EDITORIAL SPECIAL
  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఓటర్లు నేడు తీర్పునివ్వనున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలోని యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగుతుండగా అటు ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి, కమలనాథులకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమరంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఓటరు తీర్పు ఏమిటన్నది గురువారం తేలిపోనుంది.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులున్నారు. ఇందులో ఒక్క నాందేడ్ దక్షిణ నియోజక వర్గం నుంచే 38 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇక చిప్లున్ నియోజక వర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బిజెపి 152 స్థానాల్లో పోటీ చేస్తోండగా, శివసేన 124 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఓర్లీ నియోజక వర్గం నుంచి ఠాక్రే వారుసుడు ఆదిత్య ఠాక్రే పోటీకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ 145 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ 123 స్థానాల్లో పోటీకి దిగింది. వీటితో పాటు ఇతర పార్టీలు కూడా పోటీకి దిగాయి. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏకంగా 103 స్థానాల్లో పోటీకి దిగి ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో దిగి సవాల్ విసురుతోంది. ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. హర్యానాల్లోనూ పోటీ వేడిని పెంచుతోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా..1,169 తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హన్సీ నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యల్పంగా షహబాద్ నియోజకవర్గల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బిజెపి 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు లేకుండా 90 స్థానాల్లో బరిలో నిలిచింది. ఇక బీఎస్పీ 87 ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  మహారాష్ట్ర, హర్యానాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో ఆయా నేతల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతను మార్చబోతున్నాయి. అందుకే ఈ ఎన్నికలపైనా నిఘా పెరిగింది. దాదాపు పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లోని నాయకుల పరిపాలనకు మార్కులు వేయబోతున్నారు ఓటర్లు. యూపీలో ఏకంగా 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగికి ఇది కఠిన పరీక్షే. యూపీలో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. బీహార్ లోని 5 స్థానాలు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బైపోల్స్ కూడా బిజెపి, జేడీయూ స్నేహానికి కీలకంగా మారబోతున్నాయి. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో పార్టీలు కర్టనరైజర్ గా చూస్తున్నాయి.  మధ్యప్రదేశ్ లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లు ఉంది. బిజెపి కాంగ్రెస్ ల మధ్య బలం దోబూచులాడుతోంది. స్వతంత్రులు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గట్టెక్కిన, కర్ణాటక పరిణామాలు కమలనాధ్ సర్కారుకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఉప ఎన్నిక అటు బిజెపి  ఇటు కాంగ్రెస్ కు చాలా కీలకం. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను ఓ బీఎస్పీను లాగి కాంగ్రెస్ వ్యూహం ప్రదర్శించిన ఎప్పటికైనా బిజెపి నుంచి ముప్పు తప్పదన్న భావనలో ఉంది.అందుకే ఈ ఒక్క స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. ఇది గెలిస్తే ప్రజాభిప్రాయం తమకే ఉందంటూ కర్నాటక ఫార్ములా ప్రయోగించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.  కేరళలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఐదింటినీ చేజిక్కించుకోవాలని లెఫ్ట్ ఫ్రంట్ చూస్తూంటే పాగా వేయాలని బిజెపి అనుకుంటోది. అటు కాంగ్రెస్ కూటమి కూడా గెలుపుపై నమ్మకం పెట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరుగుతున్నాయి. అందుకే తాజా ఉప పోరును సెమీ సమరంగా చెబుతున్నారు.  తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో రెండు స్థానాలపై డీఎంకే కన్నేసింది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అదరగొడుతోంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమాతో ఉన్న స్టాలిన్ పార్టీ ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అటు అన్నా డీఎంకే నేతలు మాత్రం అసెంబ్లీలో తమ నెంబర్ పెరుగుతుందని చెబుతున్నారు.  తెలంగాణలోని హుజూర్ నగర్ పై అందరి దృష్టీ నెలకొంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. గుజరాత్, పంజాబ్, ఒడిషా రాష్ట్రాల్లోను ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ఇప్పటికే బిజెపి ప్రభుత్వం బలంగా మారింది. ఇప్పుడు అక్కడ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోవు. పంజాబ్ లోనూ కెప్టెన్ సర్కార్ కు ఎన్ని మార్కులు పడతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్ కు ఒక్క స్థానంతో ఎలాంటి మార్పు ఉండదు. కానీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు మరింత కీలకంగా మారాయి ,ఎందుకంటే వీటితోనే జాతకాలు తేలిపోనున్నాయి. అధికార పార్టీల పాలనపై జనం మాటేంటో ఫలితాల ద్వారా బయటకు రానుంది, మరి ప్రజాధరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది హైదరాబాదీయుల పరిస్థితి. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు మరో షాక్ తగిలింది. బస్సుల బంద్ తో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు క్యాబ్ డ్రైవర్లు ఝలక్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. దాంతో ఒకవైపు తెలంగాణ బంద్... మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో... రాష్ట్రం మొత్తం స్తంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 50వేలకు పైగా క్యాబ్ లు నిలిచిపోనుండటంతో నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు ఆగిపోనుంది. క్యాబ్ సంస్థలు పెద్దఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దాంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాంతో అప్పులు చెల్లించలేక క్యాబ్ డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. అందుకే, ప్రతి డ్రైవర్ కు కనీస బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలను కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మెను ఆపేది లేదని క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ తెగేసి చెప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ కు క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టడంతో... కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఎందుకంటే ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నగరవాసులు... ఎక్కువగా క్యాబ్ లనే ఆశ్రయిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలన్నా... అక్కడ్నుంచి రావాలన్నా... క్యాబ్ లే ఆధారం. ఇక ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా క్యాబ్ లపైనే ఆధారపడుతుంటారు. దాంతో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో ప్రధాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించినట్లవుతుంది. అయితే, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె బాటపట్టే అవకాశముండటంతో.... కేవలం మెట్రో అండ్ ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.
