ప్రజలను పీక్కుతింటున్న సర్కార్
కుప్పం: ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లు అవసరమని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం హైకోర్టులో పసలేని వాదనలు వినిపించడం వల్లే చుక్కెదురైందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఏడాది నుంచి నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నా పట్టించుకోని ప్రధాని, ముఖ్యమంత్రులు ఇప్పుడు సమీక్షలు పెట్టి పరస్పరం నిందలు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు వివిధ బహిరంగ సభల్లో మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై మేము అసెంబ్లీలో అనేక సూచనలు చేశాం. ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. పసలేని వాదనలు వినిపించడం వల్లే రిజర్వేషన్లు చెల్లవంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అని అన్నారు. దొంగలు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలన్నీతిరోగమనంలో సాగుతున్నాయి. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, కార్డుకు 30 కిలోల బియ్యం ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఓట్లు కోసం వద్దన్నా కార్డులిచ్చింది. ఇప్పుడు పనైపోగానే వెనక్కు పీక్కుంటున్నారు. ఇది చాలదన్నట్లు కిరోసిన్, బియ్యం చెక్కెర కోటాలో కోత విధించారు. ఆర్టీసీ చార్జీలు, 2 శాతం వ్యాట్ పెంచి రాష్ట్ర ప్రజల మీద వెయ్యి కోట్ల రూపాయల భారం మోపారు. ప్రజల క్షేమాలు చూడాల్సిన ప్రభుత్వం మద్యం ధరలు పెంచి సామాన్యుల రక్తం తాగుతోంది. జనం నుంచి డబ్బులేలా రాబట్టుకోవాలనే ధ్యాసే తప్ప పేదల సమస్యలు పట్టడంలేదు. ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం పడకేయడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.

