EDITORIAL SPECIAL
  టీడీపీ అధినేత, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఎంఎంటీఎస్ పురుడు పోసుకుంది. పెరుగుతున్న జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఈ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూపకల్పన చేశారు చంద్రబాబు. కొత్తగా ఎలాంటి రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టకుండానే... ఉన్న వాటిని వినియోగించుకుంటూ... అద్భుతమైన, సౌకర్యవంతమైన ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. 2003లో ప్రారంభమైన ఎంఎంటీఎస్ కు మొదట్లో ఆశించినంత ఆదరణ లభించకపోయినా, అనంతరం ఎవరూ ఊహించనిస్థాయిలో పుంజుకుంది. ఒక్కో ట్రైన్ లో కోచ్ ల సంఖ్య 12కి పెరగడంతోపాటు అత్యాధునిక టెలిస్కోపిక్ బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో మొదలైన ఎంఎంటీఎస్ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ చేరుకునేవారంతా... తమ చివరి గమ్యస్థానాలకు చేరడానికి ఎంఎంటీఎస్ నే ఆశ్రయించేస్థాయికి చేరింది. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతోపాటు ఐటీ ఎంప్లాయిస్ పెద్దఎత్తున ఈ ఎంఎంటీఎస్ ను వినియోగిస్తున్నారు. దాంతో, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది ఈ ఎంఎంటీఎస్. హైదరాబాదీల బిజీ జీవితంలో ఎంఎంటీఎస్ ఒక భాగమైపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను....రాత్రి 11గంటల వరకు మొత్తం 121 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, పదహారేళ్ల ఎంఎంటీఎస్ చరిత్రలో మొదటిసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కర్నూలు ఎక్స్ ప్రెస్ ను ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొట్టడంతో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే, ప్రమాదం జరిగే సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. ఏ కొంచెం వేగం ఉన్నా... ఊహించని ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులకు సెపరేట్ ట్రాక్ లేకపోయినప్పటికీ, ఇఫ్పటివరకు ఎలాంటి ప్రమాదాలు చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఎంఎంటీఎస్ చరిత్రలో తొలిసారి ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, లంచం కోసం వేధించినందుకే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్ 90, 101లో గల 20 ఎకరాలకు సంబంధించిన భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణంగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమిని ఓ రియల్టర్‌కు కట్టబెట్టేలా రిపోర్ట్ ఇవ్వడంతో... కొద్దిరోజులుగా సురేష్‌....  అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్యాయంగా తన భూమిని రియల్టర్‌కు కట్టబెట్టేలా వ్యవహరించినందుకే... మనోవేదనకు గురై... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌... ల్యాండ్ మ్యుటేషన్ కోసం తహశీల్దార్ విజయారెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంతకీ తన పని కాకపోవడంతో.... విజయారెడ్డిపై కోపం పెంచుకున్న సురేష్‌.... ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇక, నిందితుడు సురేష్‌కి కూడా తీవ్ర గాయాలు కావడంతో... కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అసలు, విజయారెడ్డి కార్యాలయంలోకి దుండగుడిని ఎవరు అనుమతించారు... హత్యకు అసలు కారణమేంటనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భూవివాదంలో... విజయారెడ్డి మర్డర్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్న సీపీ.... దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు.... పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  సినిమా పేరు: యాక్షన్ బ్యానర్: శ్రీ కార్తికేయ సినిమాస్ తారాగణం: విశాల్, తమన్నా, కబీర్ దుహాన్ సింగ్, ఆకాంక్షా పురి, ఐశ్వర్యలక్ష్మి, సాయాజీ షిండే, యోగిబాబు, రాంకీ, ఛాయా సింగ్, షా రా, భరత్‌రెడ్డి సంగీతం: హిప్‌హాప్ తమిళ సినిమాటోగ్రఫీ: డుడ్లీ స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుందర్ సి. విడుదల తేదీ: 15 నవంబర్ 2019 తెలుగునాట ప్రాచుర్యం పొందిన తమిళ హీరోల్లో విశాల్ ముందు వరుసలో ఉంటాడు. ఆ మధ్య 'అభిమన్యుడు' మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న అతను, 'పందెంకోడి 2', 'అయోగ్య' ('టెంపర్' రీమేక్)లతో ఒకింత నిరుత్సాహపరిచాడు. ఈ నేపథ్యంలో సుందర్ సి. డైరెక్షన్‌లో అతను చేసిన 'యాక్షన్' మూవీపై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. కారణం.. ఆ మూవీ ట్రైలర్ ఇంప్రెసివ్‌గా ఉండటం. భారీ యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు ఉన్నాయని ఆశలు రేపిన 'యాక్షన్' మూవీ నవంబర్ 15న మన ముందుకు వచ్చేసింది. మరి బొమ్మ ఎలా ఉందయ్యా అంటే... కథ ఒక బాంబ్ బ్లాస్ట్‌లో తన కుటుంబ సభ్యురాలిని కోల్పోతాడు కల్నల్ సుభాష్ (విశాల్). అతని తండ్రి సీఎం. ఈ బ్లాస్ట్ వెనుక సుభాష్ అన్న శ్రావణ్ (రాంకీ) ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. శ్రావణ్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. బాంబ్ బ్లాస్ట్, తన కుటుంబసభ్యుల మరణం వెనుక ఎవరున్నారనే తీగ కదిలిస్తాడు సుభాష్. డొంక కదిలి ప్రొఫెషనల్ కిల్లర్ కైరా (ఆకాంక్షా పురి) నుంచి పాకిస్తానీ టెర్రరిస్ట్ మాలిక్ (కబీర్ దుహాన్ సింగ్) దాకా మూలాలు వెళ్తాయి. సుభాష్ తన వ్యక్తిగత పగ తీర్చుకోవడంతో పాటు, దేశానికి ఎలా పేరు తెచ్చాడనేది మిగతా కథ. అనాలిసిస్ బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన 'బేబీ' (2015) సినిమా పోలికలు 'యాక్షన్'లో కనిపిస్తాయి. 'యాక్షన్' సెకండాఫ్ చూస్తుంటే మనకు 'బేబీ' కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. దానికీ, దీనికీ ఉన్న వ్యత్యాసాలు.. అందులో అక్షయ్‌కి తాప్సీ ఒక కొలీగ్‌గా మాత్రమే కనిపిస్తే, ఇక్కడ విశాల్‌కి తమన్నా లవ్ ఇంట్రెస్ట్‌గా కనిపిస్తుంది. అందులో ఫ్యామిలీ ఎలిమెంట్ ఉండదు. ఇందులో ఉంటుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. టైటిల్‌కు తగ్గట్లుగా యాక్షన్ సీన్స్‌ను టాప్ క్లాస్‌లో డిజైన్ చేసి చిత్రీకరించారు. ఇంటర్వెల్‌కు ముందు విశాల్, ఆకాంక్ష మధ్య తీసిన యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. బాంబ్ బ్లాస్ట్ సన్నివేశాలు, తర్వాత వచ్చే సీన్లు కొంచెం డిస్టర్బింగ్‌గా ఉన్నాయనుకొనేంతలో యోగిబాబు ఎంట్రీ ఇచ్చి, కథని గాడిలో పెట్టాడు. అక్కడ్నుంచి ఇంటర్వెల్ పడేంత వరకు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో, సూపర్బ్ యాక్షన్ సీన్స్‌తో సినిమాని ఆసక్తి కరంగా నడిపాడు డైరెక్టర్ సుందర్. కథ లండన్‌లో ఉన్న కైరా నుంచి, అట్నుంచి దీపక్ మెహతా ఉన్న ఇస్తాంబుల్‌కు, అట్నుంచి లాహోర్‌కు మారాక 'లాగింగ్' అనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్లు వచ్చేదాకా మనం కాస్త ఓపికతో ఉండాల్సిందే. క్లైమాక్స్ సీన్లను ఊపిరి బిగపట్టేలా తియ్యడంలో సఫలం చెందాడు డైరెక్టర్. ఈలోగా లాజిక్‌కు అందని ఎన్నో విషయాలు మనల్ని అబ్బురపరుస్తుంటాయి. ఇస్తాంబుల్‌లో దీపక్ మెహతా అనేవాడ్ని పట్టుకొనే యత్నంలో అక్కడి పోలీసుల్నే మన హీరో చావగొట్టి, తప్పించుకోవడం ఒక 'అద్భుతం'. ఇలాంటి 'అద్భుతాలు' కథ లాహోర్‌కి వెళ్లాక కూడా చాలానే జరుగుతుంటాయి. ఒక భారతీయుడు పాకిస్తాన్‌కు వెళ్లి, అక్కడి మిలటరీనీ, టెర్రరిస్టుల్నీ బురిడీ కొట్టించడం ఎంత ఈజీనో.. 