ALSO ON TELUGUONE N E W S
  అప్పటిదాకా ఒక మామూలు హీరోగా ఉన్న చిరంజీవిని స్టార్ హీరోగా మార్చిన సినిమా 'ఖైదీ'. చిరంజీవి యాక్టర్ అయిన ఆరేళ్లకు అంటే 1983లో వచ్చిన ఆ సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఆవిర్భవించాడు. అప్పటి సీనియర్ స్టార్ కృష్ణ చేయాల్సిన ఆ సినిమా, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా అనూహ్య పరిస్థితుల్లో చిరంజీవిని వరించింది. ఎ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన 'ఖైదీ'ని చూసి ప్రేక్షకులు పిచ్చెత్తిపోయారు. అందులో చిరంజీవి చేసిన ఫెరోషియస్ ఫైట్లు మాస్‌ను విపరీతంగా ఆకట్టుకుంటే, డాన్సులు అందర్నీ అలరించాయి. ప్రధానంగా 'రగులుతోంది మొగలిపొద' సాంగ్‌లో హీరోయిన్ మాధవితో కలిసి ఆయన చేసిన నృత్యాలు చూసి ఫ్లాటైపోనివాళ్లు లేరు. తన అక్క చావుకు కారణమైన వాళ్ల అంతుచూసే యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా చేసిన పర్ఫార్మెన్స్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు చిరంజీవి. ఆయన ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రమంగా ఇమేజ్ పెంచుకుంటూ 'పసివాడి ప్రాణం' సినిమాతో నంబర్ వన్ స్టార్‌గా రూపాంతరం చెందాడు. సందర్భవశాత్తూ ఆ మూవీ డైరెక్టర్ కూడా కోదండరామిరెడ్డే. 'ఖైదీ' సినిమా వచ్చి 36 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటికీ మెగాస్టార్ హవా ఏమాత్రం తగ్గలేదని 'ఖైదీ నంబర్ 150', 'సైరా' సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు 'ఖైదీ' పేరుతో మరో సినిమా వస్తోంది. ఆ సినిమా చేసింది టాలీవుడ్ యాక్టర్ కాదు. తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన తమిళ హీరో కార్తీ. తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో అక్టోబర్ 25న లేటెస్ట్ 'ఖైదీ' రిలీజవుతోంది. చిరంజీవి 'ఖైదీ' విడుదలైంది కూడా అక్టోబర్‌లోనే కావడం గమనార్హం. అక్టోబర్ 28న ఆ 'ఖైదీ' వచ్చింది. ఈ అక్టోబర్ 28 సోమవారం కావడం వల్లే, 25న కార్తీ 'ఖైదీ' వస్తుందనుకోవాలి. గురువారమో, శుక్రవారమో, శనివారమో అక్టోబర్ 28 వచ్చినట్లయితే, కచ్చితంగా ఆ తేదీనే రిలీజ్ చేసి ఉండేవాళ్లు. చిరంజీవి 'ఖైదీ' కథకూ, కార్తీ 'ఖైదీ' కథకు ఏమాత్రం సంబంధం లేదని కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్ ద్వారా మనకు అర్థమైంది. అక్కడ అక్క చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయే యువకుడిగా చిరంజీవి కనిపిస్తే, ఇక్కడ తను అంతవరకూ చూడని పదేళ్ల కూతుర్ని చూడ్డానికి జైలు నుంచి తప్పించుకున్న యావజ్జీవ ఖైదీగా కార్తీ కనిపించనున్నాడు. అతను ఎందుకు జైలుకు వెళ్లాడనే విషయం తెలీదు. ఆ కూతురు ఒక అనాథ శరణాలయంలో పెరుగుతున్నట్లు ట్రైలర్‌లో కనిపించింది. "నన్ను చూడ్డానికి రేపు ఎవరూ రారేమో అనిపిస్తోంది" అని ఆ అమ్మాయి అనుకోవడం చూస్తే, ఆ రోజుకు ఏదో ప్రాధాన్యం ఉందనీ, బహుశా అది ఆమె పదో పుట్టినరోజు కావచ్చనీ అభిప్రాయం కలుగుతోంది. ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకుంటే, పోలీసులు ఊరుకుంటారా? వెంటబడ్డారు. ఆ క్రమంలో కార్తీ ఒక స్మగ్లింగ్ దందాకు సంబంధించిన సమస్యలో చిక్కుకున్నాడనీ, 840 కోట్ల రూపాయల విలువచేసే సరుకు ఉన్న లారీని కార్తీ తన అదుపులోకి తీసుకున్నాడనీ, దాంతో ఒక వైపు పోలీసులతో పాటు, మరోవైపు స్మగ్లర్లు కూడా అతని వెంట పడ్డారనీ ఊహించవచ్చు. ఆ స్మగ్లర్లతో కార్తీ చేసే ఫెరోషియస్ యాక్షన్ సీన్లూ ఈ సినిమాలో ఉన్నాయి. ఇంతకీ తన కూతుర్ని 'ఖైదీ' చూసుకున్నాడా, లేదా.. అనేది మనం సినిమాలో చూడబోతున్నాం. రెండు 'ఖైదీ' సినిమాల మధ్య ఇంకో స్పష్టమైన తేడా ఉంది. ఆ 'ఖైదీ'లో ఒకరికి ఇద్దరు హీరోయిన్లు.. మాధవి, సుమలత.. ఉన్నారు. విలన్ రావుగోపాలరావు కూతురై ఉండి కూడా చిరంజీవికి మనసిచ్చిన మెయిన్ హీరోయిన్‌గా మాధవి నటిస్తే, ఆపదలో చిరంజీవికి ఆశ్రయమిచ్చి, అతడిని కాపాడే క్రమంలో తన ప్రాణాల్ని కోల్పోయిన డాక్టర్‌గా సుమలత కనిపిస్తుంది. కొత్త 'ఖైదీ'లో అసలు హీరోయిన్లు లేకపోవడం గమనార్హం. కూతురు ఉన్నప్పుడు భార్య ఉండాలి కదా.. ఆమె ఎవరో చూపించలేదు. కాబట్టి కార్తీకి డ్యూయెట్లు లాంటివేవీ లేవు. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. ఒక వర్సటైల్ యాక్టర్‌గా కార్తీకి ఈ సినిమా మంచి పేరు తెస్తుందని సినిమా యూనిట్ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌కు 'ఖైదీ' రెండో సినిమా. దీనికి ముందు అతను 'మానగారం' అనే థ్రిల్లర్ తీశాడు. అది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ మూవీ నచ్చే 'ఖైదీ'ని అతని డైరెక్షన్‌లో చేశాడు కార్తీ. ఈ మూవీ తర్వాత ఏకంగా తమిళ టాప్ స్టార్ విజయ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు లోకేష్. దాన్నిబట్టి అతను ఎంతటి టాలెంటెడ్ డైరెక్టరనేది అర్థమవుతుంది. చిరంజీవి 'ఖైదీ'లా, తన 'ఖైదీ' కూడా సూపర్ హిట్టవుతుందనే నమ్మకాన్ని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తం చేశాడు కార్తీ. ఇలాంటి నేపథ్యంతో వస్తోన్న 'ఖైదీ' సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ రీతిన ఆకట్టుకుంటుందో నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది.
'అల... వైకుంఠపురములో' షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆల్మోస్ట్ ఏడాది పాటు బన్నీ షూటింగులేవీ చేయలేదు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విడుదల తర్వాత కథలు ఎంపికపై దృష్టి పెట్టడంతో కాస్త ఒళ్ళు చేశాడు. డిజైనర్ వేర్ స్టయిలిష్ లూజ్ టీషర్టులు వేయడంతో కొంతవరకూ మేనేజ్ చేశాడు. సినిమాలో మేనేజ్ చేయడం కష్టం. అందులోనూ మిస్టర్ పర్ఫెక్ట్ అల్లు అర్జున్ మేనేజ్ చేయడానికి ఇష్టపడడు. అందుకని బరువు తగ్గాడు. కొంత గ్యాప్ తరవాత 'అల... వైకుంఠపురములో' స్టిల్స్ లో బన్నీని చూసినవాళ్లు సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఇంతలో అంతలా ఎలా సన్నబడ్డాడు అని. 'అల... వైకుంఠపురములో' కోసం అల్లు అర్జున్ నాలుగు నెలల్లో 14 కిలోల బరువు తగ్గాడు. ఎలాగో తెలుసా? కిటో డైట్ ఫాలో కావడం ద్వారా. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా కోసం బరువు తగ్గాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నప్పుడు కిటో డైట్ ఫాలో కావడం స్టార్ట్ చేశాడట. లో కార్బోహైడ్రేట్ డైట్ అన్నమాట. అదీ సంగతి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాలో 'రాములో రాములా' సాంగ్ టీజర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు.
