మరుగున పడరాని వాస్తవాలు

Publish Date:Aug 19, 2011

మరుగున పడరాని వాస్తవాలు

 

హజారే - “యథాశక్తి సత్యాగ్రహి/పదోవంతు గాంధీ'' !

-డా. ఎ.బి.కె. ప్రసాద్

 

యుద్ధంలోనే కాదు తప్పుడు సమర్థనల్లో, తప్పుడు వాదనల్లో, పక్కదార్లు తొక్కే ఉద్యమాల్లో మొదటగా బలి అయ్యేది సత్యమే! భారతదేశ చరిత్రలో అత్యుత్తమ నైతిక విలువలతో దీపించిన సత్యాగ్రహులలో గాంధీజీ, జతిన్ దాస్, పొట్టి శ్రీరాములు ప్రాతఃస్మరణీయులు కాగా "సత్యాగ్రహం'' పేరిట ఆ తరువాత బయలుదేరిన, బయలుదేరుతున్న నానా బాపతు ఉద్యమకారులలోగానీ, కొందరు రాజకీయులలోగానీ మిగిలింది స్వార్థపూరిత, ఆగ్రహ, ప్రదర్శనేగానీ సత్యాగ్రహ స్ఫూర్తి కాదు! ఈ కోవకు చెందిన వారిలో "ఇంకుడుగుంటల'' పేరిట ర్యాలిగాం సిద్ధి (మహారాష్ట్ర) గ్రామంలోంచి "గాంధేయవాదిగా, సామాజికకార్యకర్త గా'' బయలుదేరిన అన్నా హజారే కూడా నమోదుకావడం ఆశ్చర్యకరం. ఎందుకంటే, “అవినీతి నిర్మూలనోద్యమం'' ఈనాటిది కాదు, లోక్ పాల్ లాంటి వ్యవస్థ ఏర్పడాలన్న ఉద్యమాలూ ఈనాటివి కావు, గత 45 ఏళ్ళుగా ఈ "లోక్ పాల్'' వ్యవస్థకోసం అనేక రూపాలలో ఆలోచనలూ, ఉద్యమాలూ జరుగుతూ వచ్చాయి.

 

పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రతిపాదనలూ వచ్చాయి, ప్రవేశ పెట్టారుకూడా వీటన్నింటికీ మించి అవినీతి వ్యతిరేక చట్టాలు, ముఖ్యంగా ప్రజాప్రతినిథుల ప్రవర్తనా నిబంధనావళి, ఎన్నికలలో అవినీతి నిర్మూలనకు సంబంధించిన చట్టాలు, ఎన్నికలలో అవినీతిని నియంత్రించగల ఎన్నికల కమీషన్ నిబంధనలూ, జాతీయస్థాయిలో విజిలెన్స్ కమీషన్లూ, వాటితోపాటు అభియోగాలు మోపి అభ్యర్థులను, వ్యక్తులను నియంత్రించి దారికి తెచ్చేందుకు ఉద్దేశించిన రకరకాల సాధారణ చట్టాలూ ఇలా ఎన్నో ఉన్నాయి. అయినా, గమ్మత్తేమంటే అన్ని నిబంధనలనూ, నియంత్రణలనూ, చట్టాలనూ, న్యాయస్థానాలనూ ఉల్లంఘించి, ఎదిరించి మరీ అవినీతి భారత పాలనా వ్యవస్థలో పైనుంచి కిందిస్థాయి దాకా "గుర్రపుడెక్క'' లా అలుముకు పోయింది. ఇందుకు అందరూ కలిసి కారణాలనూ, మూలాలనూ వెతికి స్పష్టమైన ఉద్యమరూపం యివ్వవలసిన తరుణంలో ఉత్తుత్తి పొలికేకలద్వారా, వ్యక్తిగత ప్రతిష్టకోసం ప్రచార "ఆబ'' కొద్దీ గత 45 ఏళ్ళుగా నిద్రపోతూ అకస్మాత్తుగా 'మేల్కొన్న'వాడు అన్నాహజారే.

