మనలో మాట - "గొంగళి" కథ మళ్ళీ మొదటికే...

Publish Date:Aug 12, 2011

మనలో మాట- 1

"గొంగళీ" కథ మళ్ళీ మొదటికే...

 

రాజ్యాంగ అధికరణ (3) పై అర్ధం కాని కుస్తీలు

 

డాక్టర్ - ఎ.బి.కె. ప్రసాద్ (సుప్రసిద్ధ పాత్రికేయులు )

 

  చదవకముందు కాకరకాయ అన్నవాడు చదివేసింతరువాత ''కీకరకాయ'' అన్నాడట, వెనకటికొకడు! ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం జిల్లా) నుంచి తెలంగాణాకు వలస వచ్చిన పెద్ద వలసదారు ''బొబ్బిలి దొర'' తన పదవీ రాజకీయాల కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరుతో తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టి ''కుడితిలో పడిన ఎలకలా'' బయటపడలేక భారత రాజ్యాంగ చట్ట నిబంధనకు వక్రభాష్యాలు పలుకుతున్నాడు. చివరికి రాజ్యాంగ నిర్మాతలలో అగ్రజుడైన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేడ్కర్ భాషా రాష్ట్రాల ఏర్పాటు సమస్యపై చేసిన ప్రకటనలనూ, వ్యాఖ్యానాలనూ కూడా వక్రీకరించడానికి సాహసించాడు.

 

  మెజారిటీ ప్రాంతంలోని మైనారిటీ ప్రజలకు అంటే దళిత బహుజన వర్గాలకు అన్యాయం జరగకుండా ఉండే పద్ధతిలో రాష్ట్రాలు ఏర్పడాలన్న అంబేడ్కర్ మాటల్ని వక్రీకరించి ''మెజారిటీ ప్రాంతంలో మైనారిటీ ప్రాంతానికి అన్యాయం జరిగితే న్యాయం చెప్పడం కోసం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కేంద్రానికి సంపూర్ణ అధికారం కల్పించారని బొబ్బిలిదొర పెద్ద కోతలు కోశాడు. ఇక్కడ మార్చిన మాట ''మెజారిటీ ప్రాంతంలో మైనారిటీలకు అన్యాయం జరిగితే అన్న అంబేద్కర్ మాటను ''మైనారిటీ ప్రాంతం'' గా కే.సీ.ఆర్. మార్చడం.

 

దళిత జనుల సంక్షేమం అంటే కే.సీ.ఆర్. వర్గానికి ఎంత ''శ్రద్ధో'', దళితులంటే వారికి ఎంత గౌరవమో, ఢిల్లీ ''ఏ.పీ. భవన్'' లో పనిచేస్తున్న దళిత అధికారిపై దారుణంగా చేయి చేసుకున్న ఉదంతమే వెల్లడించింది. నిజానికి స్వాతంత్రోద్యమ దశలో బ్రిటిష్ వాళ్ళ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించినా, సామాజికుల్ని విభజించి పాలించే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుటిలనీతిని ప్రతిఘటించిన డాక్టర్ అంబేడ్కర్, ఆది నుంచీ దళిత బహుజనులకు హైందవ సమాజంలోని కులవ్యవస్థను నిర్మూలించే లక్ష్యంతోనే పనిచేస్తూ వచ్చారు. చివరికి గాంధీజీ ''గ్రామ స్వరాజ్య వ్యవస్థ'' ప్రతిపాదనకు స్థూలంగా అంబేద్కర్ వ్యతిరేకం కాకపోయినా ఎక్కడికక్కడ ఫ్యూడల్ ధనస్వామ్య శక్తుల పెత్తనాన్ని అలాగే అట్టిపెట్టి, ఆ వర్గ ప్రయోజనాలకు కళ్ళెం వేయకుండా ఉన్నంతకాలం ''గ్రామ స్వరాజ్యం'' పథకం దళిత బహుజనుల ప్రయోజనాలను రక్షించదని తెగేసి చెప్పాడు. అదే ధోరణిలో ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదన విషయంలో కూడా వ్యవహరించారు.

