ALSO ON TELUGUONE N E W S
`బిగ్ బాస్-3` ఏ మూహూర్తాన మొద‌లెట్టాల‌నుకున్నారో కానీ, ప్రారంభం కాక ముందే ర‌చ్చ మొద‌లైంది. ఇటీవ‌ల శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా లు `` అది బిగ్ బాస్ హౌసా, లేక బ్రోత‌ల్ హౌసా అంటూ `` కామెంట్స్ చేస్తూ కేసులు పెట్ట‌డం దాకా వెళ్లారు. ఇక ఈ వివాదం కాస్త చ‌ల్ల‌బడుతుందిలే అనుకుంటోన్న క్ర‌మంలో ఓయూ స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ ను ఆపాలంటూ మండిప‌డుతున్నారు. ద‌ర్శ‌క నిర్మాత కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి  ఇలాంటి షోస్ వ‌ల్ల యువ‌త చెడిపోతుందంటూ  బిగ్ బాస్  షో పై ఇప్ప‌టికే కేస్ ఫైల్ చేసాడ‌ట‌. దీనికి ఓయూ విద్యార్థులు వంత‌పాడుతూ స‌పోర్ట్ చేస్తున్నారు.  ఇక సో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండ‌టంతో నాగార్జున , బిగ్ బాస్ కార్యాల‌యాల‌ను ముట్ట‌డించాల‌న్న చూస్తున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.  దీంతో బిగ్ బాస్ నిర్వాహ‌కుల్లో టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. కాకుంటే హై కోర్టు వీరికి ఊర‌ట‌నిస్తూ `నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేయాడాలు లాంటివి ఏమి చేయ‌వ‌ద్ద‌ని` తీర్పు వెలువ‌రించింది.   విచార‌ణ‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. దీంతో బిగ్ బాస్ నిర్వాహ‌కులకు ఊర‌ట ల‌భించిన‌ట్టైంది.  మ‌రి ఇన్ని వివాదాల న‌డుమ బిగ్ బాస్ 3 అనుకున్న స‌మ‌యానికి స్టార్ట్ అవుతుందా?  లేదా అన్న‌ది చూడాలి మ‌రి.
యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఒక‌వైపు భారీ చిత్రాల‌ను నిర్మిస్తూనే మ‌రోవైపు మినిమ‌మ్ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తూ ముందుకెళ్తోంది.  ఇక ప్ర‌భాస్ తో దాదాపు 300 కోట్ల‌తో భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తోన్న ఈ సంస్థ మ‌రో మినిమమ్ బ‌డ్జెట్ లో నాగ చైత‌న్య‌తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జునుల యుద్ధం` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంద‌ట‌. ఇప్ప‌టికే కొంత కాలంగా ఈ స్క్రిప్ట్ పై వ‌ర్క్ చేస్తున్నాడ‌ట ద‌ర్శ‌కుడు గాంధీ. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య `వెంకీమామ‌` తో పాటు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే వెంకీ మామ కంప్లీట్ అయింది. శేఖ‌ర్ క‌మ్ముల సినిమా పూర్త‌య్యాక యువి క్రియేష‌న్స్ వారికి చైతు డేట్స్ కేటాయించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.
యువ కథానాయకులు శర్వానంద్, అడివి శేష్ హ్యాపీ. 'సాహో' విడుదల వాయిదా పడటంతో వాళ్లిద్దరి చిత్రాలు 'రణరంగం', 'ఎవరు'కు థియేటర్లు వచ్చాయి. మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఒక రకంగా కింగ్ నాగార్జున కూడా హ్యాపీ. 'మన్మథుడు 2' ఆగస్టు 9న విడుదల కానుంది. ఒకవేళ ఆగస్టు 15న 'సాహో' థియేటర్లలోకి వస్తే... నాగార్జున సినిమాకు థియేటర్లు తగ్గుతాయి. 'సాహో' సునామీ 'మన్మథుడు 2'పై ఎంతోకొంత ప్రభావం చూపుతుందని అనడంలో సందేహం లేదు. వీళ్లు హ్యాపీగా ఉంటే ప్రభాస్ టెన్షన్ పడుతున్నారు. సుమారు మూడు వందల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించి, మూడు భాషల్లో విడుదల విడుదల విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సినిమా వాయిదా పడుతుంటే హీరోకి టెన్షన్ ఉండటం సహజమే. టెన్షన్ ప్రభాస్ ఒక్కరికే కాదు... నానికి కూడా. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న 'గ్యాంగ్ లీడర్'ను ఆగస్టు 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ అదే రోజున 'సాహో'ను విడుదల చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 30కి 'సాహో' కన్ఫర్మ్ అయితే 'గ్యాంగ్ లీడర్' పరిస్థితి ఏంటి? 'సాహో'కి పోటీగా అదే రోజున విడుదల చేయాలా? వాయిదా వేయాలా? ఈ టెన్షన్‌లో నాని ఉన్నారట.
