గాంధీకి నాడు అంబేద్కర్ ప్రాణభిక్ష! హజారేకు నేడు మన్ మోహన్ జీవధార!!

Publish Date:Sep 3, 2011

                            గాంధీకి నాడు అంబేద్కర్  ప్రాణభిక్ష!
                       హజారేకు నేడు మన్ మోహన్  జీవధార!!
                                                                                     డా. ఎ.బి.కె. ప్రసాద్

 

జాతిపిత గాంధీజీ విధానాలు కొందరికి నచ్చకపొతే నచ్చకపోవచ్చు. కానీ ఆయన ఎన్నడూ అబద్ధాలు వల్లించలేదు. సొంతడబ్బా కొట్టుకోనూలేదు. ఉద్యమాల సందర్భంగా మాట్లాడుతూ తాను "హిమాలయాలవంటి తప్పులు చేశానని'' బాహాటంగా, నిర్మొహమాటంగా, నిష్కల్మషంగా ఒప్పుకున్న మహాత్ముడాయన. అంతేగాని ఉద్యమాలతోనూ, సత్యాగ్రహాల తోనూ  పబ్బం గడుపుకోవడానికి ఎన్నడూ అబద్ధాలు ఆడలేదు.

కాని కేవలం 12 రోజులపాటు “నిరాహారదీక్ష'' ద్వారా దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సల్పుతానని బయలుదేరిన-దళితవర్గాల, కార్మిక వర్గాల, మైనారిటీల వ్యతిరేకి అయిన అన్నా హజారే లోగడనే దేశంలో ప్రచారంలోకి వచ్చిన ప్రతిపాదనలను సహితం బాహాటంగా 'కాపీ' కొట్టడంలోనే గాక ఆగస్టు 28వ తేదీన తన "ఆమరణ నిరాహారదీక్ష''ను విరమించుతున్న సందర్భంగా కూడా పచ్చి అబద్ధం ఆడించడానికి జంకలేదంటే ఆశ్చర్యపోకండి. తన దీక్ష విరమణను ఎలా అభివర్నింపజేశాడీయన? దీక్షను ముస్లీం సోదరులు పాటించే "రోజా''గా భావించుకుని తన దీక్ష ప్రపంచంలోనే సుదీర్ఘమైన 'రోజా'గా ప్రకటింపజేసుకున్నాడు!

Lokpal bill,  jan Lokpal bill, anna hazare Lokpal bill, Anna Hazare world bank, anna hazare bjp, anna hazare rss agent

 

ముస్లీం సోదరులకు రంజాన్ పవిత్రమైన పండుగ. రంజాన్ సందర్భంలో వారు పాటించే "రోజా'' (ఉపవాస పధ్ధతి) నెలరోజులు పాటు ఉంటుంది. వారు ఈ "రోజా''ను ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు (ప్రతిరోజూ 4-30నిముషాలకు) ప్రారంభిస్తారు. ఈ ప్రారంభాన్ని "సహర్'' అంటారు. సూర్యాస్తమయ సమయానికి "రోజా'' (దీక్ష) విడుస్తారు. దీన్ని 'ఇఫ్తార్' అని అంటారు. ఈ మధ్యలో వారు 12 గంటలపాటు -"రోజా'' సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకపోవడమేగాక కనీసం ఉమ్మి కూడా మింగరు. ఇది కఠోర దీక్ష. కాని 'అభినవ' గాంధీనని చెప్ప్పుకునే (లేదా అలా అని పిలుస్తుంటే అభ్యంతరం పెట్టని) మన అన్నా హజారే దృష్టిలో తన 12 రోజుల నిరాహారదీక్షలో మంచినీళ్ళు పుచ్చుకోవడం అభ్యంతరకరం కాదు సరి కదా కేవలం 12 రోజుల దీక్షను "ప్రపంచంలోనే సుదీర్ఘమైన రోజా విడుపు''తో పోల్చుకుని, అభివర్ణించడానికి సాహసించాడు. “(This will bring to an end the longest roza in the world'')!