 

ఇలా ఏర్పడే రాష్ట్రాలలోని దళిత బహుజన వర్గాలకు సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సమాన ప్రతిపత్తితో వారి ప్రయోజనాలకు రాజ్యాంగ పరిధిలో ఎంతవరకు రక్షణ, న్యాయం సమకూరుతాయోనన్న అనుమానాన్ని అంబేడ్కర్ వ్యక్తం చేశారు. నిజానికి ఈ అనుమానం ఆయనను బాగా పీడిస్తున్నందువల్లనే రాజ్యాంగాన్ని స్వతంత్ర భారత ప్రభుత్వం ఆమోదించుతున్న తరుణంలోనే చర్చ తుది దశలో దళిత బహుజనుల ప్రజాబాహుళ్యం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఓ గొప్ప హెచ్చరికను కూడా చేయాల్సి వచ్చిందని మరవరాదు.

 

"ఈరోజున మనం నూతన రాజ్యాంగాన్ని ఆమోదించుకుని ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం దేశానికి వచ్చింది రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే కాని, సాంఘిక, ఆర్ధిక స్వాతంత్ర్యం రాలేదు. సామాజిక, ఆర్ధిక రంగాలలో వ్యత్యాసాలు అంతరాలు తొలగనంత కాలం అది నిజమైన స్వాతంత్ర్యం కాదు. ఈ వాస్తవాన్ని విస్మరిస్తే, మనం ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్న ఈ పార్లమెంటును, సామాజిక వ్యవస్థను ప్రజలు కూల్చివేయడానికి ఎంతోకాలం పట్టదు!"  అందుకే అంబేడ్కర్ ఈ హెచ్చరిక ద్వారా ఆనాడే జనాల్ని అప్రమత్తుల్ని చేయాల్సివచ్చింది. అంటే, అంబేడ్కర్, దేశ స్వాతంత్ర్యంతోపాటు రూపొందించుకున్న రాజ్యాంగం, అందులో దేశ ప్రజా బాహుళ్యానికి చేసిన వాగ్దానాలు అమలుజరగకపోతే రాజ్యాంగాన్ని కూడా ప్రజలు లక్ష్యపెట్టరని భాష్యం చెప్పాల్సివచ్చింది. కనుకనే ఈ అంతరాల దొంతరల సమాజాన్ని మార్చగల శక్తి గల రెండు రాజ్యాంగ అధికరణలను (38 – 39) ఆయన పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు.

 

దేశ సంపదపై ఏ ఒక్కరి లేదా ఏ కొందరి గుత్తాధిపత్యమో ఉండటానికి వీలులేదని, అది సమష్టి సంపద అనీ ఆ అధికరణాలు నొక్కి చెప్పాయి. కానీ, వాటి అమలుకూ తూట్లు పడ్డాయని ఆయన గ్రహించాడు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధ్యాయానికీ, ఆచరణలో దానిని అమలుజరపాల్సిన ఆదేశిక సూత్రాల (డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్) కూ మధ్య వైరుధ్యం తలెత్తుతోందనీ ఆదేశిక సూత్రాలను వ్యక్తి ప్రాథమిక హక్కుల మాదిరిగా న్యాయస్థానాల ద్వారా అమలు జరిపించే హక్కును దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించనందున ఈ పెద్ద లోటు ఏర్పడిందని ఆయన బాధపడ్డాడు.

 

అనేక వత్తిళ్ళమధ్య రాజ్యాంగ రచన భారాన్ని ఆయన మోయవలసి వచ్చినందున, ఎంచుకున్న ''రాజీమార్గం'' ఆయనకు తృప్తి ఇవ్వనందుననే పలుసార్లు ఆ విషయాల్ని ప్రస్తావించడమూ జరిగింది. అలాగే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలోని ''3వ అధికరణ'' విషయంలో కూడా అంబేడ్కర్ కొన్ని అంశాల్ని స్పష్టం చేశాడు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆయన తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మాదిరిగానే దేశాన్ని ''అవిభాజ్యమైన రాష్ట్రాల సంయోగం (యూనియన్) గా ''an indossoluble union of states'' గా భావించి, ఇండియన్ యూనియన్ నుంచి విడిపోయే హక్కు ఏ రాష్ట్రానికీ లేద''ని కూడా స్పష్టం చేశాడు. (''No state had the right to seperate from it''. కాన్స్టిట్యుయెన్ట్ అసెంబ్లీ డిబేట్స్, వాల్యూ 7, పేజీ 43)

