"ఇప్పుడు రాకపోతే ఇక రాదు" బొబ్బిలి దొర కంగారుకు అర్థం?!

Publish Date:Sep 10, 2011

"ఇప్పుడు రాకపోతే ఇక రాదు" బొబ్బిలి దొర కంగారుకు అర్థం?!

 

                                                                                      ఎ.బి.కె.ప్రసాద్ 

 

"ఆరాటపు కదురు ఏరాటన పెట్టినా నిలువదు, (ఉత్తుత్తి గరగర శబ్దాలు తప్ప)'' అని మన తెలుగువాళ్ళల్లో ఓ సామెత తరచుగా ప్రచలితవుతూంటుంది! పదవీ స్వార్థ ప్రయోజనాలతో రెండేళ్ళనాడు ఓ ఉద్యమం తలపెట్టిన పెద్దవలసదారైన 'బొబ్బిలిదొర' తెలంగాణాపై తరచూ ప్రకటనలు చేస్తూ గత ఒకటిన్నర మాసాలుగా ఓ కొత్త నినాదం లంకించుకున్నాడు!! "తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు రాకపోతే ఇక రాదు'' అని పదేపదే ప్రకటనలు యిస్తున్నాడు! దీనిలోని భావమేమై ఉంటుంది? అకస్మాత్తుగా కంగారు కంగారుగా ఈ 'బొబ్బిలిదొర' యిస్తున్న నినాదానికి అర్థం ఏమై ఉంటుందని ఆలోచించే వారికి రెండు కారణాలు కనిపిస్తాయి : (1) ప్రత్యేక రాష్ట్రం కోసం పదవీ రాజకీయాలలో భాగంగా తాను తలపెట్టిన ఉద్యమాన్ని నిర్వహించడంలో తాను విఫలమయ్యామని లోలోపల మధనపడిన దాని ఫలితంగానైనా ఈ ప్రకటన వచ్చి ఉండాలి, లేదా (2) తన ఈ వైఫల్యానికి ప్రతిఫలంగా తన 'చేతబడి' రాజకీయం మూలంగా ఆత్మహత్యల పాలైన ముక్కుపచ్చరాలని ముద్దుబిడ్డలయిన విద్యార్థి యువజనులు, వారి కుటుంబాలూ తన విధానాలపైన తిరగబడతారన్న భయాందోళన అయినా కావాలి.

 

తెలంగాణా విద్యార్థి యువకుల్లో, రాజకీయ స్వార్థపర నాయకులు ఉద్యోగాల విషయంలో, పరిశ్రమల విషయంలో కల్పించిన ఆశలు, యువకులను అనవసరపు ఆత్మహత్యల వైపుకు నెట్టాయి. నిజానికి ఏ ఉద్యమ నాయకుడూ తన ఉద్యమాన్ని నీళ్ళు కార్చుకునే నినాదాలను, ప్రకటనలనూ చేయడు. లక్ష్య సాధనకు, హేతు విరుద్ధమైన ముహూర్తాలూ పెట్టాడు. నిజాయితీ ఉన్న నాయకుడూ, స్వార్థరహితుడయిన నాయకుడూ పెట్టిన ముహూర్తానికి వెనక్కి తగ్గడు! ఒక్క అవకాశావాదులైన నాయకులే ఆ పని చేస్తారు.

 

ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు 'సోమలింగం' అన్నట్టుగా రోజుకొక నినాదంతో జనాన్ని ఊరిస్తూ ఒకటే విరగదొక్కడం! ఇదిగో, తెలంగాణా రాష్ట్రం రేపే అని ఒకరోజు, ఇదిగో 'ఎల్లుండి' అని ఒకరోజు, ఆగస్టు అని ఒకనాడు, సెప్టెంబర్ అని మరునాడు - “వాయిదా లరత్తయ్య'లా బాధ్యతగల ఏ నాయకుడూ గొంతుమార్చడు! రెండేళ్ళుగా 'ఉద్యమం' పేరుతొ నసపెడుతున్న ఈ 'పెద్దమనిషి' కాంగ్రెసు ఆధ్వర్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలయెన్స్ కూటమి, కేంద్రప్రభుత్వమూ ఇక "తెలంగాణా ఇవ్వరు'' అంటూ తాపీగా సెప్టెంబర్ 4-5 తేదీల్లో ఒక ప్రకటన చేసి కూర్చున్నాడు.