 ABK prasad, ABK prasad special articles, abk prasad anna hazare, anna hazare abk prasad article, anna hazare satyagraha article, abk prasad telangana true story, manalo maata abk prasad, manalo maata teluguone

పాలకవ్యవస్థ పార్లమెంటులో ప్రవేశపెట్టిన "లోక్ పాల్'' బిల్లు కన్నా తాను రూపొందించిన "జనలోక్ పాల్'' బిల్లును మాత్రమే ఆమోదించాలని పట్టుబట్టి జంతర్ మంతర్ వద్ద నిర్వధిక సత్యాగ్రహం మొదలుపెట్టి మధ్యలో ఉపసంహరించుకుని ఇప్పుడు ఆమరణదీక్షకు కూర్చుంటానని బెదిరిస్తున్నాడు! అవినీతి నిర్మూలనకన్నా, తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆయన ఎక్కువగా పాకులాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మాట నిజం కాకపొతే "జంతర్ మంతర్'' దశలోనే "నేను బ్లాక్ మెయిలర్ ను'' అని బాహాటంగా ప్రకటించుకుని ఉండేవాడు కాదు. ఈ బెదిరింపుల పర్వాన్ని మహారాష్ట్రలోనే లోగడ హజారే తెరిచినవాడు. ఎవరో ఒక వ్యక్తిని లేదా నాయకుడిని టార్గెట్ చేయడం "బ్లాక్ మెయిల్'' రాజకీయం లక్ష్యం! మరాఠా రాజకీయాల్లో "శరద్ పవార్ వర్సెస్ హజారే'' కథకు స్క్రిప్టు అంతా హజారేదే! బ్లాక్ మెయిల్ రాజకీయాలలో రాగతనం ఒక భాగం. అదే ఇప్పుడూ నడుస్తోంది! అందులొనూ అతను చొప్పించిన అహంబాపతు లోక్ పాల్ ప్రతిపాదనలు నలభైయింటిలో మెట్టు భాగాన్ని కేంద్రప్రభుత్వం ఆమోదించినా హజారేకు తృప్తి లేదు. అసలు ఈ దేశానికి చచ్చుదో, పుచ్చుదో ప్రజలెన్నుకున్న ఒక పార్లమెంటు అంటూ ఉంది. వ్యవస్థలో మార్పులు జరిగేవరకూ ప్రజలు ఎన్నుకొన్న ఆ శాసనవేదికలో విషయాలు చర్చించి, నిర్ణయాలు తీసుకుని శాసనాలు చేయాల్సి ఉంటుందన్న ప్రాథమిక జ్ఞానం కూడా లేనప్పుడు వ్యక్తులు తలపెట్టే ఉద్యమాలకు పరిమితులుంటాయి. ఈ విషయంలో మహాత్మాగాంధీ వ్యష్టి సత్యాగ్రహాల గురించీ, సత్యాగ్రహాల పేరిట ముందుకొచ్చే డంబాచారుల గురించీ చెప్పిన మాటలు (1947 నవంబర్ 18) ఇక్కడ ప్రస్తావించడం అవసరం.

గాంధీజీ యిలా అన్నారు :-

 

“సత్యాగ్రహ ప్రక్రియను సక్రమంగా మాత్రమే వినియోగించాలి. ఏ చర్యనుబడితే ఆ చర్యను లేదా ప్రతీదాన్నీ సత్యాగ్రహం అని పిలిచే ధోరణిని నిరసించాలి"!

 

అంతే గాదు, ప్రతీ దానికీ సత్యాగ్రహమంటూ బయలుదేరే తన సన్నిహిత సహచరుల చర్యల మూలంగా వారిలో తన విశ్వాసం ఎందుకు సడలి పోవలది వచ్చిందో కూడా గాంధీజీ యిలా స్పష్టంగా చెప్పారు :-

 

“నా సహచరగణంలోనే ఓ కొత్తతరహా వర్గం (న్యూ క్లాస్) తలెత్తుతోంది. వీళ్ళు పెద్ద పెద్ద వాగ్థానాలు చేస్తూ అతిగా గొంతెత్తి చాటుకుంటూ ఉంటారు, వీళ్ళు అదే మోతాదులో గొంతెత్తి నినాదాలూ చేస్తుంటారు''!