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, గాంధీజీ ఎన్నడూ నిరాహారదీక్షలో ఉన్నప్పుడు ఏ రోజు కా రోజు "నేనంత నీరసించిపోయాను, నే నింత బరువు తగ్గాను'' అని తానే స్వయంగా ప్రకటించుకోవడం మనం ఎరగం! కాని మన హజారే మాత్రం ప్రతి రెండు రోజులకు కనీసం రెండు సార్లయినా "నేను ఇన్ని కేజీలు తగ్గిపోయాను'' అని ప్రకటించు కోవడం  బ్లాక్ మెయిల్ రాజకీయం ద్వారా వందిమాగధుల తోడ్పాటుతో, వత్తిడి ద్వారా ప్రజల్ని ఉద్రేకపరచి, సమీకరింప జేసుకుని, ఎంత త్వరలో దీక్ష విరమణ జరిగితే అంత తొందరగా బయటపడదామన్న ఆలోచన అంతరంగంలో కొట్టుమిట్టాడబట్టే! తన ర్యాలిగావ్ సిద్ధి గ్రామంలో పాతికేళ్ళకు పైగా ఎన్నికలు లేకుండా కునారిల్లి పోతున్న గ్రామపంచాయితీనీ, గ్రామ సహకార సంఘాన్నీ  పట్టించుకోకుండా ఒక్కసారే అనామక రూపంలో అయినా సరే జాతీయ స్థాయిలో మొదటిసారిగా ఢిల్లీలో అమాంతంగా  ఆమరణ నిరాహారదీక్ష తలపెట్టడం వెనక మితవాద, మతవాద రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని ఆదినుంచీ దాగని సత్యంగానే మిగిలిపోయింది.

 ఇటీవల  జంతర్, మంతర్  సత్యాగ్రహాల ద్వారా కులవ్యవస్థలోని కుళ్ళు కూడా బహిర్గతమయింది; ఒకే మతవాద, మితవాద వర్గానికి చెందిన ఇరువురు "పెద్దమనుషులు'' ఎవరో కాదు - ఒకరు యోగి రామ్ దేవ్, రెండవ వ్యక్తి అన్నాహజారే. అయితే వీరిలో ఒకరు వెనుకబడిన వర్గా(కులా)నికి చెందిన వారు (రామ్ దేవ్) కాగా, రెండవ వారు అగ్రకులగర్వానికీ, ఆహంకారానికీ ప్రతీక! విచిత్రమేమంటే ఈ కులవివక్షను ఈ ఇరువురి దీక్షల సందర్భంగా దేశప్రజలు గమనించే ఉండాలి. గమనించకపోతే మోసపోయిన ప్రజలు మూర్ఘులే అవుతారు. ఎందుకంటే పెట్టుబడి దోపిడీ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న నవభారత పాలనా వ్యవస్థ నిర్వాహకులు బడుగు వర్గానికి చెందిన రామ్ దేవ్ దీక్షను భగ్నం చేసి, అరెస్టు చేసిన పద్ధతికీ, అగ్రవర్ణ అహంకారానికి ప్రతినిధి అయిన అన్నా హజారే దీక్ష పట్ల వ్యవహరించిన తీరుకూ నింగికీ, నేలకూ ఉన్నంత అంతర ముందని గ్రహించాలి. బడుగువర్గానికి చెందినవారు కావడంవల్ల వేధింపులను తట్టుకోలేని రామ్ దేవ్ "చీర ధరించి'' గుట్టుగా బయట పడాల్సి వచ్చింది. అందుకే దేశంలోని అసంఖ్యాకులయిన, ప్రజా బాహుళ్యంలో అత్యధికసంఖ్యాకులయిన దళిత, బడుగు, ఆదివాసీ, మైనారీటీలు, వారి ప్రతినిధులూ ఎక్కువమంది హజారే ఉద్యమాన్ని వేరు కోణం నుంచి అంచనా కట్టవలసి వచ్చింది.

Lokpal bill,  jan Lokpal bill, anna hazare Lokpal bill, Anna Hazare world bank, anna hazare bjp, anna hazare rss agent


45 సంవత్సరాల నాడే ప్రతిపాదనలోకి "అవినీతి నిరోధక బిల్లు'' గా లోక్ పాల్ బిల్లు వచ్చి ఉండగా ఇప్పటికిప్పుడే, ఈ రోజుకి ఈ రోజే "నా జనలోక్ పాల్ బిల్లును మాత్రమే'' పార్లమెంటు ఆమోదించాలని హజారే హఠం వేయడం వెనక మఠం రాజకీయాలు ఉన్నాయని ఇప్పటికైనా గమనించాలి; అందుకే అన్ని రాజకీయ పక్షాలకన్నా, బిజెపి, ఆర్.ఎస్.ఎస్., సహా ఎన్.డి.ఎ. లోని అవకాశవాద పక్షాలు కొన్ని వెంటనే హజారే వర్గానికి కొమ్ముకాయ గలిగాయి; కాగా, ప్రభుత్వ రంగాన్ని పక్కకు నెట్టేసి, దేశ, విదేశ గుత్త పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామిక వేత్తలకు వారి కార్యకలాపాలకు విచ్చలవిడిగా సానుకూలించే/సంస్కరణల ద్వారా వత్తాసు దొరికింది. ప్రపంచబ్యాంకు ప్రభుత్వేతర ప్రయివేట్-కార్పోరేట్ సంస్థలయిన ఎన్.జీ.వో.ల ద్వారా వర్థమానదేశాల ఆర్ధిక, సాంస్కృతిక వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇందులో భాగంగానే "కార్పోరేట్ గవర్నెన్స్'' అనీ, “సివిల్ సొసైటీ'' అనీ, గుడ్ గవర్నెన్స్ అనీ, “సిటిజన్స్ చార్డర్డ్'' అనీ, రకరకాల పేర్ల చాటున పాలనావ్యవస్థలో ప్రభుత్వ విధానాలను నీరసింప జేయడం ప్రపంచబ్యాంకు లక్ష్యం. ఈ బ్యాంకు ప్రణాళిక ఆధారంగానే హజారే వర్గం పదే పదే "సివిల్ సొసైటీ'' గురించీ, “సిటిజన్స్ చార్డర్డ్'' గురించీ వల్లెవేస్తున్నదని మరచిపోరాదు. (ఈ "సివిల్ సొసైటీ'' “సిటిజన్స్ చార్డర్డ్''లు, ఆ పదజాలం ఎక్కడినుంచి వూడిపడ్డాయో మరొక ప్రత్యేక విశ్లేషణలో ముచ్చటించుకుందాం - ఎ.బి.కె.)!

అన్నా హజారే నెలకొల్పిన "హింద్ స్వరాజ్ ట్రస్ట్'' లాంటి కొన్ని సంస్థలకు సమకూడే నిథులు కొన్ని, ప్రపంచబ్యాంకు నిరంతరం సాకుతున్న కొన్ని ఎన్.జి.వో. సంస్థల నుంచే ముడుతున్నాయి. గమ్మత్తేమంటే, పాలనా వ్యవస్థలోని అన్ని విభాగాలలోనూ అవినీతి నిర్మూలనను కోరుకుంటున్నారు (అందులో తప్పులేదు) అన్నా హజారే, కాని, ప్రపంచబ్యాంకు అండదండలతో బతుకుతున్న ఎన్.జి.వో. సంస్థలనుగానీ - పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడకు మూలస్తంభాలుగా నిలిచే బడా కార్పోరేట్ సంస్థలను గానీ, అవినీతి నిరోధక చట్టం పరిథిలోకి తీసుకురావడానికి హజారే వర్గం ఇష్టపడడం లేదు. పైగా ప్రభుత్వ లోక్ పాల్ బిల్లుకు ప్రత్యామ్నాయంగా తమ బిల్లునే ప్రభుత్వం ఆమోదించాలని పట్టుబడుతున్న, అహంకారపు ప్రతిపాదనలతో కూడిన, ఆచరణ సాధ్యంకాని "కిచిడీ'' బిల్లుగా హజారే వర్గం రూపొందించిన "జనలోక్ పాల్'' బిల్లు కోసం పడే తపన వెనక వరల్స్ బ్యాంకూ, దాని నిధులతో బతుకుతున్న ఎన్.జి.వో. సంస్థలే ఉన్నాయని మరవరాదు. కార్పొరేట్ రంగానికి, కార్పోరేట్ పాలనకు (కార్పోరేట్ గవర్నెన్స్), ఎన్.జి.వో. సంస్థలకూ ఆశీర్వాదాలు తెలిపే ప్రపంచబ్యాంకు. ప్రభుత్వ జోక్యాన్ని సహించలేదు గనుకనే ఈ వర్గాలను కార్యరంగంలోకి దించి వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది.