  'శ్రీమంతుడు'లో మహేష్ బాబుకు తండ్రిగా మంచి పాత్రలో జగపతిబాబు నటించారు. మహేష్ బాబు 25వ సినిమా 'మహర్షి'లో విలన్ క్యారెక్టర్‌లో కనిపించారు. మ‌హేష్‌కి, జగపతిబాబుకు మధ్య రిలేషన్ ఉంది. కానీ, ఇప్పుడది దెబ్బ తిందని టాక్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో జగపతిబాబును ఒక పాత్రకు తీసుకున్నారు. మాటలు గట్రా పూర్తయ్యాయి. తీరా షూటింగ్ ప్రారంభించే సమయానికి జగపతిబాబును పక్కన పెట్టి ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ ను ఎంపిక చేశారని టాక్. ఎందుకు తప్పించారనేది చెప్పలేదట. 'సరిలేరు నీకెవ్వరు' కోసం ఒక తమిళ సినిమాను, మరో కన్నడ సినిమాను జగపతిబాబు వదులుకున్నారట. కారణం ఏంటో చెప్పకుండా, ఏం మాట్లాడకుండా మరో నటుడిని తీసుకోవడంతో ఆయన హార్ట్ అయ్యారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ కాశ్మీరులో జరుగుతోంది.
'సాహో'కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ తప్పడం లేదు. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే... ఆ రోజున సినిమా విడుదల కాదట. ప్యాచ్ వర్క్ కొంత బాలన్స్ ఉందట. అలాగే, విఎఫ్ఎక్స్‌ పూర్తి కావడానికి టైమ్ పడుతుందట. అందుకని, పదిహేను రోజులు వాయిదా వేసి, ఆగస్టు 30న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. 'సాహో' వెనక్కి వెళ్లడంతో శర్వానంద్ 'రణరంగం', అడివి శేష్ 'ఎవరు' ఆగస్టు 15కి వచ్చాయి. ఉన్నట్టుండి రెండు సినిమాల విడుదల తేదీలు మంగళవారం ప్రకటించడంతో ప్రేక్షకుల్లో, పరిశ్రమలో 'సాహో'కి పోటీగా వస్తున్నారేంటి? అని చర్చ మొదలైంది. ఆరాలు తీయగా 'సాహో' వాయిదా పడుతుందని తెలిసి ఆగస్టు 15పై కర్చీఫ్ వేశారని తెలిసింది. సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ 'రణరంగం'కు మంచి డేట్ దొరికింది. అయితే... ప్రభాస్ అభిమానులకు మాత్రం వాయిదా నిర్ణయం మింగుడు పడటం లేదు. దర్శకుడు సుజీత్, యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశీపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
  ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర్డులను ఛేదించేందుకు ప్రత్యేకమైన సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయంటే నమ్మగలరా! అందుకే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు-   1- చిన్నపాటి పాస్‌వర్డులకు కాలం చెల్లిపోయింది. మీ పాస్‌వర్డు కనీసం 10 అక్షరాలకు పైనే ఉండాలంటున్నారు నిపుణులు. ఇక మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలలో కనీసం 12 నుంచి 14 అక్షరాలు ఉండాలని సూచిస్తున్నారు.   2- పాస్‌వర్డులో కేవలం అక్షరాలే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిందే! అంకెలు, అంకెల దిగువున ఉండే సింబల్స్, క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్ ఇలా కీబోర్డు మీద టైప్‌ చేయదగిన అన్ని రకాల సంకేతాలనీ వాడాల్సిందే!   3- మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలని (ఉదా॥ పుట్టినరోజు, భార్యపేరు) పాస్‌వర్డులో ఉంచితే పాస్‌వర్డుని ఛేదించడం సులువైపోతుంది. అందుకే మీకు బాగా గుర్తుండి, మీ చుట్టుపక్కల వారికి ఏమాత్రం అవగాహన లేని (ఉదా॥ తల్లి తరఫు ఇంటి పేరు, పిల్లలకి పురుడు పోసిన డాక్టరు పేరు) పాస్‌వర్డులను ఎంచుకోవాలి.       4- నిఘంటువులో కనిపించే పదాలను (ఉదా॥ house, system, daughter) ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డుగా ఉంచకూడదు. వీటిని పాస్‌వర్డు తస్కరించే సాఫ్టవేర్లు పసిగట్టేస్తాయి. My wife, happy home వంటి రోజువారీ వాక్యాలను కూడా ఇవి పట్టేస్తాయి.   5- చాలామంది బలమైన పాస్‌వర్డునే ఎంచుకొంటారు. కానీ పాస్‌వర్డు మర్చిపోయినప్పుడు కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు గాను చాలా తేలికైనవి ఎంచుకొంటారు. ఫలితంగా ఎవరైనా సదరు ప్రశ్నలకు జవాబు చెప్పి మీ అకౌంటులోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.       6- మనసులో ఏదో ఒక వాక్యాన్ని అనుకొని అందులోని పదాల తొలి అక్షరాలతో పాస్‌వర్డుని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదా॥ My Son was born on 14th January 2000 అన్న వాక్యాన్ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీని ఆధారంగా MSWBO1422000 అన్న పాస్‌వర్డుని సృష్టించుకోవచ్చు.   7- వేర్వేరు అకౌంట్లకి ఒకటే పాస్‌వర్డుని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదన్నది నిపుణులు హెచ్చరిక. ఒకవేళ అలా వాడాల్సి వచ్చినా, తప్పనిసరిగా అందులో ఎంతో కొంత మార్పు చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు పైన ఎంచుకొన్న MSWBO1422000 పాస్‌వర్డుని AMAZONకి కూడా వాడాలనుకుంటే MSWBO-amaze-1422000 అంటూ పాస్‌వర్డుకి తగిన మార్పు చేయవచ్చు.       8- బ్యాంకింగ్‌ వంటి ఆర్థికపరమైన, గోప్యమైన లావాదేవీలు జరిపే ఖాతాలకి చెందిన పాస్‌వర్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వీటిని తరచూ మారుస్తూ ఉండటం, మరే ఇతర పాస్‌వర్డులతో సంబంధం లేకుండా ఉంచడం అవసరం. ఇందుకోసం ఎలాంటి అనుమానం రాని పాస్‌వర్డులు కావాలనుకుంటే ఆన్‌లైన్లో http://passwordsgenerator.net/ వంటి సైట్లు ఉచితంగా క్లిష్టమైన పాస్‌వర్డులను అందిస్తాయి.   9- ఎట్టి పరిస్థితులలోనూ పాస్‌వర్డుని బయటవారితో పంచుకోకూడదు. ఇవాళ ఉన్న బంధం రేపు ఉంటుందని చెప్పలేం కదా! ఒకవేళ అలా ఎవరితోనన్నా పాస్‌వర్డుని పంచుకోవల్సిన సందర్భం వచ్చినా, ఎవరికన్నా పాస్‌వర్డు తెలిసిపోయిందన్న అనుమానం కలిగినా... వెంటనే దానిని మార్చివేయడం మంచింది.    10- ఈ రోజుల్లో పది రకాల ఖాతాలకు పది రకాల పాస్‌వర్డులు కావాల్సి వస్తోంది. పైగా అవి క్లిష్టంగా ఉండాలన్న నియమం ఎలాగూ ఉంది. దీంతో తరచూ ఏదో ఒక పాస్‌వర్డుని మర్చిపోవడం అతి సహజం. ఇందుకోసం వీటిని వీటిని ఎక్కడన్నా భద్రమైన చోట రాసి ఉంచుకోవడంలో తప్పులేదు. అయితే అలా రాసి ఉంచుకున్న కాగితాన్ని నిర్లక్ష్యంగా ఉంచితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు! - నిర్జర.
  అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరికి మామిడి చెట్టు మీద ఒక కోయిల కనిపించింది. ‘మిత్రమా! నీ గొంతు భలే మధురంగా ఉంది సుమా! పైగా నాలాగా నువ్వు నానాచెత్తా తినాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ మామిడి చిగురులతో కడుపు నింపుకోవచ్చు. నీ గొంతు విన్న ఈ లోకం ఉగాది వచ్చేసిందని పొంగిపోతుంది. నీదెంత అదృష్టజాతకం’ అని తెగ పొగిడేసింది. ‘ఆ నాదీ ఒక బతుకేనా!’ అంది కోకిల నిట్టూరుస్తూ. ఆపై ‘నా రంగు నీకంటే నలుపు. పైగా వసంత రుతవులో తప్ప కూయలేను. అంతదాకా ఎందుకు! ఆఖరికి నా పిల్లలని కూడా నేను పొదగలేక, నీ గూటిలోకి చేరుస్తుంటాను. నా జాతి ముందుకి సాగుతోందంటే అది నీ చలవే. ఇక అదృష్టం అంటావా! ఆ మాట వస్తే చిలుకే గుర్తుకువస్తుంది. పంచరంగుల వన్నెలు, పంచదార పలుకులు దాని సొంతం కదా’ అని నిట్టూర్చేసింది.   కోకిల మాటలు విన్న కాకికి అందులో నిజం లేకపోలేదనిపించింది. వెంటనే ఓ చిలుకని వెతుక్కుంటూ బయల్దేరింది. కొన్ని గడియలు గడిచేసరికి ఓ జామచెట్టు మీద మాంచి దోరపండుని తింటున్న చిలకమ్మ కనిపించింది. ‘చిలుకా క్షేమమా! ఇప్పటిదాకా నీ అదృష్టం గురించే నేనూ కోకిలా మాట్లాడుకున్నాము. నిన్ను చూస్తుంటే కోకిల చెప్పినదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఏమి అందం, ఏమి గాత్రం... పైగా కమ్మని జామపళ్లతోనే కడుపు నింపుకునే భాగ్యం. అసలు బతుకంటే నీదే!’ అంటూ పొగడ్తలను వల్లె వేసింది.   ‘ఉష్‌! గట్టిగా అరవబాక. ఏ వేటగాడన్నా వింటే నన్ను పట్టుకుపోయి పంజరంలో బంధించేయగలడు. అయినా నాదీ ఒక అందమేనా? నాదీ ఒక స్వరమేనా? అసలు నువ్వెప్పుడన్నా నెమలి అనే పక్షిని చూశావా? అది పురివిప్పి నాట్యమాడటాన్ని గమనించావా? అదీ అందమంటే! అదీ నాట్యమంటే! అదీ అదృష్టమంటే!’ అంటూ నోరు తెరుకుని ఉండిపోయింది. కాకికి చిలుక మాటలు నిజమే కదా అనిపించాయి. తానెప్పుడూ నెమలి నాట్యం గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలుగలేదు. ఈసారి ఆ నాట్యమేదో తను కూడా చూసి తీరాలి. చిలుక చెప్పిన మాటలను పూర్తిగా రూఢిచేసుకోవాలి. నెమలి జీవితమే అన్నింటికంటే అదృష్టజాతకం అని రుజువుపరుచుకోవాలి. అలా అనుకుంటూ నెమళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతానికి వెళ్లి కాపువేసింది.   