‘తెలంగాణ, సీమాంధ్ర రెండు కళ్లు’
ఏలూరు: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు తనకు రెండు కళ్లులాంటివని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం చాలా సున్నితమైందని, అలాగే జటిలమైనదిగా పేర్కొన్నారు. తెలంగాణ సమస్యను కాంగ్రెస్ పార్టీనే పరిష్కరించాలన్నారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని భావస్తున్నానన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధికే టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు. రెండు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీలు రెండుగా చీలిపోయాయని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ అంశంపై మరింత కాలయాపన చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిందని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇంకా తెలంగాణ ప్రజల మనోభావాలు ఇంకా కించపరచొద్దన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజాప్రతినిధుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. రాష్ట్ర విభజనపై మరింత స్పష్టత రావాలన్నారు. కాలపరిమితితో కూడిన ప్రకటన వచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలని నాగం డిమాండ్ చేశారు.

