'అజంత' భాష ఆనాథ కాదు!

Publish Date:Dec 20, 2011

'అజంత' భాష ఆనాథ కాదు!


                                                                                                                          ఎ.బి.కె.ప్రసాద్

 

ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలుగుభాషా, సంస్కృతులకు రాను రాను అనాదరణకు గురిచేస్తున్నారనడానికి తాజా నిదర్శనం - గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని సభలలో మాటలకోసం తరచుగా తడబడుతూండడం. ఇటీవల ఒక సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ "వెండి'', 'తాకట్టు' లేదా 'తనఖా' పదాలు గుర్తురాక వాటికి బదులుగా 'సిల్వారు' 'మార్ట్ గేజ్' పదాలు వాడాల్సివచ్చింది. మాతృభాషను నిరంతరం వాడుకలో పెట్టుకున్నప్పుడు ఎవరికీ ఈ తొట్రుబాటు ఉండదు. అందుకే ఆంధ్రప్రదేశ్ అధికారభాషా సంఘంన్ "తల్లిభాషను కౌగిలించు, పరభాషను గౌరవించు'' అన్న నినాదాన్ని అర్థవంతంగా రూపొందించి వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. అలాగే "తెలుగులో ఆలోచించండి/తెలుగులో మాట్లాడండి/తెలుగులో రాయండి'' అని సచివాలయంలోని మంత్రుల, కార్యదర్శుల కార్యాలయాల ముందు స్ఫూర్తిదాయకంగా నినాదాలున్న ఫెక్సీలు పెట్టించింది.

 

ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలుగుభాషా, సంస్కృతులకు రాను రాను అనాదరణకు గురిచేస్తున్నారనడానికి తాజా నిదర్శనం - గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని సభలలో మాటలకోసం తరచుగా తడబడుతూండడం

 

సచివాలయ స్థాయినుంచి కిందమండలస్థాయి వరకూ అధికారభాషగా తెలుగులోనే పాలనా వ్యవహారాలూ నడపాలని నిర్దేశించిన అధికార భాషా చట్టం వచ్చి సుమారు 46ఏళ్ళు కావస్తున్నా పాలకులలో చలనం లేనందున తెలుగుకు పాలనా వ్యవస్థలోనే గాక, పాఠశాల, కళాశాల విద్యావ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార ప్రయోజనాలకోసం ఎన్ని భాషలయినా ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. కాని అన్యభాషాభ్యాసానికి 'నేర్పు' అనేది మాతృభాషలో పదాల 'కూర్పు' ద్వారానే సాధ్యం. అందుకే మన పెద్దలు "మాటలో నీటుంది/ మాత్రలో పోటుంది/మాటలో సూటుంది'' అంటారు. అంటే, ఆ నీటు, ఆ పోటూ, ఆ సూటిదనం మాతృభాష ద్వారా వ్యక్తమైనంతగా పరభాషలో వ్యక్తం చేయలేరు. పెద్దలు చెప్పిన ఆ "నీటు, పోటు, సూతీ'ల సమాహారమే వెరసి మన తెలుగు అంటే ఆశ్చర్యం లేదు. పాలనాపరంగా, విద్యాపరంగా, తెలుగు సంస్కృతీ పరిరక్షణపరంగా పాలకులు ఈ 'ప్రపంచీకరణ' సద్దులో కేవలం వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఎదురవుతున్న ఆంగ్లమాధ్యమవ్యాప్తి ప్రమాదంనుంచి తెలుగుభాషకు సంపూర్ణ రక్షణ కల్పించాలి. ఇందుకు మొదటి చర్యగా 2005 తర్వాత తొలగించిన "జి.వో.76''ను పునరుద్ధరించి, “జి.వో.86''ను రద్దుచేయాలి. “ప్రపంచీకరణ'' విధానాల్లో భాగంగా దూసుకువచ్చిన ప్రయివేటీకరణ వ్యవస్థమూలంగా ప్రభుత్వ పాఠశాలలకూ, ప్రయివేట్ పాఠశాలలకూ మధ్య పెద్ద గండి ఏర్పడింది. ఫలితంగా ఇకీకృత భాషావిధానం లేకుండా పోయింది. కాని "జి.వో.76''ను పునరుద్ధరించడం ద్వారా ప్రయివేట్-ప్రభుత్వ పాఠశాల విద్యావ్యవస్థలో మాతృభాషా మాధ్యమాన్ని విధిగా అమలు జరపడం సాధ్యమవుతుంది. ఇంగ్లీషు 10వ తరగతివరకూ రెండవభాషగా మాత్రమే కొనసాగాలి. 