 

ఆనాడు ఇంత గట్టిగా అంబేడ్కర్ గానీ, నెహ్రూగానీ ఎందుకు స్పష్టం చేయాల్సి వచ్చిందంటే, రాజ్యాంగం లోని ''ఆర్టికల్2'' ఏ రాష్ట్రాన్ని అయినా ఇండియన్ యూనియన్లో చేర్చడానికి లేదా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి పార్లమెంటు చట్టం చేయడానికి అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా ఈ అధికరణం (2) ఉపఖండ విభాజనానంతరం భారత పాకిస్తాన్ల మధ్య తలెత్తిన సరిహద్దు నిర్ణయ వివాదాల సందర్భంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే ఈ అధికరణ ''ఇండియాకు సంక్రమించిన భూభాగం కొత్త రాష్ట్రంగా అయినా ఏర్పడవచ్చు లేదా మరో రాష్ట్రంతోనైనా కలిసిపోవచ్చు''నని చెప్పింది.

 

ఇక అధికరణ 3(a), 3(c) ఏ రాష్ట్రం భూభాగాన్ని అయినా వేరుపరచవచ్చు. లేదా ఒకే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్ని కలిపి రెండు మూడు భాగాలుగా ఏర్పరచవచ్చు లేదా ఏ భూభాగాన్ని అయినా ఏ రాష్ట్రంలోనైనా కలపవచ్చుననీ అలాగే ఏ రాష్ట్రపు వైశాల్యాన్ని అయినా తగ్గించనూ వచ్చుననీ, ఈ పని పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే చేయాలని నిర్దేశిస్తున్నాయి. అలాగే, అధికరణ 3 లోని ''ఇ'' క్లాజు ప్రకారం రాష్ట్రం పేరును కూడా మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం - దేశ విభజన సందర్భంగా ఇండియా, పాకిస్తాన్ల మధ్య తలెత్తిన సరిహద్దు సమస్యల పూర్వరంగంలో ఈ అధికరణను దృష్టిలో పెట్టుకుని పరిశీలించాలే గానీ ''పిడుక్కీ బియ్యానికీ'' ఒకే మంత్రాన్ని వల్లించే ప్రయత్న చేయరాదు. ఎందుకంటే ''స్థిరమైన రాష్ట్రాలు లేకుండా ఇండియా మనుగడను ఊహించలేమ''ని 1962 నాటి రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

అందువల్ల మన రాజ్యాంగ చట్టంలో రాష్ట్రాలు నిర్వహించాల్సిన ప్రముఖమైన పాత్రను ''యూనియన్ ఆఫ్ స్టేట్స్ (రాష్ట్రాల సంయోగం) సమ్మిశ్రమమే ఇండియా అని'' గుర్తించాలని ఆ తీర్పులో ఉంది. ఈ దృష్ట్యానే మన రాజ్యాంగంలోని అనేక అధికరణలకు కొన్ని నిబంధనలను లేదా షరతులను (ప్రోవిసోలు) చేర్చి, వాటికి ఒకటి లేదా మరిన్ని వివరణలను జోడించవలసి వచ్చిందని, రాజ్యాంగాన్ని అందులోని షరతులకు లేదా నిబంధనలకు భాష్యం చాలా అవసరమైందని సుప్రసిద్ధ భారత రాజ్యాంగ భాష్యకారుడైన H.M. సీరవాయ్ పేర్కొన్నారు. (సంపుటి-1)! రాజ్యాంగంలోని 1 / 2 / 3 అధికరణల మతలబు అంతా బెరుబరీ యూనియన్, కూచ్ బీహార్ లను ఇండియా, పాకిస్తాన్ల మధ్య పంపిణీ విషయంలో తలెత్తిన తగాదాల సమయంలో పెల్లుబికి వచ్చింది. అంతేకాదు, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అండదండలతో సొంత ఇలాకాలను స్వదేశ సంస్థానాల ముసుగులో వాటిని సొంత ''దేశాలు''గానే భావించుకున్నవారిలో నిజాం పాలకులూ  ఉన్నారు.

