LATEST NEWS
ALSO ON TELUGUONE N E W S
  ఇటీవ‌ల జ‌మ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో న‌ల‌భై మందికి పైగా సైనికులు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే. సాధార‌ణ ప్ర‌జ‌ల నుండి సెల‌బ్రిటీస్ వ‌ర‌కు  త‌మ సానుభూతిని ట్వీట్స్ ద్వారా తెలియ‌జేస్తున్నారు. కానీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక అడుగు ముందుకు వేసి సైనిక కుటుంబాల‌ను ఆదుకొన‌డానికి సాయ‌మందించి , ప్ర‌జ‌లంద‌రినీ సాయం చేయ‌మ‌ని కోరారు. సైనికుల సాయానికి సంబంధించ‌న స‌ర్టిఫికేట్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. విజ‌య్ ఎంత‌  అమౌంట్ డొనేట్ చేశారో ఆ స‌ర్టిఫికేట్ లో లేదు. ``సైనికులు మ‌న కుటుంబాల‌కు ర‌క్ష‌ణ‌గా ఉన్నార‌ని, మ‌నం సైనిక కుటుంబాల‌కు అండ‌గా ఉండాల‌ని , ఏం చేసినా సైనిక ప్రాణాల‌కు విలువ‌క‌ట్ట‌లేమ‌ని, త‌న వంతు సాయం చేశాన‌ని, అంద‌రం క‌లిసి సైనిక కుటుంబాల‌కు ఒక స‌పోర్ట్ క్రియేట్ చేద్దాం`` అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు.
  ప్ర‌జంట్ సాయి ధ‌ర‌మ్ తేజ్ చిత్ర‌ల‌హ‌రి సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. షూటింగ్ , పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అన్నీ తొంద‌ర‌లోనే కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల తాను చేసిన సినిమాలు ప‌రాజ‌యం పాల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తేజ్ క్రిటిక్స్ పై కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశాడు. తాను చేస్తున్న చిత్ర‌ల‌హ‌రి సినిమా క్రిటిక్స్ అంద‌రికీ స‌మాధానం చెబుతుంద‌ని అన్నాడు. ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా తండ్రీ-కొడుకుల మ‌ధ్య ఉండే రిలేష‌న్ ను చూపిస్తుంద‌ని , అంతేకాదు ప్ర‌తి నిరుద్యోగికి ఈ సినిమా క‌నెక్ట్ అవుతుంద‌ని అన్నారు. కాగా ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ , నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి  ర‌విశంక‌ర్ , చెరుకూరి మోహ‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మ‌రి స‌రైన విజ‌యాలు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న తేజ్. ఈ సినిమా పై బాగానే హోప్స్ పెట్టుకున్నాడు.
  యువ తమిళ కథానాయకుడు, టి. రాజేందర్‌ కుమారుడు శింబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘వల్లభ’, ‘మన్మథ’ సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు నమోదు చేశాయి. తర్వాత తెలుగులో పెద్ద విజయాలు దక్కలేదు. శింబుకు ఓ తమ్ముడు ఉన్నాడు. పేరు కురలరసన్‌. బాల నటుడిగా కొన్ని చిత్రాల్లో అతను నటించాడు. ‘ఇదు నమ్మ అల్లు’ అనే తమిళ సినిమాకు సంగీతం అందించాడు. అందులో శింబు హీరో. ఇప్పుడు ఇతని ప్రస్తావన ఎందుకంటే... కురలరసన్‌ మతం మారాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అతడికి తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించింది. కుమారుడి మత మార్పడి కార్యక్రమానికి తల్లిదండ్రులు హాజరయ్యారు. తమిళ సంగీత దర్శకుడు, ఇళయరాజా తనయుడు యువన్‌ శంకర్‌ రాజా కూడా ఇస్లాం స్వీకరించిన సంగతి తెలిసిందే.
  `రంగ‌స్థ‌లం` తో ఇండ‌స్ట్రీ హిట్ అందించిన స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు 26 వ సినిమాకు  సంబంధించి స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నాడ‌ట‌. ఒక‌వైపు ఇది చేసుకుంటూనే మ‌రో వైపు స‌హా నిర్మాత‌గా మారి వ‌రుస సినిమాల‌ను నిర్మించ‌డానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ఇటీవ‌లే మైత్రి మూవీ మేక‌ర్స్ తో క‌లిసి సాయి ధ‌ర‌మ్ తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం అటివ‌లే లాంచ్ అయ్యింది. ఈ చిత్రంతో సుక్కు శిష్యుడు బుచ్చిబాబు  డైరెక్ట‌ర్ గా  ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇక తాజాగా మ‌రో చిత్రాన్ని నిర్మించ‌డానికి రెడీ అయ్యాడు సుక్కు. అయితే ఈసారి మెగా డాట‌ర్ నిహారిక కోసం క‌థ‌ను సిద్దం చేశాడ‌ట. ఆయ‌న శిష్యుడ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తో కానీ లేక అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట సుకుమార్.త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెలుబ‌డునున్నాయి.
బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయిలో నే కాకుండా అంత‌ర్జాతీయ స్థాయిలో ను, ఇటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో  త‌న‌కు అంటూ మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి ద బిగినింగ్ , బాహుబ‌లి ద కంక్లూజ‌న్ అంటూ రెండు భాగాలుగా తీసిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎన్నో రికార్డులు బ‌ద్ద‌లుకొట్టింది. ఇక సినిమాకు గాను ఎన్నో అవార్డులు కూడా వ‌చ్చాయి.ఇప్పుడు తాజాగా రాజ‌మౌళికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇండియ‌న్ రెస్టారెంట్ చైన్ `గోదావ‌రి` రాజ‌మౌళికి హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఇండియా కాన్ప‌రెన్స్- 2019 కు హాజ‌రు కావాల్సిందిగా స్వాగ‌తం ప‌లికింది. మ‌రి గ‌తంలో ఈ ప్రతిష్టాత్మ‌క స‌ద‌స్సు కు భార‌త‌దేశానికి చెందిన ప్ర‌ముఖ‌లు క‌మ‌ల్ హాస‌న్, షారుక్ ఖాన్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా మ‌రెంద‌రో ప్ర‌ముఖుల‌ను స్వాగ‌తించ‌గా ఇప్పుడు రాజ‌మౌళిని ఆహ్వానించ‌డం గోప్ప విష‌య‌మే.
  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల జంపింగులే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే నేతలు వరుసపెట్టి టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. నేతల జంపింగులపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వారే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీలో, చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఎప్పుడో వెళ్లి ఉండేవారని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 150 సీట్లలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. నాలుగేళ్ల 10 నెలలు ప్రయాణం చేసి, ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో పరమార్ధాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేతలు పార్టీలు మారినా ఏమీ కాదని.. సంక్షేమం, అభివృద్ధే టీడీపీకి అండగా నిలుస్తాయని లోకేష్ స్పష్టం చేసారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ దిగనున్నాయి. టీడీపీ, వైసీపీల పొత్తు అసలు ఆప్షనే లేదు. ఇక టీడీపీ, బీజేపీలు గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, కేవలం వామపక్షాలతో కలిసి నడుస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికైతే జనసేనతో పొత్తు కూడా కష్టమే. మరి ఎన్నికల ముందు ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. ఇక మిగిలింది కాంగ్రెస్. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఎంతవరకు కలిసి పనిచేస్తాయో కూడా ఆలోచించాలి. కొందరు టీడీపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం కానీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ఏమో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటూ చర్చలు మొదలయ్యాయి. చూద్దాం మరి ఎన్నికల ముందు టీడీపీ పొత్తుల విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.
  2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వకారణమని అన్నారు. అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారని.. ఆ నమ్మకంతోనే చంద్రబాబుకు అధికారం అప్పగించారన్నారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్‌లో ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఇది చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమైందని యనమల అన్నారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని తెలిపారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని, దీంతో రాజధాని నగరాన్ని కోల్పోయామన్నారు. విభజన సమయంలో ఆదాయ-వ్యయాలు, ఆస్తులు-అప్పులు సరిగా పంపిణీ చేయలేదని.. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరాశా నిస్పృహలు నెలకొన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం వల్ల సమస్యలు మరింత జఠిలమయ్యాయని యనమల పేర్కొన్నారు. మహిళా సాధికారత సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని.. 20 ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాలను ఆయన ఏర్పాటు చేశారని యనమల గుర్తు చేశారు. వెలుగు పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమమని, ఆ పథకంలో ప్రస్తుతం 94 లక్షల మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఈ బడ్జెట్ లో పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇందులో రైతుల పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌ ముఖ్యాంశాలు: వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు బీసీ వెల్ఫేర్‌ రూ.8,242 అటవీపర్యావరణానికి రూ. 491 కోట్లు ఉన్నత విద్య- 3,171 కోట్లు ఇంధన మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ రూ.5,473 సెకండరీ ఎడ్యుకేషన్‌ రూ. 22,783 పౌరసరఫరాలు- రూ. 3,763 కోట్లు ఆర్థికశాఖకు రూ. 51, 841 కోట్లు సాధారణపరిపాలన శాఖకు- రూ.1,117 వైద్యారోగ్యశాఖకు రూ. 10,032 హోంశాఖకు రూ.6,397 కోట్లు గృహనిర్మాణశాఖకు రూ.4079 జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు ఐటీకి 1006 కోట్లు కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు న్యాయశాఖకు 918 కోట్లు అసెంబ్లీకి 149 కోట్లు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు ప్లానింగ్‌కు 1403 కోట్లు పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 35,182 కోట్లు రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ 172 కోట్లు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ 458 కోట్లు సోషల్‌ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు యువజన క్రీడలు రూ. 1982 కోట్లు చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు డ్రైవర్‌ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు యాంత్రీకరణకు రూ. 300 కోట్లు మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 14,367 కోట్లు ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 5,385 కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 16,226 కోట్లు మైనార్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 1,304 కోట్లు పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు చేనేతలకు రూ. 225 కోట్లు 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు మైనార్టీలకు దుల్హన్‌ పథకం కింద రూ.100 కోట్లు ఎన్టీఆర్‌ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు పెన్షన్‌ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు
  ఎన్నికల హడావుడి మొదలవుతుంటే సర్వేల సందడి మొదలవ్వడం సహజం. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు.. అభ్యర్థుల ఎంపిక, బలాబలాల అంచనాతో బిజీ బిజీగా ఉన్నాయి. మరోవైపు కొన్ని సంస్థలు సర్వేలతో బిజీగా ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఏపీలో కూడా సర్వే నిర్వహిస్తున్నాయి. తాజాగా ‘రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌' సంస్థలు ఏపీ పార్లమెంట్ ఎన్నికలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ఫలితాలు అధికార పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ సీట్లు సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వే వెల్లడించింది. టీడీపీ 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ.. వైసీపీ 41.3 శాతం ఓట్లతో 19 ఎంపీ సీట్లు, టీడీపీ 33.1 శాతం ఓట్లతో 6 ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. గత ఎన్నికల్లో  ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు రాగా, వైసీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. ఇప్పుడు సర్వే మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. అయితే ఈ సర్వేపై విమర్శలు కూడా వెల్లువెతున్నాయి. బీజేపీ, వైసీపీలు సర్వేల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. '2014 ఎన్నికల ముందు వైసీపీ గెలుస్తుంది అంటూ కొన్ని సర్వేలు విడుదల చేసారు. కానీ ఫలితాలు తారుమారు అయ్యాయి. ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది' అంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సర్వేలో చెప్పినట్లు వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందో లేక 2014 ఫలితాలే రిపీట్ అవుతాయో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
  వంగవీటి రంగా ఆశయ సాధన కోసమే వైసీపీలో చేరానని, కానీ అది అక్కడ సాధ్యం కాకపోవడంతో బయటకు వచ్చేశానని వంగవీటి రాధా తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రంగా ఆశయం నెరవేరుస్తానని పార్టీలో చేరేటప్పుడు వైసీపీ అధినేత జగన్ మాటిచ్చారని.. సొంత తమ్ముడికన్నా ఎక్కువ అన్నారని రాధా చెప్పారు. 'తమ్ముడినే ఇలా చూస్తే.. సామాన్య ప్రజలను జగన్‌ ఎలా చూస్తారు' అని ప్రశ్నించారు.  'ఒక్క సీటు కోసం నాకు ఈ గొడవ అవసరం లేదు. నేను అభిమానం కోరుకున్నా.. మీరు జాలి చూపిస్తున్నారు. సీటు ఇవ్వనందుకు నాకు బాధ లేదు, సూటిపోటి మాటలు నన్ను బాధించాయి' అని రాధా అన్నారు. వైసీపీలో తనకు జరిగిన అవమానాలు మరొకరికి ఎదురుకాకూడదన్నారు రాధా. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళితే.. ఎందుకు వెళ్లావంటూ వైసీపీ నేతలు తనను మందలించారన్నారు. ఇదెక్కడి న్యాయమన్నారు. రంగా విగ్రహావిష్కరణకు అన్ని రకాల పార్టీల వాళ్లు వస్తారని... ఆయన అభిమానానికి హద్దులు లేవన్నారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. అభిమానంతో కొంతమంది భోజనాలు పెడితే.. అది కూడా పొరపాటైపోయిందన్నారు. లోకల్ ఇంఛార్జీకి చెప్పలేదని.. తనను ప్రశ్నించారన్నారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ జగన్‌ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీని వీడిన తర్వాత సోషల్ మీడియాలో తనపై బెదిరింపులు పెరిగాయని వంగవీటి రాధా అన్నారు. ఒకవేళ తన చావు వారికి ఆనందం కలిగిస్తుందంటే చంపేయండని అన్నారు. తనకు ప్రాణం మీద ఆశ లేదని.. పేదల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తన తండ్రి అని.. తాను కూడా అందుకు సిద్ధమేనని చెప్పారు. 'నన్ను బెదిరిస్తున్నవారి ఐపీ అడ్రస్‌ ద్వారా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగలను. కానీ.. వైసీపీ నేతలు కింద వారిని బలి చేస్తారనే ఆగిపోయాను. ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది' అని రాధా అన్నారు. అలాగే పార్టీ మారేందుకు వంద కోట్ల డీల్ కుదుర్చుకున్నారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
  ఎన్నికల్లో గెలిస్తే ప్రజల అండ మా పార్టీకి ఉంది కాబట్టే గెలిచామని, ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్లే ఓడిపోయామని చెప్పుకోవడం కొన్ని పార్టీలకు అలవాటు. ఇప్పటికే విపక్షాలు బీజేపీ మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఓ సైబర్ నిపుణుడు కూడా చేరిపోయాడు. 2014 నుంచి ఇప్పటివరకు బీజేపీ సాధించిన విజయాలన్నీ ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే సాధ్యమైందని పెద్ద బాంబు పేల్చాడు. అమెరికాలో తలదాచుకుంటున్న సయ్యద్‌ షుజా అనే భారతీయ హ్యాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్‌ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని అన్నారు. ఇందుకు టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సహకరించిందని తెలిపారు. అయితే ఇక్కడో అర్థంకాని విషయం ఏంటంటే.. 2014లో జియో సేవలు ప్రారంభం కాలేదు. 2016 సెప్టెంబర్‌ నుంచే అవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి ఆ లాజిక్ పక్కన పెట్టి మిగతా మేటర్ లోకి వెళ్దాం. సయ్యద్‌ షుజా సోమవారం లండన్‌లో భారత పాత్రికేయ సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కైప్‌ ద్వారా మాట్లాడారు. అయితే ముఖం కనిపించకుండా మాస్క్‌ ధరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను డిజైన్‌ చేసిన ఈసీఐఎల్‌ బృందంలో తాను కూడా సభ్యుడినని చెప్పారు. 2009 నుంచి 2014 వరకు తాను ఆ సంస్థలో పనిచేశానని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయగలమా? ఎలా చేయగలం? అన్న విషయాన్ని పరిశీలించాలని ఈసీఐఎల్‌ మమ్మల్ని కోరిందన్నారు. వాటిని హ్యాక్‌ చేయవచ్చని తాము నిరూపించామని తెలిపారు. రిలయన్స్‌ జియో అందించిన ఓ మాడ్యులేటర్‌ ద్వారా మిలటరీ గ్రేడ్‌ లోఫ్రీక్వెన్సీ తరంగాలతో బీజేపీ ఈవీఎంలను హ్యాక్‌ చేసింది. తద్వారా 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే బీజేపీ సీనియర్‌ నేత గోపీనాథ్‌ ముండేను లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే చంపేశారు. ముండే మరణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలనుకున్నారు. ఆలోగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈ సంకేత ప్రసారాలను మేం అడ్డుకున్నాం. ఫలితంగా మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ గెల్చుకుంది. లేకుంటే బీజేపీ స్వీప్‌ చేసి ఉండేది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ సంకేత ప్రసారాలను మాబృందం అడ్డుకుంది. లేకుంటే ఆ రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించి ఉండేది.  గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీకి సంబంధించి ఈవీఎంలలో రిగ్గింగ్‌ జరిగింది. 2014 ఏప్రిల్‌లో ఈవీఎంల నుంచి సంకేతాలు వెలువడుతున్నట్లు గుర్తించాం. మాకు తెలిసిన ఈ సమాచారంతో బీజేపీని బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకున్నాం. హైదరాబాద్‌ శివార్లలో బీజేపీ నేత ఒకరిని కలుసుకునేందుకు మా బృందం వెళ్లింది. అక్కడ మా బృందంపై కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు చనిపోయారు. నేను తప్పించుకున్నా. ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూడటానికి హైదరాబాద్‌లోని కిషన్‌గఢ్‌లో మతకలహాలు జరిగినట్లు చిత్రీకరించారు. తన బృందంలోని కొందరు సభ్యులు హత్యకు గురికావడంతో 2014లో తాను భారత్‌ నుంచి పరారయ్యాయని చెప్పారు. అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరారన్నారు. ఈవీఎంల హ్యాకింగ్‌పై కథనం రాయడానికి పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ అంగీకరించారు.  ఆలోగానే ఆమె హత్యకు గురయ్యారు. ఈవీఎంలలో వాడిన వైర్లను ఎవరు తయారుచేశారన్నది తెలుసుకునేందుకు సమాచారం చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. ఆ తర్వాతే ఆమె హత్య జరిగింది అన్నారు. నా ఆరోపణలకు ఆధారాలిస్తా. ఇటీవలి ఎన్నికల్లో వాడిన ఈవీఎంల ద్వారానే మీకు హ్యాకింగ్‌ తీరును వివరిస్తా. ఏయే ఎన్నికల్లో ట్యాంపరింగ్‌ జరిగిందో చెబుతా అని తెలిపారు. ఈ విలేకరుల సమావేశానికి ఎన్నికల సంఘాన్ని కూడా ఆహ్వానించాం. కానీ రాలేదు. రాజకీయ పార్టీలను ఆహ్వానించాం. అయితే కాంగ్రెస్‌ తరఫున కపిల్‌ సిబల్‌ ఒక్కరే వచ్చారు అన్నారు. హ్యాకర్‌ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. బీఈఎల్, ఈసీఐఎల్‌ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్‌ చేయలేరని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న గేమ్ అంటుంది. హ్యాకర్‌ షుజా ముఖానికి ఉన్న ముసుగు తీసి ఆధారాలు బయటపెడితేనే కానీ అసలు నిజాలు ఏంటో మనకి తెలియవు.
  గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. పేదరికంతో పాటు నిర్లక్ష్యం వల్ల చాలామంది కంటి పరీక్షలు చేయించుకోవడం లేదని కేసీఆర్‌ చెప్పారు. ఎవరూ కోరకుండానే మంచి ఉద్దేశంతో కంటివెలుగు ప్రవేశపెట్టామన్నారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు పథకాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యంగా వదిలేశాయని కేసీఆర్‌ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా రుణమాఫీ చేయకపోతే ప్రజలు మళ్లీ తమకు ఎందుకు ఓటు వేశారని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. రైతే రాజు అయ్యే పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే కొందరు ప్రశంసిచారని, రైతుబీమా పరిహారం బాధిత కుటుంబాలకు కేవలం 10 రోజుల్లో అందుతోందని చెప్పారు. కార్యాలయాలు తిరగకుండా, పైరవీలు చేయకుండానే బాధిత కుటుంబం ఖాతాలో పరిహారం సొమ్ము జమ అవుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ అధికారులను కూడా నియమించలేదని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల వల్లే పోడు భూముల సమస్య పరిష్కారం కాకుండా పోయిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కోయలు వలస రావడం కూడా పోడు భూముల విషయంలో సమస్యగా మారిందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ సమస్యను తప్పకుండా పరిష్కారిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం సాహసం చేయబోతోందని కేసీఆర్‌ చెప్పారు. గతంలో సర్వే ప్రకారం 8 లక్షల ఇళ్లు నిర్మిస్తే సరిపోతుందని తేలిందన్నారు. ఇల్లు అవసరమైనవాళ్లు ఎంతమంది ఉన్నారో కచ్చితమైన లెక్కలను త్వరలో తీస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఇళ్ల పేరుతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కొంచెం ఆలస్యమైనా తాము డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు నాణ్యంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. పేదవాళ్ల పేర్లను లాటరీలో వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ లాటరీ విధానానికి మినహాయింపు లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 30వేల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని కేసీఆర్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని చెప్పారు. అందుకే ఎలాంటి మార్పులు లేకుండా టీఆర్ఎస్ కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని తెలిపారు. ఆయుష్మాన్‌భవ కంటే ఆరోగ్యశ్రీ పథకంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కిట్‌ పథకంలో కేంద్రం వాటా పైసా కూడా లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని కేసీఆర్‌ విమర్శించారు. మిషన్‌ కాకతీయ, భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కేంద్రం 24 రూపాయిలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజ్యాంగబద్దంగా రావాల్సిన పన్నువాటా తప్ప నిధులు రాలేదని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆదాయ, వ్యయాల అంచానా రూ.10 లక్షల కోట్లని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రూ.2 లక్షల 40 వేల కోట్లని, అప్పు చెల్లిస్తే మళ్లీ రూ.లక్షా 30వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు రూ.లక్షా 20 వేల కోట్ల ఖర్చు చేసినట్లు కేసీఆర్‌ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని కేసీఆర్ అన్నారు. 12,751 గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన పెన్షన్లు, రైతు బంధు, నిరుద్యోగ భృతి అమలు చేస్తామని అన్నారు. మార్చి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందజేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.
