మహాయతి కూటమిలో ముసలం..  ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు ఏక్ నాథ్ నో ఇన్విటేషన్
మహాయతి కూటమిలో ముసలం.. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు ఏక్ నాథ్ నో ఇన్విటేషన్

మహారాష్ట్ర రాజకీయాల్లో మిత్ర భేదం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమం కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర విభేదాలకు కేంద్రబిందువుగా మారింది. మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు. ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విమానాశ్రయ ప్రాజెక్టును పర్యవేక్షించే అత్యున్నత ప్రభుత్వ సంస్థ సీఐడీసీవో నేరుగా షిండే నేతృత్వంలోని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోనే పనిచేస్తుంది. అయినా.. ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందకపోవడం సంచలనంగా మారింది. ఈ వేడుకను అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ, సీఐడీసీవో సంయుక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై.. 20 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేదికపై రాష్ట్ర మంత్రులు గణేశ్ నాయక్, అదితి తత్కరేలు ఉన్నారు. అయితే.. డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండేతో పాటు సునేత్రా పవార్‌లకు కనీసం ఆహ్వానం కూడా అందకపోవడంతో వారు రాలేదు. దీంతో షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఆగ్రహంతో రగిలిపోతున్నది. కొందరు ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనీ, ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు క్రెడిట్ ఏక్‌నాథ్ షిండేకు దక్కకుండా చేసేందుకేఆయనకు ఆహ్వానం కూడా పంపకుండా తెరవెనుక కుట్ర జరిగిందనీ మంత్రి సంజయ్ శిర్సాత్ బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై శివసేన (యూబీటీ) నేత అంబాదాస్ దాన్వే మహాయుతి కూటమిలో అసలు ఏక్‌నాథ్ షిండే ప్రాధాన్యత మరియు ఆయన స్థానం ఏంటో ఈ సంఘటనతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కూటమిలో ముసలం ముదిరిపోయిందన్నారు. ఈ వివాదం మరింత ముదరకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నష్టనివారణ చర్యలకు దిగింది. ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి, ఉప ముఖ్యమంత్రులను ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి దూరం పెట్టడంపై 24 గంటల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ సీఐడీసీవో, అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా సమీపిస్తున్న తరుణంలో.. క్రెడిట్ రాజకీయం చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Publish Date: Jun 9, 2026 10:55AM
ఇండియా కూటమి కీలక నిర్ణయం...ఇకపై రెండు నెలలకు ఒకసారి భేటీ!
ఇండియా కూటమి కీలక నిర్ణయం...ఇకపై రెండు నెలలకు ఒకసారి భేటీ!

దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది. కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణను మరింత బలోపేతం చేసేందుకు విపక్షాలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన తాజా సమావేశంలో ఇండియా బ్లాక్ నేతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజల సమస్యలపై నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు గాను ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం కావాలని కూటమి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ క్రమంలోనే తమ తదుపరి కీలక భేటీని 2026, ఆగస్టు 8వ తేదీన నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించారు. ఈ చారిత్రాత్మక సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 25 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై తమ గళాన్ని వినిపించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సాగిన ఈ సుదీర్ఘ చర్చల్లో దేశాన్ని వేధిస్తున్న ఐదు అత్యంత కీలకమైన అంశాలపై కూటమి నేతలు ఒకే తాటిపైకి వచ్చారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియలో జరుగుతున్న వ్యూహాత్మక లోపాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఓటర్ల హక్కుల ఉల్లంఘనపై ఇండియా కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కి నేరుగా ఒక సమగ్రమైన లేఖ రాయాలని 25 పార్టీల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ అధికారిక లేఖను అత్యంత త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించనున్నారు. దేశంలోని విద్యావ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్‌లు, అలాగే సీబీఎస్ఈ (CBSE) మూల్యంకనంలో వెలుగుచూసిన ఘోరమైన అవకతవకలపై విపక్షాలు నిప్పులు చెరిగాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఇండియా కూటమి అత్యున్నత వేదిక నుండి డిమాండ్ చేసింది. దీనితో పాటు దేశంలో పెరుగుతున్న బంధుప్రీతి పెట్టుబడిదారీ విధానం, బీజేపీయేతర లేదా ఎన్డీఏయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలపై కేంద్రం చేస్తున్న దాడులు, సమాజంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మరియు మోదీ ప్రభుత్వ ప్రస్తుత విదేశాంగ విధానంలో లోపాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఈ ఐదు ప్రధాన అంశాలపై దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ కీలక భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), డీఎంకే (DMK) దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న డీఎంకే ఈ భేటీకి డుమ్మా కొట్టగా, ఆప్ వ్యూహాత్మకంగా దూరంగా నిలిచింది. అయినప్పటికీ, మిగిలిన భాగస్వామ్య పక్షాలు ఆగస్టు 8 భేటీ కోసం ఇప్పటి నుంచే సమరశంఖం పూరిస్తున్నాయి.