Lokpal bill,  jan Lokpal bill, anna hazare Lokpal bill, Anna Hazare world bank, anna hazare bjp, anna hazare rss agent


ప్రధాని మన్మోహన్ సింగ్ "మీ బిల్లులోని మంచి ప్రతిపాదనలను కూడా పరిశీలించి, వివిధ భాగాలకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం చర్చించి, ఉన్నంతలో పటిష్టమైన "లోక్ పాల్'' బిల్లును పార్లమెంటులో ఆమోదింప జేసుకుందా''మని హుందాగా, మర్యాదగా పదే పదే చెప్పినా "అహంబ్రహ్మస్మి, హజం బ్రహ్మస్మి''గా భావించి "హజారే బ్రహ్మస్మి''గా వ్యవహరించిన వ్యక్తి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే కాదు, సాధారణ ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదకారే కాగలడు. అరవై రెండేళ్ళుగా పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థను పాలకులు సాకుకుంటూ వచ్చినందున దాని తాలూకూ సంక్రమించిన అవలక్షణాలన్నీ ఒక్కసారిగా తోలిగేవి కావు. లేడికి లేచిందే ప్రయాణమన్నట్టుగా ఎన్.జి.వో. సంస్థ ప్రాపున వర్థిల్లుతున్న హజారే లాంటి సామాజికుడు ఒక వ్యక్తిగా, దేశ ప్రజాబాహుళ్యం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులతో ఏర్పడిన పార్లమెంటు వ్యవస్థనే శాసించి తన పాదాక్రాంతం చేసుకోవాలన్న కోరిక మర్యాదగా చెప్పాలంటే - పరమ దుష్టతలంపు.

ఏ ప్రాతిపదికిన "ఇక్కడికిక్కడే, ఇప్పుడే, వెంటనే బిల్లు పాసైపోవాలి, అవినీతి 24 గంటలలో అంతమైపోవాల''ని హజారే ఎందుకు కోరుతున్నాడో, చస్తే బయటకు చెప్పడు. ఎందుకని? “పలికెడివాడు తాను, పలికించేటివి'' ఎన్.జి.వో. సంస్థలూ, వాటి మాతృసంస్థ అయిన అమెరికా ప్రేరేపిత ప్రపంచాబ్యాంకూ, ఐ..ఎమ్.ఎఫ్. సంస్థలూ కాబట్టి! ఆ దన్నుతోనే పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్నీ అతను ఒక ఆట ఆడించి చూశాడు. ఈ ఆటమీద మరో సరికొత్త ఆట కోసం తపన పడుతున్నాడు! ఈ 'ఆట' నిరంకుశ ధోరణులు గల వ్యక్తులందరికీ సాధారణమే! హేతు విరుద్ధమైన మంకుపట్టుకు వీరు ప్రతినిధులు. గతంలో దళిత, బహుజన వర్గాలకు సంబంధించిన ప్రాతినిద్య సమస్య జాతీయోద్యమ దశలో, ఒక ప్రధాన ఎజెండాగా ముంచుకు వచ్చినప్పుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ప్రతిపాదించిన విభజించి - పాలించే దుష్టనీతిలో భాగంగా కమ్యూనల్ అవార్డును ప్రకటించినప్పుడు అందుకు నిరసనగా గాంధీజీ సుదీర్ఘ  నిరాహారదీక్ష పూనారు.