 

దేశ స్వాతంత్ర్యానంతరం సంస్థానాల విలీనీకరణ అనే బృహత్ ప్రజాస్వామిక నిర్ణయాన్ని యూనియన్ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించినప్పుడు - ''హైదరాబాద్ సంస్థానాన్ని'' ఇండియాలో చేర్చడానికి మొరాయించిన నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని ''స్వతంత్రదేశం''గా అయినా అట్టిపెట్టాలి లేదా పాకిస్తాన్ లో అయినా కలిపేసుకుంటానని ప్రకటించాడన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాంటి వాగుడు, అనాలోచితమైన ప్రేలాపన ఇటీవల ''ప్రత్యేక తెలంగాణా'' ఉద్యమాన్ని పదవీ స్వార్ధం కోసం ప్రారంభించిన ''బొబ్బిలి దొర'' K.C.R. వర్గం కూడా చేసింది. అవసరమైతే ''తెలంగాణాను దేశం నుంచే వేర్పాటు చేస్తాం'' అన్నంతవరకూ సాగలాగిందని, ఆ నినాదాన్ని ఒకటి రెండు జిల్లాల నుంచి కూడా ఒకరిద్దరి ద్వారా దాన్ని వ్యాప్తిలో పెట్టారనీ మరచిపోరాదు!

 

ఈ పూర్వరంగంలో కూడా అధికరణ (3)ను విశ్లేషించుకోవాలి. పైగా అరకొర విద్యావంతులైన కొందరు రాజకీయ నాయకులు, పదవీ స్వార్ధపరులు ప్రారంభించిన ఉద్యమాల స్వరూపస్వభావాలను అర్ధం చేసుకోలేని కొందరు న్యాయవాదులు సహితం ఎంత అయోమయంలో, అజ్ఞానంలో ఈదులాడుతున్నారంటే - ఒకే జాతి, ఒకే భాష, సంస్కృతుల పై ఆధారపడి భాషా ప్రయుక్త రాష్ట్రోద్యమాలకు అగ్రగామి దళంగా పనిచేసి అనేక త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్న జాతిని చీల్చడం కనీవినీ ఎరుగని ఘట్టమన్న స్పృహ కూడా వీరు కోల్పోయారు.

 

అధికరణ (3) లోని ఏ అంశమూ, ఏ క్లాజూ ఏకజాతి రాష్ట్ర విచ్చిత్తికి అనుమతించదు. జాతిని చీల్చడానికి ఈ ప్రబుద్ధులు చేసే వాదనల్లో ఒకటి ''మా తెలంగాణాను మాకిచ్చేయండి'' అన్న పసలేని వాదన. ఎందుకంటే, వీరి ఉద్దేశంలో ''తెలుగువారు వేరు, తెలంగాణా వేరు, ఆంధ్రులు వేరు, ఆంధ్ర వేరు''! తెలుగు నేలంతా వెరసి తెలంగాణా (తెలుగువారి నివాస భూమి) అన్న గుర్తింపు వీరికి లేదు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట నిర్మాతల్లో ఒకరైన దేవులపల్లి వెంకటేశ్వరరావు (తెలంగాణా బిడ్డ) తెలంగాణా ఎక్కడిదో ఇలా చెప్పారు - ''భారతదేశంలో బ్రిటిష్ పాలన ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సంస్థానం ఎన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదనేది ఒక వాస్తవ విషయం. తెలంగాణా, ఆంధ్రదేశంలో ఒక భాగం. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందాకా తెలంగాణా జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలోనే ఉన్నాయి'', అంతేగానీ అది ఆంధ్రుల నుంచి వేరుపడిపోయిన ప్రాంతం కాదు. అందువల్ల, పరాయి పాలనల మూలంగా ముక్కచెక్కలై పరాయి పంచల్లో చేరిన తెలుగువారందరినీ ఒక్క తాటిపైకి తెచ్చిన ఘన చరిత్రను సృష్టించి విశాలాంధ్రావతరణకు, సమైక్యతకు (ఆంధ్రప్రదేశ్ ) దారితీసిన ఏకైక పరిణామం తెలంగాణా సాయుధ పోరాటం మాత్రమే. ఆ పిమ్మట తెలుగుజాతి ఏకీకరణను సుసాధ్యం చేయడంలో ఈనాటి దొంగ రాజకీయుల మాదిరిగా పూటకొక రంగు మార్చని హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వహించిన పాత్ర. కాబట్టి, జాతీయ సమైక్యతను ఆశిస్తూన్న రాజ్యాంగంలోని అధికరణ (3) ఆంధ్రప్రదేశ్ ను నిలువునా చీల్చడానికి వర్తించదు.