  ప్రేమ గుడ్డిదంటారు! అది నిజమేనని తేల్చేందుకు చాలా పరిశోధనలే జరిగాయి. ప్రేమలో ఉన్నవారికి మిగతా ప్రపంచం సరిగా కనిపించదనీ, తమకి ఏం జరుగుతోందో పట్టదనీ ఈపాటికే తేలింది. ప్రేమలో ఉన్నప్పుడు మన శరీరంలో పనిచేసే హార్మోన్లే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రేమలో ఉన్నవారు అవతలివ్యక్తి భావాలని కూడా గమనించకపోతే ఎలా!   వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది సైకాలజిస్టులు, ప్రేమికులు ఒకరి భావోద్వేగాలను మరొకరు సరిగా పసిగడుతున్నారా లేదా అనే విషయం మీద ఓ పరిశోధన నిర్వహించారు. ఇందుకోసం వారు ఏళ్ల తరబడి ప్రేమలో మునిగితేలుతున్న ఓ 120 మంది జంటలకు కొన్ని ప్రశ్నలను అడిగారు. వారి జవాబులని విశ్లేషించిన మీదట కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.   - కొంతమంది వ్యక్తులకి కోపం వచ్చినప్పుడు... ఆ కోపాన్ని లోలోపచే అణచుకునే ప్రయత్నం చేస్తారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యక్తులలోని ముభావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టీ వారికి కోపం వచ్చిందని తెలుసుకోవచ్చు. కానీ చాలామంది ప్రేమికులు ఈ విషయంలో అంతగా శ్రద్ధ చూపరని తేలింది.   - తమ కోపాన్ని దిగమింగుకునేవారి సంగతి ఇలా ఉంటే... మరికొందరేమో ఏం జరిగినా కూడా ‘అంతా మన మంచికే’ అనే సానుకూల స్వభావంతో ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇలాంటివారి కోపాన్ని కూడా వారి ప్రేమికులు తక్కువగా అంచనా వేస్తారట. అన్నింటిలోనూ సానుకూలత చూపిస్తారు కాబట్టి, ఏం జరిగినా కూడా సానుకూలంగానే స్వీకరిస్తారులే అన్న తేలికభావంతో వీరిని తక్కువగా అంచనా వేస్తారట.   - ఒక వ్యక్తి తరచూ తన భావోద్వేగాన్ని ప్రకటించేవాడై ఉంటే... తనలో తాను ఏమీ దాచుకోకుండా తన ఉద్వేగాన్ని వెళ్లగక్కుతాడులే అన్న నమ్మకంతో ఉంటారట అవతలివారు.   - ఆడవారు తమ ప్రేమికునిలో ఎప్పుడూ సానుకూల దృక్పథాన్నే గమనిస్తారట. దాని వల్ల ఒకింత మేలు జరుగుతున్నప్పటికీ... వారి మనసుకి కష్టం కలిగినప్పుడు దాన్ని గ్రహించలేకపోయే ప్రమాదం ఉంది.   - స్త్రీలో పోలిస్తే మగవారు తమ భావోద్వేగాలను ఎక్కువగా కప్పిపుచ్చుతారని ఈ పరిశోధకులే ఇంతకుముందు నిరూపించారు. దీని వల్ల వారిని అంచనా వేసే అవకాశం తక్కువగా ఉంటుంది.   మనసులో ఉన్న అసంతృప్తిని బయటకి వెళ్లగక్కి విషయాన్ని తేల్చుకోకపోవడం వల్ల మున్ముందు చాలా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. అలాగే అవతలి వ్యక్తిలోని భావోద్వేగాలను సరిగా పట్టించుకోకపోయినా కూడా బంధం బలహీనపడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.  