'యాక్షన్' చూపిస్తుంది. సినిమాలో మూడే పాటలున్నాయి. ఒక పాటలో ఆకాంక్షా పురి అందాలను, ఇంకో పాటలో తమన్నా వంపుసొంపులను చూడొచ్చు. అంటే అవి కంటికింపే కానీ, శ్రవణానందం కలిగించేవి కావు. హిప్‌హాప్ తమిళ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాకు సంబంధించిన మరో ప్లస్ పాయింట్ డుడ్లీ సినిమాటోగ్రఫీ. యాక్షన్ సీన్లను అతను చిత్రీకరించిన విధానం సూపర్బ్. ప్లస్ పాయింట్స్ విశాల్, తమన్నా నటన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ఓవర్‌గా అనిపించే బాంబ్ బ్లాస్ట్ సీన్స్ సాగతీత ఎక్కువైన సెకండాఫ్ లాజిక్‌కు అందని సీన్లు హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు లేకపోవడం నటీనటుల అభినయం కల్నల్ సుభాష్‌గా విశాల్ రాణించాడు. ఎమోషనల్ సీన్స్‌ను ఎంతగా పండించాడో, హాక్షన్ ఎపిసోడ్‌లో అంత వేగాన్ని కనపరచి, యాక్షన్ హీరో అనిపించుకున్నాడు. సుభాష్‌ను ఇష్టపడే, అతని ఆపరేషన్‌కు సాయపడే ప్రియ పాత్రలో తమన్నా ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్‌కు తగ్గ సీరియస్‌నెస్‌ను చూపించింది. టెర్రరిస్ట్ మాలిక్‌గా కబీర్ దుహాన్ సింగ్ సరిపోయాడు. సుభాష్ బావగా షా రా అలరించాడు. యోగిబాబు కంటే కూడా షా రాకే ఎక్కువ మార్కులు పడతాయి. సుభాష్ పై అధికారిగా కనిపించిన సాయాజీ షిండేకు నటించడానికి అవకాశం రాలేదు. కైరాగా చేసిన ఆకాంక్షా పురి ఒక లైవ్ వైర్‌లా మెరిసింది. నెగటివ్ రోల్‌కు అతికినట్లు సరిపోయింది. అతిథి పాత్రలకు ఎక్కువా, ప్రధాన పాత్రలకు తక్కువా అని చెప్పదగ్గ పాత్రల్లో రాంకీ, ఐశ్వర్యలక్ష్మి పరిధుల మేరకు నటించారు. రాంకీ భార్యగా ఛాయా సింగ్ ఇంప్రెసివ్‌గా కనిపిస్తుంది.  తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్ యాక్షన్ సినిమాల్ని ప్రేమించే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. 'యాక్షన్' బలమంతా ఆ తరహా సన్నివేశాల్లోనే ఉంది. బాలీవుడ్ 'బేబీ'ని చూడనివాళ్లు ఈ సినిమాని ఓసారి చూడొచ్చు. రేటింగ్: 2.5/5 - బుద్ధి యజ్ఞమూర్తి
నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణన్, వెన్నెల కిషోర్, అయ్యప్ప శర్మ తదితరులు పాటలు: భాస్కరభట్ల, చిలక రెక్క గణేష్ మాటలు: భవానీ ప్రసాద్, నివాస్ కథ: టి. రాజసింహ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ సంగీతం: సాయి కార్తీక్ నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీశ్, శ్రీనివాస్ ఇందూరి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  జి. నాగేశ్వరరెడ్డి విడుదల తేదీ: 15 నవంబర్ 2019 'సీమ శాస్త్రి', 'సీమ టపాకాయ్', 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం'తో వినోదాత్మక సినిమాలను చక్కగా తెరకెక్కిస్తారని దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి పేరు తెచ్చుకున్నారు. అయితే లాస్ట్ డైరెక్ట్ చేసిన సినిమాలు మూడు సరిగా ఆడలేదు. మరి, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించిన 'తెనాలి రామకృష్ణ'లో ఆడే లక్షణాలు ఉన్నాయా? 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తర్వాత కామెడీ ఎంటర్ టైనర్ తో సూపర్ సక్సెస్ అందుకొని సందీప్ కిషన్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటారా? రివ్యూ చదివి తెలుసుకోండి. కథ: తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఒక చోటా మోటా లాయర్. చిల్లర కేసులు కూడా అతడి దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్లిపోతుంటాయి. ఓ సందర్భంలో తోటి లాయర్ ను కాపాడడం కోసం కోర్టు బయట ఓ కేసును కాంప్రమైజ్ చేస్తాడు. తర్వాత నుండి అలా కేసులను కాంప్రమైజ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఒకప్పుడు కోర్టులో అబద్దపు సాక్ష్యాలు చెప్పే తెనాలి రామకృష్ణ తండ్రి దుర్గారావు (రఘు బాబు) కొడుకు ఓ గొప్ప కేసు వాదించి గౌరవం తెచ్చుకుంటే చూడాలని కోరుకుంటాడు. తన తండ్రిని ప్రేమించిన అమ్మాయి రుక్మిణి (హన్సిక) తండ్రి (లాయర్ మురళీ శర్మ) అవమానించాడని కోపంతో అతడి దగ్గరకు వెళ్లిన తెనాలికి ప్రముఖ పారిశ్రామికవేత్త వరలక్ష్మీ దేవి (వరలక్ష్మీ శరత్ కుమార్)ను హత్యకేసులో ఇరికించారని తెలుసుకుంటాడు. ఆమె కేసు టేకప్ చేసి గెలుస్తాడు కూడా! కోర్టులో ఆమెను గెలిపించిన తెనాలి, మళ్ళీ ఆమెపై హైకోర్టులో అదే కేసును ఎందుకు రీఓపెన్ చేశాడు? అసలు, ఏమైంది? కథేంటి? అనేది మిగతా సినిమా. విశ్లేషణ: 'దూద్ పేడాకు, ఆవు పేడకు తేడా తెలియని జనాలు ఉన్నారు' - ఇదీ తెనాలి రామకృష్ణగా తెరపైకి వచ్చిన కొన్ని క్షణాలకు సందీప్ కిషన్ చెప్పే డైలాగ్. పేడా, పేడ, తేడా... అని ప్రాస కుదిరిందని డైలాగ్ రాయడం తప్ప, అందులో అర్థం ఏమైనా ఉందా? పాలకోవాను ఎవరైనా పేడగా చూస్తారా? ఇంకో సందర్భంలో ప్రభాస్ శీను 'తలకాయ్ పగిలితే రక్తం కారక రకుల్ ప్రీత్ సింగ్ వస్తుందా?' అని డైలాగ్ చెప్తారు. కాఫీ అడిగితే టీ ఇచ్చిన భార్యతో 'బిస్కెట్స్ అడిగితే కుక్క బిస్కెట్స్ ఇచ్చేలా ఉన్నావ్' అని మురళీ శర్మ డైలాగ్. ఇటువంటి డైలాగులకు రెండు గంటలు నవ్వగలమని భరోసా ఉన్నవారు ఎటువంటి భయాలు లేకుండా 'తెనాలి రామకృష్ణ' సినిమాకు వెళ్ళవచ్చు. మిగతావాళ్ళు ఇటువంటి కేటగిరీ సినిమాలు నచ్చుతాయో, లేదో ఆలోచించుకోవాలి. గతంలో కొన్ని కామెడీ సినిమాలతో జి. నాగేశ్వరరెడ్డి ప్రేక్షకులను నవ్వించారు. 'జబర్దస్త్' వంటి కామెడీ షోలు వచ్చాక, ఆయన హవా తగ్గింది. మళ్ళీ పూర్వవైభవం కోసం ఈ సినిమా తీశారు. సరైన కథ, సీన్స్, క్యారెక్టర్స్, డైలాగ్స్ కుదరకపోవడంతో ఫుల్ ఫామ్ లోకి రాలేదు. ఆయన సృష్టించిన పాత్రల్లో కేఏ పాల్ ను ఇమిటేట్ చేస్తూ, మాటలను పాట రూపంలో చెప్పే సత్యకృష్ణన్ క్యారెక్టర్ ఒక్కటీ క్లిక్ అయింది. స్పూఫ్ కామెడీని ఇష్టపడని వారిని సైతం ఎంతోకొంత నవ్విస్తుంది. కోర్టులో సత్యకృష్ణన్, పోసాని కృష్ణమురళి డైలాగ్స్ బావున్నాయి. సప్తగిరి తనదైన శైలిలో నవ్వించాడు. వెన్నెల కిషోర్ పర్వాలేదు. కామెడీ సినిమా కాబట్టి కథలో లాజిక్కులను పట్టించుకోకుండా వదిలేయడం మంచిది. పాటలు, నేపథ్య సంగీతం... రెండూ సినిమాకు అండగా నిలబడలేదు. సినిమాటోగ్రఫీ ఒకే. నిర్మాణ విలువలు చిన్న సినిమాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: వరలక్ష్మీ శరత్ కుమార్ సత్యకృష్ణన్, సప్తగిరి, పోసాని కామెడీ మైనస్ పాయింట్స్: కథ, దర్శకత్వం పాటలు, సంగీతం హన్సిక సందీప్ కిషన్ రొటీన్ యాక్టింగ్ నటీనటుల అభినయం: నటుడిగా సందీప్ కిషన్ కొత్తగా చేసింది ఏమీ లేదు. లవ్, కామెడీ, ఫైట్స్, ఎమోషన్... ఏ సన్నివేశంలో హీరోని చూసినా ఇంతకు ముందు సినిమాల్లో చేసినట్టు చేశాడు. హన్సిక గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 'కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి పెద్ద లాయర్ అయిపోతా' అని సినిమాలో ఒకటికి రెండుమూడు సార్లు చెప్పే డైలాగ్ కి లిప్ సింక్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది. నటిగా కొంచెం కూడా సీరియస్ నెస్ లేకుండా చేసింది. హన్సికలో మునుపటి అందం కూడా మాయమైంది. వరలక్ష్మీ శరత్ కుమార్ చక్కటి హావభావాలతో పాత్రకు ఒక హుందాతనాన్ని తీసుకొచ్చింది. ఆగ్రహాన్ని కూడా అందంగా పలికించింది. తెలుగు ఉచ్ఛారణలో కొన్ని తప్పులు చెప్పినప్పటికీ, ఓన్ డబ్బింగ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది. సత్యకృష్ణన్, పోసాని, సప్తగిరి, వెన్నెల కిషోర్ తెరపై కనిపించిన సమయంలో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రభాస్ శీను పాత్రను న్యాయం చేశారు. మురళీ శర్మ, అయ్యప్ప శర్మవి రొటీన్ పాత్రలే.     తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: సినిమాలో కొన్ని నవ్వులు ఉన్నాయి. అలాగని, ప్రచార చిత్రాలు చూసి సినిమా అంతా నవ్వుకోవచ్చని థియేటర్లకు వెళితే కొన్ని తిప్పలు తప్పవు. పాటలు బాగోలేదు. హీరోయిన్ కూడా బాగోలేదు. హీరో రొటీన్ గా చేశాడు. ఇటువంటి కొన్ని తప్పులను క్షమిస్తే.... కాసేపు నవ్వుకోవచ్చు. లేదంటే ఫోనులో పాత సినిమాల్లో కామెడీ సీన్స్ చూసుకోవచ్చు. రేటింగ్: 2/5
  మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టనే లేదు. అయినా ఆ మూవీ క్రేజ్ అసాధారణ స్థాయిలో ఉంది. ఒక్క కర్ణాటక ఏరియా మినహా మిగతా అన్ని ఏరియాల ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటికీ అయిపోవడం విశేషం. సంక్రాంతికి విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో 'సరిలేరు నీకెవ్వరు' ముందంజలో ఉంది. అంతే కాదు, హిందీ శాటిలైట్ రైట్స్ కూడా 15 కోట్ల 25 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. మహేశ్ సినిమాలకు సంబంధించి హిందీ రైట్స్ విషయంలో ఈ మూవీది రెండో స్థానం. మహేశ్ మునుపటి సినిమా 'మహర్షి' హిందీ రైట్స్ 20 కోట్లు పలికాయి. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ కేరళలో నడుస్తోంది. కాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేశ్ ఏ డైరెక్టర్‌తో చేస్తాడనే విషయంలో భిన్న ప్రచారాలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరోసారి జట్టు కట్టబోతున్నడనే ప్రచారం, 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం.. రెండూ జోరుగా సాగుతున్నాయి. 'మహర్షి'కి పని చేస్తున్న సందర్భంలో మహేశ్, వంశీ మధ్య స్నేహం కుదిరి, క్రమేణా బలపడుతూ వచ్చింది. వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. మహేశ్ కుమార్తె సితార, వంశీ కుమార్తె ఆద్య క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' మూవీ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే వంశీ చెప్పిన కథకు మహేశ్ ఇంప్రెస్ అయ్యాడనీ, వెంటనే అతడితో పనిచేయడానికి ఉత్సాహం చూపించాడనీ ప్రచారంలోకి వచ్చింది. అలాగే ఆమధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో 'కేజీఎఫ్ 2' షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేశ్‌ని కలిసిన ప్రశాంత్ నీల్.. ఆయనకు ఒక యాక్షన్ డ్రామా స్క్రిప్టును వినిపించాడనీ, అది మహేశ్‌కు బాగా నచ్చిందనే విషయం బయటకు వచ్చింది. ఆ విషయం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. లేటెస్టుగా వినిపిస్తున్నదేమంటే.. ప్రశాంత్‌తో సినిమా చెయ్యడానికే మహేశ్ మొగ్గు చూపుతున్నాడని. వంశీ స్క్రిప్ట్ మోర్ ఎమోషనల్ కంటెంట్‌తో ఉన్నప్పటికీ, 'కేజీఎఫ్'ను ప్రశాంత్ రూపొందించిన విధానం, అతని టేకింగ్ స్కిల్స్ మహేశ్‌ను బాగా ఇంప్రెస్ చేశాయి. అలాంటి డైరెక్టర్ అయితే కొత్తగా తనను తాను ఆవిష్కరించుకొనే ఛాన్స్ కూడా ఉంటుందని మహేశ్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ప్రశాంత్ నీల్‌తో మూవీ చెయ్యడానికి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సైతం డిసైడ్ అయ్యాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ సినిమా నిర్మించడానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రంగంలోకి వచ్చింది. ఆ ఇద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీతో వచ్చే ఏడాది జూన్ దాకా బిజీగా ఉండనున్నాడు. ముందుగా లాక్ చేసిన జూలై 30న ఆ సినిమా విడుదలైతే, ఆగస్టు నుంచి ఆయన తర్వాతి సినిమా మొదలుపెడతాడు. అయితే వివిధ కారణాల వల్ల ఆ మూవీ షూటింగ్‌లో జాప్యం జరుగుతూ వస్తుండటం వల్ల 2020 జూలైలో విడుదలయ్యే చాన్సులు చాలా తక్కువగా ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు నెక్స్ట్ మూవీకి అందుబాటులో ఉంటాడనే విషయంలో క్లారిటీ లేదు. దానికి భిన్నంగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ జనవరి 12న విడుదలవడం ఖాయం కాబట్టి ఆ వెంటనే తన తదుపరి సినిమాని మొదలుపెట్టడానికి మహేశ్ రెడీగా ఉన్నట్లే. ఈలోగా 'కేజీఎఫ్ 2'ను ప్రశాంత్ పూర్తి చేయనున్నాడు. దాంతో ఆ ఇద్దరూ కలిసి పనిచెయ్యడం ఖాయమనే విషయం బలంగా వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి మహేశ్ సొంత నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించే అవకాశాలున్నాయి. మరి వంశీతో మహేశ్ ఆ తర్వాతైనా చేస్తాడా? అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే.. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తర్వాత మహేశ్‌తో సినిమా చెయ్యాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. మహేశ్ సైతం ఆయనతో కలిసి వర్క్ చెయ్యడానికి ఈగర్‌గా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత రాజమౌళికే మహేశ్ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఆ తర్వాతే వంశీ పైడిపల్లితో ఆయన సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే. టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి కాబట్టి.. ఇప్పటికి అనేకసార్లు మహేశ్ తన ప్లాన్స్‌ని మార్చాడు కాబట్టి.. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఆయన ఏ డైరెక్టర్‌తో పనిచేస్తాడనే విషయం ఒకరికి మాత్రమే కచ్చితంగా తెలుసు. ఆ ఒక్కరు.. మహేశ్!
  ప్రతిష్ఠాత్మక అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకు ప్రఖ్యాత తారలు రేఖ, దివంగత శ్రీదేవి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని గురువారం అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కమిటీ చైర్మన్ టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 2018 సంవత్సరానికి శ్రీదేవికీ, 2019 సంవత్సరానికి రేఖకూ ఈ అవార్డులు అందజేస్తారు. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వి, ఖుషి అవార్డును స్వీకరిస్తారని సుబ్బరామిరెడ్డి తెలిపారు. "ఈ అవార్డును ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన గొప్ప గొప్ప వ్యక్తులకు ఇస్తూ వస్తున్నాం. లతా మంగేష్కర్, దేవానంద్, వైజయంతీ మాల, హేమమాలిని, బాలచందర్, శ్యాం బెనెగల్, అమితాబ్ బచ్చన్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తులకు ఇచ్చాం. శ్రీదేవికి ఈ అవార్డును అందజేయాలన్నది నాగేశ్వరరావుగారి కోరిక. తండ్రి తర్వాత ఏఎన్నార్ అవార్డును కొనసాగిస్తున్న నాగార్జునకు అభినందనలు" ఆయన చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ "నాన్నగారి పేరు ఉన్నంతవరకూ ఈ అవార్డును కొనసాగిస్తూనే ఉంటాం. నాన్న వెళ్లిపోయాక సుబ్బరామిరెడ్డిగారు మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కార్యక్రమాన్ని కూడా ఈ అవార్డు వేడుకకు జోడిస్తూ వస్తున్నాం. ఈసారి ఆ కాలేజీ నుంచి 70 మంది విద్యార్థులకు రేఖగారి చేతుల మీదుగా డిగ్రీలను అందజేయనున్నాం. ఈ అవార్డుకు ఎంపిక చేశామని రేఖగారికి ఫోన్ చేసి చెప్పగానే నాన్నతో తనకు చాలా అనుబంధం ఉందని, కెరీర్ తొలినాళ్లలో ఆయన నుంచి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకున్నానని ఆమె చెప్పారు. నాన్నగారు మొదలుపెట్టినప్పటి లాగే అవార్డు గ్రహీతలకు రూ. 5 లక్షలు నగదు బహుమానం కూడా ఇస్తాం" అని చెప్పారు.
  'లక లక లక' అంటూ 'చంద్రముఖి'లో రజనీకాంత్ నట విశ్వరూపాన్ని చూపించారు. జ్యోతిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటు తెలుగులో గానీ... అటు తమిళంలో గానీ... 'చంద్రముఖి'కి సీక్వెల్ తీయడం లేదు. హిందీలో తీస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం 'చంద్రముఖి'ని హిందీలో 'భూల్‌ భులైయా' పేరుతో అక్షయ్ కుమార్ రీమేక్ చేశారు. అందులో జ్యోతిక పాత్రను విద్యా బాలన్ పోషించారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'భూల్‌ భులైయా 2' తీస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరో. 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' ఫేమ్ కియారా అడ్వాణీ హీరోయిన్. ఇందులో కీలక పాత్రలో నటించడానికి టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జనవరి నుండి ఆమె షూటింగులో జాయిన్ కానున్నారు.  'భూల్‌ భులైయా 2'లో టబు క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే హారర్ కామెడీలో నటించడం ఆమెకు కొత్తేమీ కాదు. హిట్ ఫ్రాంచైజీ 'గోల్ మాల్' సిరీస్ లో రోహిత్ శెట్టి తీసిన హారర్ కామెడీ 'గోల్ మాల్ అగైన్'లో టబు ఆత్మలతో మాట్లాడే పాత్రలో నటించారు. 'భూల్‌ భులైయా 2'లో 'చంద్రముఖి'లో జ్యోతిక తరహా పాత్ర చేస్తున్నారా? అనేది కొందరి సందేహం. హిందీ సినిమాలు పక్కన పెడితే... తెలుగులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'అల... వైకుంఠపురములో' సినిమాలో టబు నటిస్తున్న సంగతి తెలిసిందే.