 ABK prasad, ABK prasad special articles, abk prasad anna hazare, anna hazare abk prasad article, anna hazare satyagraha article, abk prasad telangana true story, manalo maata abk prasad, manalo maata teluguone

అందుకే గాంధీజీ సత్యగ్రహులకు తమ చర్యల్లో విశ్వాసంతో పాటు ఆ విశ్వాసానికి తగిన విజ్ఞానం, విజ్ఞత కూడా తోడై ఉండాలన్నాడు. ఆ విజ్ఞానం కొరవడబట్టి అన్నా హజారే 2002లో గుజరాత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనారిటీలపై తలపెట్టిన మూకుమ్మడి హత్యాకాండను కాస్తా మరిచిపోయి నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేశాడు. బీహార్ లొ అంతా 'సుభిక్షం'గానే ఉందని కితాబునిచ్చాడు! కాని విచిత్రమేమంటే తాను మాత్రం "గురివిందగింజ''గా మారాడు. తన కింద పేరుకున్న నలుపును చూడలేకపోయాడు! కాని ఆ మచ్చను ఇతరులు కనిపెట్టేశారు. సెక్యులర్ వ్యతిరేక పార్టీ, హిందుత్వశక్తులు బాబ్రీ మసీదును కూల్చివేసిన తరువాత ఆ చర్యకు దారి తీసిన చరిత్ర పూర్వరంగాన్ని మతశక్తుల తత్వాన్ని విస్మరిస్తూ విజ్ఞానపూరితమైన గ్రంథాన్ని (“కమ్యూనల్ పాలిటిక్స్'') రాసిన ప్రసిద్ధ చరిత్ర వ్యాఖ్యాత రామ్ పున్యాని ఈ హజారే శ్రమజీవులకు, వారి ప్రయోజనాలకూ వ్యతిరేకి అని "ర్యాలిగాం సిద్ధి'' గ్రామం సందర్శిచిన తరువాత ప్రకటించాడు! “హజారే తన గ్రామంలో ఒక నియంతలా వ్యవహరించాడు. కుల, లింగ, వంశపారంపర్య వివక్షా భావాలకు హజారే చెక్కు చెదరని ప్రతినిథి'' అని పున్యాని రాశాడు!

 

అయినా "సామాజిక కార్యకర్త''గా "ఇంకుడు గుంతల'' తవ్వకాల పేరిట పేరులోకి వచ్చిన హజారే అవినీతికి పూర్తిగా దూరంకాని వ్యక్తి కూడానని మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ (రిటైర్డ్) పి.బి.సవంత్ అధ్యక్షతన 2005లో మహారాష్ట్ర మంత్రులపైన, అన్నాహజారేపైన వచ్చిన అవినీతి ఆరోపణల విచారణకు ఏర్పడ్డ కమీషన్ సమర్పించిన నివేదిక వెల్లడించింది. దీంతో "అవినీతి నిర్మూలనోద్యమ'' నాయకుడిగా ప్రజలమధ్యకు చొరబడిన హజారే వ్యక్తిత్వం కాస్తా దెబ్బతిన్నది. “హింద్ స్వరాజ్ ట్రస్ట్'' పేరిట ఒక ఎన్.జి.వో. సంస్థను నెలకొల్పి దాని పేరిట విరాళాలు వసూలు చేసి, ఆ ట్రస్టు నిధి నుంచి 2 లక్షల 20వేల రూపాయలను హజారే తన జన్మదిన ఉత్సవాలకు వాడుకున్నాడనీ ఇది "అవినీతి'' చర్య అనీ జస్టీస్ సమంత్ ఆ నివేదికలో స్పష్టం చేశారు. అలాగే ఇతర మంత్రుల అవకతవకలను, పాలనా లొసుగుల్ని సమంత్ ఎండగట్టారు. తన 'గాంధేయ' వ్యక్తిత్వంపై పడిన ఈ మచ్చను హజారే ఖండించనూ లేదు, ఈ ఆరోపణ పచ్చి అబద్ధమని ఎదురుతిరగలేక పోయాడు ఈ క్షణం దాకా! ఈ వార్త ఆరేళ్ళ తర్వాత జస్టీస్ సవంత్ టీ.వి. ఇంటర్వ్యూలో బయటపడిన తరువాత హజారే సత్యాగ్రహిగా లేడు, ఆగ్రహమూర్తిగా మారాడు! ఆ ఆగ్రహం ఎంతవరకు అనలు తొడిగి కొనలు సాగిందంటే తాను తలపెట్టిన నిరాహారదీక్ష తనను జైలులో పెట్టినా సాగి తీరుతుందనీ, ఒకవేళ తనను విడుదల చేసినా తనపైన చేసిన అవినీతి ఆరోపణలను ప్రభుత్వం ఉపసంహరించుకునే దాకా సత్యాగ్రహం కొనసాగుతూనే ఉంటుందని హజారే హఠం వేశాడు! ఇలాంటి రాగతనాన్ని గాంధీజీ ఎనాడూ ఒక సత్యాగ్రాహిగా ప్రదర్శించ లేదు!

