బొబ్బిలిదొర పాట్లు : “లత్కోర్ సాబ్'' గాట్లు!

Publish Date:Sep 27, 2011

             బొబ్బిలిదొర పాట్లు : “లత్కోర్ సాబ్'' గాట్లు!


                                                             - ఎ.బి.కె.ప్రసాద్  సుప్రసిద్ధ సంపాదకులు
తెలుగుజాతి విచ్చిన్నకుడిగా అవతరించిన 'బొబ్బిలిదొర' మరోసారి తన "లక్ష్యం'' గురించి ఆందోళన చెందుతున్నాడనడానికి, రోజులు గడిచిన కొద్దీ బెంబేలు పడిపోతున్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనం - వారంరోజుల్లోనే (సెప్టెంబర్ 13 నుంచి 20 మధ్య) తాను నిర్వహిస్తున్నాననుకొంటున్న 'ఉద్యమం' సందర్భంగా విడుదల చేసిన రెండు మూడు ప్రకటనలు. ఒకటి- “తెలంగాణాకోసం విషం తాగుతా'' “అవసరమైతే తలనరుక్కుంటా, (2) “మనం ఇప్పుడు ఉద్యమమనే పులిమీద ఎక్కి సవారీ చేస్తున్నాం, దాని గురించి దిగులూ లేదు, ప్రయాణం సాగించనూ లేము'' (3) ఈసారి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సాధించలేకపోతే ఇక రాదు, మనల్ని బతకనివ్వరు, పాతాళంలోకి తొక్కేస్తారు. తెలంగాణా రాకపొతే మనవి బానిసబతుకులే, మీ జీతాలు ఎక్కడికీ పోవు, రాష్ట్రం రాగానే బోనస్ తో సహా చెల్లిస్తాం; ఉద్యోగులకు వేతనాలు పెంచేస్తాం, పిల్లలకు కె.జి.నుంచి పి.జీ.వరకూ ఉచితవిద్య అందిచ్చేస్తాం''!

ఇలా ఆచరణలో అక్కరకురాని ఈ వాగ్థానాలు ఆధారంగా 'బొబ్బిలిదొర' “మరో స్వాతంత్ర్యపోరాటాని''కి  ప్రజల్ని తన పదవీ రాజకీయాల కోసం ఉద్రేకపరుస్తున్నాడు; ఏదో ఒక ఆవేదన, నిరాశ, నిస్పృహ తనను ఆవరించడంతో చిత్ర విచిత్రమైన 'సిగ్నల్స్' వదులుతున్నాడు; ఒకసారి విఫలమైపోయి, అభాసుపాలైన "ఆమరణదీక్ష''ను మరోసారి రిపీట్ చేస్తానంటున్నాడు! ఖమ్మం, నిమ్స్ ఆసుపత్రులలో జరిగిన 'దీక్షా''పద్ధతుల్ని జనం మరచిపోయారనుకుంటున్నాడు! చివరికి అతని నిరాశ, నిస్పృహ ఎంతవరకు వెళ్ళిందంటే, రాజ్యాంగ నిబంధనలనూ. చట్టాలను అతిక్రమించి వెళ్ళి, తనతో  ఏకీభవించని తోటి తెలుగువారిపైన/ఉద్యోగులపైన. మంత్రులపైన, ప్రజలెన్నుకున్న శాశనకర్తలపైనా "తిరగబడమ''ని పిలుపివ్వడమేగాక "ఎక్కడ దొరికితే అక్కడనే లాగులూడిపోయేదాక కొట్టమ''ని  'ఫర్మానా'లు జారీచేస్తున్నాడు!

