RELATED EVENTS
EVENTS
ఫీడ్ ది నీడ్ 2016 క్యాంపైన్ కోసం 2,20,000 మీల్స్ ప్యాక్ చేసిన చికాగో తెలుగు అసోసియేషన్

 


ఫిబ్రవరి 20, 2016, చికాగో: 'మాట్లాడే పెదవుల కన్నా సాయం అందించే చేతులు మిన్న' అన్న నానుడిని నిజం చేస్తూ ఆకలితో అలమటించే పిల్లల కోసం తనవంతు సాయం అందించింది చికాగో తెలుగు అసోసియేషన్. ఇలియనోయిస్ లోని అరోరా సిటీలో ఉన్నటువంటి ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ కోసం సీటీఏ ఆధ్వర్యంలోని తెలుగు వారు మీల్స్ ప్యాక్ చేశారు. చికాగో తెలుగు అసోసియేషన్(సి.టి.ఏ), ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఆధ్వర్యంలోని తెలుగు వారు పౌష్టికాహారలోపంతో బాధపడే పేద పిల్లల కోసం 2లక్షల 20వేల మీల్స్ ప్యాకెట్లు రెడీ చేశారు. మొత్తం 650 మంది పిల్లలకు ఏడాది మొత్తం సరిపోయే విధంగా మీల్స్ ప్యాక్ చేశారు. అమెరికాలో చేపడుతున్న సేవా కార్యక్రమాల ప్రాధాన్యతను చికాగో తెలుగు సంఘం అధ్యక్షులు నాగేంద్ర వేగె ఈ సందర్భంగా వివరించారు. సీ.టీ.ఏ, నాట్స్ స్వచ్ఛందంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ఆత్మసంతృప్తిని ఇచ్చే ఈవెంట్ ఇదేనంటూ అభివర్ణించారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద పిల్లల జీవితాలపై ప్రభావం చూపే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని ప్రకటించింది చికాగో తెలుగు అసోసియేషన్. అటు ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ కూడా సీటీఏ చొరవ, సేవా దృక్పథాన్ని మెచ్చుకుంది.

 

 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం చికాగో తెలుగు సంఘం నుంచి వచ్చిన 150 మంది వాలంటీర్లు చాలా శ్రమించారు. ఈ కార్యక్రమంలో సీటీఏ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మదన్ పాములపాటి, సుబ్బారావు పుత్రువు, రాజేష్ వీదులముడి, రామ్ తూనుగుంట్ల, అరవింద్ కోగంటి, మురళి కలగర పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న వాలంటీర్లకు భోజనాలు ఏర్పాటు చేసిన మూర్తి కొప్పాక(ఐడీఏ సొల్యూషన్), మహేష్ కాకరాల(వెన్సర్ టెక్నాలజీ)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

          సీటీఏ ఉమెన్ టీమ్ నుంచి మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బిందు బాలినేని, రాణి వేగె, గీతా కగటి, శ్రీదేవి చిగురుపాటి, భవాని సరస్వతి, హేమ తాతినేని, ప్రియా కన్నా, కౌసల్య గుత్తా, సహానా ఖాన్ ఈ ఈవెంట్ లో పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారు.  ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. ఆకలితో అలమటించే పిల్లల కోసం ఆహారాన్ని అందిస్తోంది. ఇందుకోసం అనాథాశ్రమాలు, స్కూళ్లు, ఆస్పత్రులకు ఆహారాన్ని అందిస్తుంది. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేయించి, స్వయంగా చేతులతో ప్యాక్ చేయించిన న్యూట్రిషన్ ఫుడ్ ను పేద పిల్లలకు అందిస్తోంది ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ.

 



          ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద పిల్లల కోసం చికాగో తెలుగు సంఘం, వాలంటీర్లు అందించిన సహాయసహకారాలను ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ కొనియాడింది.


          ఈ సేవా కార్యక్రమంలో వాలంటీర్లుగా పండు చెంగలశెట్టి, మనోహర్ పాములపాటి, కిరణ్ మొవ్వ, కిరణ్ అంబటి, రాంగోపాల్ దేవరపల్లి, శ్రీరామ్ వన్నెంరెడ్డి, రవీంద్ర చిగురుపాటి, వంశీ మన్నె పాల్గొన్నారు.

          మీల్స్ ప్యాకింగ్ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ చికాగో తెలుగు అసోసియేషన్ సర్వీస్ సర్టిఫికేట్స్ అందించింది.
          సీటీఏ పిలుపునిచ్చిన వెంటనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపిన వారందరికీ చికాగో తెలుగు సంఘం అధ్యక్షులు నాగేంద్ర వేగె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో చికాగో తెలుగు సంఘం ఏర్పడిందని, తెలుగు కమ్యూనిటీకి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు చికాగో తెలుగు సంఘం అధ్యక్షులు నాగేంద్ర వేగె.

TeluguOne For Your Business
About TeluguOne
;