  నాన్ వెజ్ కి రుచి మరిగిన పులితో.. ఇక నుంచి నువ్వు ప్యూర్ వెజిటేరియన్ వి, నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదు అని చెప్తే వింటుందా? చెప్పండి. వద్దన్నా నాలుక నాన్ వెజ్ వైపు లాగేస్తుంది. ఏపీలో కొందరి పొలిటీషియన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వద్దన్నా అవినీతి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కి తలవంపులు తీసుకొస్తున్నారు. జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత బలంగా చెప్పిన మాట.. అవినీతిరహిత పాలన అందిస్తా, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పారు. అంతేకాదు అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అవినీతి చేయడానికి వీల్లేదని, అవినీతి చేస్తే అస్సలు సహించనని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కొందరు నేతల్లో మార్పు కనిపించట్లేదు. అధికారంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఉన్నప్పుడే అందినకాడికి దోచుకోవాలి అనుకుంటున్నారు. ఏదైనా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాత సామెతను చెప్తున్నారట. అయితే నేతల అవినీతి వ్యవహారం జగన్ వరకు చేరడంతో.. ఇప్పటికే వారిని పిలిచి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు కొందరు మంత్రులను అసలు కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు.. అవినీతికి పాల్పడుతున్నారట. ఆ లిస్ట్ జగన్ కి చేరడంతో గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఈ ఐదు నెలల్లో అవినీతిలో టాప్ లిస్ట్ లో ఉన్న ఓ నలుగురు మంత్రులని పదవి నుంచి తప్పించాలి అనుకుంటున్నారట. అలా చేయటం వల్ల మిగతా మంత్రులు.. ఎక్కడ తమ మంత్రి పదవి కూడా పోతుందేమోనన్న భయంతో అవినీతి చేయడం మానేస్తారు. ఎమ్మెల్యేలు కూడా తమకి మంత్రి పదవి దక్కదేమోనన్న భయంతో అవినీతి మానేస్తారు. అందుకే జగన్ ఆ నలుగురు మంత్రులని టార్గెట్ చేసారని తెలుస్తోంది. మరోవైపు ఆ  నలుగురు మంత్రులు ఎవరా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ నలుగురిలో.. ఇద్దరు బీసీ మంత్రులు, ఒక ఓసీ మంత్రి, ఒక ఎస్సీ మహిళా మంత్రి ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు కోస్తా ఆంధ్రాకు చెందిన వారని సమాచారం. ఈ మంత్రుల అవినీతిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక బీసీ మంత్రిపై అవినీతి ఆరోపణలతో పాటు, ఆయన వ్యవహారశైలిపై కూడా సొంత పార్టీ నేతలే జగన్ కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నలుగురిలో మొదట హిట్ లిస్ట్ లో ఆ మంత్రే ఉన్నారు అంటున్నారు. ఇక మహిళా మంత్రి విషయానికొస్తే.. ఆమె పదవిని అడ్డుపెట్టుకొని ఆమె భర్త వసూళ్లకు పాల్పడుతున్నట్లు.. కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లారట. అంతేకాదు ఒకసారి ఆ దంపతులు ఎవర్నో డబ్బులు డిమాండ్ చేసారని తెలియడంతో.. జగన్ స్వయంగా ఆ మహిళా మంత్రికి ఫోన్ చేసి.. ఎంత కావాలమ్మా డబ్బులు అన్నారట. దీంతో హడలిపోయిన మంత్రి.. జగన్ కి ఎదురుపడాలంటేనే భయపడుతున్నారట. మొత్తానికి టాప్ 4 లిస్ట్ లో మహిళా మంత్రి రెండో ప్లేస్ లో ఉండగా.. ఒక బీసీ మరియు ఒక ఓసీ మంత్రి.. తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారట. ఇప్పటికే ఆ నలుగురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఏ క్షణమైనా వారిని తప్పించి వేరే వారికి అవకాశమిచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.
  ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పగ్గాలు చేపట్టాక కేసీఆర్, జగన్ ఇద్దరూ సఖ్యతగా మెలిగారు. పలుసార్లు భేటీ అయ్యారు. ఒకరికొకరు కితాబులిచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కథ కంచికి చేరినట్లు తెలుస్తొంది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని తెలంగాణ అధికార వర్గాలంటున్నాయి. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించటం, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారం కేసీఆర్ కు మంట పెట్టింది. ఏపీ తరహాలో తెలంగాణలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది, ఈ అంశం కేసీఆర్ కు కొరుకుడుపడటంలేదు. అవగాహన లోపంతో ఆర్టీసీ విలీనం పై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.ఈ తేనెతుట్టెను కదిలించి తమకు నష్టం కలిగించారని అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ అన్నందుకైనా ఆర్టీసీ విలీనం ఆరు నెలల్లోనే సక్సెస్ చేసి చూపుతామని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు.  తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన అధికారులు, కేసీఆర్ అంటే గిట్టనివారికి జగన్ పెద్ద పీట వేయడం కూడా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమని అంటున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించి వీఆర్ఎస్ తీసుకున్నారు. వెంటనే ఆయన్ను ఏపీ విద్యాశాఖ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. ఇంక కేసీఆర్ అంటే గిట్టని జర్నలిస్టులు అమర్, రామచంద్రమూర్తికి పెద్ద పీట వేయడం కూడా కేసీఆర్ కు నచ్చలేదని చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయంలోనూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. కేంద్రం నుంచి పూర్తిగా ఆదేశాలు రాక ముందే ఈ ఇద్దరినీ అనధికారికంగా విధుల్లోకి తీసుకోవటం కేసీఆర్ కు కోపం తెప్పించిందట. చివరికి స్టీఫెన్ రవీంద్ర వెనక్కొచ్చి అభాసుపాలయ్యారు. అటు గోదావరి జలాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. గోదావరి జలాలను ఉమ్మడిగా క్రిష్ణకు తరలించాలని ఇద్దరూ కలిసి నిర్ణయించారు. కేసీఆర్ ఉదారంగా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తాం అంటున్నారని జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించేశారు కూడా. అయితే ఆ తర్వాత తత్వం బోధపడిందో ఏమో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు కనిపిస్తోంది. సొంతం గానే పోలవరం నుంచి కృష్ణాకు నీళ్ళు తరలించే ప్రతిపాదనలను చేస్తోంది ఏపీ ప్రభుత్వం.  ఇక ప్రగతి భవన్లో ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశంలో మాట్లాడుకున్న అంశాలు మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఈ విషయంలో కేసీఆర్ జగన్ కలిసి కేంద్రంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు మీడియాలో వచ్చింది. దీంతో జగన్ ఉలిక్కిపడ్డారు. ఈ విషయాలు మాట్లాడుకోలేదని ప్రకటన కూడా విడుదల చేశారు. కేసీఆర్ తో సఖ్యతగా మెలగడంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూరం పెడుతోందన్న అభిప్రాయానికి వచ్చారు జగన్ .అనవసరంగా తొందరపాటుతో కేసీఆర్ తో సఖ్యతగా మెలిగి కేంద్రంతో దూరం పెంచవల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. అందుకే అమిత్ షా తో అపాయింట్ మెంట్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చిందని సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దొరకలేదని అంచనాకొచ్చారు. అందుకే కేసీఆర్ తో దూరం పాటించేందుకు జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. మళ్లీ ఈ మధ్య కాలంలో జగన్,కేసీఆర్ మధ్య భేటీలు ఉండక పోవచ్చని ఉమ్మడి ప్రాజెక్టుపై అసలు చర్చలు ఉండవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ముందు ముందు వీరి సఖ్యత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
  ఎంత వెలుగుకు అంత చీకటి అన్నట్లుగా ఉంది నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిస్వార్థంగా, నిరాడంబరంగా ఆయన ఉద్యమకారుల పక్షాన కదం తొక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏదైనా రాజకీయ గుర్తింపు ఉంటుందని ఆశించారు కానీ ఓ దఫా ప్రభుత్వ పాలన పూర్తయినప్పటికీ ఆయనకి ఎలాంటి పదవి రాలేదు. ఈ లోపు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారిని తప్పకుండా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత మాటపై నమ్మకముంచి విఠల్ రావు ఓపిక పట్టారు. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో మక్లూర్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై వ్యక్తిగత అభిమానంతో కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కూడా టీఆర్ఎస్ కే దక్కింది. అప్పటికే నిజామాబాద్ జడ్పీ పీఠం విఠల్ రావ్ కు కేటాయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులకు సంకేతాలిచ్చారు. కేసీఆర్ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలపడంతో విఠల్ రావు ఎంపిక లాంఛనప్రాయంగా ముగిసింది.  మక్లూర్ మండలానికి చెందిన దాదన్నగారి విఠల్ రావు జడ్పీ పీఠం అయితే ఎక్కారు కానీ తన సొంత నియోజక వర్గంలోనే స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మక్లూర్ ఆయన సొంత గ్రామం. ఆయన సొంత మండలం నుంచే జిల్లా పరిషత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదాలోగాని.. పార్టీ నేతగా కానీ ఆయన తన సొంత మండలంలో క్యాడర్ ను పెంచుకోవలసి ఉంటుంది. భవిష్యత్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం ప్రజలకు చేరువ కావాల్సి ఉంటుంది. ఈ ఆలోచనతో ఆయన మక్లూర్ మండలంతో పాటు నందిపేట , ఆర్మూర్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పథకం చేపట్టినా అక్కడి శిలాఫలకంపై జడ్పీ ఛైర్మన్ పేరు రాయాల్సి ఉంటుంది. ఈ మర్యాద కోసమైనా విఠల్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి విఠల్ రావు దూకుడు నచ్చడం లేదు. తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించడం సభలు సమావేశాలు పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్ అని స్వయాన కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని జీవనరెడ్డి ఫాలో అవుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగానే తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా తిరగవద్దని విఠల్ రావును ఆదేశించారు. విఠల్ రావు సన్నిహితులకు పలుమార్లు ఫోన్ చేసి కూడా ఇదే ఆంక్షలు విధించారు. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ చెడిందో అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  రెవిన్యూ డివిజన్ ల పునర్విభజన సమయంలో మక్లూరు మండలాన్ని ఆర్మూర్ డివిజన్ లో కలపాలని ఎమ్మెల్యే జీవనరెడ్డి ఆశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దలకు ప్రతిపాదన పంపారు. అయితే మక్లూర్ మండలం నిజామాబాద్ కు దగ్గరలో ఉంటుందని.. దాన్ని నిజామాబాద్ లోనే కొనసాగించాలని ఆ మండల నాయకులు పట్టుబట్టారు. గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులంతా తమ మండలాన్ని ఆర్మూర్ లో కలుపవద్దంటూ పోరాటం చేశారు. దీనికి దాదన్నగారి విఠల్ రావు నాయకత్వం వహించారు. కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన హైదరాబాద్ లెవల్ లో పావులు కదిపారు. మక్లూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు.. నాయకులందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి అనుకున్నది సాధించారు.అయితే తనకు వ్యతిరేకంగా పని చేసి.. తన నిర్ణయాన్ని ధిక్కరించారంటూ అప్పట్నుంచే విఠల్ రావు పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కోపం ఉంది. ఈ క్రమంలో ఆయన జడ్పీ చైర్మన్ కావడంతో చేసేది ఏమి లేక అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మొదలు జడ్పీ చైర్మన్ అయ్యే వరకు మౌనంగా ఉన్న జీవన్ రెడ్డి.. తీరా ఆయన దూకుడు పెంచాక తన ప్రతాపం చూపించడం మొదలెట్టారు. విఠల్ రావును తన నియోజకవర్గంలోనూ తిరగవద్దంటూనే ఇతర మండలాల నాయకులు కూడా ఆయన వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశించారు. ఎమ్మెల్యే సూచన మేరకు తన సొంత మండలమైన మక్లూరు నేతలు కూడా ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ను కలవాలంటే జంకుతున్నారు.  ఇటీవల ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై జడ్పీ చైర్మన్ విఠల్ రావు పేరు కూడా రాయించలేదు. ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సిన గౌరవ మర్యాదలను కూడా పాటించడం లేదని స్వయాన కేసీఆర్ రికమెండ్ చేసిన విఠల్ రావును తన సొంత నియోజక వర్గ ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడం ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలలో హాట్ టాపిగ్గా మారింది. ఇప్పటికే విఠల్ రావుతో ఉన్న పాత వివాదాలకు తోడు రాబోయే రోజుల్లో తన టిక్కెట్ కు ఎసరు పెడతాడన్న భావనతోనే ఎమ్మెల్యే జీవనరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. టీఆర్ఎస్ పెద్దల వద్ద జీవన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని.. ప్రత్యామ్నాయంగా విఠల్ రావును వారు ప్రోత్సహిస్తున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కారణమేదైనా తన సొంత నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విఠల్ రావు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని పార్టీ పెద్దల చెవిన కూడా వేశారు. ఆర్మూర్ లో ఏం జరుగుతోందన్న విషయమై గులాబి పార్టీ పెద్దలు సైతం ఆరా తీస్తున్నారు. చూద్దాం హైకమాండ్ ఎలాంటి కమాండ్ జారీ చేస్తుందో.
  ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది ఎదురుకోవాలిసిందే. ఓడిన నేతలు పరాభవం నుంచి బయటపడి పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సి ఉంటుంది. తమ పార్టీ పరాజయం పాలైందన బాధతో ఉండే పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఓడిన వారిపైనే ఎక్కువగా ఉంటుంది. అంతేకానీ ఎలాగో ఓడిపోయాం.. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కదా మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు రంగంలోకి దిగుదాం అనుకుంటే రాజకీయంగా తమకు తాము నష్టం చేసుకోవడమే కాకుండా.. పార్టీ క్యాడర్ ను కూడా చేజారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ టిడిపి కార్యకర్తలు ఎన్నికల్లో తమ పార్టీ వైపు నిలుచున్న అభ్యర్థి ఎవరు అనేది కూడా సంబంధం లేకుండా పార్టీ గెలుపుని భుజాన వేసుకుంటారాని టాక్ ఉంది. తెలుగు దేశం పార్టీ ఏర్పడిన తరువాత 2009 వరకు కొవ్వూరు శాసన సభ స్థానంలో 9 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 2 సార్లు మాత్రమే టిడిపి ఓటమి చెందింది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం ఉన్న 2004,2009 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఓటర్లు టిడిపికే పట్టం గట్టారు. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. కంచుకోట లాంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ నాయకత్వ లేమి నెలకొంది. 2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసిన వంగలపూడి అనిత ఓటమి చెందారు. ఆ తర్వాత ఆమె కొవ్వూరు నియోజకవర్గంపై పూర్తిస్థాయి లో సీతకన్ను వేశారని స్థానిక పార్టీ కేడర్ లో గట్టి గానే వినిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు టిడిపిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సొమ్ము చేసుకోడానికి పావులు కదుపుతూ ఉండటం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. దీంతో తాము ఎవరి నాయకత్వంలో పని చేయాలో తెలియని స్థితిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు.. కార్యకర్తలు.. సతమతమవున్నారు. అసలు ఇలాంటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీస్తే అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కొవ్వూరు టిడిపిలో రకరకాల సంక్షోభాలు తలెత్తాయి. అప్పటి మంత్రి జవహర్ కు అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా ఒక వర్గం తయారై ఎవరికి వారు పోటా పోటీగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఒక వర్గం జవహర్ కు టికెట్ ఇవ్వాలని రోడ్డెక్కితే మరో వర్గం ఇవ్వడానికి వీల్లేదని వీధి కెక్కింది. ఇలా నాడు ఇరువర్గాల మధ్య నిత్యం రచ్చ జరుగుతుండడం పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కూడా అక్కడ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే ఎన్నికల సమయంలో ఆమెకు కొవ్వూరు టికెట్ ఇచ్చి.. జవహర్ కు తిరువూరు టిక్కెట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. అయినా కూడా రెండు చోట్ల వీరిద్దరూ ఓటమిని చవి చూసారు. ఇక రాష్ట్రాంలోనూ టిడిపి పరాజయం చెంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కొవ్వూరులో రాజకీయ పరిణమాలు చకచక మరాయి.  ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడినప్పటికీ పార్టీ హైకమాండ్ కుంగిపోకుండా నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోధైర్యం దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అంతే కాకుండా పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారిని అదే నియోజకవర్గ ఇన్ ఛార్జిలుగా నియమించింది. ఇంఛార్జి గా వంగలపూడి అనిత కొవ్వూరు బాధ్యతలను చూడాల్సి ఉండగా నియోజకవర్గంలో అసలు ఆమె ప్రస్తానమే అయోమయంగా మారిందని స్థానిక నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. నిజానికి ఎన్నికల ముగిసిన తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే వంగలపూడి అనిత కొవ్వూరు నియోజకవర్గం ముఖం చూశారని కొందరంటున్నారు. నియోజవర్గాన్ని ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లేనన్న గుసగుసలు  కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో జవహర్ తో విభేదించి అనితతో కలిసి పని చేసిన ఒక వర్గం నాయకులు పూర్తి గా డీలా పడిపోయారట. తమ నాయకురాలు తరచుగా వస్తే తమకు మనోధైర్యం ఉంటుందని వారు అనుకుంటున్నా.. ఆమె నియోజకవర్గం వైపు చూసే అవకాశాలే తక్కువ  ఉన్నాయనేది మరో వర్గం టాక్. కొవ్వూరులో నెలకొన్న ఈ పరిణామాలే మళ్లీ జవహర్ వర్గానికి జీవం పోశాయి. ఆయన తిరిగి కొవ్వూరు తీసుకురావటానికి అడుగేసేలా చేశాయి. అందుకు జవహర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు కొవ్వూరు నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడి నుంచి పోటీ చెయ్యడానికి జవహర్ గట్టి ప్రయత్నమే చేశారు. కానీ అప్పటి పరిస్థితుల్లో అధిష్టానం ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించింది. కానీ ఇప్పుడు అనిత పాయకరావుపేట పై మళ్లీ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ కొవ్వూరును పట్టించుకోవడం లేదని టిడిపి వర్గాలు అనుకుంటుంన్నాయి. ఈ పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జవహర్ ప్రయత్నిస్తున్నారని మరో ప్రచారం నడుస్తుంది. తిరువూరు నుంచి కొవ్వూరు తిరిగొచ్చి మళ్లీ చక్రం తిప్పాలని జవహర్ గట్టి గా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరి ప్రయత్నాలు ఎలా వున్నప్పటికీ కొవ్వూరు టిడిపికి మాత్రం నాయకత్వ లేమి ఏర్పడిందనేది సుస్పష్టంగా కమిపిస్తున్నాయి. మరి తెలుగు దేశం అధిష్టానం ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.