 

అంతేగాదు, హజారే నెలకొల్పిన సంస్థల్లో ఒకదాని పేరిట చారిటీస్ కమీషనర్ అనుమతి లేకుండానే కొంత భూమిని హజారే భుక్తం చేసుకున్నాడని భావించిన విచారణ సంఘం ఈ చర్య చెల్లదనీ, చట్టవిరుద్ధమనీ, ఇది దుష్టమైన సంస్థానిర్వహణ అనీ శఠించింది.! ఇతను నెలకొల్పిన మరొక ఎన్.జీ.వో. సంస్థ ప్రభుత్వానికి అసలు లెక్కలే చూపలేదని చెప్పింది! అలాగే "కృష్ణపానీ గుణవత్త యోజన కో-ఆపరేటివ్ ట్రస్టు'' కు సారథ్యం వహించడానికి హజారే అనర్హుడనీ, ఆ ట్రస్టుకు అసలు భూమి లేదమీ సమంత్ కమీషన్ వెల్లడించింది. దళితవర్గాలకు వ్యతిరేకి అయినందుననే హజారే మహాత్మాపూలే బడుగువర్గాల అభివృద్ధికి ఏర్పాటైన కార్పోరేషన్ లొ ద్రవ్య సంబంధమైన అవకతవకలు జరుగుతున్నట్టు హజారే ఆరోపణలు చేయగా 1996 జూన్ లొ విచారించి తీర్పు చెబుతూ హజారే "ఆరోపణలన్నీ అబద్ధాలని'' హైకోర్టు ఖండించింది! అంతగాదు, 2003 సంవత్సరలో కేంద్రప్రభుత్వం విడుదల చేసిన రూ.45 లక్షల నిధిని హజారే దుర్వినియోగం (మిస్ అప్రోప్రియేషన్ ) చేశాడని ఆనాటి మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి సురేష్ జైన్ ఆరోపించాడు!

 

మరీ విచిత్రమేమంటే, ఇలాంటి ఆరోపణల భారం మోస్తున్న "సమాజ కార్యకర్త'' తో, ఇలాంటి సంఘ సేవకు''తో కర్ణాటక లోకాయుక్త జస్టీస్ సంతోష్ హెగ్డే, మాజీ న్యాయశాఖామంత్రి శాంతి భూషణ్ లాంటివారు చేతులు కలపడం! అయితే జస్టీస్ హెగ్డే మాత్రం మధ్యలో ఒకటి రెండు సార్లు హజారే దూకుడు రాజకీయానికి బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఇక హజారేతో పాటు "అవినీతి నిర్మూలనోద్యోమం'' లొ కుడి, ఎడమ భుజాలుగా ఉంటున్న వారు ,మాజీ ఐ.ఆర్.ఎస్. అధికారి కెజ్రీవాల్, లాయరు ప్రశాంత భూషణ్ లు. జాతీయ స్థాయి "చతుర్ముఖ రాదారు సువర్ణ జాతీయ నిర్మాణ'' పథకం అమలు జరుగుతున్న సమయంలో అందులో పనిచేస్తున్న బీహారు ఇంజనీరు (ఐ.ఐ.టి.) సత్యేంద్ర డూబేను ఆ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి గురించి ముందస్తు హెచ్చరికగా ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారాన్ని అందించిననేరానికి దుండగులు హత్య చేసినప్పుడు ఈ క్రేజీవాల్, ప్రశాంత భూషణ్ లు అప్పటి బి.జె.పి.-ఎన్.డి.ఎ. సంకీర్ణ ప్రభుత్వానికి వత్తాసుగా నిలవడంద్వారా డూబే హత్య కేసును మాఫి చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఆనాటి ప్రధాని వాజ్ పేయి డూబే హత్యకు కారకులైన వారిని శిక్షించడానికి, వారు కాంట్రాక్టర్లు అయినా సరే సహించేది లేదని చెప్పినప్పటికీ హంతకుల్ని నిగ్గు తేల్చనివ్వకుండా చేయడంలో క్రేజీవాల్ సుప్రీంకోర్టులో "రిట్''లు వేయడంద్వారా తాత్సారం చేశారన్న తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. అంతకు ముందు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లొ పనిచేస్తున్న యువ మేనేజర్ అయిన మంజునాథ్ షణ్ముగంను కొన్ని పెట్రోల బంకుల్లో వాడుతున్న పెట్రోల్ నాణ్యతలో, కొత్త సరుకును మార్కెట్ చేయడంలో అవకతవకల గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించిన నేరానికి హత్య చేశారు! ఈ ఇరువురు యువఇంజనీర్లు కాంట్రాక్టర్లకు, కల్తీదారులకు, వారిని ప్రోత్సహించిన అధికార రాజకీయపార్టీ పెద్దమనుషులకు అడ్డంకిగా ఉండి, జరుగుతున్న అవినీతి గురించి "మేలుకొల్పులు'' పాడినందుకు దారుణ హత్యలకు గురయ్యారు. సరిగ్గా వీరి హత్యల తరువాతనే ప్రజా జీవితంలో అవినీతి గురించి ఇలా మేలుకోలుపుగా ముందస్తుగా సమాచారం అందించేవారి రక్షణకోసం ప్రత్యేక చట్టాన్ని తేవడం జరిగింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల తర్వాత ప్రపంచంలో ఇలాంటి చట్టం చేసి అయిదవ స్థానంలొ నిలిచిన దేశం మన ఇండియా.