 

 

 

 

 

 

 

 

 

 

అలాగే కర్ణాటకలో కన్నడం విషయంలో అమలు జరుపుతున్నట్టుగా ఉన్నతవిద్యావ్యవస్థలో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా (ఒక ప్రశ్నాపత్రంగా) ఉంచేలా ఏర్పాట్లు చేయాలి; మాతృభాషతో మౌఖికంగానూ, లిఖితపూర్వకంగానూ అభ్యర్థులు స్పర్శ కోల్పోకుండా ఉండేందుకు ఇంజనీరింగ్, మెడిసిన్ లో కూడా ఒక భాషా పత్రాన్ని కర్ణాటకలో (కన్నడంలో) ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ ఆవేదన మన తెలుగు పాలకుల్లో కన్పించదు. కొందరు మంత్రులయితే (తెలుగువాళ్ళే) తెచ్చిపెట్టుకున్న 'యెచ్చు' కొద్దీ ఇంగ్లీషులోనే ప్రమాణస్వీకారాలు చేశారు! మాతృభాషా విధానం స్పష్టంగా మన ప్రభుత్వానికి లేనందుననే పాఠశాల, కళాశాలస్థాయిలో బోధనా మాధ్యమాన్ని తక్కువగా చూసినందువల్ల క్రమంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలకు హాజరయ్యే అభర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా, పాఠశాల, కళాశాల దశలో తెలుగు మాధ్యమంలో చదువుకున్న అభ్యర్థులు కొందరు సర్వీస్ కమీషన్ గెలుపు పరీక్షల్లో కూడా అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని గుర్తించాలి.

 

 

తెలుగు మాధ్యమంలో చదువుకునే తెలుగువాడికి బతుకులేదన్న భీతావహమైన అవగాహనను పాలకులే కల్పించి, ఆంగ్లానికి ఇవ్వవలసిన ప్రాధాన్యం కన్నా ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు, “తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం'' అన్నట్టుగా! ఇటీవల, కొలదిరోజులనాడే జరిగిన ఒక సంఘటన రాష్ట్రపాలకులకు కనువిప్పు కల్గించాలి; జూనియర్ లెక్చరర్ల పరీక్షకు హాజరయిన తెలుగు మాధ్యమం అభ్యర్థులకు యిచ్చిన ప్రశ్నాపత్రాలలో సగానికి సగం ప్రశ్నలు ఇంగ్లీషులో యివ్వడంవల్ల అభ్యర్థులు గందరగోళానికి గురికావాల్సివచ్చింది. దీనివల్ల ఇంగ్లీషు మాధ్యమంలో సమాధానాలు రాసుకునే అభ్యర్థులతో పోల్చినప్పుడు తెలుగుమాధ్యమం అభ్యర్థులు ప్రతికూల పరిస్థితులను (ప్రశ్నలు ఇంగ్లీషులో ఇచ్చినందువల్ల) ఎదుర్కొనవలసివస్తుంది. ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే - పాలకులకు మాతృభాషపట్ల, తెలుగు సంస్కృతిపట్ల, తెలుగుభాష, చారిత్రిక వికాసాలదశల పట్ల ఏమాత్రం పరమ, అభిమానం ఉన్నా పరిస్థితులు నేడున్నంత అధ్వాన్నంగా ఉండి ఉండేవికావు. చివరికి భాషా సంస్కృతుల పెంపుదలకు కృషి చేయవలసిన అధికార భాషా సంఘానికి, రాష్ట్ర సాంస్కృతిక మండలికి కేటాయించవలసిన నిధుల విషయంలో కూడా పాలకులకు ఒక స్పష్టతగాని, తపనగానీ లేదు.