ఈ ఉరవడిలో ముందుకు తోసుకొచ్చిందే "పూనా సంధి”.  కాని ఈ సంధి, అంతిమంగా భారత దళిత, బహుజన వర్గాల ప్రయోజనాలకు 'గండి' కొడుతుందని భావించి వ్యతిరేకించిన వాడు స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రేసరుడైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అయితే గాంధీజీ ఆమరణ నిరాహారదీక్షలో ఉన్నందున, ఆయన ప్రాణాలకు ముప్పు వస్తుందన్న స్పృహతో, పూనా సంధి, పట్ల తన తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తూనే గాంధీజీకి ప్రాణభిక్ష పెట్టినవాడు అంబేద్కర్ అని మరవరాదు. అలాగే ఇప్పుడు గాంధీజీతో వీసమెత్తు కూడా పోలికలేని, ఎన్.జి.వో. ప్రేరేపిత వ్యక్తిగా హజారే ప్రారంభించిన దీక్షను విరమింప జేసి, ప్రాణభిక్ష పెట్టినవాడు - పాలనా నిర్వహణలో ఎన్నిలోపాలున్నా ఈ విషయంలో ఎంతో హుందాగా వ్యవహరించిన వాడూ ప్రధాని మన్మోహన్ సింగ్.

Lokpal bill,  jan Lokpal bill, anna hazare Lokpal bill, Anna Hazare world bank, anna hazare bjp, anna hazare rss agent
 

నిజానికి, గత 62 ఏళ్ళలో ఎన్నడూ లేనంత స్థాయిలో అవినీతికి, ఆర్ధిక నేరాలు, అక్రమాలు, వ్యవస్థాగతమైన తొట్రుబాట్లకు, ఆర్ధిక రంగ విచ్చిన్నతకు, సామాజిక దోపిడీకి, అశాంతికి, అంతరాల దొంతరలు పెరిగిపోవడానికి, కార్పోరేట్ రంగంల కోట్ల  లక్ష చోట్లలో లాభాల వేటలో అర్రులు చాచడానికీ దోహదం చేసిన ప్రపంచబ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణలకు నాటి ప్రధానిగా పి.వి.నరసిహారావు, నాటి ఆర్ధికమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ కారణమనడంలో సందేహం లేదు. అన్నా హజారేను భుజాన వేసుకుని తిరగడం ఎంత తప్పయిందో ఆయనతో కొంతదూరం ప్రయాణించిన స్వామి అగ్నివేష్ గుర్తించి, పక్కకు తప్పుకున్నంతగా  బిజెపి-ఆర్.ఎస్.ఎస్. కంబైన్ లో అంతర్భాగమైన కెజ్రీవాల్ గాని, బిజెపి సంపూర్ణ సహకారంకోసం ప్రాధేయపడిన కిరణ్ బేడీగానీ పక్కకు తప్పుకోలేకపోయారు.


ఆదినుంచీ మితవాదులైన రామ్ దేవ్, “జీవనకళ''లో ఆరితేరిన రవిశంకర్, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు రామ్ మాధవ్ లు హజారే చుట్టూ చేరినవారే. వ్యష్టితత్వం జాతికి ఎంత చెరుపు తెస్తుందో ప్రపంచాధిపత్యం కోసం ఉద్యమించిన నాజీస్థాపకుడు హిట్లర్ నిరూపించాడు. ఒక్క సంవత్సరంలోనే జర్మనీ దారిద్ర్యాన్ని, జర్మనీ రుణాలనూ, యువకుల నిరుద్యోగాన్ని తీర్చి పరిష్కరిస్తానని గప్పాలు కొట్టాడు. చివరికి ఎవరూ ఆశించనంత ఎజెండాను ప్రకటించి, జర్మనీని సోషలిస్టు దేశంగా మర్చేస్తానని బీరాలు కూడా పలికాడు! ఆ ఎజెండా ఏమైందో, ప్రపంచ ప్రజలను అతడు ఎలా యుద్ధగండంలోకి నేట్టాడో చరిత్ర విద్యార్దులకు తెలుసు. అందువల్ల హజారే ఎజెండా నుంచి మనం నేర్చుకోవలసింది - దుష్టపరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్న స్పృహ కోల్పోకుండా ఉండడమే కాదు, వ్యష్టి. ప్రయోజనం కోసం కాకుండా, ప్రజాబాహుళ్యం     ప్రయోజనాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం  పునాదులకు, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రజాస్వామ్య ప్రవర్తనా నిబంధనావళికి ఎసరు పెట్టుకునే వ్యష్టి అహంకార  ధోరణులను  విడనాడడం.