  రామానాయుడుగారి మనవడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు వెర్సటైల్ యాక్టర్ రానా తమ్ముడు అభిరామ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని టాక్. నిజానికి, ఎప్పుడో ఈ కుర్రాడు హీరోగా రావాల్సింది. వంశీ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన 'లేడీస్ టైలర్'ను అభిరామ్ తో చేయాలని నిర్మాత మధుర శ్రీధర్ కొంత ప్రయత్నం చేశారు. ఎందుకో సక్సెస్ కాలేదు. తర్వాత పవన్ సాధినేని దర్శకత్వంలో అభిరామ్ హీరోగా పరిచయం కానున్నారని ఓ వార్త వినిపించింది. అయితే అటువంటిది ఏదీ జరగలేదు. తర్వాత శ్రీరెడ్డి ఇష్యూలో అభిరామ్ పేరు ప్రముఖంగా వినిపించడంతో కొన్నాళ్ళు మీడియా ముందు ఎక్కడా అతడు కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు అభిరామ్ పేరు బయటకొచ్చింది. అతడు ముంబైలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడట. మంచి కథ దొరికిన వెంటనే స్వంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో తనయుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ సినిమా స్టార్ట్ చేయాలని సురేష్ బాబు ఆలోచిస్తున్నారట.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'విజిల్' ఈ శుక్రవారం తెలుగులోనూ విడుదలవుతోంది. అలాగే, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీ నటించిన 'ఖైదీ' కూడా శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది. ఈ దీపావళికి తెలుగులో విడుదలవుతున్న భారీ సినిమాలు ఇవే. సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు ఇవే దిక్కు. తెలుగు ప్రేక్షకులది పెద్ద మనసు. తెలుగు, తమిళం అని వివక్ష చూపకుండా మంచి సినిమాలు వస్తే చూస్తారు. అలాగని, థియేటర్లలో కొత్త తెలుగు సినిమాలు లేకపోతే ఎలా? అదీ దీపావళికి. పండక్కి తెలుగులో మాంచి స్టార్ సినిమా విడుదలైతే అదో కిక్. గత ఏడాది (2018)లో దీపావళికి నాలుగు రోజుల ముందు నాగచైతన్య 'సవ్యసాచి' విడుదలైంది. అంతకు ముందు ఏడాది (2017) దీపావళికి కొంచెం అటు ఇటుగా రవితేజ 'రాజా ది గ్రేట్' వచ్చింది. ఈ ఏడాది దీపావళికి సరైన తెలుగు సినిమా ఒక్కటి కూడా లేకుండా పోయింది. మొన్నటికి మొన్న దసరా పండక్కి 'సైరా', 'చాణక్య' సినిమాలు వచ్చాయి. మధ్యలో 'ఊరంతా అనుకుంటున్నారు' కూడా విడుదలైంది. నెక్స్ట్ క్రిస్మస్ బరిలో మూడు నాలుగు సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. సంక్రాంతికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి, దీపావళిని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందుకు మిస్ చేసుకుంటోందో? తమిళ సినిమాలకు ఎందుకు వదిలేసిందో? నిర్మాతల్లో సరైన ప్లానింగ్, అండర్ స్టాండింగ్ లేకపోవడమని డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుస.
