‘రోశయ్య మంత్రివర్గంలో చేరం’
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితిలో ముఖ్యమంత్రి కె రోశయ్య మంత్రివర్గంలో తెలంగాణవారెవరూ కొత్తగా చేరబోరని కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేత, శాసనసభ్యుడు ఆర్.దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ముఖ్యమంత్రి కె రోశయ్య మంత్రి వర్గ విస్తరణ ఆలోచన చేయడం మంచిది కాదని ఆయన గురువారం మీడియా సమావేశంలో అన్నారు. ఉద్యమం తీవ్రంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ నేతలు పదవి తీసుకుంటే తెలంగాణ ద్రోహులవుతారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుంటే పదవులనే కాదు ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పాదయాత్ర చేస్తున్న విద్యార్థి జేఏసీ నాయకులను తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని ఆయన అన్నారు. సాధారణ పౌరులుగా హైదరాబాద్ వస్తే తమకేమీ అభ్యంతరం లేదని, ఉద్యమకారులుగా వస్తే తిరస్కరిస్తామని ఆయన అన్నారు. ఇటువంటి చర్యల ద్వారా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని ఆయన సీమాంధ్ర నాయకులను కోరారు. సమైక్యాంధ్ర నినాదంతో విద్యార్థుల పాదయాత్రను అనుమతించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా ఉంటేనే అంగీకరిస్తామని ఆయన చెప్పారు. విధివిధానాలు ఖరారైన తర్వాతనే తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 6వ తేదీ తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు.

