శాఖల వారీ కేటాయింపులు ఇలా..!

మల్లు బడ్జెట్ లో వివిధ శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు   కేటాయించారు. అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు రూ.1,000 కోట్లు రైతులకు ఎకరాకు రూ.15,000 రైతు భరోసా: డిప్యూటీ సీఎం భట్టి కౌలు రైతులకు రైతు భరోసా సాయంపై మార్గదర్శకాలు 6 గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయింపు పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక శాఖ రూ.11,692 కోట్లు  ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు.  గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు.  నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు.  బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. 
Publish Date: Feb 10, 2024 12:39PM

రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం!

రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం.. ఇదే కొటేష‌న్ తో సోష‌ల్ మీడియాలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతుంది. ఏపీలో సీఎం జ‌గ‌న్ అరాచ‌క పాల‌న సాగిస్తుంటే.. తెలంగాణ‌లో సీఎం రేవంత్ త‌న‌దైన శైలిలో అద్భుత‌ పాల‌న సాగిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్ల‌కు కొంద‌రు వైసీపీ శ్రేణులు సైతం మ‌ద్ద‌తు ప‌లుకుతుంట‌డం గ‌మ‌నార్హం.  ఇంత‌కీ.. రేవంత్‌, జ‌గ‌న్ గురించి సోష‌ల్ మీడియాలో ఇంత‌లా ఎందుకు చ‌ర్చ జ‌రుగుతోంది?  రేవంత్ రెడ్డి చేసిన ప‌నేంటి.. జ‌గ‌న్ చేయ‌ని ప‌నేంటి?  అంటే..  ద‌క్షిణాది రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు, సినిమా వాళ్ల‌కు  అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంది కూడా. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా హీరోలంటే ప్ర‌జ‌లు ఎంతో గౌర‌విస్తారు. హీరోల‌కు అభిమాన సంఘాల‌తోపాటు.. వారి పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు సైతం చేస్తుంటారు.   రాజ‌కీయ పార్టీల గెలుపోట‌ముల్లో సినీ హీరోల ప్ర‌భావం కూడా ఉంటుంది. ఇలాంటి ఘట‌న‌లు అనేకం ఉన్నాయి. అందుకే చంద్ర‌బాబు నుంచి వైఎస్ఆర్‌, కేసీఆర్‌, ప్ర‌స్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ‌ర‌కు సినిమా వాళ్ల‌ను ఎంతో గౌర‌వంగా చూసుకుంటూ వ‌చ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించింది. చిరుతో పాటు మాజీ ఉపరాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు కూడా ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు వ‌రించింది. మ‌రి కొంద‌రు తెలుగు వారికి ప‌ద్మ శ్రీ అవార్డులు ద‌క్కాయి. ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డులు ద‌క్కిన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. తాజాగా చిరు, వెంక‌య్య నాయుడుతో పాటు ప‌ద్మ శ్రీ అవార్డుల గ్ర‌హీత‌ల‌ను రేవంత్ స‌ర్కార్ స‌న్మానించింది. అంతేకాక‌, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత‌ల‌కు రూ. 25ల‌క్షలు, నెల‌నెలా రూ. 25వేల పెన్ష‌న్ సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల నుంచి రేవంత్ స‌ర్కార్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.  స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిరంజీవి, వెంక‌య్య నాయుడు సైతం రేవంత్ స‌ర్కార్ స్పందించిన తీరుప‌ట్ల ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రేవంత్ పాల‌న తీరును పొగిడారు. మ‌రో వైపు రాజ‌కీయాల‌కు అతీతంగా అవార్డు గ్ర‌హీత‌ల‌కు స‌న్మాన  కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వ‌ ప‌రంగా నిర్వ‌హించ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో రేవంత్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. రేవంత్   సంస్కారానికి ఇది నిద‌ర్శ‌నం అంటూ సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అదే స‌మ‌యంలో ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కార్ పై సోష‌ల్ మీడియాలో  రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం అంటూ కామెంట్లు హోరెత్తుతున్నాయి. అయితే, ఇక్క‌డ విశేషం ఏమిటంటే.. సోషల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌కు కొంద‌రు వైసీపీ శ్రేణులుకూడా మ‌ద్ద‌తు తెలుపుతుంన్నారు. ఇంత‌కీ.. జ‌గ‌న్ స‌ర్కార్ పై ఎందుకు అంత వ్య‌రేఖ‌త వ్య‌క్త‌మ‌వుతుందంటే.. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో పాల‌న సాగించిన అన్ని ప్ర‌భుత్వాలు సినిమా వాళ్ల‌పైన‌, వెంక‌య్య నాయుడు లాంటి పెద్ద‌వారిపై ఎంతో మ‌ర్యాద‌గా న‌డుచుకుంటూ వ‌చ్చాయి. కానీ, ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సినిమా వాళ్ల‌పై చిన్న‌చూపుతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న ఉంది. మ‌రోవైపు వెంక‌య్య నాయుడు లాంటి వారిపై వైసీపీ నేత‌లు బాహాటంగానే విమ‌ర్శ‌లుచేసి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నారు.  ముఖ్యంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సినిమా వాళ్లంటే చాలా చిన్న‌చూపు అనే వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో, సినీ వ‌ర్గాల్లో ఉంది. గ‌తంలో టికెట్ల రేట్ల నుంచి మొద‌లు పెడితే ప్ర‌తి విష‌యంలో సినిమా వాళ్ల‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఎంత‌టి పేరున్న సినిమా హీరోలైనా ప్ర‌భుత్వానికి ఏమైనా సూచ‌న చేద్దామ‌ని చూసినా సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేయించి బెంబేలెత్తించేశారు. అంత‌టితో ఆగ‌లేదు.. సినీ పెద్ద‌ల‌ని కాళ్ల బేరానికి ర‌ప్పించుకున్నారు జ‌గ‌న్‌. మెగాస్టార్ చిరంజీవిలాంటి వారుసైతం జ‌గ‌న్ ముందు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేసుకోవాల్సి వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవితో చేతులు జోడించి మొక్కించుకొని వీడియో రిలీజ్ చేసి ఆనందం పొందారు. ఈ ఘ‌ట‌నతో జ‌గ‌న్ తీరుపై అప్పట్లో వైసీపీ శ్రేణుల్లోనూ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది. కానీ, ఎవ‌రూ బ‌హిరంగంగా ఇది త‌ప్పు అని చెప్పే సాహ‌సం చేయ‌లేదు. చిరంజీవిలాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లో విఫ‌లం అయి ఉండొచ్చు. కానీ, ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాక‌ముందు.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నా.. ఆయ‌న‌కున్న అభిమానం   చెక్కుచెద‌ర్లేదు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చిన్న‌చూపు చూసే సినిమా రంగానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌న్  పురస్కారంతో గౌర‌వించింది. అవార్డులు ప్ర‌క‌టించింది.  తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. కానీ, సీఎం రేవంత్ రెడ్డి తెలుగు వారికి ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ శ్రీ అవార్డుల రావ‌డం ప‌ట్ల అభినంద‌న‌లు తెలిపారు. అంతేకాక శిల్ప‌క‌ళా వేదిక‌గా చిరు, వెంక‌య్య‌నాయుడు, ప‌ద్మ శ్రీ అవార్డు గ్ర‌హీత‌ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. మ‌రోవైపు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మాత్రం  అవార్డు గ్ర‌హీత‌ల‌కు క‌నీసం క‌లిసి అభినంద‌న‌లు కూడా తెలపలేదు.  దీనిని ఎత్తి చూపుతూనే సినీ, రాజకీయవర్గాల్లో జగన్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సోష‌ల్ మీడియాలో రేవంత్ సంస్కారం.. జ‌గ‌న్ అహంకారం అంటూ విస్తృతంగా ట్రోల్ అవుతోంది.  
Publish Date: Feb 5, 2024 11:06AM

ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థిగా బీసీకి చాన్స్

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు  కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ స్థితిలో  ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. పెద్దారెడ్ల సామ్రాజ్యంగా ఉండే నెల్లూరులో ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయా అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సాధారణంగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతుంది. అయితే ఈ సారి పార్టీల అధినాయకులు బీసీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా  ఉదయగిరి  అసెంబ్లీ నియోజకవర్గ   అభ్యర్థుల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్‌ జగన్‌   నాయకత్వంలోని వైసీపీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి   పోటీ   దాదాపుగా ఖరారైంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థి కోసం అన్వేషణలో భాగంగా బీసీ అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి బహిష్కృతుడై తెలుగుదేశం గూటికి చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి పోటీకి దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీసీ వర్గానికి చెందిన బీద రవీంద్ర పేరు ప్రస్తావించినప్పటికీ, ఆయన కూడా పోటీలో నిలవడానికి సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. దీంతో తెలుగుదేశం నుంచి ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఇద్దరు బీసీ నేతలు రేసులో నిలిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ఒకరైన చంచల్ బాబు యాదవ్ అయితే వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి దీటైన అభ్యర్థిగా నిలవగలుగుతారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఈ సీటులో పోటీ కోసం రేసులో నిలిచిన రెండో వ్యక్తి డాక్టర్ మల్లికార్జున రావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  ప్రభుత్వ వైద్యుడిగా పని చేసి రిటైర్ అయిన డాక్టర్ మల్లికార్జున రావు రిటైర్మెంట్ తరువాత నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. అన్నిటికీ మించి యాదవ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పేరు ఉంది.  ఒక్క ఉదయగిరి అనే కాకుండా మరో రెండు నియోజకవర్గాలలో కూడా బీసీ అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న యోచనతో తెలుగుదేశం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మొత్తం మీద రానున్న ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లలో బీసీ కార్డ్ ద్వారా సత్ఫలితాలు పొందాలని తెలుగుదేశం యోచిస్తుంటే.. జగన్ పార్టీ కూడా జిల్లాలో బీసీలకు పెద్ద పీట వేసే యోచనలో ఉందని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ అయ్యిందంటున్నారు.  
Publish Date: Jan 18, 2024 1:33PM