  వాళ్లు రాష్ట్రానికి మంత్రులు కానీ సొంత నియోజకవర్గం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే జంకుతున్నారు, కొద్దిమంది మంత్రులైతే ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రులు, రాష్ట్రానికి మంత్రులైనా వాళ్ల నియోజకవర్గాలు దాటి బయట కాలు పెట్టలేకపోతున్నారు. పక్క నియోజక వర్గాల్లో కూడా మంత్రులు తమ ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రుల రాకను వ్యతిరేకిస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆధిపత్య పోరుతోనే మంత్రులు, ఎమ్మెల్యేల గ్యాప్ కు కారణంగా తెలుస్తోంది. నియోజక వర్గాల్లో మంత్రుల జోక్యాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తమ నియోజక వర్గాలకు మంత్రులు రావటాన్ని ఇష్టపడని కొంత మంది శంకుస్థాపనను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు అనే చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలతో మంత్రికి పొసగడం లేదని సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వాళ్లు మంత్రి వస్తే ఎలాంటి హడావుడి చేయొద్దని కార్యకర్తలు అనుచరులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సొంత నియోజక వర్గాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఇక హైదరాబాద్ లో హల్ చల్ చేసే మంత్రి తలసానికి ఇప్పటికే ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తనయుడు ఓటమికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణమని చర్చ అప్పట్లో జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులున్నారు. వారు కూడా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అటు ఆదిలాబాద్ లోనూ ఇదే పరిస్థితి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత చెడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో మంత్రులు నియోజకవర్గాలకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అటు వైపు కూడా చూడడం లేదని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిపై మంత్రులు ఎమ్మెల్యేలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితులపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
  తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నెలలుగా భూములను కొనుగోలు చేయటం లేదు. ఎకరాకు సర్కారు ఇస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకు రాష్ట్రంలో ఎక్కడా భూముల దొరక్క పోవడమే ఇందుకు కారణం. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో సర్కారు దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి దశలో గుంట భూమి కూడా లేని వారికి మూడెకరాలను ఒకట్రెండు ఎకరాలున్న వారికీ మూడు ఎకరాలకు సరిపోయేంతగా భూమి ఇస్తామని ఆ తర్వాత నీటి సదుపాయం, డ్రిప్ సౌకర్యం, విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందుల రూపంలో సమగ్ర ప్యాకేజీని కూడా ఇస్తామని అప్పట్లో సర్కారు వెల్లడించింది. గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కేవలం ఆరు వేల యాభై ఒకటి మంది దళిత కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రెండు వందల యాభై మూడు మందికి ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాలను పంపిణీ చేశారు. అయితే ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది.  2014-15, 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మినహా ఎప్పుడూ వెయ్యి మందికి మించి భూ పంపిణీ జరగలేదు. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది దళితులు, టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం సర్కారు ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి దొరికే పరిస్థితి లేదు. చిన్న జిల్లాల కావడం, సాగు నీటి వసతి పెరగటం, రియలెస్టేటుతో ధరలకు రెక్కలు రావడంతో రైతులెవ్వరూ భూములను అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు భూములను కొనేవారున్నారు తప్ప అమ్మేవారు కరువయ్యారని ఎస్సీ సంక్షేమ శాఖలో పని చేసే ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎకరాకు పది లక్షలు వెచ్చించిన రాష్ట్రంలో ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేకపోవటంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తాజాగా సర్కార్ కు ఒక ప్రతిపాదన పంపారు. ఎకరా భూమికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వగలిగితేనే భూ కొనుగోళ్లు చేయగలుగుతామని అందులో స్పష్టం చేశారు. అయితే భూములు దొరికే పరిస్థితి లేకపోవటంతో ఈ పథకం అధికారికంగా ప్రకటించకుండానే కనుమరుగయ్యే అవకాశం కన్పిస్తోంది. టీఆర్ఎస్ నేతల మాటలు కూడా దీనికి మంగళం పాడినట్టే అనేలా ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇలా అంటుంటే అధికారులు ప్రభుత్వం ఈ పథకం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ప్రజలు వారంతట వారే ఈ పథకం గురించి మరిచిపోయేలా చేయడమే సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.దీని పై ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాలి.
  ఒకప్పుడు కాలక్షేపానికి పుస్తకం మాత్రమే ఉండేది. అందుకే ఇంట్లో చిన్న నుంచి పెద్దదాకా చదివే పుస్తకాలు మాత్రమే ఉండేవి. పిల్లల పత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు ఎన్నో పుస్తకాలు కాలక్షేపాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. మారిన కాలంలో పుస్తకం మరుగున పడిపోతోంది. ఇప్పటికీ పుస్తక ప్రేమికులు చాలా మందే ఉన్నా చదివే అలవాటు క్రమంగా తగ్గుతూ వస్తుందన్నది నిజం. కాలక్షేపాన్ని వినోదాన్ని అందించే సాధనాలు ఎన్నో అందుబాటులో ఉండేసరికి పుస్తాకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాని పుస్తకం చదివే అలవాటు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది గుర్తించండి అంటున్నారు నిపుణులు. 1. పుస్తకం చదివే అలవాటు ఏకాగ్రతను పెంచుతుంది. రోజుకో అరగంట చదివినా చాలు. ఆసమయంలో మనసు, మెదడు అనుసంధానం జరిగి అదో మెడిటేషన్ లా మారుతుంది.     2. మతిమరుపు ఇబ్బంది పెడుతుంటే పుస్తకం చదవడం మొదలుపెట్టండి చాలు. మెదడులోని న్యూరాన్లు యాక్టివ్ గా మారుతాయి. చూడటం, చదవడం, గ్రహించడం దానిని స్టోర్ చేసుకోవడం ఇలా అన్నీ ఒక్కసారే జరిగే ప్రక్రియ మెదడుకి ఒక ఛాలెంజ్ లాంటిదే. ఆ ఛాలెంజ్ న్యూరాన్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 3. రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ రీసెర్చ్ వయసు ప్రభావం మెదడు మీద లేకుండా చేసే శక్తి పుస్తక పఠనానికి మాత్రమే ఉందని చెప్పింది. బాగా చదివే అలవాటు ఉన్నవారి మెదడు వయసు, వారి శారీరక వయసు కంటే తక్కువగా ఉండటం గుర్తించారు.     4. మానసిక ధృడత్వం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఎమోషనల్ ఇంటెలిజన్స్ ఇలా ఎన్నో జీవన నైపుణ్యాలు ఒక్క పుస్తక పఠనం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని గట్టిగా చెపుతున్నారు నిపుణులు. 5. ఒక్క పుస్తకం చేతిలో ఉంటే చాలు ఎందరో మనతో ఉన్నట్టే. మానసిక ప్రశాంతత, ఉత్సాహం అన్నీ లభిస్తాయి. ఒత్తిడికి సులువైన విరుగుడు పుస్తకం. కాబట్టి చదవడం మొదలుపెట్టగానే శరీరం, మనసు రెండూ రిలాక్స్ అవటం మొదలవుతుంది.     ఇక భాషాజ్ఞానం పెరగడం వంటి లాభాలు, అందరికీ అన్ని విధాలుగా ఎంతో ప్రయోజనం ఈ పుస్తకం పఠనం వల్ల అని తెలిసాక దానితో స్నేహం చేయకుండా ఉండగలమా? ఒకవేళ ఈ మధ్యకాలంలో దానిని పలకరించకపోతే ఒక్కసారి దగ్గర చేయాలనే ఈరోజుని 'పుస్తక దినోత్సవం'గా ప్రపంచవ్యాప్తంగా పాఠిస్తున్నారు. పుస్తకంతో మన అందరి అనుబంధం నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుందాం. -రమ
  అదో పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు. వాటిలో సహజంగానే ఓ సింహమూ, ఓ జింకా ఉన్నాయి. ఒక రోజు ఆ సింహం జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వేటాడేందుకు వెంటపడింది. సింహం నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులోకి పడిపోయింది. దాన్ని తరుముతూ సింహం కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు నిండా నీళ్లున్నా బాగుండేది. కానీ కరువుతో చెరువు సగానికి ఎండిపోయింది. బురదతో నిండిపోయింది. ఆ బురదలో ఒక పక్క జింక, మరోపక్క సింహం మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ‘‘హహ్హా! ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి, నీ లేత మాంసాన్ని రుచిచూస్తాను,’’ అంటూ నవ్వింది సింహం.   ‘‘నా మాంసపు రుచి తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు,’’ అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా సింహం ముందుకు కదలబోయింది. కానీ అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. ‘‘నిజమే నేను కదల్లేకపోతున్నాను. ఇప్పుడెలా!’’ అని బిక్కమొగం వేసింది సింహం. ‘‘నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా?’’ అని తాపీగా అడిగింది జింక.   ‘‘నేను ఈ అడవికి రాజుని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడ ఉంటారు. నాకు బానిసలు, శత్రువులే కానీ స్నేహితులు ఉండరు,’’ అని గర్వంగా చెప్పింది సింహం. ‘‘కానీ నాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు,’’ అని నమ్మకంగా చెప్పింది జింక. ‘‘సరే! అదీ చూద్దాం... ’’ అని ధీమాగా అంది సింహం. ఆ బురద చెరువులో కాలం చాలా భారంగా గడిచింది. ఒకో గంటా గడిచెకొద్దీ సింహంలో అసహనం పెరిగిపోయింది. కానీ జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. తన స్నేహితులు వస్తారనే నమ్మకం తనలో ఇసుమంతైనా తగ్గలేదు.   