 

రవీందర్ సింగ్ అనే పిటీషనర్ (ఏప్రిల్ 20/2006 న పెర్మాలింక్, జిమేన్, లా ఇండియా.ఆర్ టి ఇ) రాసిన లేఖలో అరవింద్ కెజ్రీవాల్ 20 బి.జె.పి.-ఆర్ ఎస్. ఎస్.ల తరపున డూబే హత్య కేసు విచారణలో గూఢచారిగా పనిచేశాడని రాశాడు. డూబేది రాజకీయ హత్య అని రవీందర్ సింగ్ ఆరోపించాడు. ఈ కేసులో విచారణ ముందుకుసాగకుండా అడ్డుకోనేందుకే విచారణను గాడి తప్పించేందుకే కెజ్రీవాల్ (అప్పటికీ రెండు ప్రజాప్రయోజన వాజ్యాలు కోర్టులో ఉన్నా సి.బి.ఐ. రెండుసార్లు విచారణలు జరిపినా) మూడవ ప్రజాప్రయోజన వాజ్యాన్ని నడిపాడని రవీందర్ సింగ్ లేఖలో ఆరోపించాడు! అప్పటి ప్రధాని వాజ్ పేయి కార్యాలయానికి డూబే సమాచారం అందించిన మరుక్షణమే ప్రధాని కార్యాలయంలోని సంబంధిత వ్యక్తులు (రాజకీయులు లేదా ఆర్థికంగా కాంట్రాక్టర్ల వల్ల లబ్దిపొందిన వారు) డూబే పేరును బయటపట్టేసిన వెంటనే డూబే హత్య జరిగింది! ఏతావాతా చెప్పొచ్చేదేమంటే - ఇంత జరిగిన తరువాత హజారే సలహాదారులుగా ఇలాంటి వాళ్ళు ఎలా ఇమడగలరో అర్థంకాని "దేవతా వస్త్రాల'' కథ! నేడు అవినీతిపైన హజారే బృందం ప్రకటించిన వాచాలపు "దండోరా'' అవినీతికి సంబంధించిన ఆత్మపరిశీలనతో ప్రారంభమై ఉంటే బావుండేది! కాని అలా జరగలేదు.

 

ఇంతకూ హజారే బృందానికి నేటి భారత పాలనావ్యవస్థ వర్గ స్వభావంగానీ, ఆ వ్యవస్థకు ఆధరువుగా ఉన్న పెట్టుబడీదారీ వ్యవస్థగానీ దృష్టిలోకి రానట్టుంది. పెట్టుబడీదారీ వ్యవస్థను ఆశ్రయించిన రాజకీయ పాలనావ్యవస్థ ఆ వ్యవస్థ తాలూకు అన్ని లక్షణాలను (లంచాలు, ఆర్ధిక నేరాలు, ధనార్జనకోసం హత్యలు, హత్యల్ని మాఫీ చేయడం, చేయించడానికి న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడం వగైరా నేరాలు) అంటువ్యాధిలాగా సంక్రమింపజేసారనక తప్పదు. వాటిలో భాగమే 'అవినీతి' అనే పెద్దరోగం. ఇది తిలాపాపం తలా పిడికెడు పంచాలనే తత్వంమీద బతుకుతుంది. కనుకనే ఎన్ని కమీషన్లు ఉన్నా, వేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఈ సత్యం గాంధీజీకి తెలియక పోలేదు. అందుకనే 1947 డిసెంబర్ 3న, అంటే స్వాతంత్ర్యం వచ్చిన సుమారు అయిదు మాసాలకే ఇలా ప్రకటించాడాయన : -