కాకి అదృష్టం ఏమో కానీ, కాసేపట్లోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గుంపులోని నెమళ్లు కొన్ని పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యాన్ని చూసి కాకి కళ్లు చెదిరిపోయాయి. ఏం అందం! ఏం నాట్యం! ఏం ఈకలు! ఏం హొయలు! అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వెంటనే ఓ నెమలి దగ్గర వాలి ‘ఆహా అదృష్టమంటే మీదే కదా! అసలు పక్షిజాతిలో మిమ్మల్ని మించినవారు లేనే లేరు. మీ గాత్రం, మీ నాట్యం, మీ అందం.... ముందర మా బతుకులన్నీ బలాదూర్‌’ అనేసింది.   ఆ మాటలు విన్న నెమలి కళ్లలోంచి కన్నీరు ఒలికింది ‘ఓసి పిచ్చిదానా! నాదీ ఒక బతుకేనా! మబ్బు పట్టినప్పుడు తప్ప నేను నాట్యం చేయలేను. మిగతా సమయాలలో ఈ ఈకలు నాకు బరువు. పైగా ఈ ఈకల కోసమే వేటగాళ్లు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని వండుకు తినేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక అన్నింటికీ మించిన దౌర్భాగ్యం చెప్పనా! పక్షినన్న మాటే కానీ ఆకాశంలో అంతెత్తున ఎగరగలనా? నా మటుకు నాకైతే నిన్ను చూసినప్పుడల్లా భలే ఈర్ష్యగా ఉంటుంది. ఏది పడితే అది తిని బతికేస్తావు. ఆకాశంలో చక్కుర్లు కొడుతూ తిరిగేస్తావు. నీకు వేటగాళ్ల బాధ లేదు. ఆకలితో ఉండే రోజూ ఉండదు. హాయిగా వేళకింత తింటూ, పిల్లల్ని కంటూ, గూట్లో గువ్వల్లే బతికేస్తావు. అసలు అదృష్టమంటే నీది. అన్నింటికంటూ అమూల్యమైన స్వేచ్ఛ నీ దగ్గర ఉంది. అన్నింటికంటే శాపమైన ఆకలి నీ జోలికి రాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమలి మాటలకు కాకి మనసు ఆకాశంలో తేలిపోయింది. ఆ మనసుతో పాటే తాను కూడా రివ్వున నింగికి ఎగిరిపోయింది. (జానపద కథ ఆధారంగా) - నిర్జర.
  ఇంట్లోకి అడుగుపెట్టినవారు ఒక్క నిమిషం మీ డ్రాయింగ్‌ రూంని చూస్తూ ఉండిపోవాలనీ, వారి కళ్లో మీ అభిరుచి పట్ల అభినందన కనిపించాలనీ ఎవరికి మాత్రం అనిపించదు. అతిథుల సంగతి పక్కన పెడితే మనది అనుకునే ఇల్లు అందంగా కనిపించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు. కాకపోతే ఇందుకు చాలానే అవాంతరాలు కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం లేకపోవడం, ఇరుకైన గదులు, అద్దె ఇల్లులాంటి సమస్యలతో అనుకున్నా ఇంటిని అలంకరించుకోలేకపోతుంటారు. అందుకోసమే ఈ చిన్న చిట్కాలు...     మామూలు వస్తువులతోనే అలంకరణకు ఎక్కువ అవకాశం లేనప్పుడు నిత్యం వాడుకునే వస్తువులనే మరింత కళాత్మకంగా కనిపించేవి ఎన్నుకొంటే సరి. బట్టలు తగించే కొక్కేలు, కర్టెన్ రాడ్స్, పెన్‌స్టాండులు, గడియారాలు, నైట్‌ ల్యాంప్స్ వంటివి కొంచెం విభిన్నమైనవి ఎంచుకొని చూడండి.     వాల్‌ స్టికర్స్‌ ఆన్‌లైన్‌ షాపింగ్ పుణ్యమా అని ఇప్పుడు వాల్‌స్టికర్స్‌ అందరికీ అందుబాటులోనే దొరుకుతున్నాయి. వీటి ధరలు కూడా మరీ అంత ఎక్కువగా ఉండవు. కాకపోతే ఎలాంటి బొమ్మని ఎంచుకోవాలి? అది ఎంత పరిమాణంలో ఉండాలి? అన్న విషయాలను ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవాలి. గోడ రంగుని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం ఆర్డర్‌ చేసిన వాల్ స్టికర్‌ ఒకే షీట్‌ మీద వస్తోందా లేకపోతే వేర్వేరు స్టికర్స్‌ని అసెంబుల్‌ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి.     చిన్న చిన్న బొమ్మలతో ఇంట్లో చిన్న బొమ్మలు చాలానే పేరుకుంటాయి. చాక్లెట్లతో పాటుగా వచ్చినవో, చైనా బజార్లలో కొనుక్కున్నవో, కీచెయిన్లు ఊడిపోయినవో మిగిలిపోయిన బొమ్మలను అక్కడక్కడా అతికించవచ్చు. ఫ్రిజ్‌ తలుపులకీ, కిటికీ చెక్కలకీ, స్విచ్‌ బోర్డులకీ డబల్ స్టికర్‌తో అంటించి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు.     పోస్టర్స్‌ గృహాలంకరణకు సంబంధించి అతి చవకగా లభించేవి వాల్‌ పోస్టర్లే. కాకపోతే చవగ్గా దొరుకుతోంది కదా అని ఇల్లంతా నింపితే మాత్రం వీటితో అసలుకే మోసం వస్తుంది. మరీ భారీ పరిమాణంలో ఉండే పోస్టర్లు ఒకోసారి ఇల్లు ఇరుకుగా ఉన్న భావన కలిగిస్తాయి. కాబట్టి కంటికి నదురుగా, మరీ ఆడంబరంగా తోచని పోస్టర్లని ఎన్నుకోవాలి. వీటిని సెలోఫిన్‌ టేప్‌తో అతికిస్తే త్వరగా ఊడిపోవడమే కాకుండా, గోడ మీద కూడా మరకని మిగులుస్తాయి. ఇలాంటి సందర్భాలలో మెడికల్‌ షాపుల్లో దొరికే తెల్లటి సర్జికల్‌ టేపుని ఉపయోగిస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటు గోడకీ, అటు పోస్టరుకీ నష్టం కలగకుండా తీసివేయవచ్చు.     