సరిగ్గా హింసను ప్రేరేపిస్తూ ఈ "బొబ్బిలిదొర'' చేసే బెదిరింపులు, చట్టవిరుద్ధమైన ప్రకటనలూ చేస్తున్న సమయంలోనే ఫక్తు తెలంగాణాలోని స్థానిక తెలుగు కుటుంబాలు, ఉపాధ్యాయ సోదరులూ కూనారిల్లిపోతున్న తమ బిడ్డల చదువుసంధ్యల గురించి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ వరసవారీ బంద్ ల వల్ల, విద్యాసంస్థలను తరచుగా మూసివేస్తుండడంవల్ల పిల్లల పాఠశాల విద్య ఎలా 'చంకనాకిపోతు'న్నదీ సోదాహరణంగా వివరించారని "హిందూ'' (సెప్టెంబర్ 20) పత్రిక కొన్ని ఇంటర్వ్యూలు ప్రచురించింది. “తామెందుకు నష్టపోవాలో, ఈ బాధలు అనుభవించాలో తెలియక తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, విద్యార్థులూ ఆందోళన చెందుతున్నార''ని ఆ పత్రిక నివేదించింది. “తమ చుట్టూ అల్లిన ఉద్రేకవాతావరణంలో పిల్లల్ని చదువుల మూడ్ లోకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాద''ని హైదరాబాద్ నవోదయ స్కూల్స్ కాంప్లెక్స్ అధ్యక్షురాలు డి.ఉషారెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. ఈ పాఠశాల సముదాయంలో సిబియస్ పాఠ్యమోలిక అనుసరించే 64 స్కూళ్ళు ఉన్నాయి. గత ఏడాది నుంచి సాగుతున్న "ఆందోళన'' ఫలితంగా తాము విద్యా సంవత్సరం కోల్పోయినందుకు, అందుమూలంగా విద్యార్జనలో, పరీక్షలలో దారుణ ఫలితాలు చవిచూడవలసి వచ్చినందుకు విద్యార్థులు "నరాల బలహీనత'' వ్యాధికి గురికావలసి వచ్చిందని తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ మొత్తుకున్నారని ఆ నివేదికలో ఉంది. ఇంజనీరింగ్, ఐ.ఐ.టి.లకు సెలక్టయిన వేలాదిమంది తెలంగాణా బిడ్డలు (విద్యావకాశాలు ఈ ప్రాంతాల్లో పెరిగినందువల్ల), గత అనేక సంవత్సరాలుగా ఇంజనీరింగ్, ఐ.ఐ.టి. పరీక్షల్లో దూసుకువస్తున్న విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు జాతీయస్థాయిలో ఉన్నతవిద్య, ఉపాథి రంగాలలో పోటీకి నిలబడలేని పరిస్థితులు ఈ "ఆందోళన'' వల్ల ఎదురైనాయని తల్లిదండ్రుల సంఘాల రాష్ట్రస్థాయి సమన్వయకర్తల నాయకులు ఆందోళన వెలిబుచ్చారు. ళ్ళనూ, కాలేజీలనూ అనవసర ఆందోళనోద్యమాల  నుంచి మినహాయించాలని, అయితే ఉద్యమాలకు తాము వ్యతిరేకం కాదని అభిప్రాయపడ్డారు.