 

"నేటి దేశస్వాతంత్ర్యాన్ని నిజమైన స్వాతంత్ర్యంగా నేను పరిగణించను. పైగా దాన్ని స్వాతంత్ర్యవిధ్వంసనగా భావిస్తాను. ఎందుకంటే మనకాళ్ళను మనేమే నరుక్కుంటున్నాం, మనల్ని మనమే నాశనం చేసుకొంటున్నాం'' ఈ వినాశకర ప్రయోగంలో అవినీతి ఒకటి. స్విస్ బ్యాంకులు సహా విదేశీ బ్యాంకుల్లో భారతీయ 'పెద్దలు' ('డాకూ' గాళ్ళంటే మంచిది) ఇటు దేశాభివృద్ధికి వినియోగపడకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం రూ.72 లక్షల కోట్లు గుప్తధనంగా దాచుకున్నారంటే, కాదు దాచుకోడానికి దేశ పాలనావ్యవస్థ అవకాశమిచ్చిందంటే, అది ఎవరి తప్పు? కేవలం వ్యక్తులది కాదు, మనం ఎంచుకొని సాకుతున్న పెట్టుబడీదారీ వ్యవస్థ కల్పించిన, దోపిడీ వ్యవస్థ కల్పించిన మహదవకాశం! అటువంటి వ్యవస్థ తొడుక్కున్న రాజకీయ ముసుగు "ప్రజాస్వామ్యం''. కాని ప్రజాస్వామ్యానికీ, పెట్టుబడీ వ్యవస్థకూ పొంతన కుదరదని అమెరికాలోని మహా కోటీశ్వరుల్లో ఒకరు, కరెన్సీ వ్యాపారీ అయిన జార్జి సోరెస్ అంటున్నాడు. ఎందుకంటే, ప్రయివేట్ ఆస్తిపైన, దాని రక్షణపైన ఆధారపడింది పెట్టుబడీదారీ వ్యవస్థ కాగా, ప్రజల ప్రాథమిక కోర్కెలు, అవసరాలు, ప్రయోజనాలపై ఆధారపడి వాటి రక్షణ కోసం నిలిచేది ప్రజాస్వామ్యం. కనుక రెండింటి ప్రయోజనాలు బద్ధవిరుద్ధమైనవని సోరెస్ అన్నాడు! ఈ మాత్రపు జ్ఞానం కూడా కొందరు ఉద్యమకారులకు, కొన్ని రాజకీయ పక్షాలకు, వాటి నాయకులకు లేకపోవడమే విడ్డూరం, ఈ దేశంలో "దున్నపోతు ఈనింద''ని ఎవడో కూస్తే చాలు, అయితే "గుంజకు కట్టేయండి'' అనే వాళ్ళు ఉన్నంతకాలం ప్రజలకు వాస్తవాలు తెలియజేయరు. దోపిడీపై ఆధారపడిన పెట్టుబడీదారీ వ్యవస్థ ధర్నాలతో, దొంగ సత్యాగ్రహాలతో, అందులోనూ మీడియా కనుసన్నల్లో మెలిగి మెరిసిపోవాలనుకుంటూ మురిసిపోయే కుహనా ఉద్యమకారులవల్ల ఈ వ్యవస్థ అసలు మారదు. అలా అని మిలిటెంట్లుగానూ వీళ్ళు మారలేరు. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ అసమానతలకు, ధనికవర్గ ఆధిపత్యానికి పట్టం కట్టి పెట్టుబడి వ్యవస్థను సమూలమైన శస్త్ర చికిత్స జరిగే వరకూ దొంగ సత్యాగ్రహాల ద్వారా వచ్చే సంస్కరణలన్నీ "తూట్లు'' పడివచ్చే సంస్కరణలు మాత్రమేనని గ్రహించాలి. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ఉద్బోధలో దేశం నుంచి "అవినీతిని రూపుమాపే యత్నంలో పార్లమెంటులాంటి వ్యవస్థల సాధికారతను, విశ్వనీయతనూ తుడిచిపెట్టేందుకు ప్రయత్నపూర్వకంగా గాని, అప్రయత్నపూర్వకంగా గానీ ఎవరూ ప్రయత్నించరాద''ని చెప్పారు, ఈ మంచి మాటలు, ఈ లక్ష్యం ఆచరణ సాధ్యం కావాలంటే ఉన్న చట్టాలకు బలమైన కోరలు తొడగాలి. పాత చట్టాలలో ప్రజల అక్కరకు రాకపోగా ప్రజల పురోభివృద్ధికి ఆటంకకరమైన వాటిని తొలగించాలి. శ్రీమతి పాటిల్, హజారేగారు గోల పెడుతున్న "పటిష్టమైన లోక్ పాల్'' గురించి ప్రస్తావిస్తూ చెప్పినట్టుగా "అవినీతి రోగ నిర్మూలనకు అవసరమయింది ఒక మందుగాదు, ఒక హక్కు కాదు, అసలు మొత్తం వ్యవస్థనే అన్ని స్థాయిల్లో పారదర్శకంగా ఉంచాలి, జవాబుదారీ చేయాలి, అపుడు చట్టాన్ని అమలు చేయాలి''. ఎందుకని? అవినీతి అనే క్యాన్సర్ వ్యాధి, జాతి రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలన్నింటినీ చుట్టబెట్టింది కాబట్టి ఈ పారదర్శకత, విశ్వసనీయత అవసరం. అయితే ఇంత చెప్పుకున్నా మౌలిక రహస్యం- పెట్టుబడి వ్యవస్థను రూపుమాపడం ద్వారానే ఆ పారద్దర్శికత, విశ్వనీయత ప్రస్తుతం ఉన్న 10-15 శాతం నుంచి 90 శాతానికి పెరగగల్గుతుంది! స్వాతంత్ర్యం వచ్చేనాటికి, ఆ తరువాత పదేళ్ళవరకూ దేశంలో 10-12 మంది మాత్రమే మహాకోటీశ్వరులు ఉండగా వారి సంఖ్య 62 ఏళ్ళలోనే 50కి మించిపోవడానికి ఈ అంతరాల దొంతర్ల వ్యవస్థే కారణం. అందువల్ల అవినీతిపై నేటి హజారే కుహనా పోరాటం అతనికీ 'ప్రధాని మన్మోహన్ సింగ్ కీ మధ్యనే పరిమితమైనది కాదు. అందరూ "శ్రీవిష్ణువులయిపోయి, రొయ్యల బుట్టను మాత్రం ఖాళీ'' చేసినట్టుగా హజారే 'దీక్ష'తో చేతులు కలపనివాడు 'పాపాత్ముడై'పోతున్నాడు! ఈ దేశంలోగొర్రెల మందకూ మన రాజకీయ పక్షాల నాయకులకూ మధ్య తేడా లేదు! అందుకే గాంధీజీకి, ఆయనలో పదోవంతు శక్తియుక్తులు కూడా లేని హజారేకు మధ్య వ్యక్తిత్వాల్లో, ప్రవర్తనలో, నీతిలో, రీతిలో ఎంత తేడా ఉందో ఒక ఆంగ్ల దినపత్రికలో రాసిన లేఖలో ఒక సంస్కారవంతుడైన విద్యాధికుడు చెప్పిన మాటలు విందాం :