సాయంత్రం అయ్యింది. నిదానంగా చీకటి పడింది. అసలే ఆకలితో ఉన్న సింహం డీలాపడిపోయింది. కానీ తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో.... చెట్ల చాటు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ముందు ఓ జింక పిల్ల చెరువువైపు తొంగిచూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుక ఇంకో జింక.... వరుస పెట్టి ఓ జింకల మంద చెరువుగట్టుకి చేరింది. వాటికి అక్కడి పరిస్థితి చిటికెలో అర్థమైపోయింది. ఎలాగొలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. తాళ్లే పడేశాయో, చేతులే చాచాయో... మొత్తానికి ఎలాగొలా బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి తెచ్చాయి. దాన్ని తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వెళ్లిపోయాయి.   తన కళ్ల ముందే జరుగుతున్నది చూసిన సింహానికి మతిచెడిపోయింది. కచ్చగా తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే! అది మరింత లోతుకి జారిపోయింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  చలికాలం. పైగా ఆ రోజు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ఉదయం ఎనిమిదిగంటలైనా కూడా వెలుగు జాడ కనిపించడం లేదు. జనం ఇళ్లలోంచి అడుగుపెట్టే సాహసమే చేయడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు అలా వెచ్చగా ఉండగా ఒక నడివయసు మనిషి మాత్రం వీధి పక్కనే కూర్చుని వణుకుతూ ఉన్నాడు. ఇంతలో... ఎక్కడి నుంచో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి ఒక యువతి బయటకు దిగింది. ఆ నడివయసు మనిషి వంక చూడగానే ఆమె మనసు కరిగిపోయినట్లుంది. నిదానంగా అతని దగ్గరకు వెళ్లింది. ‘‘మీరు చలికి బాగా వణికిపోతున్నట్లు ఉన్నారు!’’ అని అడిగింది ఆ యువత. ఆ మాటలకి పెద్దాయన ఉలిక్కిపడ్డాడు. తనని పలకరించిన యువతిని ఓమారు తేరిపార చూశాడు. ‘సమస్యే లేదు. ఈవిడ బాగా డబ్బున్నావిడే. నా పేదరికాన్ని ఎగతాళి చేయడానికే ఇలా అడుగుతోంది,’ అనుకున్నాడు. అందుకే ‘‘ఆహా బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటాను,’’ అంటూ ఈసడించుకున్నాడు. ఆ మాటలకు ఆమె పెద్దగా బాధపడినట్లు లేదు. పైగా ‘‘మీరు ఆకలిగా ఉన్నారా!’’ అని అడిగింది. ఆ ప్రశ్నకి పెద్దాయన మరింత మండిపడ్డాడు. ‘‘అబ్బే ఇప్పుడే కడుపునిండా భోజనం చేసి వచ్చాను. నేను వదలేసిన తిండితో ఇంకో నలుగురు కడుపు నిండుతుంది,’’ అని నిష్టూరమాడాడు. పెద్దాయన ఎగతాళిని ఆ యువతి అంతగా పట్టించుకోలేదు సరికదా... ఆయన దగ్గరకి వెళ్లి భుజం మీద చేయి వేసి ‘‘పదండి. ఆ హోటళ్లో తింటూ మాట్లాడుకుందాం!’’ అంటూ ఎదురుగుండా ఉన్న హోటల్లోకి ఆయనను నడిపించుకుని వెళ్లింది. ఆ యువతి చర్యతో పెద్దాయనకి నోటమాట రాలేదు. హోటల్ మేనేజరు కూడా ఏదో అనబోయాడు. కానీ యువతి ఖరీదైన దుస్తులు చూసి లేని మర్యాదని తెచ్చిపెట్టుకున్నాడు. ‘‘ఏం కావాలి మేడం!’’ అంటూ వారి టేబుల్‌ దగ్గరకి వచ్చి వినయాన్ని ఒలకబోశాడు. ‘‘ఈయనకి ఏం కావాలో అన్నీ తీసుకురండి,’’ అని హుకుం జారీచేసింది యువతి. యువతి చలవతో పెద్దాయన కడుపునిండా తిన్నాడు. ఆకలి తీరాక, కాస్త వేడివేడి టీ నోట్లో పోసుకున్నాడు. ‘‘ఇదంతా మీరు నాకెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు!’’ అన్నాడు పెద్దాయన కాస్త కుదుటపడిన తర్వాత. ‘‘మీరు ఇంకా నన్ను గుర్తుపట్టినట్లు లేదు జేమ్స్!’’ అంది యువతి చిరునవ్వుతో. ఆ యువతి తనని పేరు పెట్టి పిలవడంతో పెద్దాయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా ఆ యువతి తన కథని ఆయనకు గుర్తుచేసేందుకు సిద్ధపడింది. ‘‘సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నేను కాలేజి చదువు ముగించుకుని, ఉద్యోగం కోసం ఈ ఊరికి వచ్చాను. ఎంత తిరిగినా నాకు ఉద్యోగం దొరకనేలేదు. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. అద్దె కట్టలేదని ఒకరోజు ఇంట్లోంచి కూడా నడివీధిలోకి గెంటేశారు. నిలువ నీడ లేదు, విపరీతమైన ఆకలి. ఆ ఆకలిలో ఏం చేయాలో తెలియక ఇదే హోటల్‌ ముందుకి వచ్చి నిలబడ్డాను...’’ ‘‘అవును ఆ రోజు నాకు గుర్తుంది. అప్పుడు నేను ఇదే హోటల్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నీకు ఏదన్నా ఆహారం పెడదామంటే దానికి హోటల్‌ నిబంధనలు ఒప్పుకోవని చెప్పాను...’’ అంటూ గుర్తుచేసుకున్నాడు పెద్దాయన. ‘‘అయినా మీరు నన్ను ఈసడించుకోలేదు. నాకు ఆహారం ఇచ్చి, ఆ బిల్లు మీ జేబులోంచి చెల్లించారు. అనుకోకుండా నాకు ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సొంతగా ఓ కంపెనీ పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఈ ఇరవై ఏళ్లలో ఇటువైపుగా వచ్చిన ప్రతిసారీ మీరు కనిపిస్తారేమో కృతజ్ఞతలు చెప్పుకుందామని అనుకున్నాను. మీ గురించి ఎంతగా వాకబు చేసినా లాభం లేకపోయింది. చివరికి ఇవాళ మీరు కనిపించారు. ఇక నుంచి మీకు ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది,’’ అంటూ తన విజిటింగ్ కార్డుని అతని చేతిలో పెట్టింది ఆ యువతి. ‘‘అబ్బే ఆ రోజు నేను నీకు చేసిన సాయం చాలా చిన్నదే! అలాంటి సాయం నేను చాలామందికి చాలాసార్లు చేశాను. అంత చిన్న సాయానికి నువ్వు ఎందుకింతగా తిరిగి చెల్లించుకోవాలని అనుకుంటున్నావు?’’ అని అడిగాడు పెద్దాయన. ‘‘కొన్ని సాయాలు మనకి చాలా చిన్నవిగానే తోచవచ్చు. కానీ ఆ చిన్న పనుల ఇతరుల మనసులో కొత్త ఆశలని నింపుతాయి. ఆ రోజు జరిగిన సంఘటనలతో నాకు మానవత్వం మీద నమ్మకం పోయింది, జీవితం మీద విరక్తి కలిగింది. కానీ మీరు చేసిన పనితో మనుషులలో మంచితనం ఇంకా మిగిలి ఉంది అన్న నమ్మకం కలిగింది. ఎలాగైనా జీవించాలన్న ఆశ ఏర్పడింది. మీరు కల్పించిన ఆశకీ, నమ్మకానికీ తిరిగి ఎంత చెల్లించినా తక్కువే కదా!,’’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది ఆ యువతి. నిజమే కదా!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  వల్లభనేని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. వల్లభనేని వంశీ.. నీకు సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు మాట్లాడు అని ధ్వజమెత్తారు. తన ఆస్తులను కాపాడుకునేందుకే వంశీ టీడీపీని వీడారని ఆయన ఆరోపించారు. ఈరోజు నెల్లూరులో లోకేష్ మీడియాతో మాట్లాడారు. వారం రోజుల క్రితం వంశీ తనతో మాట్లాడి.. ఇప్పుడు యూ టర్న్, జే టర్న్ తీసుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఒకరిద్దరి పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ఆదేశాలు జారీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆయనకు షోకాజ్‌ నోటీసులు కూడా పంపింది. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ  నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌పై వంశీ చేసిన విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టినట్టు తెలుస్తుంది. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చిన వంశీ..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తానేమీ కేసులకు భయపడడం లేదని..లావాదేవీల కోసం సీఎం జగన్ పక్కన చేరడం లేదన్నారు. వర్ధంతికి..జయంతికి తేడా తెలియని వాళ్లు పార్టీని నడుపుతున్నారంటూ పరోక్షంగా లోకేష్‌పై విమర్శలు చేశాడు వంశీ. అలాంటి వాళ్లు తమను అంటే పడాలా అంటూ నిలదీశారు. నన్ను బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో ఉంచుకుంటారా? అంటూ మరోసారి ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలపై తనకు మోజు లేదని వంశీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఘాటుగానే జవాబులు ఇస్తున్నారు. వైసీపీ లో ఉండే వారు ఎవ్వరు కడుపుకి అన్నం తినరని వంశీ ఒక్కప్పుడు మీడియాతో మాట్లాడిన మాటలు బయటకి వచ్చాయి.. అది చూసి " వైసీపీలో ఉన్నన్ని రోజులు వంశీ అన్నం తినకుండా డైటింగ్ చేస్తాడంటూ " సెటైర్ లు వేస్తున్నారు.
  సోషల్ మీడియాలో తనను కించపరిచేలా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుని కలిసి పరిస్థితులను వివరించారు. ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి  తనపై అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదంతా టీడీపీ సోషల్ మీడియా వింగ్‌ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. బాధ్యులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు వంశీ. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ.. 'చంద్రబాబు తనను సస్పెండ్ చేసేదేంటి.. నేనే పనిచేయనని చెప్పి బయటకొచ్చేశా' అంటూ కౌంటర్ వేశాడు. చంద్రబాబుకు అంత సీన్ లేదని.. మహా అయితే పళ్లు కొరకడం తప్ప ఆయనేమి చేయలేరని చతుర్లు ఆడారు. చంద్రబాబుకి రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలన్నారు. జూ.ఎన్టీఆర్‌కి..నారా లోకేష్ కి.. నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపారు. లోకేష్ కి పార్టీలో  పనిలేక సోషల్ మీడియా వింగ్స్ నడుపుకుంటూ కూర్చుంటున్నాడని విమర్శించారు. వెబ్‌సైట్స్ ద్వారా నేతల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని.. తనపై కూడా అలానే చెయ్యడం వల్లే మనస్తాపంతో పార్టీని వీడానని చెప్పుకొచ్చారు. పరువు కాపాడుకునేందుకు తనను సస్పెండ్ చేశారని.. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.  