కాని "బొబ్బిలిదొర'' పదవీ సాధనలో ఉద్యమానికి విద్యార్థియువకులనే 'సమిథులు' వెతుకుతున్నాడు! అయితే ఈ "బొబ్బిలిదొర'' ఉద్యమానికి సంబంధించి కొన్ని ప్రకటనలకు మౌలికమైన సమాధానాలు దొరకడంలేదు. ఎందుకంటే నేరమనస్తత్వంతో అతడు చేసే ప్రకటనలు తెలంగాణా ప్రాతంలోని తెలుగువారిని తెలుగువారిపైనే రెచ్చగొట్టడం ద్వారా "ముఖ్యమంత్రి పదవి'' చేజిక్కించుకోవాలని తాపత్రయపడుతున్నాడు! అది సాధ్యంకాదన్న అనుమానం, ఆందోళన, చిరాకు, పరాకు వచ్చినప్పుడల్లా చేసే హింసాపూరితమైన  ప్రకటనలవల్ల తెలుగువారి మధ్యనే పరస్పరం శాశ్వతమైన 'గండి'ఏర్పడే ప్రమాదపు అంచులకు అతడు నెడుతున్నాడు. దేశం నుంచి విడిపోయిన రాష్ట్రంలా వ్యవహరిస్తున్నాడు. ఆంధ్రప్రేదేశ్ రిజిష్ట్రేషన్ ఉన్న ప్రాంతపు కార్లపైన నెంబరు మాత్రం అదే ఉంచి, “టి'' గుర్తు తగిలించి మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. అతని ఉద్రేకపూరిత అనుచిత ప్రకటనల వల్ల ఇప్పటికే "బలవంతపు బ్రాహ్మణార్థం''గా అనేక స్కూళ్ళనూ, కాలేజీలనూ మూసివేయవలసి వస్తోందని కొన్ని యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ పరిస్థితికి సమాధానం బొబ్బిలిదొర హింసాపూరిత ప్రకటనలలోనే ఉంది. అనేకమంది తెలంగాణా బిడ్డల ఆత్మహత్యలను ప్రోత్సహించి వాటికి కారకుడైన 'దొర' అసలు భయం- ఎవడో తన గొయ్యి తానే తవ్వుకొన్నట్టుగానే తన సంకల్పం వికటించినప్పుడు ఇదే ప్రజలు తనపైన తిరగబడగల అవకాశం ఉందన్న భయాందోళననుంచి పుట్టి ఉంటుంది. “తెలంగాణా సాధించకపోతే మనల్ని బతకనివ్వరు'' అన్న ప్రకటనకు అర్థం లేదు; ఎందుకంటే, తెలంగాణా ప్రజల్ని నిజాం నిరంకుశపాలకులతో చేతులు కలిపి దశాబ్ధాల తరబడి పీల్చుకు తిన్నవాళ్ళు, దోచుకుతున్నవాళ్ళూ, రక్తమాంసాలు తోడుకుతిన్న వాళ్ళూ 'దొర'లూ, జాగిర్థార్లూ, దేశ్ ముఖ్ లూ, జమీందార్లూ, పటేల్ పట్వార్వీలే గాని మరెవరూ కారు! ఇది ఛారిత్రిక సత్యం. తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం నిగ్గుతెల్చిన వాస్తవం; లోకానికి బట్టబయలు చేసిన అసలు రహస్యం - ఒక్కముక్కలో, తెలంగాణా సాధారణ తెలుగుపేద, మధ్యతరగతి రైతాంగామూ, కార్మికులూ నాడు అనుభవించిన దోపిడీ నిత్య కర్మకాండ! అందువల్ల "మనల్ని బతకనివ్వరు'' అనే బొబ్బిలిదొర నోట వర్తించేది సోదర తెలంగాణా ప్రజలకు మాత్రం కానేకాదు, ఆ ప్రకటన వర్తించేది, వర్తించాల్సిందీ ప్రజాకంటకులయిన ఆనాటి, ఈనాటి 'దొర'లకూ, దొరల సంతతికి మాత్రమే! ఎందుకంటే బొబ్బిలిదొర పేలుతున్నట్టుగా ఇంతకుముందు అంటే నిజాం పాలన నుంచి విమోచన పొందకముందు సోదర తెలంగాణా ప్రజలు తమను "పాతాళంలోకి తోక్కేసిన'' వారెవరో కాదు, ఈ 'దొర'లూ, జమీందార్లేననీ. అలా "పాతాళానికి తోక్కబడి''న  ప్రజలచేత "నీ బాచన్ దొరా, నీ కాల్మొక్తా'' అని సాగిలబడేటట్టు చేసిన దుర్మార్గపు సంస్కృతికి ప్రతినిథులు ఈ 'దొరలే'నని చరిత్ర నిరూపించింది.; అందుకే ఆ "బానిస బతుకుల'లో తిరిగి సోదర తెలంగాణా ప్రజల్ని నెట్టడమే అభినవ బొబ్బిలిదొర విపులమైన ఎజెండా అని మరిచిపోరాదు! కనుకనే ఆయన "రేపటి తెలంగాణాకు దళితుడ్నే ముఖ్యమంత్రి చేస్తాన''ని  హైదరాబాద్ లో ప్రగల్భించి, ఢిల్లీ ఏ.పి.భవన్ లో మాత్రం అదే దళిత అధికారిని చావబాది రావడానికి మరొక 'దొర'ను పురమాయించాడు! ఈ ఘటనను, ఈ 'నాల్క చీలిన' ధోరణిని యావదాంధ్ర దళిత, బహుజన, బి.సి., మైనారిటీ వర్గాలు ముక్తకంఠంతో ఖండించారు. తన పదవీ ఉద్యమం కోసమే 'బొబ్బిలిదొర' తెలంగాణా సాధనకోసం మరో "స్వాత్రంత్ర్య పోరాటం'' అవసరమంటున్నాడు గానీ, ఆ దొరల రకరకాల దాష్టికాల నుంచి ఏనాడో, తెలంగాణా ప్రజలు రైతాంగ సాయుధ పోరాటం ద్వారా విముక్తి పొందారని గుర్తించాలి; అలా అతను గుర్తించేటట్టు చేయగల శక్తి కష్టజీవులయిన సోదర తెలంగాణా ప్రజలకే ఉంది.