తెలుగుదేశం,జనసేన ఉమ్మడి కార్యాచరణ.. వంద రోజుల టార్గెట్!

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగా ఎన్నికల వేడి మాత్రం ఎప్పుడో పీక్స్ కు చేరింది. అధికార, విపక్షాలు ఎవరికి వారు నిర్దిష్ట ప్రణాళికలతో గెలుపు వేట మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రజా నాడి, ముందస్తు సర్వేల ఫలితాలతో  విపక్ష తెలుగుదేశం గెలుపు ధీమాతో ప్రజల మధ్యకు వెళ్తుండగా.. ఆ పార్టీకి జనసేన కూడా తోడు కావడంతో జోష్ తారస్థాయికి చేరింది. ప్రభుత్వం మరో అవకాశం కావాలంటూ ప్రజల వద్దకు వెళ్తున్నప్పటికీ  ప్రజల నుండి  వ్యతిరేకతే వ్యక్తమౌతోందన్నది ప్రస్ఫుటమైంది.  వైసీపీ బస్సుయాత్రకు సొంత పార్టీ కార్యకర్తలే మొహం చాటేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో  ప్రతిపక్ష పార్టీలు  తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణతో  జనంలో మమేకమయ్యేందుకు రెడీ అయ్యాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదలతో రెండు పార్టీలలో మొదలైన కదలిక  ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ రూపంలో  ముందడుగు వేసింది. దీని కోసం రెండు పార్టీలు నియమించుకున్న సమన్వయ కమిటీ నేతలు గురువారం (నవంబర్ 11) సమావేశమై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.   తెలుగుదేశం,జనసేన సమన్వయ కమిటీలు ఇప్పటికే అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలోని మంజీర హోటల్‌లో ఒకసారి సమావేశమై కార్యాచరణపై చర్చించగా.. తాజాగా రెండో సమావేశం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో గురువారం(నవంబర్9) నిర్వహించారు. ఈ రెండో సమావేశానికి తెలుగుదేశం తరఫున.. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్య నారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య హాజరవ్వగా.. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన, 100 రోజుల ప్రణాళిక, ఓటరు జాబితా అవకతవకలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించిన్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సమన్వయ కమిటీల సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ హాజరు కాలేకపోయారు. తొలి సమావేశానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించగా.. ఈ సమావేశానికి పవన్ తెలంగాణ ఎన్నికల పనిలో బిజీగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కోర్టు బెయిల్ షరతుల నేపథ్యంలో చంద్రబాబు హాజరయ్యే అవకాశం లేదు. కాగా, ఈ సమావేశంలో రెండు పార్టీలు కలిసి చేపట్టనున్న ఉమ్మడి కార్యాచరణతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం 100 రోజుల పగడ్బంధీ ప్రణాళికతో ఈ రెండు పార్టీలు బరిలోకి దిగనున్నాయి. అంటే మూడు నెలలుకు పైగా నేతలు ప్రజలు మధ్యనే ఉండనున్నారు. ఇప్పటికే ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై కొంత అవగాహనకు వచ్చిన ఈ రెండు పార్టీలు అదే అంశాలను ప్రజల మధ్య చర్చకు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రజల నుండే ప్రత్యక్షంగా మరికొన్ని అంశాలను ఎంచుకొని మ్యానిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, ఒక్కసారి టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఇరు పార్టీల జెండాలతో ప్రజల మధ్యకి వెళ్తే అధికార పక్షానికి వ్యతిరేకత మొదలైనట్లే. ప్రజలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. దానికి తోడు చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం కూడా జగన్ కు వ్యతిరేకంగా మారింది. ఈ తరుణంలో ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తే వైసీపీ ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. గత రెండు నెలల ముందు కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ యాత్రలలో సూటి ప్రశ్నలతో ప్రభుత్వానికి ఎక్కుపెట్టగా సమాధానం చెప్పుకోలేని వైసీపీ నేతలు మొహం చాటేసిన పరిస్థితి కనిపించింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా మూడు నెలలకు పైగా ప్రణాళిక అంటే వైసీపీ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే భావించాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ప్రతిపక్షాల టార్గెట్ ఎలా ఉండబోతుంది.. అధికార వైసీపీ దాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈసారి ఎలాంటి ఎత్తులు వేయనున్నారన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.
Publish Date: Nov 9, 2023 5:04PM

