne
;