సేవచేసిన వారికే అన్యాయమా: జయప్రద
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీకి ఎంతో సేవచేసిన అమర్‌సింగ్ ను బహిష్కరించడం అన్యాయమని సినీనటి జయప్రద అభిప్రాయపడ్డారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టే విధంగా లోక్‌సభలో తన వాణీ వినిపిస్తానని జయప్రద మీడియా తో చెప్పారు. ఒక పార్టీ అధ్యక్షుడు తనను అవమానించడం వల్లే ఆ పార్టీని వీడినట్లు గురువారం జయప్రద సంచలన వ్యాఖ్య చేశారు. ఆయన అవమానించడంతోనే తాను ఉత్తరాదికి వచ్చి సమాజ్‌వాదీ పార్టీలో చేరినట్లు ఆమె చెప్పారు. ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల నుంచి కూడా తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ నుంచి తనను బహిష్కరించడం తనకేమీ బాధ కలిగించడం లేదని జయప్రద అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటిపై జయప్రద ఆచితూచి స్పందించారు. కమిటి నివేదిక వచ్చిన తర్వాతే తన అభిప్రాయం చెబుతానని ఆమె అన్నారు. అయితే కేంద్రం ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని, రాష్ట్రంలో పరిస్థితులు దిగజారడానికి అర్థరాత్రి చేసిన ప్రకటనే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.