కొత్త ప్రభాకర్ రెడ్డి సేఫ్..మూడు గంటలు సర్జరీ..15 సెంటీమీటర్ల మేర చిన్న పేగు తొలగింపు

ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకరెడ్డి కత్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారనీ,  కోలుకోడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ దాడిలో ఆయన  చిన్న పేగుకు నాలుగు చోట్ల లోతైన గాయం కావడంతో మూడు గంటలకు పైగా సర్జరీ చేశామని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రాణాపాయం లేదనీ, అయితే నాలుగు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలనీ వివరించారు. ఆ తరువాత ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న విషయంపై క్లారిటీ వస్తుందన్నారు.   దాడి జరిగిన తర్వాత గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స జరిగిందని, ఆ గాయంతోనే తమ ఆస్పత్రికి వచ్చారని, వెంటనే డాక్టర్ల బృందం ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్‌మెంట్ మొదలుపెట్టిందని తెలిపారు. చిన్న పేగుకు బలమైన గాయం కావడంతో వెంటనే సర్జరీ చేయాలనే నిర్ణయానికి వచ్చారని డాక్టర్ విజయకుమార్ తెలిపారు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేయడంలో ఉన్న ఇబ్బందులు, పరిమితులను దృష్టిల పెట్టుకుని జనరల్ సర్జరీ చేశామన్నారు. కడుపులో చిన్న, పెద్ద పేగులు కలిపి మొత్తం 4 చోట్ల గాయాలయ్యాయని తెలిసారు. సర్జరీ చేసి చిన్న పేగులో 15 సె.మీ.ల మేర తొలగించామని వివరించారు. ఈ తరహాలో సర్జరీ జరిగిన తర్వాత రోగి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. దీనికి తోడు ప్రభాకర్‌రెడ్డికి హైపర్ టెన్షన్ సమస్య ఉందన్నారు. మెడికో లీగల్ కేస్ కావడంతో అన్ని శాంపిల్స్ సేకరించి భద్రపరిచినట్లు తెలిపారు. నాలుగు రోజుల తర్వాతే ఏ మేరకు కొలుకున్నారో చెప్పగలమన్నారు. అనంతరం వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు. 
Publish Date: Oct 31, 2023 8:34AM