 

పైగా రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఈ అధికరణను వినియోగించుకోవాలని ఉబలాటపడుతున్న ప్రజా వ్యతిరేక ప్రతినిధులు అలాంటి విభజనకు రాష్ట్రపతి సమ్మతించి సిఫారసు చేస్తే తప్ప పార్లమెంటులో ప్రభుత్వం ఎలాంటి బిల్లునైనా ప్రవేశపెట్టడానికి వీలు లేదు, చట్టం చేయడానికి వీలులేదు. అలాంటి చట్టం వచ్చినా దాన్ని తిరిగి రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తెలుసుకునేందుకు సదరు సభకు నివేదించాల్సి ఉంటుంది. అందుకు నిర్ణీత సమయంలో అభిప్రాయం కోరడం జరుగుతుంది లేదా రాష్ట్రపతి అనుమతి మేరకు శాసనసభ అభిప్రాయం తెలుపవలసిన గడువును పోడిగించనూ వచ్చు. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమంటే, రాష్ట్ర విభజన సమస్య అన్నది ''కుక్కల తక్కెడ'' వ్యవహారంగా ఉంది. ఏకవాక్యత లేదు. ఎవరికీ వారే యమునా తీరేగా ఉంది. ఎక్కడికక్కడ విభజన వాదుల్లో ప్రత్యేక కుంపట్లు నడుస్తున్నాయి. పొంతన లేదు, పొందిక లేదు, ఆ మాటకొస్తే రాదు కూడా. కారణం విభజన కోరిక స్వార్ధపరులైన సంపన్న అగ్రకుల రాజకీయనాయకులదే గానీ తెలంగాణా ప్రజా బాహుళ్యానిది కాదు.

 

''చేతబడుల'' సంస్కారానికి అలవాటు పడిన కొందరు స్థానిక నాయకులు తమ పదవీ కాంక్షకు ముక్కుపచ్చలారని విద్యార్ధి యువతపైన ''చేతబడి'' చేస్తున్నారు. ఇది "చేతబడి రాజకీయం"! లేనిపోని ఆశలు కల్పించి ఆత్మహత్యల వైపు నెడుతున్నారు. వారికి తెలుగుజాతి చరిత్రను, తెలుగు భాషా సంస్కృతుల ప్రారంభ, వికాసాలను, తెలుగుజాతి పరాయి పాలనలలో, కునారిల్లడానికి దారితీసిన చారిత్రక, సామాజిక పూర్వరంగాన్ని వివరించి చెప్పి జాతి సమైక్యతను పరిరక్షించాల్సిన ఆచార్యులు కొందరు పెడ మార్గాలు తొక్కారు. ఇలాంటి పెడమార్గం పంజాబును కూడా రెండుగా చీల్చిందని, ఇక్కడి పదవీ కాంక్షాపరుల మాదిరిగానే పంజాబు నాయకులు కొందరు అడ్డదారులు తొక్కి, పంజాబ్ (పెప్సూ) శాసనసభను తప్పించేసి విభజన బిల్లును పంజాబ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంగా 1962 లో పార్లమెంటు చేసినందున, శాసనసభను కాదని చట్టం చేసినందున - ఆ యాక్టు కాస్తా వీగిపోయింది. చెల్లుబడి కాలేదు.

 