అంతేగాదు, పైగా రాష్ట్ర ప్రభుత్వ పరధిలోలేని రాష్ట్ర "విభజన'' సమస్యపైన , కేవలం కేంద్రప్రభుత్వం పరధిలో మాత్రమే ఉన్న సమస్యపైన చట్టవిరుద్ధంగా ఉద్యోగుల పోట్టగొట్టే పనికి 'బొబ్బికిదొర' దిగినందుకు రాష్ట్ర ప్రజాబాహుళ్యం ప్రయోజనాలను దెబ్బతీసే సార్వత్రిక సమ్మెను నివారించమని వచ్చిన పిటిషన్ ఆధారంగా రాష్ట్ర  అత్యున్నత న్యాయస్థానం బొబ్బిలిదొర ప్రభ్రుతులకు నోటీసులు (సెప్టెంబర్ 19) యివ్వవలసి వచ్చింది. నిజానికి సర్వీసు నిబంధనలకు సంబంధించిన ఆందోళనకు మాత్రమే అర్హులైన రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు వారికి సంబంధంలేని వ్యక్తి ప్రయోజనాలు కేంద్రంగా తలపెట్టిన ఉద్యమాలలో లేదా సమ్మెలో పాల్గొనరాదు. అలాంటి పరిస్థితులలో రాష్ట్ర విభజనను, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఈ అధికరణ నిరోదిస్తోందన్న విషయాలు కూడా చదువుకున్న లాయర్ అయినా మన 'దొర' యాదికి అందకపోవడం ఆశ్చర్యం! “చేతబడి'' రాజకీయం ద్వారా తెలుగుబిడ్డల్ని అనేకమందిని ఆత్యహత్యల వైపునకు నెట్టేసి తన కుటుంబాన్ని మాత్రం సురక్షితం చేసుకున్న "దొర' చనిపోయిన బిడ్డల కుటుంబాలకు 'పరిహారం' పేరిట యిచ్చిన అరకొర చెక్కులు కూడా బ్యాంకుల్లో బౌన్స్ అయి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాకుండా పోయి, అభాసుపాలవుతున్న దశలో - 800 మార్కులు ఇంటర్ లో సంపాదించుకొని మండలస్థాయిలో ప్రథమశ్రేణిలో నిలిచి కూడా, దారుణ దారిద్ర్యానికి తోడు కీళ్ళవ్యాధితో తీసుకుంటున్న వరంగల్ జిల్లాకు చెందిన కేసముద్రం నిరుపేద విద్యార్థి సురేష్ కు తోమ్మిదిలక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందించాడు!

ఇంతకు చెప్పవచ్చేదేమంటే - సోదర తెలంగాణా తెలుగువారు కోల్పోయిన 'దొరల' బానిసత్వాన్ని తిరిగి ఎవరూ చేజేతులా ఆహ్వానించి ప్రజల్ని నిప్పులలోకి తోయవద్దనే! ఎందుకంటే, బార్టోలి, చంపారన్  రైతాంగ తిరుగుబాట్లు గాంధీజీని ఆకర్షించగా 1945 – 51 నాటి తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం యావద్భారతావానినే కాకుండా ప్రపంచదేశాలనే ఆకర్షించింది. అలాంటి మహా సాయుధపోరాటంలో 'దొర'లూ, జమీందార్లు, దేశ్ ముఖ్ లూ, రజాకార్లూ శలభాల్లా ఎగిరిపోయారు! మాచిరెడ్డిపల్లి, మునుగోడు, వెతవోలు, కడివెండి, బాలెంల, పాతసూర్యాపేట, మునగాల, దేవరుప్పల, ధర్మాపురం సాయుధపోరాటాలు అన్ని ప్రాంతాల పోరాటయోథుల్ని కలుపుకుని ఒక్కుమ్మడిగా సాగి ప్రజలకు విమోచనం సాధించిపెట్టాయి. కాని రజాకార్లను అణచే పేరుతొ దిగిన యూనియన్ సైన్యాల నీడల్లో తిరిగి తెలంగాణా గ్రామాల్లో ప్రవేశించి, సాయుధపోరాటం ద్వారా తెలంగాణా పేద ప్రత్యూష ప్రజలు సాధించుకున్న 10 లక్షల ఎకరాలను తిరిగి బలవంతంగా ఆక్రమించుకున్నవాళ్ళు  మాత్రం - దొరలూ జమీందార్లూ, దేశ్ ముఖ్ లూ, భూస్వాములేనని మరవరాదు! ఈ తప్పుడు పరిణామం మళ్ళీ పునరావృత్తం కాకూడదనుకుంటే 'బొబ్బిలిదొర' చేతులకు పోరాట పగ్గాలు వదలకూడదు, గుంజుకోగలగాలి. ఆ సత్తా ప్రజలకు కలగకుండా ఉండేందుకే 'దొర' “మరో స్వాతంత్ర్య పోరాటా''నికి పిలుపునిస్తున్నాడు! కానీ, రేపు ప్రజల్ని పీడించేది తనే, “బ్రతకనివ్వనిదీ'' అతనే, “పాతాళానికి తోక్కేసేదీ'' అతనే, ఇదేదీ సాగనప్పుడు తానెక్కి కూర్చున్న 'పులిమీద' ప్రయాణం సాగించలేనిదీ అతనే, ఒకరు ఎక్కిన "పులిమీదనుంచి'' దిగలేనిది కూడా అతనేనని దిగితే అది చంపేస్తుందని గుర్తించిన వాడూ అతనేననీ  గ్రహించాలి!  అంతిమంగా భస్మాసుర హస్తానికీ అర్థం కూడా అదే అవుతుంది. ఏ అధికారం లేకుండానే "దంచితేనే దయ్యం వదిలిపోతుందనే వాడు పెద్ద క్రిమినల్, హింసావాది.