  "ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం నా క్యారెక్టరైజేషన్. పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బయటకు వచ్చే ఒక 'ఖైదీ' క్యారెక్టర్. అతనికి ఒక కూతురు ఉంటుంది. కానీ అప్పటి దాకా ఆమెను అతను చూడలేదు. తను ఎలా ఉంటుందో  కూడా తెలీదు. అన్ని అవాంతరాలని దాటుకొని తన కూతురిని చూడగలిగాడా? లేదా? అనేది కథ" అని చెప్పారు కార్తీ. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖైదీ'లో ఆయన టైటిల్ రోల్ పోషించారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా 'ఖైదీ' విడుదలవుతున్నసందర్భంగా కార్తీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... "డైరెక్టర్ లోకేష్  కనకరాజ్‌ షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇండస్ట్రీకి వచ్చారు.  ఫస్ట్ మూవీ 'మానగారం'తోనే  చాలా పెద్ద హిట్ అందుకున్నారు. ఈ కథ చెప్పేటప్పుడే 'ఇదొక కొత్త ఐడియా. కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకసారి వినండి' అని చెప్పారు. సినిమా మొత్తం మాస్ ఉంటుంది. యాక్షన్ కూడా ఎక్కువే. ఒక రాత్రి  నాలుగు గంటల కాలంలో కథ జరుగుతుంది. ఆ నాలుగు గంటల్లోనే చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని ఒక భారీ బడ్జెట్ సినిమాగా తీస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనిపించింది. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది." క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది "ఇదొక బిగ్ యాక్షన్ ఫిలిం. పది సంవత్సరాలు తన కూతురిని చూడలేదు అంటే నాకు కూడా పెర్ఫామెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ నచ్చే ఈ సినిమా చేశాను. నిజ జీవితంలో నాకు ఒక కూతురు ఉండడం వల్ల తండ్రిగా నటించడం ఈజీ అయింది. నేను గతంలో 'విక్రమార్కుడు' మూవీని తమిళంలో రీమేక్ చేసేటప్పుడు నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని నటించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య ఏమీ లేదు కాబట్టి అంతా హ్యాపీగా చేశాను." డైలాగ్స్ బలం "ఈ సినిమా బలాల్లో డైలాగ్స్ కూడా ఒకటి. ట్రైలర్‌లో నా డైలాగ్స్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. అందులో చూపించింది చాలా తక్కువ. రేపు సినిమాలో డైలాగ్స్‌కి  మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. ప్రతి సీన్ ఫ్రెష్‌గా ఉంటుంది. సినిమా ఒక న్యూ ఏజ్ యాక్షన్ ఫిలింలా ఉంటుంది, కానీ నా క్యారెక్టర్ మాత్రం మాస్. ఇదొక యూనిక్ కాంబినేషన్. అతను ఎవరు? అతని గతం ఏంటి అనేది మోర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అతను చెప్పే డైలాగ్స్‌కి ఆడియెన్స్ బాగా స్పందిస్తారు." ఆ 'ఖైదీ' లాగే! "చిరంజీవి గారి ఐకనిక్ ఫిల్మ్ 'ఖైదీ'.. అక్టోబర్ 28న విడుదలైన విషయం నాకు ముందు తెలీదు. ఇప్పుడే తెలిసింది. చాలా ఆనందమేసింది. ఇది చాలా మంచి విషయం. నా సినిమాకి అనుకోకుండా ఈ నెలే కుదిరింది. ఆ సినిమా లాగే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో నాతో పాటు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్  ఉంటాయి. ఫేమస్ ఆర్టిస్టులు  నటించారు." హాలీవుడ్ స్టైల్ మ్యూజిక్ "ఇలాంటి ఒక మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నపుడు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోను ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టడమనేది న్యూ థాట్. అందుకు తగ్గట్లు ఒక హాలీవుడ్ మూవీలాగే మ్యూజిక్ ఇచ్చారు శ్యాం. మాములుగా ఇలాంటి సినిమా రెండు గంటలే ఉంటుంది. కానీ కాన్ఫిడెంట్‌గా 2 గంటల 20 నిమిషాలు పెడుతున్నామంటే తప్పకుండా దానికి సరిపోయేంత థ్రిల్ ఉన్న కంటెంట్ ఉండబట్టే." ఇలాంటివి తరచూ రావు "తెలుగులోనూ కొత్త కొత్త కథలతో థ్రిల్లర్  సినిమాలు వస్తున్నాయి. 'అర్జున్ రెడ్డి',  అడవి శేష్ స్టైలిష్ థ్రిలర్ 'ఎవరు' వంటివి పెద్ద సక్సెస్ అయ్యాయి.  అందులోను డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికీ చాలా దగ్గరయింది. ఇలాంటి సందర్భంలో 'ఖైదీ' లాంటి సినిమా చేసే అవకాశం తరచూ రాదు. ఎప్పుడో ఒక్కసారే వస్తుంది.  నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేటప్పుడు కూడా ఇలాంటి సినిమాలు చేయాలి అనుకున్నాను. సాంగ్స్‌, రొమాన్స్‌ లేకుండా కేవలం యాక్షన్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండే డిఫరెంట్‌ మూవీ ఇది. నేను కథలో ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటాను. అంతేకాని అలా ప్లాన్ చేసి సెలెక్ట్ చేస్తే వెరైటీ చేయడం చాలా కష్టం." ఖైదీలు వెలుగును కోరుకుంటారు "ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు మేము నిజ జీవిత ఖైదీలను కలిశాం. డైరెక్టర్ వారిని కలిసినప్పుడు చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు. చాలా కాలం జైలులో ఉన్న ఖైదీలు బయటకు వచ్చి వైట్ కలర్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది.. అని చెప్పారు. వెలుతురును వాళ్లంత ఇష్టపడతారు. ఒక విషయం చెప్పమంటారా.. ఈ సినిమాని మొత్తం 60 రాత్రులు షూట్ చేశాం. ఈ సినిమా తీసిన తర్వాత లోకేష్ కనకరాజ్‌కు విజయ్ గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇప్పటివరకూ నేను చేసిన అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్." నెక్స్ట్ ప్రాజెక్ట్ "డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారితో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ చేస్తున్నాను. దానిలో మా వదిన జ్యోతిక కూడా నటిస్తున్నారు. చాలా మంచి కథ. అందర్నీ ఆకట్టుకొనే అంశాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కథ."