 

దీనికి తగ్గట్టుగానే ఈలోగా ఇంతకుముందు మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన టిమోతీ రోమర్ "తెలంగాణా విషయంలో 2009 డిసెంబర్ 9న కాంగ్రెస్ చేసిన ప్రకటన తొందరపాటు చర్య అనీ, “కాంగ్రెస్ పార్టీ వెన్నెముకలేనిదనీ, బలహీనమైన సంస్థ'' గా మారినందున కొందరు దానిని బెదిరింపులకూ, అదిరింపుకూ గురిచేస్తున్నారనీ 2009లొ అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబిల్ లో తెలిపాడు, అయితే తెలంగాణా విషయంలో తాను చేసిన ప్రకటనకు కాంగ్రెస్ విచారం వెలిబుచ్చిందని రోమర్ పంపిన వర్తమానాన్ని "వీకీలిక్స్'' వైతాళిక సంస్థ సెప్టెంబర్ మొదటివారంలో (2011) బయటపెట్టింది. అందువల్ల "కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో తెలంగాణా విషయమై'' తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని కూడా రోమర్ ను ప్రస్తావిస్తూ "వీకీలిక్స్'' బయట పెట్టింది!

 

 

 

ఇది వెలువడిన ఇరవై నాలుగు గంటలలోనే పెద్దవలస దారైన 'బొబ్బిలిదొర' ఎందుకైనా మంచిదని అందరికన్నా ముందుగా జాగ్రత్తపడి తెలంగాణా రాష్ట్రం "ఇప్పుడు రాకపోతే ఇకరాదు'' అని ప్రకటిస్తూనే ఇక 2014 ఎన్నికలకు సిద్ధమవుదామనీ, అప్పుడయితే తన పార్టీకి "వందసీట్లు ఖాయ''మనీ ఉద్యమ వాయిదాకు తగిన ఎజెండాను ప్రకటించారు! దీనికొక సమర్థనగా ఏం చెప్పాడాయన? “ఒకవేళ కేంద్రం తెలంగాణా యిచ్చినా హైదరాబాద్ ప్రతిపత్తి విషయంలో కొర్రీ తప్పదు'' కాబట్టి, ఈలోగా రహదార్లు బంద్ చేద్దాం, “ప్రళయం'' సృష్టిద్దాం, అవసరమైతే హైవే రోడ్లకు గండ్లుకొడదాం వగైరా హతాశుడి పరిభాషలో మాట్లాడేశాడు! కంగారులో ఉన్న ఈ 'పెద్దమనిషి' అంతటితో ఆగలేదు - “ఉద్యమం విఫలమయిందంటే తెలంగాణా ప్రజల్ని పాతాళానికి తొక్కేస్తార''ని ఒక ఉన్మాదపు ప్రకటన విడుదల చేశాడు! "ప్రస్తుతం నాయకులు పులిమీద ఎక్కి స్వారీ చేస్తున్నారు, కాని ఎక్కిన పులి నుంచి కిందికి దిగిరాం, దిగామా ఆ పులే మింగేస్తుంద''ని భీతికొద్దీ బెదిరించాడు!

 

లక్ష్యశుద్ధి కొరవడిన నాయకత్వం మూలంగా ఉద్యమంలో రోజుకొక తీరుగా వస్తున్న చీలికలను గమనించి, బెంబేలు పడిపోతున్న 'బొబ్బిలిదొర' "ఒక్క తాటిమీద నాయకులంతా నిలబడకపోతే" తెలంగాణా రాష్ట్రం రాదనీ, ఒకవేళ ఈ 'ఉద్యమం' విఫమయిందంటే నాయకులంతా "ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది, శాశ్వతంగా వెట్టిచాకిరీకి' తాకట్టు పడవలసి వస్తుందనీ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రకటన చేశాడు! కాని తెలంగాణా ప్రజలపై ఆ "వెట్టి చాకిరీ“ని రుద్దినవారూ, ప్రజల్ని పీడించిన వారూ 'దొరలే'నని ప్రజలు మరవలేరు! ఒకవేళ ఉద్యమం ఆగిపోతే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించడానికే భయంకరంగా ఉంది. అంతకన్నా విషం తాగి చావడమే నయం'' అని బొబ్బిలిదొర (ఆగస్టు 8) మరోసారి యువకుల్ని ఆత్మహత్యలకు పురిగోల్పే "చాతబడి''కి సాహసించాడు! తనలో పెరుగుతున్న భయాన్ని ప్రజలకు ఆపాదించాడు!

