అమర్ సింగ్ కొత్త పార్టీ!
బాలియా: సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ ఈ నెల చివర్లో కొత్త పార్టీ స్థాపించనున్నారు. ఈ నెల 25వ తేదీ లోపు కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరవింద్ సింగ్ వెల్లడించారు. పార్టీ పేరుపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని ఆయన చెప్పారు. శుక్రవారం అరవింద్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమర్ స్థాపించబోయే కొత్త పార్టీకి, సమాజ్‌వాదీ పార్టీకి పేరుతో సహా ఎందులోనూ పోలిక ఉండదు’, తమ పార్టీకి మద్దతు నివ్వాలంటూ ఈశాన్య ఉత్తరప్రదేశ్ లోని అనేక చిన్న పార్టీలతో అమర్ సింగ్ జరిపిన చర్చలు సఫలీకృతం అవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కొత్త పార్టీలో ఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన రాంపూర్ ఎంపీ, సినీ నటి జయప్రద, బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఈయన సతీమణి జయా బచ్చన్, సంజయ్‌దత్‌లు కీలక పాత్ర పోషించవచ్చని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. కాగా, ఎస్పీలో చక్రం తిప్పిన అమర్ సింగ్.. ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ కుమారుడుతో ఏర్పడిన విభేదాల కారణంగా ఎస్పీకి దూరమైన విషయం తెల్సిందే.