ఈ విషయంలో పప్పులో కాలువేసిన వారిలో ప్రసిద్ధసామాజిక కార్యకర్త అయిన మేధా పాట్కర్ కూడా ఉన్నారు. కాగా, అదే స్థాయిలోని సామాజిక కార్యకర్తలు, మానవహక్కుల పరిరక్షణా బాధ్యతను తలకెత్తుకున్న అరుంధతీ రాయ్, షబనామ్ ఆస్మీ, మహేష్ భట్, ఆనంద్  తెల్తుండే మాత్రం హజారే పద్ధతుల్ని తూర్పార పట్టారు; మెగాసాసే పురస్కార గ్రహిత అరుణ్ రాయ్ హజారే "జనలోక్ పాల్ బిల్లు'' (ఆయన రాసింది కాదు, వందిమాగధులు రాసింది)కు పూర్తి ప్రత్యామ్నాయ బిల్లు ముసాయిదాను రూపొందించారు.

చివరికి హజారే సాధించింది - 30 సొంత ప్రతిపాదనల్లో మూడింటిని; “జనలోక్ పాల్''గా వెంటనే ఆమోదించాలని భీష్మించిన హజారే, ఆమోదించే దాకా ఆమరణ నిరాహారదీక్షలోనే కొనసాగుతానని బీరాలు పలికిన హజారే తన సొంత బిల్లు 'సోయ' మానేశాడు; కేవలం  "పరిశీలిస్తా''మని కేంద్రప్రభుత్వం చెప్పిన హజారే బృందపు మూడు ప్రతిపాదనలు (లోక్ పాల్ పరిథిలోకి చిన్న చితకా ఉద్యోగుల్ని కూడా తీసుకు రావడం, రాష్ట్రాలలో లోకాయుక్త సంస్థలు ఏర్పరచడం, ప్రజల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించే “సిటిజన్ చార్టర్''  రూపొందించడం) కూడా వెంటనే అమలులోకి వచ్చేవి కావు; అవి పార్లమెంటు స్థాయీ సంఘం పరిశీలనలోకి వెళ్ళి, చర్చించి, తుదిగా పార్లమెంటు ద్వారా వెలువడే లోక్ పాల్ బిల్లులోకి ఏ రూపంలో ప్రవేశిస్తాయో ఎవరికీ తెలియదు!

మిగిలింది అహంబ్రహ్మస్మి, హజం బ్రహ్మస్మి, హజారే బ్రహ్మస్మి! కాని, తానెక్కడ అబాసుపాలవుతానోనని ఇప్పట్నుంచే మళ్ళీ కొత్త నినాదాలు చేపట్టాడు హజారే.  ఎజండా మారిపోతోంది! రైతాంగ ఉద్యమం, ఎన్నికల సంస్కరణలు, కార్మిక సంస్కరణలు, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి-ఇవీ తన రేపటి ఎజండా. అంటే ఈ వ్యవస్థలతో బాటు సంఘాల అధికారాలన్నింటినీ హజారే తనకు తానై తలకెత్తుకుంటాడట; ఇవి గాక ఇష్టంలేని అభ్యర్థిని తిరస్కరించే ఓటు ద్వారా తిరస్కరించే ఓటుహక్కు కోసం కూడా పోరాడుతాడట. కాని ఈ సంస్కరణకు మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ ఏనాడో పిలుపునిచ్చాడు. అయినా ఇతరుల ప్రతిపాదనలను కాపీ కొట్టడంలో కూడా ఆరితేరిన హజారేకు జేజేలు తెలపాల్సిందే.  ఎక్కడ బయల్దేరాడు, ఎక్కడ ముగించాడు మన హజారే! సిగ్గుపడాలి.

 


 

ALL IN ONE NEWS

Sorry, Your browser is not supporting this feature