  ఏపీ జల వనరుల శాఖ నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో హైదరాబాద్ లో భేటీ కానుంది. సమావేశంలో సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల కార్యాచరణను గురించి ప్రశ్నించనుంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నప్పుడు వద్దని వారిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ రాసింది. పీపీఏతో సహా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ సూచించింది. తరువాత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. రివర్స్ టెండర్ విధానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొన్నప్పటికీ పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, పోలవరం జల విద్యుత్ కేంద్రాలను కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ లను జలవనరులశాఖ పిలిచింది. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి రాష్ట్ర హై కోర్టులో వివాదం ఉంది. హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యి తీర్పు రిజర్వులో ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర జల వనరుల శాఖతో పీపీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడే న్యాయపరమైన ప్రతిబంధకాలు తలెత్తుతాయని ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని పీపీఏతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు హెచ్చరించాయి. అయితే నేటి సమావేశంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని రివర్స్ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని వివరించనుంది. ఒకే ఒక్క సంస్థ బిడ్ ను దాఖలు చేసినందున రీటెండర్ గా పరిగణించాల్సి ఉంటుందని వివరించనుంది. ఈ రీటెండర్ లో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆదా అయిందని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ వివరించనుంది. న్యాయస్థానం తీర్పు వెలువడ్డాకే కార్యాచరణను ప్రకటిస్తామని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేయనుంది. న్యాయస్థానం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉటుందని పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. అయితే దీనిపై పీపీఏ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి  సర్వత్రా నెలకొంది.  మరోవైపు పోలవరం తుది అంచనాల పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ న్యూఢిల్లీలో రేపు భేటీ కానుంది. ఇప్పటికే పలు దఫాలు ఈ సమావేశాలు జరిగాయి. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం, పోలవరం తుది అంచనాలు యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా సంఘం సమ్మతి తెలిపింది. దీన్ని ఆమోదించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఫైలు పంపింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ తుది అంచనాలోని భూ సేకరణ సహాయ పునరావాసం వ్యయంపై ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తూ వస్తోంది. అటు ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెండు వేల పద్నాలుగుకు ముందు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఆడిట్ నివేదికను కోరుతోంది. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం సాగు జల విద్యుత్ కేంద్రాల రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ఈ రివర్స్ టెండరింగ్ లో ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే పోలవరం తుది అంచనా యాభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లకు చేరుతుంది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఇక పైన అయినా పోలవరంలోని పనులు జోరందుకుంటాయో లేదో వేచి చూడాలి.
  తెలంగాణ ఏర్పడిన తర్వాత అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సంఘంతో పాటు సచివాలయ టీఎన్జీవో విభాగాలు ప్రధాన సంఘంలో విలీనమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు దానిని విరమింపజేయటానికి జ్యూస్ ను అందించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తొలిగురి ఎమార్పీఎస్ పైనే ఉంది. మంద కృష్ణ మాదిగకు కుడి ఎడమ భుజంగా ఉన్న కీలక నేతలతో రహస్యంగా సమావేశమైన కేసీఆర్ ఎమ్మార్పీఎస్ ను ముక్కలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయానికి కొన్ని ప్రజా ఉద్యోగ సంఘాలు తలో దిక్కున ఉన్నాయి. వాటికి తోడు మరికొన్ని సంఘాలను అప్పట్లో టీఆర్ఎస్ ఏర్పాటు చేయించింది. విడివిడిగా ఉన్న సంఘాలను దగ్గరికి చేర్చి బలమైన తాడుగా పేనింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకం చేసింది. అన్నిటినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. సొంత రాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వివిధ సంఘాలు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలకు ఇది నచ్చటం లేదని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోవడం లేదని ప్రజా, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.  