Publish Date: Jun 8, 2026 5:30PM
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్

రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు.రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీ నారాయణ,పంతం వెంకటేశ్వరరావు(నానాజి), తంగిరాల సౌమ్య సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యేలు బి.రామాంజనేయులు,కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరాం తాతయ్యలు సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ రెండు సెట్లు నామినేషన్లు సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి కొలుసు పార్థసారథి,ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్,సుందరపు విజయ్ కుమార్,బోడే ప్రసాద్ లు సంతకాలు చేశారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. అఖిల్ కుమార్, పి.విజయ కుమారి తోపాటు కూటమి నేతలు జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రూ),వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)వరుపుల సత్య ప్రభ,బండారు సత్యానంద రావు పాల్గొన్నారు. ఇంకా 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తదతర నేతలు పాల్గొన్నారు.

Publish Date: Jun 8, 2026 4:52PM
9 నుంచి ఏపీ సర్కార్ ప్రజాబాట!
9 నుంచి ఏపీ సర్కార్ ప్రజాబాట!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. వైసీసీ హయాంలో జగన్ ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కేవలం కోటరీకే పరిమితమై దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమైన జగన్.. అధికార పగ్గాలు చేపట్టగానే, ప్రజలకు చేరువయ్యే అన్ని మార్గాలనూ మూసేసుకున్నారు. కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ ప్రజాబాటలో భాగంగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నాయి. జూన్ 9న సంక్షేమ పథకాలపై కేంద్రీకరిస్తూ భారీ ఎత్తున తొలి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు పథకాలు అందుతున్న తీరు, అందులో మార్పుల వంటి పలు అంశాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత జూన్ 12న అమరావతి వేదికగా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పాలనాపరమైన ఇబ్బందులు, ప్రజల సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. ఇక జూన్ 15న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై స్థానిక ప్రజలు, మేధావుల నుండి నేరుగా సూచనలు, సలహాలు సేకరించనున్నారు. వైసీపీ హయాంలో సీఎంగా ఉన్న జగన్ ప్రజలతో నేరుగా కలిసే అవకాశాలకు తాళం వేసేశారు. ప్రజల నుండి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ తీసుకోకపోవడంతోనే 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఎన్డీఏ కూటమి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజలతో మమేకం అయ్యే వ్యూహాలనే అనుసరిస్తున్నది. తాజాగా చేపట్టిన ప్రజాబాట. ద్వారా సామాన్య ప్రజలు తమ ప్రాంత ప్రతినిధులను, ప్రభుత్వాన్ని నేరుగా కలిసి అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ప్రభుత్వం భవిష్యత్తులో తన పరిపాలనను మరింత మెరుగుపరుచుకుంటూ, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని తెలుగుదేశం కూటమి సర్కరా్ భావిస్తోంది.

Publish Date: Jun 7, 2026 12:12PM
. అమరావతిపై విషం.. రాజకీయ ఉనికి కోసం కవిత వ్యర్థ ప్రయత్నం
. అమరావతిపై విషం.. రాజకీయ ఉనికి కోసం కవిత వ్యర్థ ప్రయత్నం

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత.. మాటలతో గారడీ చేసే విద్యను తండ్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నుంచి పుణికి పుచ్చుకున్నట్లుగా కనిపిస్తారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె శైలి ఒకింత భిన్నంగా ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించిన కల్వకుంట్ల కవిత రాజకీయ ఉనికి కోసం వివాదాస్పద విమర్శల దారి ఎంచుకున్నట్లుగా కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వర్షాల కారణంగా అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కుర్చీ నీరు కారుతోందని, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలు పడవల్లో తిరుగుతున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్‌తో కవితకు ఏవైనా రాజకీయ విభేదాలు ఉంటే, ఆమె రాజకీయ స్థాయిలో ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ.. ఆమె అమరావతిపై విమర్శలు చేయడంపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతంది. రాజకీయాల్లోని విభజన, ప్రాంతీయత అంశాన్ని గతంలో కేసీఆర్ వీలైనంతగా వాడుకున్నారు. ఇప్పుడు కవిత మళ్లీ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఆమె అమరావతి లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్రాలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తన రాజకీయ ఉనికి కోసం కవిత అమరావతిపై విషం కక్కడం వ్యర్థ ప్రయత్నంగా పరిశీలకులు అభివర్ణిస్తుననారు.