ఉపాయం ఉంటే ఇల్లు మనది కాకపోవచ్చు, మేకులు కొట్టడం ఇష్టం లేకపోవచ్చు, గోడకి ఏదన్నా అంటించడానికీ మనస్కరించకపోవచ్చు... అయినా కూడా కాస్త శ్రద్ధ పెడితే గదిని అలంకరించేందుకు చాలా ఉపాయాలు తడతాయి. ఫ్రిజ్‌ మీద ఒక బొమ్మల కొలువు తీరుతుంది, బెడ్‌ల్యాంప్‌ నుంచి ఒక అందమైన బొమ్మ వేళ్లాడుతుంది, టీవీ కింద ఉన్న కేబుల్ బాక్స్‌ మీద ఒక టెడ్డీ బేర్‌ కూర్చుంటుంది... కాస్తంత ఉపాయం ఉంటే గది మొత్తం అందంగా మారిపోతుంది. కావాలంటే ఒక్కసారి మీ డ్రాయింగ్ రూమ్‌ని పరిశీలించి చూడండి. - నిర్జర.
  అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పు ఇచ్చింది. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షను నిలిపిస్తూ తీర్పు వెలువరించింది. జాదవ్‌ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది.  2016లో గూఢచర్య ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాక్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
  ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలోకి చేరికలకు కాస్త విరామం వస్తుంది అనుకునేలోపు.. కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా మరో నేత పేరు తెర మీదకు వచ్చింది. టీడీపీలో సీనియర్ దళిత నేత జూపూడి ప్రభాకర్ రావు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇతర పార్టీల నేతలను చేర్చుకొని బలపడాలని చూస్తున్న బీజేపీకి దళిత నేతల కొరత ఉంది. ఈ నేపథ్యంలో జూపూడి బీజేపీలో చేరి ఆ కోటాలో ఏదైనా నామినేటెడ్ పోస్టు కొట్టేయడానికి చూస్తున్నారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ లో మంచి వాగ్ధాటి గల నేతగా పేరుతెచ్చుకున్న జూపూడి.. ఆ తరువాత, ఏపీలో కాంగ్రెస్ కనుమరుగవడంతో, 2014లో వైసీపీలో చేరారు. కొండపి నుంచి ఎన్నికల్లో పోటీకి దిగి ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో జూపూడి ఆలోచనలో పడ్డారట. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా జూపూడి బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
  కర్ణాటక‌లో రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్ మీద వాదనలు వింటున్న సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఆ ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణీత గడువులో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌పై ఒత్తిడి చేయలేమని పేర్కొంది. ఎమ్మెల్యేల రాజీనామాను అంగీకరించాలా లేదా అనేది స్పీకరే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అంతేకాక బలపరీక్షలో పాల్గొనాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయకూడదని ఈ సందర్భంగా ఆదేశించింది.  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనురుద్ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుపై కర్ణాటక‌ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రకారమే తాను విధులను నిర్వహిస్తానని తెలిపారు. మరో పక్క బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ, ‘ఇక ప్రభుత్వం పడిపోతుంది.  ఎందుకంటే వారికి కావాల్సినంత బలం లేదని పేర్కొన్నారు. 14 నెలల నుంచి కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 117 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో 78 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాగా, 37 మంది జేడీఎస్ సభ్యులు, ఒకరు బీఎస్పీ, మరొక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీకి 105 మంది సభ్యలుండగా, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆ పార్టీకి ఉంది. ఇప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. వారు రేపు జరిగే బలపరీక్షలో పాల్గొనకపోతే అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది.  మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. ఈ సమయంలో కుమారస్వామి వర్గానికి ఇన్న బలం 102 మాత్రమే కాగా బీజేపీకి 107 మంది బలం ఉంది. ఆ 15 మందిలో కనీసం ఏడెనిమిది మందిని అయినా బాల పరీక్షకు తెలేకుంటే ప్రభుత్వం కూలిపోక తప్పదు. ఇదిలా ఉంటే యడ్యూరప్ప ఇవేవి పట్టనట్లుగా రిలాక్స్‌గా కనిపించారు. బెంగళూరులోని రమాదా హోటల్‌ ప్రాంగణంలో యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు. దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
  కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’.   ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌!     మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయని తెలిసిందే! అయితే ఈ పిండి పదార్థాలను ఎడాపెడా తీసుకోవడం వల్ల వాటిలోని అధిక చక్కెర మన శరీరాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, స్వీట్లు, తియ్యటి తేనీరు, చాక్లెట్లు, ఐస్ క్రీములు... ఇలా చెప్పుకుంటో పోవాలే కానీ చక్కెర అధికంగా ఉండే పదార్థాల జాబితా చాంతాడుని మించిపోతుంది. కొంతమంది ఈ పదార్థాలను వదిలి లేకపోవడమే కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్.   ఏం జరుగుతుంది కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌ ఉన్నవారు చక్కెర అధికరంగా ఉండే పదార్థాలను తినేందుకు ఉబలాడపడిపోతుంటారు. ఒకటి రెండు రోజుల పాటు ఇలాంటి పదార్థాల దొరక్కపోతే వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలైతే ఆ పదార్థాన్ని తీసుకునేదాకా పేచీ పెడుతూనే ఉంటారు. వీరి శరీరం చక్కెరకు అలవాటు పడటం వల్ల, చక్కెర తీసుకున్న వెంటనే వారి ఒంట్లో ‘డోపమైన్‌’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ డోపమైన్‌ మనసు సంతోషంగా ఉన్న ఒక భావనని కలిగిస్తుంది. మద్యం వంటి వ్యసనాలలో కూడా ఈ డోపమైన్‌దే ముఖ్య పాత్ర. తరచూ ఏదో ఒక చక్కెర పదార్థాన్ని తినాలని నాలుక లాగుతూ ఉంటడం, ఎదురుగుండా ఎంత తీపి పదార్థం ఉంటే... అంతా తినేయడం, ఊబకాయం వస్తున్నా కూడా ఆహారాన్ని నియంత్రించుకోకపోవడం... ఇవన్నీ కూడా కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ లక్షణాలే!   ప్రమాదం కార్బొహైడ్రేట్ ఎడిక్షన్‌ అనేది ఆషామాషీగా తీసుకోవల్సిన లక్షణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చిన్నవయసులో ఊబకాయం బారిన పడేవారిలో 75 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తోందట. కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉన్న వారిలో ఇన్సులిన్‌ చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది కొన్నాళ్లకి అస్తవ్యస్తంగా మారిపోయి, చక్కెర వ్యాధికి దారితీస్తుంది. ఇక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యల గురించి చెప్పనే అక్కర్లేదు. పైగా చక్కెర అధికంగా ఉండే చాలా పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు తదితర పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా కనిపిస్తుందే కానీ, కూర్చుంటే లేవలేనంత నిస్సత్తువ ఉంటుంది.   మరేం చేయడం! - ముందుగా తీపి పదార్థాలలోనే కాస్త ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి. ఉదాహరణకు పండ్ల రసాలకు బదులుగా పండ్లు, ఐస్‌క్రీంకు బదులుగా పెరుగు... ఇలాగన్నమాట.   - ఇంట్లో అదేపనిగా చిరుతిళ్లను నిలువ చేసుకోవడం అపేయండి. మీ ఇంట్లో చిరుతిండి డబ్బాలను ఖాళీ చేయండి.   - ఆకలి వేయకపోయినా కూడా ఏదో ఒకటి తినాలని నోరు పీకేస్తుంటే బాదం పప్పులు, టమోటాలు, ఆమ్లెట్లు, మొలకలు... ఇలా తక్కువ పిండి పదార్థాలు ఉండే చిరుతిళ్లని తీసుకోండి.   - నీరు తాగడం వల్ల ఆకలి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. కడుపు నిండిన భావనా కలుగుతుంది. ఒంట్లోని చెడంతా బయటకి పోవడమూ ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ నుంచి బయటపడే వరకూ కాస్త మంచినీరుని ఆరారగా తీసుకుంటూ ఉండండి.   - వ్యాయామం వంటి శారీరిక శ్రమను అలవాటు చేసుకోండి. దీని వల్ల కొవ్వు కరగడమే కాదు, శరీరంలో ‘నిజమైన’ ఆకలి మొదలవుతుంది. అది తీపి పదార్థాల మీద కాకుండా పోషక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటుంది.   - మీ పిల్లల్లో కనుక కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉందని గమనిస్తే, వారిని కూర్చోపెట్టి అందులోని లాభనష్టాల గురించి వివరించండి. - నిర్జర.
గోల్ప్‌ ఈ మధ్య పుట్టిన ఆట కాదు. రోమన్ల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆట. అయితే ఇది ఏనాడూ ప్రజాదరణ పొందలేకపోయింది. ఆట ఆడేందుకు విశాలమైన మైదానాలు, ఖరీదైన పరికరాలూ కావల్సి రావడంతో ఇది కేవలం ధనవంతుల ఆటగా నిలిచిపోయింది. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గోల్ఫ్ ఇప్పుడు చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లుగా ఫలానా వ్యాయామం చేస్తే ఈ ఫలితం, ఫలానా ఆట ఆడితే ఆ ఫలితం అని వింటూ వస్తున్నాము. మరి గోల్ఫ్ ఆడటం వల్ల ఉపయోగం ఏమిటా అన్న సందేహం శాస్త్రవేత్తలకి వచ్చింది. దాని ఫలితమే ఈ నివేదిక-     గోల్ఫ్ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్ట్‌ World Golf Foundation అనే సంస్థ గోల్ఫ్‌ ఆటకీ ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని గమనించేందుకు ఈ గోల్ఫ్‌ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్టుని ఆరంభించింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు... గోల్ఫ్‌ మీద ఇప్పటివరకూ జరిగిన ఐదేవేల పరిశోధనలను సమీక్షించారు. గోల్ఫ్‌ ఆడే సమయంలో వారిలో ఎన్ని కేలొరిలు ఖర్చవుతున్నాయి, వారు సగటున ఎంత దూరం నడవాల్సి వస్తోంది, వారి ఆరోగ్యం మీద ఆట ప్రభావం ఏమిటి... తదితర విషయాలను పరిశీలించారు.     జీవతకాలమే మెరుగుపడింది. పరిశోధకుల సమీక్షలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో బయటపడ్డాయి. గుండెపోటు, పక్షవాతం, డయాబెటీస్‌, పేగు క్యాన్సర్ వంటి 40 రకాల తీవ్రమైన రోగాలను గోల్ఫ్‌ నివారించగలుగుతోందని తేలింది. ఒక పరిశోధనలో అయితే గోల్ఫ్‌ అడేవారి జీవితకాలం ఏకంగా ఐదేళ్లపాటు మెరుగుపడినట్లు బయటపడింది. ఇంతేకాదు! వయసుతో పాటు వచ్చే నరాల బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధ వ్యాధులు... గోల్ఫ్‌ ఆటలో మాయమవుతున్నాయట. గోల్ఫ్‌ ఆటతో శరీరమే కాదు మనసు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మెరుగుపడటంతో పాటుగా... ఆందోళన, మతిమరపు, క్రుంగుబాటు వంటి వ్యాధుల నుంచి దూరం కావడం జరిగిందట.     కారణం! గోల్ఫ్ ఆటలో ఆటగాళ్లు కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాలి. వారి బలమంతా ఉపయోగించి బంతిని కొట్టాల్సి ఉంటుంది. విశాలమైన పచ్చిక బయళ్లలో గుట్టలని దాటుతూ, మైదానాలలో నడుస్తూ ఈ ఆటని ఆడాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు దాదాపు 6 నుంచి 13 కిలోమీటర్ల వరకూ నడుస్తారనీ, 500కి పైగా కేలొరీలను ఖర్చు చేస్తారని తేలింది. పైగా గోల్ఫ్‌ ఆటని వయసుతో సంబంధం లేకుండా ఏ వయసువారైనా ఆడవచ్చు. తమ ఓపికను బట్టి ఆటలో మార్పులు చేసుకోవచ్చు. ఈ కారణాలన్నింటి వలనా గోల్ఫ్‌ గొప్ప ఆరోగ్యాన్ని అందించే ఆటగా మారిపోయిందని పరిశోధకులు సంతోషపడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఐదుకోట్ల మందికి పైగా ఈ ఆటని ఆడుతున్నారనీ, భవిష్యత్తులో మరింత మంది ఈ ఆట పట్ల ఆసక్తి చూపుతారనీ భావిస్తున్నారు. - నిర్జర.