ప్రభుత్వంలోని ముఖ్యులు సంఘాలను నిలువుగా చీల్చే వ్యూహాలకు పదును పెడుతూ చాలా వరకు సఫలీకృతులవుతారనే చర్చ నడుస్తోంది. ఇందుకు సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో చీలిక వర్గం ప్రభుత్వానికి పూర్తి విధేయత ప్రకటిస్తుంది. రెండో వర్గం న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. రాష్ట్ర సర్పంచుల సంఘంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మరొక వర్గం అధికార టీఆర్ఎస్ అండగా నిలుస్తోంది.  తాజాగా ఆర్టీసీ సమ్మెకు నేతృత్వం వహిస్తున్న టీఎంయూ చీలికకు తెర వెనుక పావులు కదుపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా ప్రభుత్వం ముందు న్యాయమైన తమ వర్గం సమస్యలను ఉంచి పరిష్కారం కోసం కొట్లాడుతున్న సంఘాల నేతలను వేధింపులు తప్పడం లేదనే ఆందోళన నెలకొంది. అప్రాధాన్య పోస్టులలోకి సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు గురి చేయటం వంటి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ అధినేతకు విధేయత చాటిన వారికి కూడా ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదనే చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యోగులతో అప్రకటిత యుద్ధం చేస్తున్న క్రమంలోనే ఒకే సంఘానికి చెందిన నేతలు భిన్నస్వరాలు వినిపించటం ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి ఉద్యమ సమయంలో వీరంతా టీఆర్ఎస్ నేతలకు చాలా సన్నిహితంగా మెలిగిన వారే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలకు సహకరించారు. అప్పుడు వారి పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచిన సమాచారాన్ని గుట్టుగా అందజేశారు.  హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో భూముల అక్రమ కేటాయింపుల సమాచారాన్ని తెలంగాణ తహసీల్దార్ ల సంఘం అధ్యక్షుడు అయిన వి లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతి నిధుల నుంచే కేసీఆర్ ఆ సమాచారాన్ని సేకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని తహసీల్దార్ లకు కట్టబెట్టడాన్ని తహసీల్దార్లంతా తీవ్రంగా వ్యతిరేకించగా సీఎం విధేయుడిగా ఉన్న లచ్చిరెడ్డి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అందుకు నజరానాగా లచ్చిరెడ్డికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. రెండేళ్ల పాటు అంతా బాగానే ఉన్నా కలెక్టర్ల సదస్సులో ఏం జరిగిందో తెలుసుకోవటానికి మంత్రి ఈటెలతో లచ్చిరెడ్డి భేటీ అయ్యారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిని సాకుగా చేసుకున్నా ప్రభుత్వం లచ్చిరెడ్డి బదిలీ చేయడమే కాకుండా ఇటీవలే కొందరు డిప్యూటీ కలెక్టర్ లతో ఆయన పెట్టుకున్న సంఘంలో కూడా చీలిక తెచ్చింది. ఆ సంఘంలో కీలక కార్యవర్గ సభ్యులంతా రాజీనామాలు చేశారు.అసలు తెలంగాణ ప్రభుత్వంలో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆర్టీసీ సమ్మె కారణంగా అంతరంగా దాగున్న రహస్యాలు అన్ని బయటకు వస్తున్నాయా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.
నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధికమంత్రి... పరకాల ప్రభాకర్, పొలిటికల్ ఎకనామిస్ట్... ఇద్దరూ భార్యాభర్తలు... ఒకరు దేశ ఆర్ధిక వ్యవహారాలను చూస్తుంటే.... మరొకరు ఆ ఆర్ధిక విధానాల్లో మంచిచెడ్డలను విశ్లేషిస్తుంటారు. అయితే, దేశ ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ భర్తగా... ఎన్డీఏ ప్రభుత్వంపై పరకాల ప్రభాకర్ చేసిన హాట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ పరకాల చేసిన కామెంట్స్... కలకలం రేపుతున్నాయి. నెహ్రూ సోషలిజాన్ని విమర్శించే బదులు సరళీకృత ఆర్ధిక విధానాలకు బాటలు చూపిన పీవీ, మన్మోహన్ నమూనాలను అనుసరించాలన్న పరకాల.... పీవీ, మన్మోహన్ ఆర్ధిక విధానాలు ఇఫ్పటికీ సవాలు చేయలేనివిధంగా ఉన్నాయంటూ పొగడటంపై దేశమంతా చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ భార్య కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉండగా, పరకాల ప్రభాకర్ ఈ కామెంట్స్ చేయడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ నేరుగా స్పందించకపోయినా, మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటరిచ్చారు. యూపీఏ హయాంలో... కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేయడంతోనే కొంతమందికి బ్యాంకర్లు లోన్లు ఇచ్చారని, దాని ఫలితమే ఇప్పుడు బ్యాంకింగ్ రంగ సంక్షోభమని నిర్మల ఆరోపించారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై పరకాల ప్రభాకర్ విమర్శలు... కౌంటర్ గా నిర్మలా సీతారామన్ కామెంట్... కలకలం రేపుతున్నాయి. అయితే, పరకాల ప్రభాకర్ కాకుండా, ఇంకెవరైనా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసుంటే... ఇంత చర్చ, రగడ జరిగేది కాదు... కానీ భార్య ఆర్ధికమంత్రిగా ఉండగా, భర్త విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో, పరకాల ప్రభాకర్-నిర్మలా సీతారామన్ డైలాగ్ వార్ దేశమంతా ఆసక్తి రేపుతోంది. అయితే, భార్యాభర్తల నడుమ ఇంటి బడ్జెట్‌పై గొడవలు, వాదనలు కామనే అయినా, ఏకంగా దేశ ఆర్ధిక పరిస్థితిపై వాదులాడుకోవడం మాత్రం సంచలనంగా మారింది.