Publish Date: Jun 7, 2026 11:55AM
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు...సామాజిక సమీకరణాలకే పెద్దపీట!
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు...సామాజిక సమీకరణాలకే పెద్దపీట!

ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు నేతల పేర్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కోసం కష్టపడిన విధేయత, సామాజిక సమీకరణాలు, యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ దఫా పెద్దల సభకు వెళ్లే అభ్యర్థుల జాబితాలో ప్రముఖ విద్యావేత్త భాష్యం రామకృష్ణ, ప్రస్తుత ఎంపీ సానా సతీష్ బాబు, యువ నాయకుడు చింతకాయల విజయ్ స్థానం దక్కించుకున్నారు. శనివారం రాత్రి వీరందరికీ చంద్రబాబు స్వయంగా పార్టీ తరఫున బీ-ఫామ్‌లను అందజేశారు. దీంతో గత కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యంగా మూడో స్థానం ఎంపికలో పార్టీ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేసింది. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు చివరి నిమిషం వరకు పరిశీలనలో ఉన్నప్పటికీ, బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో చింతకాయల విజయ్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడైన విజయ్, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీడీపీ ఇన్‌ఛార్జిగా సాంకేతిక విభాగంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలపై నమోదైన కేసుల ఉపశమనానికి విశేషంగా శ్రమించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించినా పొత్తుల వల్ల త్యాగం చేయాల్సి రావడంతో ఇప్పుడు పెద్దల సభకు పంపుతున్నారు. మరో అభ్యర్థి, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ పార్టీ విపక్షంలో ఉన్న కష్టకాలంలో ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచారు. గత ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ టికెట్ దక్కకపోయినా పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరించినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ పదవి దక్కింది. ఇక కాకినాడకు చెందిన సానా సతీష్ బాబు గత ఉప ఎన్నికల్లో కేవలం ఏడాదిన్నర కాలానికే ఎన్నికవ్వడంతో, సామాజిక సమతూకం దృష్ట్యా ఆయనకు చంద్రబాబు మరోసారి పూర్తి కాలానికి అవకాశం కల్పించారు. మొత్తంగా ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్థానాలలో కూటమి ఒప్పందం ప్రకారం మూడు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నాయి. జనసేన తరఫున ఇప్పటికే లింగమనేని రమేష్ నామినేషన్ వేయగా, టీడీపీ అభ్యర్థులు సోమవారం తమ పత్రాలను దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ మెజారిటీ నేపథ్యంలో ఈ నలుగురి ఎన్నిక కేవలం ఏకగ్రీవంగా పూర్తి కావడం లాంఛనంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో యువతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ముగ్గురు నేతలు గళం విప్పుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Publish Date: Jun 7, 2026 11:30AM
 ఐటీ నుంచి పెద్దల సభ వరకూ చింతకాలయ విజయ్   ప్రస్థానం
ఐటీ నుంచి పెద్దల సభ వరకూ చింతకాలయ విజయ్ ప్రస్థానం