 

 

 

నిజానికి తెలంగాణా ప్రజలు సంస్కారప్రియులు, మర్యాదకు, ప్రేమానురాగాలకు, అతిధి గౌరవాలకూ పెట్టింది పేరు. కాని అలాంటి ప్రజలను బెదిరింపులతో, స్వార్థప్రయోజనాల కొద్దీ అదిరింపులతో, లొంగతీసుకోవాలని చూసేవారు, రాష్ట్ర ప్రజాబాహుళ్యం మధ్య చీలికలు పెట్టి పబ్బం గడుపుకొనజూచేవారూ నాయకులే తప్ప మరొకరు కాదనీ 'బొబ్బిలిదొర' ఉన్మాద పూరిత ప్రకటన మరొకసారి రుజువు చేస్తోంది. నాయకులు, 'నారదులు', కలహాభోజులూ! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని ప్రజాబాహుళ్యం మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు, ఉండవు. వాటిని సృష్టించాలని చూసే నాయకులు చివరికి భంగపడతారని గుర్తించాలి! ప్రస్తుతం ఆ వైపుగానే నాయకత్వంలో ఒక భాగం భీతిల్లుతోందని మరవరాదు! కనుకనే అపమార్గం పట్టిన స్వార్థపూరిత నాయకత్వం తలపెట్టిన ధర్నాలను, సమ్మెలను, సార్వత్రిక సమ్మెలను ఏకవాక్యతకు దూరమైపోయి చీలుబాట్లతో, వాయిదాలతో సరిపెట్టుకొనవలసి వస్తోంది. అంతేకాదు, 'ఉద్యమం' ఏకవాక్యతకు దూరం కావడానికి హెచ్చుగా తోడ్పడిన అంశం - నాయకత్వానికి వాక్ శుద్ధి లేకపోవడం. ఏ మాట పడితే ఆ మాటే, అవి 'నోళ్ళు' కావు, అనిపించేలా చేసిన నాయకుల మాటలూ, ప్రకటనలూ!

 

ఉదాహరణకు ఒక పెద్దమనిషి ప్రత్యర్థి పక్షం వారిని "అడ్డగాడిదలం''టాడు! ఆచార్య పదవికి అనర్హుడయిన మరొక 'పెద్దమనిషి' “సచ్చుడు లేదా సంపుడే''నని ప్రగల్భిస్తాడు; ఒక ప్రబుద్ధుడు "దేశంనుంచి కూడా మేం విడిపోయే హక్కుందం''టాడు! ఇంకొకడు తెలుగు రాష్ట్రంలోనే తెలుగువాడికి 'వీసా' లిస్తామంటాడు; ఒక పెద్దమనిషి తన భవనంలో గృహప్రవేశం చేసుకోడానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతపు పురోహితుల్ని తెచ్చుకుంటానే, పురోహితుల మధ్యనే కుల,గోత్రాల, ప్రాంతాల భేదాలు చూపి తంపులు పెట్టాలని చూస్తాడు; మరొకడు బిసి, ఎస్.సి. ఎస్.టి. వర్గాన్నీ, మైనారిటీలనూ 'ఉద్యమానికి' లేదా ఉద్యమనాయకత్వానికీ దూరంగా ఉంచుతూ తాను 'కులగుల'కు మాత్రం దూరం కాలేకపోతున్నాడు!

 

 

 

అంతకన్నా మరొక అన్యాయానికి 'ఉద్యమ' నాయకత్వం పాల్పడింది - విశ్వవిద్యాలయ స్థాయినుంచి, పాఠశాల, కళాశాల విద్యార్థుల స్థాయి వరకూ యావత్తు విద్యారంగాన్నే అస్తవ్యస్తం చేసి కూర్చుంది! ఈ నెల 5వ తేదీన 'బొబ్బిలిదొర' ప్రకటనే ఇందుకు నిదర్శనం. అంతకుముందే విద్యార్థుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పడంతో ప్రారంభమైన అతడి 'చేతబడి' రాజకీయం విద్యార్థుల చదువు సంధ్యలనూ, ఉపాధి సౌకర్యాలనూ ఘోరంగా దెబ్బతీసింది. సకాలంలో పరీక్షలు రాసుకోకుండా చేసింది; ఇంటర్వ్యూలకు హాజరుకాకుండా చేసింది; చివరికి ఉస్మానియా నుంచి ఉద్యోగార్థమై విద్యార్థులు దరఖాస్తులు పెట్టుకోనక్కరలేదని, కొన్ని పెద్ద కంపెనీలు 'వెబ్ 'లొ సమాచారం చొప్పించేదాకా నాయకత్వం నిద్రపోలేదు! స్థానిక విద్యార్థులకు ఉపాధి అవకాశాలన్నింటినీ ఎవరో కొట్టేస్తున్నారన్న అబద్దపు ప్రచారాన్ని ఒకవైపు వ్యాపింపచేసిన నాయకత్వమే, తమ అదుపాజ్ఞలు తప్పిన 'ఉద్యమం' మూలంగా సుమారు 10-12 బడా ఐ.టి. తదితర కంపెనీలు వేలాదిమందికి ఉపాధి చూపించే పరిశ్రమలను తమిళనాడుకు, బెంగుళూరుకు తరలించుకుపోతున్నప్పుడు కూడా గుడ్లు అప్పగించి కూర్చుందని మరవరాదు!