  మనకి ఏది వచ్చినా పట్టడం కష్టం. ఫలానా ధెరపీ మంచిదనో, ఫలానా ఆహారం తినిచూడండి అనో ఓ వార్త రాగానే... దానిని అల్లుకుని వందలాది వార్తలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. మనం కూడా వాటికి అనుగుణంగానే ప్రవర్తించేస్తుంటాం. ఏం చేస్తాం! ఆరోగ్యం గురించి అవగాహనతో పాటుగా తొందరపాటు కూడా సహజమేనేమో! బహుశా అందుకేనేమో విటమిన్‌ డి ప్రాముఖ్యత గురించి వార్తలు వినిపించగానే కొంతమంది ముందూవెనుకా ఆలోచించకుండా డి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం మొదలుపెట్టారు. వైద్యులు ఇష్టపడకపోయినా అడిగి మరీ రాయించుకుంటున్నారు. కానీ ఇదేమంత శుభపరిణామం కాదంటున్నారు నిపుణులు.   ఎందుకీ విటమిన్ డి: విటమిన్‌ డి గురించి ఒకప్పుడు పెద్దగా తెలియదు. శరీరంలోకి చేరిన కాల్షియం సరిగా ఒంటపట్టాలంటే విటమిన్ డి అవసరం అన్న విషయం మాత్రమే తెలుసు. కానీ ఈమధ్య మన శరీరానికి విటమిన్‌ డి ఎంత అవసరమో చెబుతూ, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పరిశోధన వెలుగుచూస్తూనే వస్తోంది. ఈ పరిశోధనల ప్రకారం మెదడు ఎదుగుదలలో లోపాల దగ్గర్నుంచీ షుగర్‌ వ్యాధి వరకు, ఎన్నో సమస్యలు రాకుండా డి విటమిన్‌ తోడ్పడుతుంది. ఇక కాల్షియం లోపం వల్ల ఏర్పడే ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు త్వరగా దరిచేరకుండా విటమిన్‌ డి అడ్డుకొంటుందని నమ్ముతున్నారు.   అదనంగా ఎందుకు: మన శరీరానికి విటమిన్‌ డిని అందించే ప్రధాన వనరు సూర్యకాంతి. ఎందుకంటే ఆహారపదార్థాల ద్వారా విటమిన్ డి లభించే శాతం చాలా తక్కువ. అందుకనే ఈ మధ్య కాలంలో నూనె, పాలు, పళ్లరసాలు వంటి ఉత్పత్తులకు విటమిన్‌ డిని కృత్రిమంగా జోడించి మరీ విక్రయిస్తున్నారు. ప్రస్తుత జీవనశైలిలో మనం బయట తిరిగేది తక్కువ కాబట్టి, శరీరానికి అందవలసినదానికంటే తక్కువ విటమిన్‌ డి అందుతోందేమో అన్న అనుమానం ప్రతివారిలోనూ మొదలైంది. ఆ ఆనుమానమే అవసరం లేకపోయినా విటమిన్ డి తీసుకునే అలవాటుని కల్పిస్తోంది.   ఎంత అవసరం! చాలామంది రోజుకి 1000 IUల విటమిన్‌ డి మన శరీరానికి అవసరం అనుకుంటారు. కానీ 2010లో సరిచేసిన పరిమితుల ప్రకారం 70 ఏళ్లలోపువారికి 600 IUలు, 70 ఏళ్లు దాటినవారికి 800 IUల విటమిన్‌ డి అందితే సరిపోతుంది. దీనికి ఓ 200 IUలు తగ్గినా కూడా పెద్ద ప్రమాదం లేదని చెబుతున్నారు. కీళ్లవ్యాధులు వంటి సమస్యలు ఉన్నవారు తప్ప ప్రత్యేకించి విటమిన్ డిను మందుల ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ అటు వైద్యులు ఇటు రోగులు కూడా డి విటమిన్‌ను తీసుకునేందుకు ఉబలాట పడుతున్నారు.   దుష్ప్రభావాలు లేకపోలేదు: అవసరానికి మించి విటమిన్ డి మన శరీరంలోకి చేరితే చిన్నాచితకా దుష్ప్రభావాలు లేకపోలేవంటున్నారు. నీరసం, నిద్రలేమి, తలనొప్పి, అజీర్ణం, వికారం వంటి తాత్కాలిక సమస్యలు ఎలాగూ ఉంటాయట. వీటితో పాటుగా డి విటమిన్‌ వల్ల శరీరంలో అధికంగా కాల్షియం పేరుకుపోవడంతో రక్తనాళాలు గడ్డకట్టడం దగ్గర్నుంచీ కిడ్నీలు దెబ్బతినడం వరకూ రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక గర్భవతులు, పాలిచ్చే తల్లులు అధికంగా డి విటమిన్‌ తీసుకోవడం వల్ల వారి శిశువుకి హానిజరిగే ప్రమాదం ఉందంటున్నారు. అందుకనే ఆటకాయితనంగా విటమిన్ డి జోలికి పోవద్దని సూచిస్తున్నారు. ముందుగా వైద్యుల సలహా సంప్రదింపుల మేరకే మనకు డి విటమిన్‌ అవసరం ఉందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ సూర్యకాంతిలో కాసేపు తిరగడం వల్ల అది అదుపులోకి వస్తుందేమో ప్రయత్నించాలి. ఆ తరువాతే సప్లిమెంట్ల జోలికి పోవాలి.   - నిర్జర.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.