చింతకాయల విజయ్ అంటే కేవలం చింతకాలయ అయ్యన్న పాత్రుడు రాజకీయ వారసుడు మాత్రమే కాదు. ఉన్నత విద్యావంతుడు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి, రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. ఐటీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగాలపై ఆయనకున్న అవగాహన టెక్నాలజీని రాజకీయ వ్యూహాల్లోకి ఎలా అమలు చేయాలో నేర్పింది. ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది. ఆ సమయంలో టీడీపీ ఐటీ వింగ్, సోషల్ మీడియా విభాగాల బాధ్యతలను విజయ్ భుజానికెత్తుకున్నారు. పార్టీ కోసం ఒక పటిష్టమైన సోషల్ మీడియా ఆర్మీని అంటే టీడీపీ డిజిటల్ వింగ్ ను నిర్మించారు. కేవలం అమరావతి, హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామ స్థాయి వరకు వాట్సాప్, ఎక్స్), ఫేస్‌బుక్ గ్రూపుల ద్వారా పార్టీ లూప్‌ను కనెక్ట్ చేశారు. అప్పటి అధికార వైసీపీ ఐప్యాక్ టీమ్ సోషల్ మీడియాలో సంధించే విమర్శలను, ట్రోల్స్‌ను అంతే వేగంగా డిజిటల్ వేదికలపై తిప్పికొట్టడంలో విజయ్ వ్యూహాలు కీలకంగా పనిచేశాయి. 2019, 2024 మధ్య కాలంలో ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసినందుకు, పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించినందుకు విజయ్ తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లను, న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో జగన్ సర్కార్ విజయ్‌పై పలు కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం, విచారణల పేరుతో ఇబ్బంది పెట్టడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ ఒత్తిళ్లకు లొంగకుండా ఆయన నిలబడటం, న్యాయపోరాటం చేయడం ద్వారా పార్టీ క్యాడర్‌లో ఆయనపై గౌరవం పెరిగింది. కేవలం ఏసీ రూముల్లో కూర్చునే నేత కాదనీ.. , పార్టీ కోసం కేసులు ఎదుర్కొనే ఫైటర్ అనీ తెలుగుదేశం క్యాడర్ గుర్తించింది. దీంతో యూత్ లో చింతకాలయ విజయ్ కు ఫాలోయింగ్ పెరిగింది. ఇక విజయ్ తండ్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు సుదీర్ఘ కాలంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైన బీసీ సామాజికవర్గ నేతగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం స్పీకర్ హోదాలో ఉండటంతో ప్రత్యక్ష రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ.. ఉత్తరాంధ్రలో పార్టీ యువతను సమూహపరచడంలో విజయ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అన్నిటికీ మించి చింతకాయల విజయ్ కేవలం ఒక నియోజకవర్గానికో లేదా జిల్లాకో పరిమితమైన నాయకుడు కాదు. సాంకేతికతను, సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ డిజిటల్ క్యాడర్‌ను లీడ్ చేసిన అనుభవం ఆయనకుంది. అందువల్లే, నేటి ఆధునిక రాజకీయాల్లో, మారుతున్న ఢిల్లీ సమీకరణాలకు అనుగుణంగా ఇలాంటి టెక్-సావీ, అలాగే దూకుడుగా వ్యవహరించే యువనాయకుడిగా గుర్తించిన తెలుగుదేశం అధినాయత్వం చింతకాలయ విజయ్ ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించుకుంది.

Publish Date: Jun 7, 2026 11:20AM
రాజ్యసభకు చింతకాయల విజయ్.. చంద్రబాబు నిర్ణయం వెనుక కారణమేంటంటే?
రాజ్యసభకు చింతకాయల విజయ్.. చంద్రబాబు నిర్ణయం వెనుక కారణమేంటంటే?

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు గానూ ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించగా ఆ పార్టీ తమ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను ఎంపిక చేసింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక తెలుగుదేశం కూడా ఇద్దరు అభ్యర్థుల ఖరారు సజావుగా సాగిపోయింది. మూడో అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానం సమయం తీసుకుని మరీ చింతకాయల విజయ్ ను ఖరారు చేసింది. ఈ స్థానం కోసం చివరి నిముషం వరకూ టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పోటీ పడ్డారు. చివరికి పార్టీ అధినేత చంద్రబాబు చింతకాలయ విజయ్ కే మొగ్గు చూపారు. ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది. అందుకే ఉన్నత విద్యావంతుడు, ఇంగ్లీష్, హిందీ భాషలపై మంచి పట్టున్న నాయకుడు. ఢిల్లీ స్థాయిలో జాతీయ మీడియాతో మాట్లాడాలన్నా, పార్లమెంట్ లో పాయింట్ టు పాయింట్ వాదించాలన్నా విజయ్ లాంటి యంగ్ అయితేనే కరెక్ట్ ఆప్షన్ అని భావించి ఆయనను చంద్రబాబు రాజ్యసభకు ఎంపిక చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు.. సోషల్ మీడియా వేదికగానూ, క్షేత్రస్థాయిలోనూ టీటీడీ వాయిస్ ను ఐటీ వింగ్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. రాబోయే రోజుల్లో పార్టీని నడిపించే నెక్స్ట్ జనరేషన్ నాయకులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు చింతకాయల విజయ్ కు రాజ్యసభ ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే.. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంలో చింతకాయల అయ్యన్నపాత్రుడి కుటుంబం పాత్ర ఉంది. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఇప్పుడు చింతకాయల విజయ్ ను రాజ్యసభకు పంపడం ద్వారా జాతీయ స్థాయిలో బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత ఇఇచ్చినట్లు అవ్వడమే కాకుండా.. ఉత్తరాంధ్ర యువతకు ఈ నిర్ణయం ద్వారా పెద్ద పీట వేసినట్లు అవుతుంది. అదలా ఉంటే.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల విమర్శలను ఒంటిచేత్తో తిప్పికొట్టిన వర్ల రామయ్యకు అన్యాయం జరిగినట్లేనని పార్టీలోని కొందరు అంటున్నారు. అయితే.. "వర్ల రామయ్య గారి సీనియారిటీకి తగని గౌరవం ఇస్తూనే.. ఆయన సేవలను పారటీ రాష్ట్ర రాజకీయాలలోనే ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తోందని అధిష్ఠానం చెబుతున్నది. అలాగే . వర్ల రామయ్యకు ఎమ్మెల్సీగా అవకాశమో, కీలకమైన నామినేటెడ్ పదవో కట్టబెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో యువనాయకత్వానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకునే చింతకాయల విజయ్ కు రాజ్యసభ చాన్స్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Publish Date: Jun 7, 2026 11:05AM
 రజనీకాంత్, అణ్ణామలై .. తమిళనాట కొత్త రాజకీయ సమీకరణం!
రజనీకాంత్, అణ్ణామలై .. తమిళనాట కొత్త రాజకీయ సమీకరణం!