  Everyone wants to lead a happy life. But how? 10 tips given by Dr Purnima Nagaraja. To know those 10 changes watch the video.   https://www.youtube.com/watch?v=3L3k5ou3fnE    
  మీరు ఎప్పుడన్నా మీ పనితో ప్రేమలో పడ్డారా ? లేదంటే వెంటనే ఆ పనిలో వుండండి. ఎందుకంటే రోజు సంతోషంగా ఉండాలంటే మీరు చేసే పనితో ప్రేమలో పడండి అంటున్నారు పరిశోధకులు . నిజానికి  చాలామందికి ఈ సీక్రెట్ తెలీక   జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు అంటున్నారు వారు . అదేదో బరువు మోస్తున్నట్టు  జీవితాన్ని ఎంతో కష్టం గా లాక్కు వెళుతుంటారు . అదేమంటే చేసే పని నచ్చితే కదా ! దానిని ఎంజాయ్ చేసేది అంటారు. అయితే  చేసే పని మీకు నచ్చినా నచ్చకపోయినా ముందుగా దానిని వందశాతం ప్రేమించటం మొదలు పెట్టండి.  అప్పుడు అది భారంగా అనిపించదు. అదెలా సాద్యం అంటే, చేసేపని మీద పూర్తిగా మనసుపెట్టి నప్పుడు, ఆ పని పూర్తి అయ్యేసరికి మనకి తెలియకుండానే ఒక సంతృప్తి కలుగుతుంది.      సో... మనం చేసే పనిమీద ద్రుష్టి పెట్టాం కాని , అది మనకు నచ్చినదా , కాదా అన్న విషయం మీద కాదు కాబట్టి , ఆ క్షణం లో నిజంగా ఒక పనిని సమర్దవంతం గా పూర్తి చేసినప్పుడు కలిగే ఆనందాన్ని రుచి చూస్తాం. ఈ సూత్రం  చిన్న పని నుంచి పెద్ద పని దాకా అన్నిటికి వర్తిస్తుంది. చేసే పని ఏది అయినా సరే దానిని మనస్పూర్తిగా , శ్రద్దగా చేయటం అనే చిన్న అలవాటు ఒక్కటి చాలు మనకి కొండంత సంతోషాన్ని ఇవ్వటానికి.     చేసే పని నచ్చనప్పుడు అసహనం, కోపం కలుగుతాయి . అవి ఒకదాని నుంచి ఒకదానికి పాకి పోయి, రోజుని, ఒకో సారి  మొత్తం  జీవితాన్ని నిందిస్తూ  గడిపేస్తాం. దాని వల్ల నచ్చిన పనులని కూడా ఆనందం గా చేయలేము. ఇది ఒక చైన్ లా మొత్తం జీవితాన్ని చుట్టబెట్టేస్తుంది. దాంతో సెల్ఫ్ పిటి లోకి వెళ్ళిపోయి మన జీవితం ఇలా కావటానికి కారణం అంటూ చుట్టుపక్కల వాళ్ళని నిందించటం మొదలు పెడతాం . దానివలన అనుబంధాల మద్య పొరపచ్చాలు వస్తాయి. మళ్ళి దాని నుంచి బాధ .. నైరాశ్యం ..పుట్టుకొచ్చి మనసుని అల్లకల్లోలం చేస్తాయి.    వింటుంటే ...నిజమా ? అన్న అనుమానం కలుగుతుంది కాని ఒక్కసారి మీలోపలకి మీరు ప్రయాణించి, మీ కోపానికి, అసహనానికి కారణాలని వెదకటం మొదలు పెట్టండి. మీరు చేసే పనిని మీరు ప్రేమించకపోవటమే కారణం అని తెలుస్తుంది. అంటున్నారు పరిశోధకులు. కొన్ని ఏళ్ల పాటు, వందల మందిపై వీరు జరిపిన పరిశోధనలలో బయట పడ్డ నిజం అది.   అందుకే చేసే ప్రతి పనితో ప్రేమలో పడదాం. అసలే జీవితం ఉన్నదే చిన్నది. అందులో సగం జీవితం పనిని చూసి విసుక్కోవటం తోనే సరిపోతే ఇక ఉన్న జీవితాన్ని హాయిగా ఆస్వాదించే అవకాశమే రాదేమో? కష్టంగా ఉన్నవాటిని ఇష్టంగా మార్చుకుంటే జీవితం ఎప్పుడు మూడు నవ్వులు ఆరు విజయాలతో కళకళలాడుతుంది. మరి మీ పనితో మీరు ప్రేమలో పడ టానికి సిద్దమేగా ?  - కళ్యాణి
  తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 31 జిల్లాలు ఉండగా తాజాగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబరు 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధారంగా 11 మండలాలతో నారాయణపేట జిల్లా, 9 మండలాలతో ములుగు జిల్లా ఏర్పాటుకు ఇవాళ రెవెన్యూశాఖ తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. నారాయణపేట జిల్లా పరిధిలో నారాయణపేట, దామరగిద్ద, మరికల్‌, కోస్గి, ధన్వాడ, నర్వ, మద్దూర్‌, ఊట్కూర్‌, మక్తల్‌, మాగనూర్‌, కృష్ణా మండలాలు.. ములుగు జిల్లా పరిధిలో ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, మంగపేట, వాజీడు, తాడ్వాయి(సమ్మక్క-సారక్క), ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాలు ఉంటాయి. రేపట్నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయి. రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికారులను నియమించాల్సి ఉంది.
  ఛత్తీస్‌గఢ్‌లో టాటా స్టీల్‌ ప్రాజెక్టు కోసం 2008లో 1,707 మంది గిరిజన రైతుల నుంచి తీసుకున్న భూములకు సంబంధించిన పత్రాలను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం సాయంత్రం తిరిగి ఇచ్చేయనున్నారు. 2008 లో బీజేపీ ప్రభుత్వం టాటా స్టీల్‌ ప్లాంట్ ఒప్పందం చేసుకుని, రైతుల నుంచి భూమిని తీసుకుంది. లోహండిగూడ ప్రాంతంలో రూ.19,500 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మించాలని భావించగా కొన్ని పరిస్థితుల వల్ల ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. రైతులకు భూములూ తిరిగివ్వలేదు. కాగా, రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని గత ఏడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల భూములను తిరిగి ఇచ్చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన రైతుల హక్కులను తెలియచెబుతూ ‘ఆదివాసీ కృషక్‌ అధికార్‌ సమ్మేళన్’ పేరుతో ధురగావ్‌‌ గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భూములకు సంబంధించిన పత్రాలతో పాటు అటవీ హక్కుల ధ్రువపత్రాలు, రైతు రుణమాఫీ పత్రాలను రాహుల్‌ గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో రూ.582 కోట్ల రుణమాఫీ పత్రాలను రైతులకు అందించనున్నారు. మొత్తం 1,40,479 మంది రైతులకు రుణాల నుంచి విముక్తి లభించనుంది.
  పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకారమని చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మనిషి ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు అత్యంత హేయమైనవిగా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ వంతు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు.
      జనానికి ఏమొచ్చినా పట్టడం కష్టం. మొన్నటి వరకూ Cold Water Challenge పేరుతో చల్లటి నీళ్లు ఒకరి మీద ఒకరు దిమ్మరించుకునేవాళ్లు. ఇహ ఇప్పుడు Hot Water Challenge శకం మొదలైంది. ఏడాది క్రితం మొదలైన ఈ సరదా ఇప్పుడు వెర్రి తలలు వేసి ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఎవరన్నా తన స్నేహితుడి మీద వేడి వేడి నీళ్లు పోయడం కానీ... వేడి నీళ్లు బలవంతంగా తాగమని ఛాలెంజ్ చేయడం కానీ చేస్తారు.   ఈ ఛాలెంజ్ వల్ల వచ్చే సరదా ఏంటో కానీ వేడి నీళ్లు పడ్డ ప్రతివాళ్లకీ ఒళ్లు బొబ్బలెక్కి హాస్పిటల్‌లో చేరే పరిస్థితులు వస్తున్నాయి. ఇక వేడి నీళ్లు తాగినవాళ్లకి అయితే నోరు, గొంతు కాలిపోయి మూగ, చెవిటివాళ్లుగా మారిపోతున్నారు. వేడి వేడి నీళ్లు తాగడం వల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా రికార్డు అవుతున్నాయి. వేడి నీళ్ల వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందని తెలియని పిల్లలు మాత్రం ఈ ఛాలెంజ్ మోజులో పడి స్నేహితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.     మనం వేడి చేసే నీళ్లు సాధారణంగా 120 డిగ్రీలు దాటితే SECOND DEGREE BURNS ఖాయం. అంటే చర్మపు పై పొరతో పాటు రెండో పొర కూడా దెబ్బతింటుంది. ఇలా ఏర్పడే గాయాలు ఓ పట్టాన తగ్గకపోగా చాలా బాధని కూడా మిగులుస్తాయి. ఇక 150 డిగ్రీలు దాటితే THIRD DEGREE BURNS తప్పవు. అంటే చర్మం లోపల ఉండే కొవ్వు కూడా దెబ్బతిని, నరాలు కూడా పాడైపోతాయి. ధర్డ్‌ డిగ్రీ బర్న్స్ వల్ల ఒకోసారి ఎముకలు కూడా బయటపడవచ్చు.     హాట్ వాటర్ ఛాలంజ్ వెనకాల ఇంత బాధ ఉందన్నమాట! ఇలాంటి సంఘటనలు జరిగాక తెగ బాధపడే కంటే ముందే ఇంట్లో పిల్లలకి వేడి నీళ్లతో ఎప్పుడూ చెలగాటం ఆడొద్దని ఓ గట్టి వార్నింగ్‌ ఇవ్వాలి. యూట్యూబ్‌లో వేడి నీళ్లు పడటం వల్ల కలిగే అనర్థాలు ఓసారి చూపిస్తే ఇక వాటి జోలికే పోకుండా ఉంటారు. - నిర్జర.  
  మనుషులన్నాక దెబ్బలు సహజం. పిల్లవాడు ఆడుకుంటూ తల బొప్పి కట్టించుకున్నా, పెద్దవాళ్లు బండి మీద నుంచి జారిపడినా... ఒంటి మీద దెబ్బ పడకుండా జీవితాన్ని ఈదలేం. కాకపోతే తల మీద దెబ్బ తగిలితే ఆ అనుమానమే వేరబ్బా! ఆ దెబ్బ వల్ల మెదడులో ఏదన్నా బ్లడ్‌ క్లాట్‌ అయిందేమో అని మనసు ఒకటే పీకుతూ ఉంటుంది. ఇక ఆ అనుమానాన్ని క్యాష్‌ చేసుకునేందుకు మన హాస్పిటల్స్ ఎలాగూ సిద్ధంగా ఉంటాయి. మెదడుకి కాస్త దెబ్బ తగిలి కళ్లు బైర్లు కమ్మాయని చెప్పగానే వెంటనే CT SCAN తీయించుకోమని భయపెడతారు డాక్టర్లు.   సీటీ స్కాన్ అంటే మాటలా! అది ఎక్కడ పడితే అక్కడ ఉండదు. దాన్ని ఏర్పాటు చేసుకున్న హాస్పిటల్స్ దగ్గరకి వెళ్లి తెగ నిరీక్షించాలి. ఆపై వేలకి వేలు ఫీజులు కట్టాలి. సీటీ స్కాన్ మిషన్ వల్ల వెలువడే రేడియేషన్‌కి మన శరీరాన్ని అప్పగించాలి. ఇంత చేసిన తర్వాత రిపోర్టు ఎలా వస్తుందో అని దేవుడికి తెగ మొక్కాలి. మరి ఈ హడావుడి అంతా లేకుండా సింపుల్‌గా ఒకే ఒక్క రక్తపు చుక్కతో మన మెదడులో ఉన్న పరిస్థితిని తెలుసుకోగలిగితే ఎంత బాగుండో కదా!   ఇదే ఆలోచన వచ్చింది జెనీవాలో కొంతమంది శాస్త్రవేత్తలకి. మన శరీరంలో ఏదన్నా తేడా జరిగినప్పుడు రక్తప్రసారంలో కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని ప్రొటీన్లు ఎక్కువగానో తక్కువగా స్రవిస్తాయి. వీటిని బయోమార్కర్స్ అంటారు. మెదడుకి దెబ్బ తగిలినప్పుడు కూడా ఇలాంటి బయోమార్కర్స్‌ ఏవన్నా విడుదల అవుతాయేమో కనుక్కుందామని ప్రయత్నించారు ఆ శాస్త్రవేత్తలు.   