ఓటమి భయం.. బాబాయ్ హత్య కేసు.. జగన్ ఉక్కిరిబిక్కిరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాజకీయంగానే కాకుండా సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పేరు ప్రస్తావించడం, అలాగే సొంత సోదరి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టేందుకు, కాలు పెట్టేందుకు సమాయత్తమౌతుండటం, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుస భేటీలతో ఆమె ఆస్తుల విషయంలో కూడా జగన్ కు పక్కలో బల్లెంగా మారడం ఇవన్నీ ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడ ఏం మాట్లాడుతున్నారన్న విచక్షణ మరచి ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అన్న తేడా కూడా లేకుండా విపక్ష నేతపై విమర్శలు గుప్పించడమే ఏకైక కార్యక్రమంగా, సింగిల్ పాయింట్ అజెండాగా మాట్లాడుతున్నారనీ అంటున్నారు. ఆయన ప్రసంగాలే ఆయనలోని ఫ్రస్ట్రేషన్ ను ఎత్తి చూపుతున్నాయంటున్నారు. ఒక వైపు వచ్చే ఎన్నికలలో ఓటమి భయం, మరో వైపు వివేకా హత్య కేసులో విచారణను ఎదుర్కొనవలసి ఉంటుందన్న ఆందోళనతో ఆయన సంయమనం కోల్పోతున్నారని చెబుతున్నారు.   ఇక పార్టీ పరంగా చూస్తే వైసీపీలో అసమ్మతి సెగలు, అసంతృప్తి జ్వాలలూ నెల్లూరులో మొదలైనా అవి రాష్ట్రం మొత్తం వ్యాపించడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, చివరాఖరికి ఉప ముఖ్యమంత్రి కూడా అసమ్మతిని, అసంతృప్తిని బహిరంగంగా వెల్లగక్కడంతో పార్టీలో లుకలుకలు రోడ్డున పడ్డాయి.  దీంతో వైనాట్ 175 ధీమా కోల్పోయి.. కనీసం విజయం సాధిస్తే చాలన్న పరిస్థితికి జగన్ వచ్చేశారని పార్టీ శ్రేణులో అంటున్నాయి.  ఇదిలా ఉంటే ఇంత కాలం  ఆర్థిక అరాచకత్వం సహా  జగన్ సర్కార్ చేసే ప్రతి పనికీ, తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతు ఇస్తూ వస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్ ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ జగన్ ను అత్యంత ముక్తసరిగా పలకరించడంతో కేంద్రం నుంచి జగన్ కు ఇక సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే గురువారం (జూన్1) ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదలీ చేసిన జగన్ ఆ సందర్బంగా చేసిన ప్రసంగం యావత్తూ విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును దుమ్మెత్తి పోయడానికే సరిపోయిందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయనలో ఓటమి భయం, విపక్షం పుంజుకుంటోందన్న ఆక్రోషం ప్రస్ఫుటంగా బయటపడ్డాయని సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. తన సభల నుంచి జనం గుంపులు గుంపులుగా వెళ్లిపోతుండటం.. అదే సమయంలో చంద్రబాబు సభలకు, లోకేష్ పాదయాత్రకు జనం అసంఖ్యాకంగా హాజరౌతుండటం జగన్ లో  గుబులు పెంచాయనడానికి నిదర్శనమే..పత్తికొండ సభలో మహానాడును తెలుగుదేశం డ్రామా కంపెనీతో పోల్చడం అని విశ్లేషిస్తున్నారు.ఇక చంద్రబాబును  సత్యం పలకడు, ధర్మానికి కట్టుబడడు, మాట మీద నిలబడడు, విలువలు.. విశ్వసనీయత అనేవి లేని వ్యక్తిగా అభివర్ణించడాన్ని ఎత్తి చూపుతూ జగన్ తన లక్షణాలన్నీ చంద్రబాబుకు ఆపాదించారని తెలుగుదేశం శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.  ఓ ప్రభుత్వ కార్యక్రమంలో  ప్రభుత్వాధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయనగారిలోని ప్రెస్ట్రేషన్  ఫీక్స్‌కు చేరిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. అలాగే చివరిలో తన ప్రభుత్వంపై విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మకండి ప్లీజ్ అంటూ ప్రజలను వేడుకోవడం చూస్తుంటే..  వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచేందుకు ప్రజలు పక్కాగా ఫిక్స్ అయిపోయారని జగన్ కు అర్ధమైపోయినట్లుందని అంటున్నారు. 
Publish Date: Jun 2, 2023 11:32AM

పొల్యూటెడ్ కు బదులు పొలిటికల్.. నిర్మల ప్రసంగంలో అప్పుతచ్చు

నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం మొత్తం అంకెలగారడీతో సాగుతోంది. ఎక్కడా చెణుకులు, జోకులూ వినిపించడం లేదు. అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి అభినందించడం వినా నిర్మల బడ్జెట్ ప్రసంగానికి పెద్దగా సభ్యుల నుంచి స్పందన కనిపించడం లేదు. ఆ పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో దొర్లిన ఒక పొరపాటు సభలో నవ్వులు పూయించింది. తుక్కు విధానం గురించి మాట్లాడుతూ ఆమె పొల్యూటెడ్ వెహికల్ అనబోయి పొరపాటుగా పొలిటికల్ అని పలికారు. దీంతో సభలో ఒక్క సారిగా నవ్వులు పూశాయి. అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న సభ ఒక్కసారిగా నవ్వులతో మార్మోగిపోయింది. నిర్మల వెంటనే తన తప్పు సవరించుకుని ప్రసంగాన్ని కొనసాగించారు.
Publish Date: Feb 1, 2023 12:06PM

ఆ సిట్టింగులకు నో టికెట్స్.. ఇప్పటికే జగన్ నిర్ణయం?