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అణ్ణామలై, రజనీకాంత్ కాంబినేషన్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ద్రావిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టేందుకు తెరవెనుక చకచకా పావులు కదులుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై చుట్టూ తిరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌ను పూర్తిగా షేక్ చేస్తోంది. నిన్నటివరకు తమిళనాడు బీజేపీలో అత్యంత యాక్టివ్, ఫైర్ బ్రాండ్ లీడర్‌గా చక్రం తిప్పిన అన్నామలై, ఆ పార్టీకి అధికారికంగా గుడ్ బై చెప్పిన తర్వాత ఒక సరికొత్త రాజకీయ వేదికను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన ఏర్పాటు చేసిన ఈ సరికొత్త వేదికకు క్షేత్రస్థాయిలో ప్రజల నుండి, ముఖ్యంగా యువత నుండి ఊహించని రీతిలో భారీ ఎత్తున స్పందన లభిస్తోంది.ఇలాంటి కీలక తరుణంలో, అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దశాబ్దాలుగా సాగుతున్న సాంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా, ఒక సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కాబోతోందనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. అన్నామలై మొదటి నుంచి రజనీకాంత్‌ను తన వ్యక్తిగత గురువుగా, అంతకంటే ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా బహిరంగంగానే భావిస్తూ వస్తున్నారు. అన్నామలై తన ప్రతిష్టాత్మక ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత, 2020లో రజనీకాంత్ స్వయంగా ఆయనను తన నివాసానికి ఆహ్వానించి సుదీర్ఘంగా మాట్లాడారు. అప్పటినుంచే వీరిద్దరి మధ్య అత్యంత బలమైన సంబంధాలు, ప్రత్యేక అనుబంధం కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా అన్నామలై రెగ్యులర్‌గా రజనీకాంత్‌ను కలుస్తూనే ఉన్నారు.ప్రస్తుతం అన్నామలై బీజేపీని వీడిన ప్రత్యేక తరుణంలో, రజనీకాంత్ గతంలో కలలుగన్న ఆధ్యాత్మిక రాజకీయం అనే సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఈ కొత్త కూటమి రూపుదిద్దుకోబోతున్నట్లు సమాచారం. ఈ వ్యూహం ప్రకారం, క్లీన్ ఇమేజ్ ఉన్న అన్నామలైను పార్టీ ఫ్రంట్ ఫేస్‌గా ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేదా కీలక నేతగా పెట్టి, తెరవెనుక నుండి రజనీకాంత్ తన పూర్తి సపోర్ట్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. గతంలో రజనీకాంత్ సొంతంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, చివరి నిమిషంలో ఆరోగ్యం సహకరించని కారణంగా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే హవాకు బ్రేక్ వేయడానికి ఈ సరికొత్త కాంబినేషన్ ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్లీన్ ఇమేజ్, అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యువ నాయకుడు అన్నామలైకు, రజనీకాంత్ ఉన్న పాన్-ఇండియా ఇమేజ్ తోడైతే రాష్ట్రంలో తిరుగులేని మాస్ ఫోర్స్ క్రియేట్ అవుతుందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. రజనీకాంత్ అభిమాన సంఘాలు కూడా అంతర్గతంగా ఈ కాంబినేషన్‌పై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాక ముందే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ అవుతుండటం విశేషం. ఒకవేళ ఈ కాంబినేషన్ అధికారికంగా నిజమైతే, అది తమిళనాడు రాజకీయాలలో ఒక సంచలన కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు.