 

ఈ అశాంతి వాతావరణంలో వేలాదిమంది తెలంగాణా బిడ్డలు విద్యార్జన కోసం కోస్తాంద్రలోని కళాశాలలకు వలసపోవలసిన దుస్థితిని కల్పించాడు. అంతేగాదు, ఒక పధ్ధతి, క్రమం లేని నాయకత్వం మూలంగా చీటికీ, మాటికీ తలపెట్టిన బంద్ లూ, ధర్నాలూ, సమ్మెల నేపథ్యంలో - సేవారంగంలో (సర్వీసెస్ సెక్టార్) 40వేల ఉద్యోగాలూ, వస్తూత్పత్తి (మాన్యుఫాక్చరింగ్ ) రంగంలో మరో 20వేల ఉద్యోగాలూ కోల్పోవలసి వచ్చిందన్న ఇంగితజ్ఞానం కూడా నాయకత్వానికి కొరవడిందని గుర్తించాలి. ఇక గడిచిన రెండేళ్ళలో పారిశ్రామిక రంగంలో క్రియాశీలమైన ఫలితాలూ దెబ్బతినిపోయాయి; నాయకత్వం తన ఉనికిని ప్రజాబాహుళ్యం ప్రశ్నించకుండా ఉండేందుకు తలపెట్టిన బంద్ ల వల్ల, ప్రజలనుంచి వసూలు చేస్తున్న పన్నులకు గాను ప్రజలకు బాధ్యత వహించాల్సిన రాష్ట్ర బొక్కసానికి వచ్చిన నష్టం రూ.400 కోట్లు!

 

గత సంవత్సర కాలంగా 17 రోజుల తరబడి జరిగిన బంద్ పిలుపుల మూలంగా సమాజంలోని ప్రతీ రంగమూ దెబ్బతినడంవల్ల రాష్ట్ర ఆర్ధికవ్యవస్థ కూడా మొత్తంగా భారీ స్థాయిలోనే దెబ్బతిన్నది; చిన్నా చితక వ్యాపారులు, రోజువారీ బళ్లమీద కూరగాయాలు, ఇతర సరుకులను అమ్ముకుంటే గాని రోజు గడవక "పూటబెత్తం పుల్లవెలుగు''గా బతుకులీడ్చే కూలీనాలీ జనం ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. “రాష్ట్రం వస్తుందో రాదో గాని కోల్పోయిన మా డబ్బులూ రావు, బజారుపాలైన మా బతుకులూ తిరిగి బాగుపడవు'' అని కొందరు సామాన్య తెలంగాణా కష్టజీవులు, చిన్నవ్యాపారులు ఈ రచయితతో అన్నారు! పద్దతీ, బాధ్యతా ఎరుగని కొందరు నాయకత్వంలో పాగావేసినందున వారిలోని ఒక నాయకుడు తెలంగాణా ఉద్యమ సారథ్యం కోసం "గుర్రమెక్కుతా. దౌడుతీయిస్తా'' అని ప్రకటించడాన్ని చౌకబారు నినాదంగా భావించకపోవడం విడ్డూరం కాదా?!

 

ఒకరు "సర్వజనుల సమ్మె'' నినాదాన్ని లంకించుకోగా, మరొకరు, కాదు "సర్వజనుల ఉద్యమం'' కావాలని పిలుపిచ్చారు! అంతేకాదు, ఒకరు తలపెట్టిన "ఆత్మహత్యల ప్రక్రియ''ను మరొక ఉద్యమకారుడు అవహేళన చేస్తూ 'బొబ్బిలిదొర' వారి "ఎన్నికల రాజకీయాల్లో రాజనీతి లేదని ఎత్తిపోడిచి రాజకీయ ప్రక్రియలో అవకాశవాదులు చేరడం వల్లనే ఆత్మహత్యల ప్రక్రియ వచ్చింద''ని (సెప్టెంబర్ 4 ప్రకటన) ఆత్మపరిశీలనలో భాగంగా ఆవేదన వ్యక్తం చేయవలసి వచ్చింది. “రాజీనామాలతో, ఆత్మహత్యలతో'' లక్ష్యం నెరవేరదని యువకుల కుటుంబాలకు జరిగిన అపార నష్టం తరువాత జ్ఞానోదయం ప్రకటించాడొక ప్రసిద్ధ కళాకారుడు!

 

 

 

ఆత్మవిమర్శ సకాలంలో జరక్కపోబట్టే నాయకులు "చెటాకులు''గా "అరచెటాకులు'' గా మారి అవాకులూ చెవాకులూ పేల్చుతూ కాలక్షేపం చేయడం! రాజకీయ పరిపక్వత అనేది క్రయవిక్రయాలకు అతీతమైన విద్య!

 

 

ALL IN ONE NEWS

Sorry, Your browser is not supporting this feature