ఏపీలో వైసీపీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా పడిపోతోంది. ఇందుకు సర్వేలను, నివేదికలను ఉటంకించాల్సిన అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సరిపోతుంది.  ఆ విషయం విపక్షానికే కాదు.. అధికార వైసీపీకీ మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కూ కూడా స్పష్టంగానే అర్ధమైంది. ఈ క్రమంలోనే  సీఎం జగన్ రెడ్డి తమ పార్టీ నేతలు, జిల్లాలు, ప్రాంతీయ ఇన్ చార్జిలతో  వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు. వీటన్నిటిలోనూ ఆయన వైనాట్ 175 అంటూ చెబుతుండటం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఆ భేటీల్లో తాను స్వయంగా చేయించిన సర్వేల్లో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన రిపోర్టులపై జగన్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా  పార్టీ మరోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని, అందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై జగన్ లో  అసహనం ఓ రేంజ్ లో పెరిగిపోతోందని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.  ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు సరిగా లేకపోవడం వల్లే పార్టీకి గడ్డు  పరిస్థితి వచ్చిందని జగన్ అంటున్నారు.  ఈ క్రమంలోనే జగన్ తన పార్టీలోని సిట్టింగులలో చాలా మందికి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పేస్తున్నారు.   ఇలా సిట్టింగులకు ఉద్వాసన చెప్పే నియోజకవర్గాలలో దాదాపు 30 నియోజకవర్గాలపై ఇప్పటికే ఆయనో నిర్ణయం తీసేసుకున్నారని కూడా అంటున్నారు. అలా పక్కన పెట్టాలనుకునే వారిలో పలువురు సీనియర్లు, ఒకరిద్దరు మంత్రులు, మాజీ మంత్రులూ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరో వైపు జగన్ కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఎమ్మెల్యేలూ మీరు మారాలి, మీ పని తీరు మెరుగుపడాలి.. లేకుంటే టికెట్ కష్టమే.. ఇందులో ఎలాంటి మోహమాటం లేదు అని చెబుతూ వస్తున్నారు.  ఇప్పటికే చెప్పినా పని తీరు మార్చుకోని, మెరుగుపరుచుకోని ఓ 30 మందికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  ప్రస్తుతం అభ్యర్థి మార్పు తథ్యమని వినిపిస్తున్న నియోజకవర్గాల విషయానికి వస్తే.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లా గూడూరు, వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఉదయగిరి, అలాగే ఉమ్మడి కడప జిల్లా రాజంపేట, హిందూపురం, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కైకలూరు, నందిగామ, తిరువూరు అలాగే కర్నూలు జిల్లా పాణ్యం, నందికొట్కూరు ఇంకా  తిరుపతి,  కనిగిరి, గిద్దలూరు శ్రీకాళహస్తి ,పలమనేరు ననియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తెరమీదకు తీసుకురావడం ఖాయమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇంకా   శ్రీకాకుళం జిల్లాలోనూ   మార్పులు ఉంటాయంటున్నారు. అదే విధంగా విజయనగరం, బొబ్బిలి, భీమిలి నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమలోని ఏలూరు, ఆచంట, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాలలోనూ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించేందుకు జగన్ ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని చెబుతున్నారు.  అయితే వీరే కాక ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ టికెట్లు దక్కని సిట్టింగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రజలలో ఉండి, వారి సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను ఉపేక్షించేది లేదని జగన్ చెబుతున్న మాటలు కేవలం హెచ్చరికలు కావనీ, కొత్త ముఖాలతో వచ్చే ఎన్నికలకు వెళితేనే.. ఇప్పుడు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకత తీవ్రత ఒకింతైనా తగ్గే అవకాశం ఉందన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలనూ, ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలనూ ఎమ్మెల్యేల వైఫల్యంగా ప్రజలకు చూపి సేఫ్ గేమ్ అడాలన్న ఉద్దేశంతో జగన్ అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే సిట్టింగులకు టికెట్లు దక్కని పరిస్థితిపై పార్టీలో అసమ్మతి రాజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమకు టికెట్ వచ్చే అవకాశం లేదంటూ జగన్ ఇస్తున్న సంకేతాలపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తిరుగుబావుటా ఎగురవేసేందుకు రెడీ అవుతున్నారు. రానున్న రోజులలో వైసీపీలో అసమ్మతి మరింత జ్వలించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. 
Publish Date: Jan 12, 2023 2:51PM

జగన్ పంతమా.. మేకపాటి పట్టుదలా..?