రాజ్యాంగం అధికరణ (3) లోని చిన్న ''ప్రోవిసో''ను (షరతు) ఖాతరు చేయనందుననే ఈ పని జరిగింది. అయినా శాసనసభకు బిల్లు నివేదించి అభిప్రాయం తెలుసుకోకుండా, మెజారిటీ సభ్యులు మూడింట రెండొంతులమంది ఆమోదించకుండా చట్టమయ్యే పరిస్థితి లేదు. ఈ సత్యం తెలిసి కూడా పదవీ పీడితులైన రాజకీయ నాయకులు మూర్ఖంగా అధికరణ (3) ప్రకారం ముందడుగు వేద్దామని బయలుదేరడం తెలుగు ప్రజలను మోసగించడం తప్ప మరొకటి కాదు. "పంజాబ్ విభజన వల్ల మేం ఎంత నష్టపోయామో మాకు తెలుసు. ఇప్పుడు ఎంతగా బాధలు పడుతున్నామో తెలుసు. ఆ పొరపాటు మీరు చేయకండి'' - అని సుప్రసిద్ధ పంజాబు పాత్రికేయుడు, మాజీ హై కమీషనర్ కులదీప్ నయ్యర్, పంజాబ్ మాజీ DGP గిల్ తదితరులు బుర్రలు పోయిన మన రాజకీయ వేత్తలకు పాఠం చెప్పాల్సివచ్చింది.

 

అంతేకాదు, 1956 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం (S.R.C.) నివేదిక వెలువడిన తరువాత ఉమ్మడి బొంబాయి రాష్ట్ర విభజన సందర్భంగానూ ఇలాంటి రసాభాసే జరిగిందని మరవరాదు. ఒరిజినల్ బిల్లు ప్రకారం మూడు ప్రత్యేక రాష్ట్రాలుగా (బొంబాయి కేంద్ర పాలిత రాష్ట్రంగా, మరాట్వాడా, విదర్భలతో కూడిన మహారాష్ట్రగా, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో కూడిన గుజరాత్ రాష్ట్రంగా) ఏర్పడాల్సి ఉంది. కానీ, మూడు వేర్వేరు భూభాగాలతో కూడిన ఉమ్మడి రాష్ట్ర ప్రతిపాదన బిల్లును బొంబాయి శాసనసభకు నివేదించి, అభిప్రాయం తెలుసుకోలేదు కనుక రాజ్యాంగలోని అధికరణ (3) ను ధిక్కరించినట్టయింది.

  అసలు అదీ ఇదీ కాకుండా ఎక్కడికక్కడ వేర్పాటు ధోరణులను ఆది నుంచీ ఖండించిన పండిట్ నెహ్రూ జాతీయతను దెబ్బతీసే మనోభావాల వంటకాన్ని పార్లమెంటు సభ్యులకు ఉండాల్సిన విశాల దృక్పథాన్ని గురించి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ నివేదికపై లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా (1955 డిసెంబర్ 21) ప్రస్తావిస్తూ ఇలా హితబోధ చేయాల్సి వచ్చింది.

 

''పార్లమెంటు సభ్యుడైన వ్యక్తి ఒక సభ్యుడిగా తన నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించవచ్చుగాక, కానీ ఆ స్థానిక పరిధికి మించిన వ్యక్తి పార్లమెంటు సభ్యుడు అవునా, కాదా? ప్రతి ఒక్క సభ్యుడు దేశంలోని ఆ మూలనున్న ప్రాంతానికీ, ఈ మూలనున్న ప్రాంతానికే కాదు, మొత్తం భారతదేశానికే ప్రతినిధి అని గుర్తుంచుకోవాలి. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం కన్నా ఇండియా అనేది ఒక మహాదేశమన్న సంగతిని పార్లమెంటు సభ్యుడు మరవకూడదు. దేశంలో వేర్పాటువాద శక్తులు పెచ్చరిల్లుతున్న తరుణంలో ఈ అవగాహన, స్పృహ చాలా అవసరం. ప్రజల దృష్టిని స్థానిక, సంకుచిత రాష్ట్రీయ సమస్యల వైపు మళ్ళిస్తున్నారు కానీ, దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను విస్మరించే గుణం మంచిది కాదు''! ఈ పాఠం నేటివారికి, రేపటి తరానికి గుణపాఠం కావాలని కోరుకుందాం.

 

ఇంతకూ ఒక సందేహం - తాను కోరుకున్న పద్ధతిలో ''ప్రత్యేక రాష్ట్రం" రాకపోతే "విషం తాగి చస్తానన్న'' దొరవారు ''2014 నాటికి రాష్ట్రం'' ఏర్పాటును ఎందుకు వాయిదా వేసుకున్నట్టో?! ''ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన "ఒక లాలూచీ కుస్తీ!

” ___+++___

 

 

 

 

ALL IN ONE NEWS

Sorry, Your browser is not supporting this feature