ఈ సందర్భంగా నల్గొండజిల్లా నాయకుడూ, ప్రజాకళాకారుడూ, అయిదుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రజల నాల్కలమీద నర్తించిన నర్రా రాఘవరెడ్డి "ఫజల్ ఆలీ కమీషన్'' గోడమీది పిల్లవాటపు పరిష్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా ప్రతిపాదించినప్పుడు ఓ ఎకపాత్రాభినయంలో "లత్కోర్ సాబ్'' పేరిట పిట్టలదొర వేషంలో కొందరు ఏర్పాటువాదుల మీద వేసిన వ్యంగ్రాస్త్రాలను వినండి:


“లత్కోర్ సాబ్ లత్కోర్ సాబ్
పోతుంది పోతుంది, అన్నారంతా
ఏం పోతుందోనని నేను
నెత్తినున్న బుట్ట  చేతినున్న లొట్ట
ఎన్నడు నిండని పొట్ట
పెట్టీ పట్టీ చూసిన
అన్నీ వున్న చోటనే వున్నాయని
ఇంకేంబోతుందన్నాను
నిజం రాష్ట్రం బోయి
మహారాష్ట్రలో కొంతగలిసి
కర్నాటకలో కొంతగలిసి
ఆంధ్రలో కొంతగలిసి
అండ్లగలిసి ఇండ్లగలిసి
ఆయింత లేకుండ బోతే
నైజం నవాబుగిరి
మంట గలుస్తుందన్నారు
అట్లయితే -
మా బూర్గుల రాంకిషన్ రా వెటుబోతడు
మా వెంకటరంగారెడెటు బోతడు
మా చెన్నారెడెటు బోతడు
అని నేనంటున్నంగనే -
ఏం లత్కోర్ సాబు
నీ నసీబు నాకు పడుతుందని
చెన్నారెడ్డి నన్ను బట్టుకొని ఏడ్వ
నేను ఆయన్ని బట్టుకొని ఏడ్వ
ఈ 'దొర' దొర ఇంతోడ్ని
బట్టుకొని ఏడ్వ ….!!!

ఈ 'ఏడుపు' నుంచి రేపు తానెట్లా బయటపడాలి అన్నదే మన 'బొబ్బిలిదొర' పైకి చెప్పలేని లోలోపతి గుబులంతా! అందుకే మనల్నందర్తో కాసేపు విషంతాగుతానంటాడు ఇంకాసేపు "మెడకోసుకుంటాన''ని బెదిరిస్తాడు. ఈ రెండు హామీల్లో ఏదీ నెరవేరకుండానే 'సెలైన్' భరాసాతో. “పిటిలోన్'' పోషకాలతో "ఆమరణదీక్ష''కు ఇంకోసారి కూర్చుంనని అంటాడు! ఖమ్మం, నిమ్స్ ఆస్పత్రుల్లో రికార్డులు తెప్పించుకుని చూసిన కేంద్రప్రభుత్వం ఈసారి 'దొర'వారు ఎన్నిరోజులు "దీక్ష''లో ఉన్నా పట్టించుకొనక పోవచ్చునని ఢిల్లీ వర్గాల సమాచారం! కవిగాడు ఎందుకన్నా డబ్బా - “మేడిపండు చూడమేలిమైయుండు/పోట్టవిప్పిచూడ పురుగులుండు''! అసలు ఈ రాజకీయవేత్తలలో అగ్రగణ్యుడైన డాక్టర్ హోమిచిన్ "నిద్రలో అందరి మొగాలు నిజాయితీగానే కనిపిస్తాయి, కాని మేల్కొన్నప్పుడు గానీ వారి నైజాలు బయటపడవు''!

 

 

ALL IN ONE NEWS

Sorry, Your browser is not supporting this feature