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ అధినేత నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో గురువారం భేటీ అవుతున్నారు. ఇటీవలే హఠాత్తుగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ప్రకటించాలని రాజమోహన్ రెడ్డి కోరేందుకు జగన్ ను కలుసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్- మేకపాటి రాజమోహన్ రెడ్డి భేటీతో ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణకు ముందు ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మేకపాటి కుటుంబానికే చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కూడా సీఎం జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎవరనే విషయం కూడా ఇంతవరకు తేల్చలేదు. ఇలా ఉండగా.. ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత గౌతమ్ రెడ్డి సతీమని శ్రీకీర్తి రెడ్డి పోటీ చేస్తారంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. ఆ అవకాశం శ్రీకీర్తిరెడ్డి కాకుండా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డికి ఇవ్వాలని మేకపాటి కుటుంబం నిర్ణయించింది. ఈ విషయాన్నే సీఎం జగన్ కు వివరించి, తన రెండో కుమారుడు విక్రమ్ రెడ్డి పేరును ఖరారు చేయించే దిశగా కీలకమైన చర్చలు జరుపుతారని తెలుస్తోంది. నిజానిని మేకపాటి కుటుంబంలోని మహిళలెవరూ రాజకీయాల్లోకి వచ్చే సాంప్రదాయంలేదు. దాని ప్రకారమే శ్రీకీర్తిరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారానికి ఇప్పటికే మేకపాటి కుటుంబ సభ్యులు తెర దించారు. కేవలం మగవారు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. ఈ విషయమే సీఎం జగన్ కు వివరించి, శ్రీకీర్తికి కాకుండా విక్రమ్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఒప్పించేందుకే రాజమోహన్ రెడ్డి భేటీ అవుతున్నారని చెబుతున్నారు. కాగా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తిరెడ్డికి ఉప ఎన్నికల బరిలో దింపాలని, ఆమెను గెలిపించి, మంత్రి పదవి కూడా కట్టబెట్టాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ దిశగా వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా శ్రీకీర్తిరెడ్డిని ప్రోత్సహించారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో మేకపాటి తమ కుటుంబంలో మహిళలు రాజకీయాల్లోకి రారని తేల్చి చెప్పి, విక్రమ్ ను అభ్యర్థిగా ప్రకటించాలనే ప్రతిపాదనను సీఎం జగన్ ఒప్పుకుంటారో లేక.. శ్రీకీర్తిరెడ్డి పేరునే మళ్లీ తెరమీదకు తీసుకువస్తారా? అనే టెన్షన్ నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తల్లో మొదలైంది. ఒక విధంగా చెప్పాలంటే.. గడచిన మూడేళ్లుగా వైఎస్ జగన్ గుమ్మం కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి తొక్కలేదు. తాజా పరిణామాలు జగన్ వద్దకు మేకపాటి రాజమోహన్ రెడ్డిని వెళ్లేలా చేశాయా? ఒక వేళ ఈ భేటీ సందర్భంగా శ్రీకీర్తిరెడ్డికి అవకాశం ఇద్దామని జగన్ అంటే రాజమోహన్ రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎవరనే స్పష్టత జగన్- రాజమోహన్ రెడ్డి భేటీలో ఫైనల్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి జగన్ పంతం నెగ్గుతుందా?.. రాజమోహన్ రెడ్డి పట్టుదల గెలుస్తుందో?
Publish Date: Apr 27, 2022 6:33PM

ఈట‌ల‌కు మ‌ళ్లీ నోటీసులు.. భూముల‌ స‌ర్వేతో క‌ల‌క‌లం..

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈట‌ల రాజేంద‌రే హుజురాబాద్ రారాజుగా నిలిచారు. హోరాహోరీగా జ‌రిగిన పోరులో ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో ఈట‌ల‌ను గెలిపించారు. టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా క‌ర్రు కాల్చి వాత పెట్టారు. గెలిచాక ఇక త‌న నెక్ట్స్ టార్గెట్ గ‌జ్వేల్‌, సిద్ధిపేట‌లేన‌ని స‌వాల్ చేశారు రాజేంద‌ర్‌. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు కూల్చే వ‌ర‌కూ త‌గ్గేదే లేదంటూ స‌మ‌రోత్సాహంతో ఉన్నారు ఈట‌ల‌. క‌ట్ చేస్తే.. ఈట‌లపై భూక‌బ్జా కేసు మ‌ళ్లీ వేగం పుంజుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ప‌క్కా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లేనంటున్నారు.  బీజేపీ నేత,  హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమునా హర్చరీస్‌ సంస్థకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న స‌ర్వేకు హాజ‌రుకావాల‌ని ఈట‌ల రాజేంద‌ర్‌ స‌తీమ‌ణి జ‌మునారెడ్డి, కుమారుడు నితిన్‌రెడ్డిల‌కు తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.  మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్‌పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టు ఈటెల కుటుంబం ఆరోపణలు ఉన్నాయి. జమునా హర్చరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కొవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 18న స‌ర్వే జ‌రిపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు అధికారులు. 
Publish Date: Nov 8, 2021 5:24PM