 

చివరికి "సంజ్ఞాభాష''కు (సైన్ లాంగ్వేజి) కూడా అధికారభాషా ప్రపత్తిని కల్పించాలన్న సహజమైన డిమాండ్ వినవస్తున్న దశలో 3000 సంవత్సరాల లిపి, భాష, శాసనాల చరిత్ర కలిగిన తెలుగు పట్ల పాలకవ్యవస్థ వహిస్తున్న నిరాదరణ దుస్సహమైనదిగా భావించక తప్పదు! అవసరానికి మించిన వ్యసనంగా మారిన ఆంగ్ల వ్యామోహానికి ఒక చక్కని తాజా ఉదాహరణ - “ఇంగ్లీషులో ఆలోచించమ''ని ప్రబోధిస్తూ ఒక రచయిత అయిన న్యాయవాది "స్పోకెన్ ఇంగ్లీషు'' కోర్సు నేర్పడానికి గాను ఒక ప్రకటన విడుదల చేశాడు. అందులో ఆయన తెలుగు మకుటంలో "ఆంగ్లంలో అనర్ఘళంగా మాట్లాడండి'' అన్నారు. తెలుగు వర్గాక్రమం ఆయనకు సరిగ్గా వచ్చివుంటే అన(ర్ఘ)ళం అని వాడేవారు కారు. అంటే "ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడాల''ని సందేశాలిచ్చేవారు "తెలుగులో ధారాళంగా మాట్లాడండి'' అని చెప్పలేకపోవడం దౌర్భాగ్యం కాదూ? “మీరూ ఇంగ్లీషులో కూడా బాగా రానిస్తారండీ'' అని ఒకాయన శ్రీ శ్రీ ని ప్రశ్నించగా. “నేను తెలుగులో బాగా రాయగలను కాబట్టే''నని శ్రీ శ్రీ సమాధానమిచ్చాడు! అదీ, మాత్రుభాషలోని రహస్యమూ, ఇతర భాషల అధ్యయనానికి మాతృభాషే అనువైన పట్టూ! భాషవాడకంలో పెట్టుకోనకపోతే వాడిపోతుంది.

 

ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలుగుభాషా, సంస్కృతులకు రాను రాను అనాదరణకు గురిచేస్తున్నారనడానికి తాజా నిదర్శనం - గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని సభలలో మాటలకోసం తరచుగా తడబడుతూండడం

 

అందులోనూ తెలుగు "అజంత'' భాష, అంటే ప్రతి శబ్దం చివరనా అచ్చులు వచ్చి వయ్యారాలు ఒలకబోసుకుంటాయి. గుండ్రపు ముత్యాలు తెలుగు వర్ణాలు, మార్పులకూ, చేర్పులకూ వెసలబాటు కల్పించే తత్వం మూటకట్టుకున్న భాష తెలుగు; సంస్కృతంలో కూడా లేని విశేషధ్వనులను పొదిగి ఉన్న భాష తెలుగు; వ్యవహారిక భాష అనేక సొగసులతో సోయగాలతో వర్థిల్లడాన్ని సుకరం చేసిన భాష తెలుగు; సంగీతంలో స్వర ప్రస్తారానికి అందమైన మెట్లు పెట్టిన భాష తెలుగు; రాగాలాపనను రాసిక్యంతో విరాజిల్లచేసిన భాష తెలుగు' 'హలంత'భాషలకు (హల్లులతో ముగిసే భాషలకు) ఈ సౌదర్యం, సౌకుమార్యం దక్కనివ్వని స్వతంత్ర భాష తెలుగు; యుగయుగాలుగా జానపదులు, కవులు, వాగ్గేయకారులూ అల్లారుముద్దుగా పెంచుకుంటూ పరిఢవిల్ల చేస్తూ దేశ సరిహద్దులు దాటించి విశ్వవ్యాపితం చేసిన భాష తెలుగు; ఆణిముత్యాల సిరులతో తెలుగు దస్తూరికి వెలుగులు తెచ్చిన భాష మన తెలుగు!

 

 

 

ALL IN ONE NEWS

Sorry, Your browser is not supporting this feature