  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై పార్టీ పరంగా దండయాత్ర మొదలైంది. తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ జగన్ రెడ్డికి మద్దతుగా నిలబడుతున్నట్లు వంశీ ప్రకటించారు. వెంటనే పార్టీ పరంగా వ్యూహం మొదలైపోయింది. వంశీ మీడియా సమావేశంలో జగన్ కు మద్దతు ప్రకటించే సమయానికి చంద్రబాబు ఇసుకకొరతపై దీక్ష చేస్తున్నారు. వంశీ ఏకంగా చంద్రబాబు.. లోకేష్ తో పాటు పేర్లు చెప్పకుండానే కొందరి నేతలపై చేసిన కామెంట్లను నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్ళారు. జిల్లా స్థాయిలో వంశీ అంటే పడని నేతలను ముందుగా గుర్తించే పనిలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు. మొదటగా ఎంఎల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ కనబడ్డారు. చంద్రబాబు ఆదేశానుసారం ప్రకారం రాజేంద్రప్రసాద్ గన్నవరం ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా టీవీ చర్చలో ఆరోపణలు మొదలుపెట్టేశారు. అయితే ఎంఎల్సీ ఊహించని విధంగా సదరు టివి చర్చలో వంశీ కూడా ప్రత్యక్షమయ్యారు. రాజేంద్రప్రసాద్ చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే తన కౌంటర్ మొదలుపెట్టటంతో ఖంగుతిన్నారు. చివరకు రాజకీయ ఆరోపణలతో మొదలయి.. చివరకు వ్యక్తిగత దూషణలతో ముగిసింది. వ్యక్తిగత విషయాలు ఒకరివి ఒకరు బయట పెట్టుకుంటూ చివరకు ఇద్దరు బూతులు తిట్టేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేసిన బోడెప్రసాద్ దగ్గర ఎంఎల్సీ డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపిస్తే.. చంద్రబాబు దగ్గర ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నాడంటూ రాజేంద్రప్రసాద్ ఎదురుదాడి చేసాడు.కూతురు పెళ్ళికి కూడా రాజేంద్రప్రసాద్.. బాబు దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ మళ్ళీ వంశీ దాడి మొదలుపట్టారు. ఇలా ఒకరిగురించి మరొకరు వ్యక్తిగత విషయాలు బయట పెట్టుకుంటూ బూతుపురాణమే చదివారు. వీళ్ళ బూతులను భరించలేక చర్చా కార్యక్రమాన్నే ఛానల్ అర్ధాంతరంగా నిలిపేసింది.
  ‘మిరపకాయ’ చూడటానికి చిన్నదే అయినా మన వంటల్లో దాని స్థానం మాత్రం పెద్దదే. కారం లేనిదే ఏ వంటకం పూర్తి కాదు. కేవలం రుచికి మాత్రమే కాదు... ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా వున్నాయట. మిరపకాయలో ఎ, బి, సి, ఇ విటమిన్లతోపాటు పొటాషియం, మాంగనీసు, ఫోలేట్ వంటి పోషకాలు బాగా లభిస్తాయట. మన ఆరోగ్యానికి మేలు చేసే కాప్సాసిన్ అనే పదార్ధం పచ్చిమిర్చిలో మనకు దొరుకుతుంది. శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడి ఆరోగ్యం చేకూర్చే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ పచ్చిమిరపకాయలో ఉన్నాయట. తొక్కే కదా అని తీసిపారేయకండి... ఇక మిరపకాయలలోని విటమిన్ బి శరీరంలో హోమోసిస్టిన్ పరిమాణాన్ని తగ్గించడమే కాదు.. హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందిట. సరే మరి, ఘాటైన మిరపకాయలోనే ఇన్ని సుగుణాలు వుంటే తియ్యటి యాపిల్ పండులో ఎన్ని ఉండాలి? రోజుకో యాపిల్ తింటే ఎలాంటి అనారోగ్యాలూ దరిచేరవు అంటారు కదా. చివరికి రోజుకో యాపిల్ తింటే క్యాన్సర్ కూడా దరిచేరదుట. యాపిల్ పండు తొక్కలో వుండే దాదాపు పన్నెండు రకాల రసాయన పదార్ధాలు క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చ్‌లో తేలింది. ‘ట్రిటర్ పెనాయిడ్స్’గా వ్యవహరించే ఈ పదార్ధాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయిట. కేవలం క్యాన్సర్ కణాలను అడ్డుకోవడమే కాదు.. ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటకి పంపించడంలోనూ యాపిల్ పై తొక్కులు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించారు పరిశోధకులు. తొక్కులోనే కాదు.. యాపిల్ పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ, ఫినోలిక్ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్ తింటే క్యాన్సర్‌కి చెక్ చెప్పవచ్చని వీరు సూచిస్తున్నారు. సో.. రోజుకో యాపిల్ తినడం అలవాటుగా మార్చుకోవాలి. హాయిగా ఊపిరి తీయండిలా... మన శరీరం మొత్తానికి రోజంతా ప్రాణవాయువు సరఫరా అవ్వాలంటే ఊపిరితిత్తులు సమర్థంగా పనిచేయాల్సిందే. ఈ ఊపిరితిత్తులు బలహీనమైతే జలుబు, దగ్గు వంటివి తరచూ పట్టి పీడిస్తుంటాయి. వీటి బారిన పడకుండా వుండాలంటే వారానికి కనీసం 5 యాపిల్స్ తినడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే వెల్లుల్లిలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయిట. అలాగే ఉల్లిపాయలో వుండే క్వెర్‌సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, గ్రీన్ టీ కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది అని తేలింది పరిశోధనల్లో. మోకాళ్ళ నొప్పులు హుష్ కాకి... మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి వాటితో బాధపడేవారు రోజూ ఒక యాపిల్ తినడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయంటున్నారు నిపుణులు. అలాగే నువ్వులని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ములగాకుని సాధారణంగా చాలామంది వంటకాలలో వాడరుగానీ, మునగాకుని వీలైనంత ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కీళ్ళ నొప్పులకు మంచి ఉపశమనం లభిస్తుందట. ఇవండీ.. చక్కటి ఆరోగ్యానికి కొన్ని మంచి సూత్రాలు.. మరి పాటిస్తారు కదూ! -రమ
  మోతాదు మించకుండా మద్యం పుచ్చుకుంటే ఏం కాదు, పైగా ఆరోగ్యానికి మంచిది కూడా! ఇక రోజుకి ఒకటో రెండో పెగ్గులు తాగితే గుండె కూడా బలంగా ఉంటుంది.... లాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ మాటలు పట్టుకుని మందుబాబులు ఒకటి రెండు పెగ్గులతో మొదలుపెట్టి ఒకటి రెండు క్వార్టర్ల స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇంతకీ మోతాదులో మద్యం మంచిదన్న మాట ఎక్కడిది. అది నిజంగా నిజమేనా!   మితంగా మద్యం తాగితే ఆరోగ్యపరమైన లాభాలు ఏమన్నా ఉన్నాయోమో పరిశీలించే ప్రయత్నం చేశారు కెనడాకి చెందిన పరిశోధకులు. దీనికోసం మద్యపానం గురించి ఇప్పటివరకూ జరిగిన ఓ 45 పరిశోధనల ఫలితాలను గమనించారు. మద్యంతాగనివారికంటే మోతాదులో మద్యం పుచ్చుకునేవారిలో గుండెజబ్బులు కాస్త తక్కువగానే ఉన్నట్లు వాటిలో చాలా పరిశోధనలు పేర్కొన్నాయి. కానీ ఈ పరిశోధనలని కాస్త జాగ్రత్తగా కనిపిస్తే ఒక విస్పష్టమైన లోపం కనిపించింది.   పరిశోధన సమయంలో ఒక వ్యక్తికి మద్యం అలవాటు ఉందా లేదా అని గమనిస్తున్నారు కానీ, అతనికి ఒకప్పుడు ఆ అలవాటు ఉందో లేదో ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, కాలేయ వ్యాధులు లాంటి సమస్యలు వచ్చిన తర్వాత చాలామంది మద్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. వారు సదరు అనారోగ్యంతో త్వరగా మరణించే ప్రమాదమూ ఉంది. దాంతో మందు తాగని వారు త్వరగా మరణిస్తున్నారని నిర్ధారించేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా జీవితంలో ఎప్పుడూ మందు ముట్టనంత మాత్రాన అతని లైఫ్‌స్టైల్‌ అద్భుతంగా ఉందనుకోవడానికి లేదు. వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం, ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం, పేదరికం.. లాంటి చాలా కారణాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంటాయి.   పైన తేల్చిన విషయాన్నే మరోసారి నిర్ధరించేందుకు మరో సర్వే కూడా చేశారు. ఇందుకోసం 9,100 మందిని... వారి 23 ఏట నుంచి 55 ఏట వరకు గమనించారు. ఒకప్పుడు మద్యం అలవాటు ఉన్న చాలామంది 55 ఏడు వచ్చేసరికి వేర్వేరు కారణాలతో ఆ అలవాటు మానుకుంటున్నట్లు తేల్చారు.   ఏతావాతా పరిశోధకులు చెప్పేదేమిటంటే... తక్కువ మోతాదులో మద్యం పుచ్చుకోవడం వల్ల, ఆరోగ్యానికి పెద్దగా హాని కలగని మాట వాస్తవమే! అలాగని మందుతో ఏవో అద్భుతాలు జరుగుతాయన్న భ్రమలు మాత్రం కూడదంటున్నారు. ఈ భ్రమలో పడి లేని అలవాటుని బలవంతంగా చేసుకోవాల్సిన అగత్యం అసలే లేదంటున్నారు.   - నిర్జర.
  ఆరోగ్యం..ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన శరీరానికి తగిన పోషకాలు, విటమిన్లు అందితేనే ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా ఉండాలంటే కొన్నిపాతకాలపు ఆహారపు అలవాట్లు పాటించాలి. అవేంటో ఈ వీడియో ద్వారా చూసి వాటిని పాటించండి. ఆరోగ్యంగా ఉండండి.. https://www.youtube.com/watch?v=ZH5yCJttcWQ      
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.