ఉన్నావ్ దోషి భార్యకు బీజేపీ టికెట్

అతను బీజేపీ ఎమ్మెల్యే. 2017లో 17ఏళ్ల మైనర్ బాలికను రే-ప్ చేశాడు. 2019లో అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే, ఆయన భార్యకు లేటెస్ట్‌గా బీజేపీ టికెట్ ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది. జాతీయ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు. ఆమెకు టికెట్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్థించుకుంటున్నారు. ఉన్నావ్ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మైనర్ బాలికపై అత్యా.చార కేసులో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ దోషిగా తేలారు. 2019 డిసెంబర్ 20న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. అయితే, ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన భార్య బీజేపీ తరపున పోటీచేయబోతున్నారు. కుల్దీప్ సింగ్ సెంగార్ భార్య సంగీత సెంగార్‌కు యూపీ పంచాయితీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ టికెట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఉన్నావ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫాతేపూర్ చౌరాసీ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. 2016లో ఆమె జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు.  రే-ప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి భార్యకు టికెట్ ఇవ్వడాన్ని కమలనాథులు నిసిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ‘‘కుల్‌దీప్ సింగ్ తప్పు చేశారు కాబట్టి ఇవాళ ఆయన జైల్లో ఉన్నారు. కుల్దీప్ చేసిన నేరాలకు అతడి భార్యను శిక్షించకూడదు. సుదీర్ఘ చర్చల అనంతరం కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు బీజేపీ టికెట్ ఇచ్చాం. ఇప్పటికే ఆమె ఉన్నావ్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రజాదరణ ఉందోలేదో చూడాలి తప్ప.. నేరస్తుడి భార్య కాబట్టి పట్టించుకోకుండా వదిలేయకూడదు.’’ అంటున్నారు. తప్పు చేసినా పర్వాలేదు.. గెలిచే సత్తా ఉంటే చాలు అన్నట్టుగా బీజేపీ తీరు ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా అవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు.
Publish Date: Apr 9, 2021 7:15PM

ఢిల్లీ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా!

సౌత్ ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారిపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ పిరియడ్ లో ఫుడ్ హోం డెలివరీలకు ప్రభుత్వాలు అనుమతించాయి. దాదాపు 72 మంది పిజ్జా ఆర్డర్ చేసుకున్న వారికి ఈ బాయ్ డెలివ‌రీ ఇచ్చాడ‌ట‌. అధికారులు వీరి ర‌క్త శాంప్లిస్‌ను కూడా సేక‌రిస్తున్నారు. వారందరినీ హోం క్వారెంటైన్ లో ఉంచారు. పిజ్జా డెలివరీ బాయ్ డయాలసిస్ పేషెంట్ అట‌. అత‌ను ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. అక్కడే కరోనా వైరస్ అంటుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు అతను పిజ్జా డెలివరీ చేయగా, ఇటీవల అతనిలో కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వైరస్ హాట్ స్పాట్ కేంద్రాల్లో సౌత్ ఢిల్లీ కూడా వుంది.
Publish Date: Apr 16, 2020 12:32PM

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రపంజా

అనుకున్నదంతా అయ్యింది..ఏదైతే జరక్కూడదని కేంద్రప్రభుత్వం భయపడిందో అదే జరిగింది. పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పంజా విసిరారు. నిన్న రాత్రి అనంతనాగ్ జిల్లాలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఎస్కార్ట్ వ్యాన్‌పై నిన్న రాత్రి 8.20 గంటల ప్రాంతంలో సాయుధులైన ముష్కరులు దాడి చేశారు..వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే మీదకు వస్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు ముష్కరుల తూటాలు తగిలడంతో ఏడుగురు యాత్రికులు మరణించగా..11 మంది గాయపడ్డారు..వీరంతా అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని వస్తున్నారు..అయితే రాత్రి 7 గంటల తర్వాత యాత్రా బస్సులు హైవే మీదకు తిరగకూడదని కానీ డ్రైవర్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుంది పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు..ఇలాంటి పరికిపంద చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.  
Publish Date: Jul 11, 2017 12:11PM

మరోసారి జమ్ముకాశ్మీర్లో చెలరేగిన అల్లర్లు....

  చాలా రోజుల నుండి ప్రశాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని గలందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీనిలో భాగంగానే భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. జతీయరహదారిపై కొంతసేపు వాహన రాకపోకలను నిలిపివేశారు. ఈ సమయంలో, భద్రతాదళాలపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేయడానికి సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించి... గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా ఎనిమిది మంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Publish Date: Dec 30, 2016 5:26PM