Publish Date: Jun 6, 2026 4:43PM
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!

భారత దక్షిణ సరిహద్దుల్లో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, పర్యావరణ దుమారాన్ని రేపుతోంది. నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ. 81,000 కోట్ల భారీ వ్యయంతో ఈ ద్వీపంలో ఒక అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, సివిల్ మరియు మిలిటరీ అవసరాల కోసం అంతర్జాతీయ విమానాశ్రయం, గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్, అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించింది. మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల చైనా వ్యూహాత్మక ఆధిపత్యానికి గట్టి అడ్డుకట్ట వేయడానికి.. అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదాస్పద ద్వీపాలను స్వయంగా సందర్శించి.. అక్కడ సముద్రంలోకి ప్రత్యేకంగా డైవింగ్ చేసి అక్కడి పర్యావరణాన్ని నిశితంగా పరిశీలించిన రాహుల్ గాంధీ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. దేశ రక్షణ, అంతర్జాతీయ ఓడరేవు అనేవి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పచ్చి అబద్ధాలని.. నిజానికి రక్షణ అవసరాలే ఉంటే అక్కడ ఇప్పటికే ఉన్న మిలిటరీ బేస్ ఐఎన్ఎస్ బాజ్ ను మరింత విస్తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం రక్షణ దళాల వెనుక దాక్కుని దేశ అమూల్యమైన భూములను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లింక్‌ను రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది కేవలం అదానీ మాత్రమేనని ఆరోపించారు. భారతదేశపు అత్యంత అరుదైన పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, కేవలం ఒక వ్యాపారవేత్త కోసం అక్కడ లగ్జరీ హోటళ్లు, క్యాసినోలు, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని రాహుల్ ఆరోపించారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది అడవులను నరికివేసి, ఆ విలువైన కలపను అక్రమంగా తరలించి కోట్లాది రూపాయల వ్యాపారం చేసే పెద్ద స్కెచ్ దీని వెనుక ఉందని ఆరోపించారు. పర్యావరణ పరంగా చూస్తే ఈ ప్రాజెక్టు వల్ల గ్రేట్ నికోబార్ ద్వీపానికి కోలుకోలేని శాశ్వత నష్టం వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సుమారు 130 చదరపు కిలోమీటర్ల మేర దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలను పూర్తిగా తొలగించాల్సి వస్తుందని, దీనివల్ల దాదాపు 1.5 కోట్లకు పైగా అత్యంత అరుదైన వృక్షాలు నరికివేతకు గురవుతాయని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన సుందాలాండ్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లో ఈ ద్వీపం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ ఓడరేవు నిర్మాణం చేపట్టడం వల్ల సముద్ర గర్భంలో శతాబ్దాలుగా పెరుగుతున్న సజీవ పగడపు దిబ్బలు అంతరించిపోతాయని, అంతరించిపోతున్న అరుదైన లెదర్‌బ్యాక్ సముద్ర తాబేళ్ల ప్రధాన సంతానోత్పత్తి కేంద్రమైన గలాథియా బే పూర్తిగా కలుషితమైపోతుందని పర్యావరణ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రకృతికే కాకుండా, తరతరాలుగా అక్కడ నివసిస్తున్న షోంపెన్, నికోబారీస్ వంటి ప్రాచీన ఆదిమ గిరిజన తెగలను, అలాగే దేశం కోసం ప్రాణాలర్పించి అక్కడ స్థిరపడిన మాజీ సైనికుల కుటుంబాలను ఫారెస్ట్ రైట్స్ యాక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించి అక్రమంగా వారి సొంత భూముల నుండి ఖాళీ చేయిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ శతాబ్దాల నాటి అడవులను దారుణంగా నరికేసి, దానికి పరిహారంగా ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్తగా మొక్కలు నాటుతామనడం పర్యావరణాన్ని, ప్రకృతిని దారుణంగా అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఆన్‌లైన్ పిటిషన్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించడంతో, ఈ గ్రేట్ నికోబార్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది.

Publish Date: Jun 6, 2026 4:41PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds