EDITORIAL SPECIAL
  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఈరోజు అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. "గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేదు. నీతిఆయోగ్‌లో ప్రధాని, కేంద్రమంత్రిమండలి సమక్షంలో ఇదే కాపీ చదివినిపించా. విభజనతో రాష్ట్రం అన్నిరంగాల్లో నష్టపోయింది. విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. హోదా వస్తేనే రాయితీలు వస్తాయి. ఏపీకి ప్రత్యేక హోదా జీవనాడి అయినందున జాప్యంలేకుండా వెంటనే ఇవ్వాలని ఐదు కోట్లమంది ప్రజల తరపున హోదా కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నా’’ అని జగన్‌ తెలిపారు. ఈ విషయమై మాజీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం  తాము అన్ని రకాల సహకరిస్తామని స్పష్టం చేశారు. 2014 మార్చిలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని.. హోదా ఇవ్వాలని  తాము ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. హోదాను  ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని.. హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. పేరు మార్చాం కానీ.. హోదాతో వచ్చే లాభాలతో ప్యాకేజీ ఇస్తున్నామని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.  దీంతో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నట్టుగా చంద్రబాబు తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ మాత్రం ప్రత్యేక హోదా పేరుకు ఒప్పుకోలేదన్నారు. ఫైనాన్స్ కమిషన్ సూచన మేరకు హోదాకు బదులుగా ప్యాకేజీ పేరు పెట్టారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ 29సార్లు ఢిల్లీకి వెళ్లానని.. రాజకీయంగా నష్టపోయినా రాష్ట్రం కోసం పోరాటం చేశామని ఆయన చెప్పారు.  ప్రత్యేక హోదా కోసం తాను సిన్సియర్‌గా పోరాటం చేసినట్టుగా  చంద్రబాబు చెప్పారు. ప్లానింగ్ కమిషన్‌కు వెళ్లి  ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పడం సరైంది కాదన్నారు. మీకు 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ప్రత్యేక హోదా సాధించాలని జగన్ ను చంద్రబాబు కోరారు.  తనపై బురద చల్లితే ఏపీకి ప్రత్యేక హోదా రాదని  ఆయన అభిప్రాయపడ్డారు.  చంద్రబాబు ప్రసంగానికి జగన్ కౌంటరిచ్చారు. చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ కు ఒక్క లేఖ కూడ రాయలేదన్నారు.  చంద్రబాబు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా పోయిందని జగన్ వ్యాఖ్యానించారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చే వరకు ప్రత్యేక హోదాపై తీర్మానం చేయని విషయాన్ని జగన్ గుర్తు చేశారు.
  ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమయింది. తీర్మానాన్ని వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రవేశ పెట్టారు. విప్ బూడి ముత్యాలనాయుడు బలపరిచారు. ఇద్దరూ తమ ప్రసంగంలో.. టీడీపీ పాలనపై అనేక విమర్శలు చేశారు. ఆ తర్వాత టీడీపీ తరపున అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌పై అచ్చెన్నాయుడు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేలన్నట్లుగా సాగింది.  పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అంచనాలు పెంచి.. టీడీపీ సర్కార్ దోపిడీకి పాల్పడిందని కాంట్రాక్టర్లకు మేలు చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ విమర్శలపై అచ్చెన్నాయుడు సూటిగా స్పందించారు. అంచనాలు తగ్గించి.. ప్రాజెక్టును పూర్తి చేయాలని సవాల్ చేశారు. అంచనాలు తగ్గించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే సన్మానం చేస్తామని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని చంద్రబాబు తప్పు చేశారన్న వైసీపీ నేతలకూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అడిగారో, ఇచ్చారో ప్రభుత్వం దగ్గర రికార్డులుంటాయన్నారు. పట్టిసీమపైనా వైసీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. అవినీతి జరిగిందన్నారు. ఆ ప్రాజెక్ట్ పై పెట్టినంత దృష్టి పోలవరంపై పెడితే.. ఈ పాటికే ప్రారంభమయ్యేదని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదనుకుంటే అ ప్రాజెక్ట్ ను ఉపయోగించడం మానేయాలని సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం.. కేంద్రానికి వదిలేయాలని నిర్ణయించుకుని.. ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నారని గుర్తు చేశారు.
  గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ఈరోజు చేపట్టిన ‘రాజన్న బడిబాట' కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ఆశీర్వదించిన జగన్ ఓ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మరికొందరు చిన్నారుల చేత కూడా పలక, బలపం పట్టించి చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని అక్షరాలు దిద్దించారు. పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో ‘రాజన్న బడిబాట' నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్షరాభ్యాసం చేయించిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. చిన్నారులతో కలిసి గడపడం, వాళ్లు బాగా చదువుకోవడం తన మనసుకు నచ్చిన విషయమని తెలిపారు. తన మనసుకు నచ్చిన పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘పిల్లలు బడికి పోవాలి. బడుల నుంచి కాలేజీకి పోవాలి. అక్కడి నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ల వంటి పెద్దపెద్ద చదువులు చదవాలి. ఈ చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులపాలు కాకూడదు అన్నదే నా ఆశ' అని జగన్ అన్నారు. 'ప్రతీ తల్లికి, ప్రతీ చెల్లికి నేను మాటిచ్చా.. మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చింది. అందుకు సంతోషంగా ఉంది. ఇవాళ నేను ప్రతీ తల్లి, చెల్లికి ఇక్కడి నుంచి ఒకేఒక మాట చెబుతున్నా. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను మీరు బడికి పంపండి. ఏ స్కూలుకు పంపించినా ఫరవాలేదు. బడికి పంపించినందుకు వచ్చే ఏడాది జనవరి 26 నాటికి ఏపీ పండుగదినం చేస్తాం. జనవరి 26వ తారీఖున పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లి చేతిలో రూ.15,000 పెడతాం. ఏ తల్లి కూడా తన బిడ్డను చదివించేందుకు కష్టపడకూడదు అనే తపనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం’ అని జగన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంత అధ్వానంగా తయారు అయ్యాయి కాబట్టే ఏ తండ్రి, తల్లి అయినా తమ పిల్లలను గవర్నమెంటు పాఠశాలలకు పంపడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. 'అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల ఫీజులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఎల్ కేజీలో చేర్పించాలంటే రూ.20,000 అడుగుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో అయితే రూ.40,000 తీసుకుంటున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలను చదవించుకోవాలంటే తల్లిదండ్రులు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి. ఇవన్నీ మార్చేస్తామని నేను మీకు మాట ఇస్తున్నా. నేను ప్రజలను 2 సంవత్సరాల సమయం అడుగుతున్నాను. ఈ రెండేళ్లలో స్కూళ్లను అభివృద్ధి చేసి చూపిస్తాను. పాఠశాలల్లో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తాం.’ అని జగన్ భరోసా ఇచ్చారు.
ALSO ON TELUGUONE N E W S
'నా లైఫ్ లో నీలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు' - ఓ బేబీ ట్రైలర్ లో సమంతతో నాగశౌర్య చెప్పే డైలాగ్! అందుకు బదులుగా 'చూసి ఉండవులె నీది చిన్న వయసే కదా! ఎంతమందిని చూసి ఉంటావ్' అంటుంది సమంత. ట్రైలర్ చూశాక... తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు చూడలేదని ప్రేక్షకులు అనుకోవాల్సిందే. 70 ఏళ్ల బామ్మ పాతికేళ్ల పడుచు అమ్మాయిలా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అవ్వడానికి కొరియన్ సినిమా రీమేక్ అయినా.... ట్రైలర్ తో కనెక్ట్ కావడానికి కారణం మాత్రం కాన్సెప్ట్ కాదు, సమంతే. రెండున్నర నిమిషాలు కూడా లేని ట్రైలర్ లో మంచి కామెడీ టైమింగ్ కల యాక్టింగ్ తో నవ్వించింది. కొన్ని క్షణాలు ఏడిపించింది. డాన్సులతో అలరించింది. మొత్తానికి నటిగా విజృంభించింది. నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కూడా చక్కటి అభినయంతో అలరించారు. అందరి టైమింగ్ భలే కుదిరింది. దర్శకురాలు నందిని రెడ్డి చక్కగా తీశారు. సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలు పెంచుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం `రాజుగారిగ‌ది` ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే.   ఆ సినిమాకు ఫ్రాంచైజీగా `రాజుగారి గ‌ది 3` గురువారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది.  ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. `రాజుగారిగ‌ది 3`లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అశ్విన్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఊర్వ‌శి, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ఘోష్ ఇత‌ర పాత్ర‌ల్లో  న‌టిస్తున్నారు. శుక్ర‌వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్‌, గౌతంరాజు ఎడిటింగ్‌, సాహి సురేశ్ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. `రాజు గారి గ‌ది` త‌ర్వాత రాజుగారి గ‌ది 2` సినిమా  నాగార్జున‌, స‌మంత తో చేసాడు ఓంకార్ . కానీ, ఆ సినిమా పెద్ద‌గా వ‌ర్క‌వ‌ట్ కాలేదు. మ‌రి ` రాజుగారి గ‌ది 3` ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి అంటున్నారు సినీ జ‌నాలు.   ఇక ఈ సినిమాలో త‌మ‌న్నా క్యార‌క్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంది? ఈ సినిమా ఆమె ఒప్పుకోవ‌డానికి అంత‌గా మెప్పించిన అంశం ఏంట‌న్న చ‌ర్చ ఇప్పుడు అంద‌రిలో మొద‌లైంది. ఈ సినిమాను  ఈ ఏడాది లోనే రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
స‌మ్మ‌ర్ లో రిలీజైన `చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చాడు మెగా హీరో సాయితేజ్. ప్ర‌జంట్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తీరోజు పండ‌గే` అనే ఓ సినిమా చేయ‌డానికి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సాయితేజ్ మ‌రో సినిమాకు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం అందుతోంది.  ఆ వివ‌రాల్లోకి వెళితే గ‌తంలో ప్ర‌స్తానం వంటి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ని డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా మ‌రోసారి అటువంటి డిఫ‌రెంట్ అండ్ సీరియ‌స్ స‌బ్జెక్ట్ ను రెడీ చేస్తాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో తేజుని సంప్ర‌దించి స్క్రిప్ట్ ను కూడా వినిపించాడ‌ట దేవా. తేజుకి కూడా  క‌థ నచ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పాడ‌ని టాలీవుడ్ టాక్. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని విష‌యాలు వెలువ‌డే అవ‌కాశం ఉంది. వ‌రురుస ప‌రాజ‌యాల త‌ర్వాత `చిత్రాల‌హ‌రి` తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన తేజు. ఇప్పుడు వ‌రుస‌గా కంటెంట్ ఉన్న డైరెక్ట‌ర్స్ తో డిఫ‌రెంట్ మూవీస్ చేయ‌డం అత‌నికి క‌లిసొచ్చే అంశ‌మే.
 వ‌రుస‌గా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవ‌డంతో కొంత కాలం గ్యాప్ ఇచ్చాడు యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌. క‌థల ఎంచుకునే విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇప్ప‌టికే దిల్ రాజు బేన‌ర్ లో `ఇద్ద‌రి లోకం ఒక‌టే` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభించుకుంది. ఇదిలా ఉంటే  `గుండెజారి గ‌ల్లంత‌య్యిందే` సినిమాతో ద‌ర్శ‌కుడు ప‌రిచ‌య‌మై తొలి సినిమాతోనే స‌క్సెస్ అందుకున్న విజ‌య్ కుమార్ కొండ ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మాణంలో రాజ్ త‌రుణ్ ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ రోజు పూజా  కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జ‌రిగాయి. ఇదిలా ఉంటే `సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు` చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గ‌విరెడ్డి కి మ‌రో సారి అవ‌కాశం క‌ల్పించాడ‌ట రాజ్ త‌రుణ్‌. ఈ సినిమా అన్న‌పూర్ణ బేన‌ర్ లో రూపొంద‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. న‌వంబ‌ర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. ఇక విజ‌య్ కుమార్ కొండ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే సినిమాలో రాజ్ తరుణ్ స‌ర‌స‌న అదితి రావ్ ని హీరోయిన్ గా తీసుకునే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది.  ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: ఆండ్రూస్‌, మాటలు: నంద్యాల రవి, ఆర్ట్‌: రాజ్‌కుమార్‌, కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, మేకప్‌: శివ, కాస్ట్యూమ్స్‌: నాగులు, స్టిల్స్‌: ఆనంద్‌, పబ్లిసిటీ: ధని ఏలె, నిర్మాత: కె.కె. రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.
తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా చేస్తున్నాడు. రామ్ చరణ్ 'ధృవ' మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ (ఆది) కూడా హీరోగా చేస్తున్నాడు. తెలుగులో దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్ అప్పుడప్పుడూ సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ విల‌న్‌గా చేయలేదనుకుంట. ఇప్పుడో మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే క్రూరమైన విలన్ క్యారెక్టర్ చేశారు. 'లండన్ బాబులు' ఫేమ్ రక్షిత్ హీరోగా నటిస్తున్న సినిమా 'పలాస'. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఉత్తరాంధ్రలో 1970 కాలంలో మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అందులో రఘు కుంచె విలన్‌గా చేశారు. అన్నట్టు... ఈ సినిమాకు ఆయనే సంగీత దర్శకుడు.
  అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు& కో వేసిన తప్పటడుగు కొన్ని లక్షల ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగా పడేలా చేశాయని చెప్పవచ్చు. అగ్రిగోల్డ్ సంస్థలో కొన్ని లక్షల కుటుంబాలు డిపాజిట్ చేసి మోస పోయాయి. అయితే అప్పుడు బాబు సర్కార్ అమలు కానీ హామీని ఇచ్చి సమస్యని నెత్తి మీదకు తెచ్చుకుంది. డిపాజిటర్ల డబ్బులన్నీ ప్రభుత్వమే తిరిగిస్తుందని చెప్పింది. దీంతో విపక్షాలు ఈ విషయంలో బాబుని టార్గెట్ చేశాయి. బాబు సర్కార్ డబ్బులు చెల్లించలేకపోవడం, విపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండడంతో.. డబ్బులు వస్తాయన్న ఆశతో ఉన్న డిపాజిటర్లకు బాబు సర్కార్ మీద వ్యతిరేకత మొదలైంది. అసలు డిపాజిటర్లకు డబ్బులు ప్రభుత్వం తిరిగి ఇవ్వాలన్న సలహా బాబుకి ఎవరు చెప్పారో కానీ.. ఎంతో అనుభవం ఉన్న బాబు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సలహాను పాటించడం ఆయన చేసిన పెద్ద తప్పు. అసలు ఓ ప్రైవేట్ సంస్థ మోసం చేస్తే ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి?. అంటే ప్రైవేట్ సంస్థలు మోసం చేసుకుంటూ పోతుంటే.. ప్రభుత్వం అవి చెల్లించుకుంటూ ఖజానా ఖాళీ చేసుకుంటూ రావాలా?. అసలే లోటు బడ్జెట్.. దానికి తోడు ఇలాంటి హామీలు ఇచ్చి కొత్త తలనొప్పులు తెచ్చుకున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో నిజంగా బాధితులకు న్యాయం చేయాలనుకుంటే.. అది ఆ సంస్థ ముక్కు పిండి వసూలు చేసి ఆదుకోవాలి. చట్టం ద్వారా ఆ సంస్థ ఆస్తులు, అప్పులు అంచనా వేసి.. ఆస్తులను వేలం వేసి బాధితులకు డబ్బు చెల్లించాలి. కానీ ముందుకి ముందే పోయేదేముంది మాటేగా అనుకొని డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. తీరా అది సాధ్యపడక.. విపక్షాల నుంచి విమర్శలు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అంతేకాదు అగ్రిగోల్డ్ ఆస్తులపై అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల కన్ను పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టడంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. మొత్తానికి అగ్రిగోల్డ్ వ్యవహారం పుణ్యమా అని టీడీపీ.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొని ఎన్నో లక్షల ఓట్లను దూరం చేసుకుంది. అధికారానికి దూరమైంది.  
  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడుగా వెళ్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, అధికారం లోకి వచ్చిన వెంటనే ఆయా వర్గాల వారికి మేలు చేసేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ లో ప్రభుత్వ, ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొనడం కేసీఆర్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ నూతన మంత్రి వర్గ సమావేశం లో ప్రభుత్వ ఉద్యోగులకు ఐ ఆర్ ప్రకటించిన జగన్ , సీపీస్ రద్దుకు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు తక్షణమే తమకు ఐ ఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సీపీస్ పెన్షన్ స్కీమ్ రద్దుకు సిఫార్స్ చేయాలని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, తమ డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశించిన ఉద్యోగ సంఘాలకు నిరాశే ఎదురయింది. మంత్రి వర్గ సమావేశ అనంతరం మీడియా తో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఉద్యోగుల సమస్యల అంశాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించగా లేనిది, తెలంగాణ సర్కార్ ఎందుకు ప్రకటించదని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏపీ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోవడంతో , తెలంగాణ ఉద్యోగులు మౌనంగా ఉన్నారు. కానీ జగన్ ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడంతో తమకు కూడా ఐఆర్ ప్రకటించాల్సిందేనని తెలంగాణ ఉద్యోగులు భీష్మించుకు కూర్చున్నారు. అదేవిధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ సదుపాయం కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది నేటి నుంచే అమలులోకి వచ్చింది. క్షణం తీరికలేకుండా పగలు, రాత్రి, ఎండ, వాన అని తేడా లేకుండా విధినిర్వహణలో ఉండే ఏకైక ప్రభుత్వ శాఖ పోలీస్‌ శాఖ. వీక్లీ ఆఫ్ లేకపోవడంతో ఉద్యోగ రీత్య మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కుటుంబజీవితాన్ని కూడా కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు జగన్ వీక్లీ ఆఫ్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. ఏపీ పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం కూడా కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ అంటూ కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు కానీ దానిని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇప్పుడు ఏపీ సీఎం ఆచరణలోకి తెచ్చి చూపడంతో.. తెలంగాణ పోలీసు వర్గాలు మాకెప్పుడు వీక్లీ ఆఫ్ అంటూ కేసీఆర్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
  చంద్రబాబుకి మెజారిటీ ఉద్యోగులు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆ విషయం రుజువైంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు.. ఉద్యోగులు తమకి అనుకూలంగా ఉన్నారని, ఈసారి వారంతా టీడీపీ పక్షానే నిలుస్తారని భావించారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక బాబు అంచనా తప్పని తేలిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లో కూడా వైసీపీనే సత్తాచాటింది. ఉద్యోగులు బాబుకి వ్యతిరేకంగా ఉన్నారని తేలిపోయింది. అయితే బాబు.. ఉద్యోగులు తమ పక్షాన ఉన్నారని నమ్మడానికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ అశోక్ బాబు అని చెప్పాలి. ఉద్యోగ సంఘాల నేత అని, ఉద్యోగులంతా తమ పక్షాన నిలుస్తారన్న ఆశతో.. బాబు అశోక్ ని నెత్తిన పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ కట్టబెట్టారు. అశోక్ కూడా 'మీకు నేను ఉన్నాను.. ఉద్యోగులంతా మనవైపే ఉంటారు' అని చెప్పారు. ఇంకేముంది బాబు ఆహా ఓహో అంటూ గాలిలో తేలిపోయారు. గంపగుత్తగా ఓట్లన్నీ తమకే పడతాయి అనుకున్నారు. కానీ ఫలితాలు పూర్తీ భిన్నంగా వచ్చాయి. పార్టీ వల్ల అశోక్ కి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కానీ, అశోక్ వల్ల పార్టీకి అసలు ఓట్లే రాలేదు. ఆయన ఉద్యోగుల ఓట్లు గానీ, తన సామజిక వర్గం ఓట్లు గానీ రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. బాబు ఆయన్ని గుడ్డిగా నమ్మి భ్రమల్లోకి వెళ్లారు. తీరా ఫలితాలు చూసాక కళ్ళు బైర్లు కమ్మాయి. బాబు మీద ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు కానీ.. గడిచిన ఐదేళ్ళలో ఒక సంఘటన మాత్రం ఉద్యోగుల మీద బాగా ప్రభావం చూపిందనే అభిప్రాయం ఉంది. అదే ఎమ్మార్వో వనజాక్షి పై చింతమనేని ప్రభాకర్ వర్గం దాడి చేయడం. ఆ విషయంలో బాబు.. చింతమనేని పక్షాన నిలిచారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అశోక్ బాబు వంటి వారిని గుడ్డిగా నమ్మకం, చింతమనేని వంటి వారిని వెనకేసుకురావడం వంటివి బాబు కొంపముంచాయనే చెప్పాలి.  
  "పేరు గొప్ప.. ఊరు దిబ్బ" అనే సామెత వినే ఉంటారు. ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన బాబు.. ప్రపంచంలోని గొప్ప రాజధానుల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుందని.. అమరావతిని ఓ సింగపూర్, ఓ జపాన్ చేసి చూపిస్తానని చెప్పారు. దీంతో రాజధానిపై ఏపీ ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ బాబు ఆ అంచనాలు అందుకోలేకపోయారు. దీంతో టీడీపీ ఓటమిలో రాజధాని కూడా ఓ కారణంగా మిగిలిపోయింది. తాత్కాలిక భవనాలు పేరిట పలు భవనాలు నిర్మించారు. అయితే వాటి నిర్మాణం కూడా నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్న ఇంజినీర్లని కాదని విదేశాల నుండి ఇంజినీర్లను తెప్పించారు. పోనీ వారితో అయినా పూర్తిగా డిజైన్లు చేయించారా అంటే అదీ లేదు. వాస్తు నిపుణులను, సినీ దర్శకులను రాజధాని డిజైన్లలో భాగమయ్యేలా చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమాలో సెట్లు బాగున్నాయి కదా అని రాజధానికి డిజైన్లు గీయండి అని అడిగేసరి.. బాబుపై సెటైర్లు వచ్చాయి. దానికి తోడు వాస్తు ఒకటి. అసలు రాజధాని నిర్మాణంలో వాస్తు ఏంటి?. ఇంజినీర్లు అక్కడి పరిస్థితులను బట్టి డిజైన్ చేస్తారు. అంతేకాని వాస్తు పేరిట ఎవరో వచ్చి అక్కడ ఇది, ఇక్కడ అది అని ఏదేదో చెప్తుంటే ఇక ఇంజినీర్లు డిజైన్లు ఏం చేస్తారు?. ఒకవేళ బాబు రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. అమరావతిని ఎంతలా అభివృద్ధి చేసేవారో తెలీదు కానీ.. మొదటి టర్మ్ లో మాత్రం డిజైన్ పేరిట కాలయాపన చేసారని, గ్రాఫిక్స్ రాజధాని అని.. అసలు అది అమరావతి కాదు భ్రమరావతి అని విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు రాజధాని భూములు విషయంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. వీటిని తిప్పి కొట్టడంలో బాబు & కో విఫలమయ్యారు. మరోవైపు విపక్షాలు.. అమరావతి అంతా భ్రమరావతి అని, అసలు ఒక్క ఇటుక కూడా పడలేదని పదేపదే విమర్శలు చేసాయి. ఈ విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మొత్తానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానన్న బాబు.. ఏమీ చేయలేదన్న పేరు మూటగట్టుకొని పరాజయం పాలయ్యారు.
  కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. "రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే!’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా రాజగోపాల్‌రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుసుకునేందుకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి.. ఆ పార్టీ పెద్దలు బంపరాఫర్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. రాష్ట్రం నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యాన్ని పెంచితే, ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లి, తదుపరి ఎన్నికల్లో లాభం కలుగుతుందని రాజగోపాల్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న పక్షంలో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ మొదలైంది. అయితే వెంట్‌రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెబుతున్నారు. మీ సోదరుడు పార్టీ మారాలనుకుంటున్నారు మీ సంగతేమిటి అనే ప్రశ్నకు వెంకట్ రెడ్డి ఏది ఎమైనా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాబోయే రోజుల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పార్టీ మార్పుపై తుది నిర్ణయం సోదరుడిదేనని, అయినా ఒక కుటుంబంలోని వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో ఉండటం సహజమేనని వెంట్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా కోమటిరెడ్డి సోదరులు వారి భవిష్యత్తు కోసం వేసిన ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ద్వితీయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఎవరైనా సరే భవిష్యత్తులో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాగలరు. అందుకే రెండు పార్టీల్లోనూ తమ కుటుంబం ఉంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని కొమటిరెడ్డి సోదరులే ఈ ప్లాన్ వేశారని.. ఒక్కసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరిది పైచేయి అనేది తేలగానే ఇరువురు అదే పార్టీలో ఉండిపోవాలనేది వారి ప్లాన్ అయ్యుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
  ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే మాట మార్చడం కూడా టీడీపీ ఘోర ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. విభజన గాయం మానాలంటే ప్రత్యేకహోదానే ఔషదమని ఏపీ ప్రజలు భావించారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని, ఏపీకి న్యాయం జరగాలంటే హోదా కావాల్సిందేనని ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నారు. మొదట్లో బీజేపీతో దోస్తీ సమయంలో ప్రజలతో పాటు బాబు కూడా హోదా కావాలన్నారు. బీజేపీ కూడా పార్లమెంట్ సాక్షిగా, తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి మాట మార్చి.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నది. దీన్ని వ్యతిరేకించి హోదా కోసం పట్టుపట్టాల్సిన బాబు.. బీజేపీ నిర్ణయానికి తలొగ్గి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పాటు, ఉద్యమ సంఘ నేతలు, విద్యార్థులు.. ప్యాకేజీని వ్యతిరేకిస్తూ.. హోదా గళాన్ని బలంగా వినిపించారు. అయితే బాబు మాత్రం హోదా ఏమన్నా సంజీవనీనా అంటూ వారి మీద విరుచుకుపడ్డారు. ఇక కొందరు టీడీపీ నేతలైతే హద్దుదాటి చులకన వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేనా.. హోదా కోసం పోరాడిన వారిని బాబు అరెస్ట్ లు కూడా చేయించారు. మరోవైపు అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చారంటూ బీజేపీ నేతలను ఆకాశానికెత్తడాలు, సన్మానాలు చేయడాలు సరేసరి. ఈ చర్యలతో.. హోదా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు.. బాబు మీద, టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. రోజులు గడిచాయి. హోదా మీద ఏపీ ప్రజలకు ఆశ మాత్రం చావలేదు. ఇంతలో కొన్నాళ్ళకు ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చింది. అప్పటి నుంచి చంద్రబాబు స్వరం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు బీజేపీ నేతలను పొగుడుతూ, సన్మానాలు చేసిన బాబు.. బీజేపీ మోసం చేసిందని, రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ పోరాటం మొదలు పెట్టారు. హోదా ఏమన్నా సంజీవనీనా అని అడిగిన బాబు.. బీజేపీకి దూరమైన తరువాత హోదా కావాల్సిందే అంటూ అడగడం మొదలు పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీ ఏమో తాము ఏపీకి ఎంతో చేసామని, లెక్కలు అడిగేసరికి బాబు మాట మర్చి మా మీద విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. మరోవైపు విపక్ష నేతలు కూడా యూ-టర్న్ బాబు అంటూ పదేపదే విమర్శలు చేశారు. దీంతో బాబు మాటలు మారుస్తున్నారన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదీగాక గతంలో హోదా అడిగిన వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసి, వారిని అరెస్ట్ లు చేయించిన బాబు.. తరువాత హోదా కావాలని అడిగితే ప్రజలకు నమ్మకం కలగలేదు. అదే బాబు బీజేపీ ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడే.. దాన్ని వ్యతిరేకించి కచ్చితంగా హోదానే కావాలని పట్టుబట్టి పోరాడి ఉంటే.. ప్రజలను నిజమైన నాయకుడిలా కనిపించేవాడు. ఇలా యూటర్న్ బాబు అని పేరు తెచ్చుకునేవాడు కాదు.  
నలుగురిలో ఉన్నప్పుడు ఎలాంటి పదాలు ఉపయోగించాలి? అని మనకి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తుంటారు. అసభ్యంగా, అశ్లీలంగా తోచే పదాలని నలుగురిలోనూ వాడకపోవడం సంస్కారం అని చెబుతూ ఉంటారు. అందుకే మన పదాలన్నీ ఆచితూచి ఉంటాయి. ఏవన్నా తేడాపాడాగా పదం బయటకు రావాలని ప్రయత్నిస్తే... దానిని లోలోపలే కప్పెట్టేస్తాం. తరచూ బూతులు మాట్లాడేవారిని అనాగరికులుగా, మొరటు మనుషులుగా భావిస్తుంటాం. కానీ అలా ఏది పడితే అది మాట్లాడేవారిలో నిజాయితీ పాలు ఎక్కువ అని చెబుతోంది ఓ పరిశోధన!!!   ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అసభ్యపదజాలానికీ, నిజాయితీకి మధ్య ఉండే పొంతనని గమనించాలని అనుకున్నారు. ఇందుకోసం వారు కొన్ని వందల మందిని ఎన్నుకొని వారి మాటతీరు మీద అనేక ప్రశ్నలు గుప్పించారు. ఆ తరువాత వారు చెబుతున్నదానిలో ఎంతవరకూ నిజం ఉందో తెలుసుకునేందుకు lie testను నిర్వహించారు. తమకి కోపం, కసి, చిరాకు, ఆశ్చర్యం వంటి అనుభూతులను వ్యక్తపరిచేటప్పుడు, వీరిలో కొందరు బూతుమాటలని గుప్పించడాన్ని గమనించారు. చిత్రం ఏమిటంటే వీరిలో నిజాయీతీపాళ్లు కాస్త ఎక్కువగా ధ్వనించాయట.   బూతుమాటలకీ నిజాయితీకీ మధ్య సంబంధం ఏమిటన్న ప్రశ్న రావచ్చు. దీనికి పరిశోధకులు స్పష్టమైన జవాబుని అందిస్తున్నారు. మనసులో ఏదీ దాచుకోనివారు, అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాలని ప్రయత్నించేవారు... తమకి ఏది తోస్తే అది మాట్లాడేసే స్వభావాన్ని కలిగి ఉంటారట. సహజంగానే అందులో బూతులు కూడా చోటు చేసుకోవచ్చు.   పైన పేర్కొన్న ప్రయోగం ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు పరిశోధకులు మరో పరీక్షని కూడా నిర్వహించారు. ఇందుకోసం 75,000 మంది ఫేస్బుక్ యూజర్స్ని ఎన్నుకొన్నారు. వీరి ఆన్లైన్ సంభాషణల్లోని పదాలు ఎలా ఉన్నాయో గమనించారు. వీటిలో కూడా, మొరటు పదాలు వాడిన సంభాషణల్లో నిజాయితీ ఎక్కువగా కనిపించింది. ఇంతేకాదు! చీటికీ ఏదన్నా విషయం చెప్పేముందు ఒట్టుపెట్టుకునేవారిలో కూడా నిజాలను చెప్పే అలవాటు ఉందని తేలింది. ‘నా మాటలో నిజాయితీ ఉంది. నన్ను నమ్ము!’ అని ఒప్పించేందుకే వారు ఇలా ఒట్లు పెట్టుకుంటారట.   అదీ విషయం! అసభ్యంగా మాట్లాడటం, ఒట్టు పెట్టుకోవడం వెనుక ఇంత కథ ఉందన్నమాట. అలాగని ఇది అందరికీ వర్తిస్తుందనుకోవడానికి లేదు. పనిగట్టుకుని మరీ అసభ్యంగా మాట్లాడాల్సిన అగత్యమూ లేదు. మనుషుల వ్యక్తిత్వాలని పరిశీలించేందుకే కానీ, ఇలా ఉంటే మంచిది అని చెప్పడం ఈ పరిశోధన ఉద్దేశం కాదు. మనిషిలో సంస్కారం ఉంటే ఒట్టు పెట్టుకోకుండానే నిజాన్ని చెప్పగలడు. గుండెల్లో ధైర్యం ఉంటే అసభ్యతకు తావులేకుండానే, నిజాన్ని కుండబద్దలు కొట్టేయగలడు. - నిర్జర.
మనిషి నుదురు విశాలంగా ఉంటే అది అతని పెద్ద మెదడుని సూచిస్తుందనీ, పెద్ద మెదడు తెలివితేటలని సూచిస్తుందనీ పెద్దలు చెబుతూ ఉండేవారు. ఇందులో నిజానిజాల గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు పడుతూనే ఉన్నారు. ఆ సంగతేమో కానీ ఇప్పుడు మెదడు ఆకారాన్ని పరిశీలిస్తే, సదరు మనిషి మనస్తత్వం బయటపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు! ఆ మనస్తత్వం ఆధారంగా భవిష్యత్తులో అతను ఎదుర్కోబోయే మానసిక సమస్యలని కూడా అంచనా వేయవచ్చని ఆశిస్తున్నారు.   ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మెదడులో ఉండే కార్టెక్స్‌ అనే ముఖ్యభాగం తీరుని బట్టి వ్యక్తుల ధోరణిని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఈ కార్టెక్స్‌ ఎంత మందంగా ఉంది, ఎంత పెద్దదిగా ఉంది, ఎంతవరకు ముడుచుకుని ఉంది అనే మూడు అంశాల ఆధారంగా ఐదు రకాల లక్షణాలను పసిగట్టారు. నిరాశావాదం (neuroticism), కలుపుగోలుతనం (extraversion), విశాల దృక్పథం (openness), పరోపకారం (altruism), ఆత్మస్థైర్యం (conscientiousness) అనేవే ఆ ఐదు లక్షణాలు.   ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు దాదాపు 500 మంది వ్యక్తుల మెదడు తీరుని గమనించారు. కార్టెక్స్‌ బాగా మందంగా ఉన్న వ్యక్తులలో నిరాశావాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులు సహజంగానే మానసికమైన రోగాలను కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా విశాలమైన దృక్పథం ఉన్న మనుషులలో కార్టెక్స్ తక్కువ మందంతోనూ, ఎక్కువ వైశాల్యంతోనూ కనిపించింది.   మెదడు ఓ చిత్రమైన అవయవం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ యవ్వనం వచ్చేంతవరకూ కూడా ఆ మెదడులో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మన ఆలోచనా తీరు, మన అలవాట్లు కూడా మెదడు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. మెదడులోని కార్టెక్స్ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకోవాలంటే దానికి ఒకే ఉపాయం ఉంది. అది తన మందాన్ని తగ్గించుకుని వైశాల్యాన్ని పెంచుకోవాలి. అలా పెరిగిన వైశాల్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముడతలు పడాలి.   ఒక్క మాటలో చెప్పాలంటే రబ్బరు షీటుని మడిచిపెట్టినట్లుగా కార్టెక్స్‌ కూడా మడతలు మడతలుగా మారడం వల్ల తనకి ఉన్న ప్రదేశంలోనే ఎక్కువ విస్తరించగలుగుతుందన్నమాట. మెదడులో ఇలాంటి మార్పులు వచ్చేందుకు మన ఆలోచనలు కూడా దోహదపడతాయని ఇప్పుడు తెలిసిపోయింది. మనుషులు పెద్దవారయ్యే కొద్దీ వారిలో తిరుగుబాటు ధోరణి, బాధ్యతారాహిత్యం, నిరాశావాదం తగ్గడానికి కారణం కూడా మెదడులో వచ్చే మార్పులే కారణం అంటున్నారు. అదీ విషయం! అంటే మన మెదడు శుభ్రంగా ఎదగాలంటే ఆలోచనల్లో పరిపక్వత ఉండాలన్నమాట!   - నిర్జర.
సమసోఖ్ఖ దుఖ్ఖ పరివడ్ఢిఆణం కాలేన రూఢ పెమ్మాణం  మిహుణాణం మర ఇ  జం తం జిగయి యీరం ము అం హోయి.  (గాధా-1-42) గాధాసప్తశతిలోని యీ గాధ, భార్యాభర్తల గాఢమైన ప్రేమకు అద్దం పడుతున్నది. 'సుఖదుఖాలను సమానంగా పంచుకుంటూ జీవించిన దంపతులలో, ముందెవరు మరణించినా, వారే జీవించి ఉన్నవారితో సమానం. మిలిగినవారు బ్రతికిఉన్నా, జీవన్మృతులే' అంటున్న పై గాధ, దాంపత్య జీవిత సార్థక్యతను స్పస్టంగా వివరిస్తున్నది. దాదాపు యేడు వందల సంవత్సరాల క్రితం రచనైనా, అప్పటి గృహస్థ జీవనంలోని విలువలను ఇప్పటి జంటలకు బోధిస్తున్నట్టూ, ఇలాగే మీరూ ఉండాలి సుమా' అని హెచ్చరిస్తున్నట్టూ ఉంది కదూ!              గాధాసప్తశతిలోని మరో పామరుడైన   రైతు,  తన భార్య గతించటాన్ని తట్టుకోలేక, ఆ శూన్యమైన ఇంటికి వెళ్ళేందుకూ ఇస్థపడక,పనేమీ లేకున్నా, పొలంలోనే కాలం గడుపుతున్నాడట! (గాధా-2-69) తనలో ఇంకా సజీవంగానే ఉన్న భార్య జ్ఞాపకాలను చెరిపివేయటం  సుతరామూ ఇష్టం లేదు పాపం ఆ అమాయకునికి!! ఈ నాటి దాంపత్య జీవితం,ఇటువంటి గాఢానుభూతులకు తావిచ్చేలా  లేదేమోననిపిస్తుంది. కారణం- ఆర్థిక పరమైన పరస్పరాధారాలుగానే  ఉంటున్న జీవితాలు మనవి. డబ్బుతో వచ్చే సౌఖ్యాలు తప్పనిసరి బంధాలను ప్రోత్సహిస్తున్నాయేమోననిపిస్తుంది కూడా!  యేది యేమైనా, ప్రేమ వివాహాలలోనూ, పెద్దలు కూర్చి చేసిన పెళ్ళిళ్ళలోనూ, 'ఇగో' అన్న గుణాన్ని అదుపులో ఉంచుకోకపోతే అన్నీ అనర్థాలే నన్నదీ నగ్న సత్యం. ఎంతగానో ప్రేమించుకుని, ఎన్నెన్నో త్యాగాలు చేసి మరీ పెళ్ళాడిన జంటలు కూడా యీ సమస్యతోనే విడిపోవటం నేను చూసిన సత్యం. ఇరువురి గుణాలూ, అలవాట్లూ అన్నీ అర్థమయ్యాకే పెళ్ళిళ్ళు చేసుకున్నా, కొద్ది రోజుల్లోనే  వీళ్ళెందుకు విడిపోతున్నారో అర్థం కాదు. అంటే, పెళ్ళికిముందు, వీరిద్దరిలోనూ ఉన్నది  కేవలం  ఆకర్షణేనా అని అనుమానమూ వస్తుంది కదా!  అంతేకాక, చాలావరకూ ప్రేమ జంటలకు   తల్లిదంద్రుల సమ్మతి దొరకకపోవటం వల్ల, ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, సర్ది చెప్పే పెద్దవారూ  ఉండరు. ఇకపోతే, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో, భార్యాభర్తల మధ్య  అనుబంధం యేర్పడేందుకూ  కొంత కాలం పడుతుంది. ఐనా, ఇదివరకటి బాల్య వివాహాలు వితంతు సమస్యకు కారణమైనా, భార్యాభర్తల మధ్య,కుటుంబ సభ్యుల మధ్య కూడా, సుదీర్ఘ అనుబంధానికి అనుకూలంగా ఉండేవి. కాలం మారి, వివాహాలకూ అర్హమైన వయస్సును నిర్ణయించటం వల్ల, ముక్కుపచ్చలారక ముందే తల్లి కావటం, ప్రసవ సమస్యలకు గురి కావటం, లేత వయసులోనే తనువు వీడటం   లేదా కాళ్ళ పారాణికీ, పసుపు కుంకుమలకూ దూరం కావటమన్న సమస్యలు శాశ్వతంగానే పరిష్కరింప బడినాయి  కూడా!  ఇది మంచి పరిణామమే. ఈనాడు, ఆడ, మగ పిల్లలిద్దరూ సమానంగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటున్న వయసులో తమ కాళ్ళపై తాము నిలబడిన తరువాతే వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు.అంతేకానీ, వివాహబంధం కలకలం ఒక తీయని అనుబంధంగా వర్ధిల్లేందుకు అవసరమైన ఆలోచనాధోరణిని అలవరచుకోవటంలో కాస్త అలసత్వం వహిస్తున్నారేమోననిపిస్తుంది.  జీవితంలో భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలూ, అనునయించుకోవటాలూ, రాజీపడి, తిరిగి జీవనరాగాలు ఆలపించటమూ ఉన్నట్టే,అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, పట్టు విడుపులూ, ఒకరి అభిప్రాయాలను మరొకరు కుటుంబ నేపధ్యంలో గౌరవించుకోవటమూ కూడ అలవరచుకుంటే, యీ 'ఎడమొగం-పెడమొగం’ కాపురాలకొక పరిష్కారం  దొరుకుతుంది. ఎవరికి వారే యమున తీరే అనుకుంటూ, తాను పట్టిన కుందేటికి   మూడే కాళ్ళూ అని పట్టుదలలతో ప్రవర్తించేవారికి విడాకులూ వరాలుగా అనిపించినా, జీవిత చరమాంకంలోగానీ  మనం కోల్పోయినదేమిటో అర్థం కాదు.అలాంటి విడాకుల జీవితాలూ, విశృంఖల జీవితాలూ, స్వేచ్చాశృంగారంతోనే తాత్కాలిక ఆనందం పొందుతూ, 'వివాహానికి అర్థం ఇదేకదా' అని వాదించే  విపరీత  ధోరణులు పాశ్చాత్య జీవిత ప్రభావాలే! ఇలాంటి ఆలోచనలనుండి, బయటపడాలనీ, మన భారతీయ కౌటుంబిక జీవనాన్నే ప్రమాణంగా స్వీకరించాలనీ, పశ్చిమ దేశాలు సైతం తహతహలాడుతున్న నేపధ్యంలో యీ 'యిగో 'అన్న అంశాన్ని గురించి దంపతులు పునరాలోచించవలసి ఉంది.  పెళ్ళి అన్నది, ధర్మార్థకామమోక్షాలకు ఆలవాలంగా, గృహస్తాస్రమం,  సమాజానికి ఒక నిజమైన అండగా అభివర్ణించిన మన శాస్త్రాలలోని అంతరార్థం అర్థం చేసుకుంటే,  ఒంటరి జీవితం ఒక దిద్దుకోలేని తప్పుకు అద్దం లా నిలిచి పోతుంది. అంతే!!   అలాకాక, ఒకరికోసం మరొకరు అప్పుడప్పుడూ తగ్గుతూ, ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకుంటూ మనగలిగితే, వైవాహిక జీవితంలోని అసలు ఆనందం అనుభవీభూతమవుతుంది. తల్లిదండ్రులిరువురి  ప్రేమనూ సమానంగా పొంది, పెరిగిన పిల్లల్లను సమజానికి అందించటం ద్వారా,బాధ్యతాయుతమైన పౌరులను సమాజానికి మన కానుకగా అందించిన  తృప్తి దక్కుతుంది దంపతులకు.సమాజంలో నేడు జరుగుతున్న అనేక నేరాలకు, వారి వారి కుటుంబ నేపధ్యమే కారణమంటున్నాయి మనస్తత్వ శాస్త్రాలు. ఈ నేపధ్యంలో ఆలోచించినా, భార్యాభర్తల మధ్య అవగాహన,సర్దుకుపోయే మనస్తత్వం అవసరమేననిపిస్తుంది కూడా. అలా సుఖంగా సంసారాలు చేసుకుని, తమ వారసత్వం యెదుగుదలను కళ్ళారా ఆనందంగా చూసుకునే ఆనందంలోని ప్రతి క్షణమూ కవితాత్మకం కాదామరి? -పుట్టపర్తి నాగపద్మిని
  పోలీసుల లాఠీచార్జ్‌ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తలకి గాయమైన సంగతి తెలిసిందే. అయితే తనను తానే గాయపరుచుకుని రాజాసింగ్ హైడ్రామాకు తెరదీశారని పోలీసులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు.   హైదరాబాద్‌ పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్ లో.. అక్కడి స్థానికులంతా కలిసి స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్‌ విగ్రహ ఏర్పాటుకు యత్నించడంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తన మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాజాసింగ్‌పై పోలీసుల దాడిని బీజేపీ ఖండించింది. ఓ ప్రజాప్రతినిధిని రక్తం వచ్చేలా కొట్టడం దారుణమని, తెలంగాణలో ప్రజాపాలన ఉందా? రజాకార్ల పాలన కొనసాగుతోందా? అని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ వచ్చింది. అసలు రాజాసింగ్‌పై పోలీసులు దాడి చేశారనడంలో ఏమాత్రం నిజం లేదని.. రాజాసింగ్ తనను తాను గాయపరుచుకున్నారని రుజువు చేస్తూ పోలీసులు ఓ వీడియో విడుదల చేసారు. ఆ వీడియోలో రాజాసింగ్ తనని తనని రాయితో గాయపరచుకోవడం కనిపించింది. మరి దీనిపై రాజాసింగ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.
  ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి సొంత పార్టీ నేతలు, ఎంపీలనే గుర్తించడం కష్టం. అలాంటిది ప్రధాని మోదీ.. వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డిని.. 'హాయ్ విజయ్ గారూ' అని పలకరించడం చర్చనీయాంశమైంది. జమిలి ఎన్నికల విషయంపై పార్లమెంటు లైబ్రరీ భవనంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీల అధ్యక్షులకు తప్ప మిగతావారెవరికీ ఆ సమావేశంలో పాల్గొనే అనుమతి లేకపోవడంతో బయట ఉన్న లాంజ్‌లో వైసీపీ ఎంపీలు కూర్చున్నారు. సమావేశం ముగిసి తరువాత అందరూ బయటకు వస్తున్న క్రమంలో ఎంపీలు నిల్చున్నారు. అటుగా వచ్చిన ప్రధాని మోదీ.. విజయసాయిరెడ్డిని చూసి చేతులు ఊపుతూ ‘హాయ్.. విజయ్‌ గారూ’ అని ప్రత్యేకంగా పలకరించారు. దాంతో విజయసాయి ఆయన వద్దకు వచ్చి ఆయనతో కరచాలనం చేసి నమస్కరించారు.   ఈ ఘటనపై విజయసాయి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మోదీ తనను ప్రత్యేకంగా పలకరించిన వీడియో పోస్ట్ చేసి.. ‘‘ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధాని మోదీ బయటకు వెళుతూ లాబీలో వైఎస్‌ జగన్‌ గారి కోసం నిరీక్షిస్తున్న నన్ను చూసి 'హాయ్ విజయ్‌ గారు' అని పలకరిస్తూ నావైపుకు అడుగులు వేసి నాతో కరచాలనం చేశారు. ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం.’’ అని పేర్కొన్నారు. మొత్తానికి ప్రధాని మోదీ, విజయ సాయి రెడ్డిని ప్రత్యేకంగా పలుకరించి వెళ్లటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
  పోలవరం కాలువపై నీటిని తోడడానికి ఏర్పాటు చేసిన పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దొంగిలించారంటూ.. సత్యనారాయణ అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళుతున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయటానికి అనువుగా మూడేళ్ల క్రితం చింతమనేని ప్రభాకర్ అధ్వర్యంలో పైపులు ఏర్పాటు చేసి నీటిని చెరువులకు మళ్లించారు. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్‌ మండలాల్లోని గ్రామాల్లో సాగుకు ఈ పైపుల ద్వారా నీరందిస్తున్నారు.  అయితే, ఇటీవల చింతమనేని అనుచరులు వచ్చి.. చింతమనేని తీసుకురమ్మన్నారంటూ పైపుల్ని తీసేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు ఆందోళన నిర్వహించారు. పైపుల్ని మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనితో సహ  మరో ఐదుగురిపైన వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ పైపులు చింతమనేని తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసారని, వాటిని ఆయన తీసుకెళ్తే చోరీ ఎలా అవుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరికొందరు మాత్రం.. పవర్లో లేనప్పడు ప్రజలకు మరింత సాయం చేయటం, అండగా ఉండటం ద్వారా వారి మనసుల్ని గెలుచుకునే అవకాశం లభిస్తుంది. అలా కాకుండా తన పైపులు తాను తీసుకెళ్తానంటూ ఇలాంటి పనులు చేస్తే మరింత వ్యతిరేకత మూటగట్టుకుంటారు అని అభిప్రాయపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.