 ABK prasad, ABK prasad special articles, abk prasad anna hazare, anna hazare abk prasad article, anna hazare satyagraha article, abk prasad telangana true story, manalo maata abk prasad, manalo maata teluguone

"నేను మీ మాదిరే 70 దాటినా వాడిని, నేనూ మీలా ప్రిన్సిపల్సుకు నిలబడి, పోరాడే వ్యక్తినే. కాని లక్ష్య సాధనకు మీరు అనుసరిస్తున్న చిట్కాలతో నేను ఏకీభవించనందున నన్ను మీరు మీ పౌరసమాజ సభ్యునిగా చేర్చుకొనక పోవచ్చు. తన లక్ష్య సాధనకు గాంధీజీ ఏ రోజునా మీలాగా బలవంతపు బ్రాహ్మణార్థానికి దిగలేదు. తన అభిప్రాయాలు, తన ఆదర్శాలు ఆమోదిస్తావా లేదా అంటూ ఆయన ఎన్నడూ ప్రత్యర్థి నోరు బలవంతంగా మూయించడానికి నిరశన దీక్షకూ దిగలేదు. బ్రిటీష వాళ్ళ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాడే గాని అధికారులను గాంధీ ఎన్నడూ దూషించలేదు. (ఒకసారి గాబోలు ఒక ఇన్స్ పెక్టర్ ను మురికి అధికారి - గట్టర్ ఇన్స్ పెక్టర్ అనడం తప్ప)! కాని మీరో, దేశ ప్రధానమంత్రినే 'అబద్ధాలకోరు' అని దూషించారు. లోక్ పాల్ పరిథిలోకి దేశప్రధానమంత్రిని చేర్చరాదన్నది ఆయన అభిప్రాయంకాదు, అది కేంద్ర మంత్రిమండలి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఆయన తలదాలాడు.. అంతే, మన్మోహన్ సింగ్ టీమ్ లీడర్, క్యాబినెట్ లొ వ్యక్తిగత అభిప్రయాలకన్నా మెజారిటీ సభ్యుల సమిష్టి నిర్ణయానికే కట్టుబడి ఉండడం ప్రజాస్వామ్య ధర్మం. ఏనాడైనా గాంధీజీ నిరాహార దీక్షకు దిగేముందు "రండి, నన్ను జైల్లో పెట్టండి'' అంటూ బ్రిటీష్ వాళ్ళను సవాల్ చేయలేదు బ్రిటీష్ పాలకుల అరెస్టు చేసే హక్కును గాంధీజీ ఎన్నడూ కాదనలేదు. మీరు పెట్టిన ప్రతిపాదనల్లో కేవలం ఆరింటిని ప్రభుత్వం ఆమోదించలేదన్న మిషపైన ప్రజల్ని పూనకంలోకి రెచ్చగొడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం సబబా? మీ వ్యక్తిగత ప్రతిపాదన తప్ప మరొక ప్రత్యామ్నాయం ఉండడానికి వీల్లేదనా మీ ఉద్దేశం? కర్ణాటకలో గనుల కుంభకోణం పట్ల మీ మౌనం దిగ్భ్రాంతి కల్గిస్తోంది! కాని ప్రధాని పట్ల మాత్రం హద్దూ పద్దూలేని ఆగ్రహమా? మీరు "నేను ప్రభుత్వానికే గాని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాద'ని చెప్పారు.

 

కాని ప్రజలెన్నుకొన్నదే గదా ప్రభుత్వం. ఈసారి ఎన్నికల్లో దాన్ని ఓడించవచ్చుగదా. అదీ ప్రజాస్వామ్యం, ప్రభుత్వం లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టేవరకూ సమస్యను ముందుకు నెట్టడం ద్వారా మీరు మంచి సేవే చేశారు. కాని ఆ బిల్లు నా టీమ్ బిల్లుగానే వుండాలి, లేకపోతే నా కిష్టంలేదని మాత్రం మీరు శాసించలేరు. అన్నీ ఒక్కసారిగా నమిలి మింగడం ఏ వ్యవస్థకూ సాధ్యం కాదు. "కాని బాలారిష్టాలతో మొదలయ్యే పెట్టుబడీదారీ వ్యవస్థ అనేక కుంభకోణాలకు, నేరాలకు పుట్టిల్లుగా మారి పుట్టెడు సమస్యలతో ప్రజావ్యతిరేక విధానాల మధ్య కుంగుతూ ఎదుగుతూ ఉంటుంది కాబట్టి కొన్ని సమస్యలను తన స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా అయిష్టంగానే వదిలేస్తుంది, తన ప్రయోజనాలకు సాయపడే మరికొన్ని సమస్యలను, ఇష్టంగా పరిష్కరించచబోతుంది! ఇది తొక్కుడు బిళ్ళ ప్రజాస్వామ్యం, అందులో ఒక బిళ్ళ అన్నా హజారే. ముందు హజారే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను చెరిపేసుకొని ఎదుటివారిని శాసించడానికి ధైర్యం చేయాలి. షో మాస్టర్లు ఆ పని చేయలేరు.!

 

 

ALL IN ONE NEWS

Sorry, Your browser is not supporting this feature