ప్రకటనలో జాప్యం
న్యూఢిల్లీ: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల ప్రటనలో జాప్యం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసు కోర్ కమిటీలో చర్చించిన తర్వాతనే కమిటీ విధివిధానాలు వెల్లడవుతాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి పిళ్లై చెప్పారు. కాగా, జస్టిస్ శ్రీకృష్ణ కమిటి విధివిధానాలు ఖరారయ్యాయి. రాష్ట్రపరిస్థితిపై సంప్రదింపుల కమిటి విధివిధానాలపై సోమవారం నాడు హోం మంత్రి చిదంబరం ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమై తుది కసరత్తు జరిపారు. సమావేశానంతరం హోం శాఖ కార్యదర్శి పిళ్ళై మీడియాతో మాట్లాడారు. అయితే కాంగ్రెస్ కోర్‌కమిటి సమావేశం తర్వాత ప్రకటన ఉండవచ్చని ఆయన చెప్పారు. కమిటి కాలపరిమితిని ఏడాదిలోపు ఉండవచ్చునని సూచనప్రాయంగా తెలిపారు. అయితే కమిటీ విచారణకు సమయం సరిపోకపోతే మరికొంత కాలం పొడిగించే అవకాశం లేకపోలేదన్నారు. మొత్తానికి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందని హోం శాఖ కార్యదర్శి పిళ్ళై వివరించారు. విధివిధానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