మెదడుకి దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఉన్న కణాలు ఏవన్నా దెబ్బ తింటే H-FABP అనే ప్రొటీను రక్తంలోకి ఎక్కువగా విడుదల అవుతుందని తెలిసింది. ఒక మిల్లీలీటరు రక్తంలో 2.5 కంటే ఎక్కువగా H-FABP ఉంటే లోపల ఏదో జరిగి ఉంటుందని అనుమానించవచ్చు. అప్పుడే మిగతా పరిక్షల జోలికి వెళ్లవచ్చని తేల్చారు. ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఎలాగైతే యూరిన్‌ శాంపిల్‌ ఉపయోగిస్తామో... అలాగే H-FABP ప్రొటీన్‌ ఎంత ఉందో తెలుసుకునేందుకు ఒక చిన్న స్ట్రిప్‌ మీద రక్తపు బొట్టు వేస్తే సరిపోతుందట.   సాధారణంగా ఇలాంటి పరిశోధనలు వినడానికి బాగానే ఉంటాయి కానీ మార్కెట్లోకి రావడానికి చాలాకాలం పడుతుంది. కానీ ఈ స్ట్రిప్‌ని మాత్రం వచ్చే ఏడాది నుంచి జనాలకి అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. - నిర్జర.  
  రోజూ మీరు తినే ప్రతి ముద్ద విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉంటున్నారా? మీరు తినే ఆహారంలో తగినన్ని పోషకపదార్థాలూ, వీలైనంత తక్కువ కొవ్వు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మంచిదే! కానీ మనసులో ప్రశాంతత కరువైతే మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేదంటున్నారు పరిశోధకులు...   మంచి ఆహారం- చెడు ఆహారం: అమెరికాలోని ఒహియోకి చెందిన కొందరు వైద్య నిపుణులు ఒక పరిశోధనను చేపట్టారు. ఇందులో భాగంగా వారు సగటున 53 ఏళ్ల వయసు ఉన్న కొందరు మహిళలను ఎన్నుకొన్నారు. వీరిలో కొందరు క్యాన్సర్‌నుంచి కోలుకున్నవారు ఉండగా, మరికొందరు ఆరోగ్యవంతమైన స్త్రీలూ ఉన్నారు. వీరికి రెండు రకాల ఆహారాన్ని అందించి... వాటిలో ఏదో ఒక ఆహారాన్ని తినమని చెప్పారు. ఇందులో ఒక రకం ఆహారంలో విపరీతమైన కొవ్వు పదార్థాలు ఉండగా, మరో రకం ఆహారంలో కొవ్వు శాతం వీలైనంత తక్కువగా ఉండేలా చూశారు.   ఒత్తిడి గురించిన వివరాలు: పరిశోధనలో పాల్గొన్నవారు పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల వారి రక్తంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అన్న విషయాన్ని తేల్చేముందు, పరిశోధకులు వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. నిన్న మీ రోజు ఎలా గడిచింది? మీలో ఒత్తిడిని విపరీతంగా పెంచే సంఘటనలు ఏవన్నా చోటు చేసుకున్నాయా? వంటి వివరాలను సేకరించారు. వీటి ఆధారంగా వారిలో ఎవరెవరు ఒత్తిడిలో ఉండి ఉంటారో గమనించారు.   ఆశ్చర్యం! పరిశోధకులు రెండు రకాల ఆహార పదార్థాలనూ తీసుకున్న అభ్యర్థుల నుంచీ రక్తాన్ని సేకరించారు. ఆ రక్తాన్ని పరీక్షించి... వారి రక్తనాళాలలో వాపునీ (inflammation), గడ్డలనీ (plaque) కలిగించే పరిస్థితులలో ఏమన్నా మార్పులు వచ్చాయేమోనని గమనించారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఒత్తిడిలో ఉన్నవారు మంచి ఆహారం తిన్నా కూడా వారి రక్తంలో ఏమంత ఆరోగ్యకరమైన పరిస్థితులు కనిపించలేదు. మనసు ప్రశాంతంగా ఉండి, మంచి ఆహారాన్ని తీసుకున్నవారిలోనే కాస్త మెరుగైన ఆరోగ్యాన్ని సూచించే లక్షణాలు తేలాయి.     ఇదీ పాఠం! పోషకాహారం మీద విపరీతమైన శ్రద్ధ చూపించేవారికి ఈ పరిశోధన కాస్త నిస్తేజాన్ని కలిగించడం సహజమే! ఎలాంటి ఆహారం తింటే మాత్రం ఏంటి ఉపయోగం అన్న అభిప్రాయం వారిలో కలగవచ్చు. కానీ పరిశోధకుల ఉద్దేశం పోషకాహార విలువని తక్కువ చేయడం కాదు. ‘మీరు ఆహారాన్నే కాదు, మనసుని కూడా పట్టించుకోండి’ అన్న సూచనను అందించడమే వీరి లక్ష్యం. శారీరిక ఆరోగ్యం మీద చూపించే శ్రద్ధని, మానసిక ప్రశాంతతకి కూడా కేటాయించండి అని హెచ్చరించడమే వీరి అభిప్రాయం.   - నిర్జర.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.