చింతమనేనిపై కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 11న అరెస్టయిన చింతమనేనిపై ఒకదాని తర్వా మరొకటి బయటికి తీస్తూ దాదాపు నెలన్నరగా జైలుకే పరిమితం చేశారు పోలీసులు. ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసులో జైలుపాలవుతున్నాడు. ప్రస్తుతం ఐదు కేసుల్లో అక్టోబర్ 9తో రిమాండ్ పూర్తవడంతో, చింతమనేని బెయిల్ పై బయటకు వస్తారని కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు ఆశించారు. కానీ పీటీ వారెంట్ పై జైల్లోనే మరోసారి అరెస్ట్ చేయడంతో అక్టోబర్ 23వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇలా, ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్ట్ చేస్తుండటంతో చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చింతమనేని దాదాపు 60 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం 22 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. చింతమనేనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్టు చేస్తూ... జైలుకే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, టీడీపీ హయాంలో ఒక్క ఇంచు కూడా ముందుకు కదలకుండా, మరుగునపడిపోయిన కేసులన్నీ తెరపైకి రావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కేసులున్నా, చంద్రబాబు హయాంలో ఆడుతూ పాడుతూ తిరుగుతూ, తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించిన చింతమనేనికి... జగన్ సర్కారులో మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. చింతమనేనిపై నమోదైన కేసులన్నీ ఇప్పుడు బయటికి వస్తుండటంతో ప్రభాకర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అయితే, చింతమనేనిపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తూనే ఉన్నా, కేసుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు చేసిన పాపం ఊరికే పోదని వైసీపీ నేతలంటుంటే, కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, కటకటాల వెనుకున్న చింతమనేనిని, ఈ జైలు బాధలోనూ మరో బాధ మరింతగా బాధపెడుతోందట. కష్ట సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నుంచి తనకు ఆశించినంత మద్దతు దొరకడం లేదని, తనను పట్టించుకోవడం లేదని కుమిలిపోతున్నాడట. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ, దూరం జరిగినట్టు అనిపిస్తోందని అనుచరులతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. దాంతో, ఇలా కోర్టు, జైలు చుట్టూ తిరుగుతుండటంతో అసలు చింతమనేని బయటి వస్తాడా అనే అనుమానాలు అనుచరులకు కలుగుతున్నాయట. మరి, కేసు మీద కేసు, రిమాండ్‌ మీద రిమాండ్‌తో జైలుకే పరిమితమవుతున్న చింతమనేని, ఎప్పడు రిలీజ్ అవుతారో చూడాలి.
  ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్, కలెక్టర్ దివ్య దేవరాజన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ‌ఎలాంటి పనులూ కావడం లేదని, దీనికి‌ కలెక్టర్ దివ్యదేవరాజన్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై తిరుగుబాటు చేయాలని జెడ్పీటీసీలకు ఛైర్మన్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలూ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు జెడ్పీ ఛైర్మన్. జిల్లా పాలన మొత్తం, కలెక్టర్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. కనీసం పట్టా పాస్ ఇప్పించలేకపోతున్నామని వాపోయారు. పనులు చేయలేని పదవులు మాకెందుకన్న జనార్ధన్, ప్రజాప్రతినిధుల అధికారాలపై కలెక్టర్ పెత్తనమేంటని మండిపడ్డారు. కనీసం, విరాసత్, పట్టాపాస్ ఇవ్వడాన్నీ కలెక్టర్ పట్టించుకోవడంలేదని వాగ్భాణాలు సంధించారు. కలెక్టర్‌పై తిరుగుబాటు చేయాలని జెడ్పీ ఛైర్మన్‌ ఏకంగా పిలుపునిచ్చారు. అయితే భయపడేది లేదంటోన్న కలెక్టరమ్మ దేనికైరా రెడీ అంటున్నారు. దాంతో ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ వర్సెస్ జడ్పీ చైర్మన్‌ కోల్డ్‌ వార్, రోజురోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఏజెన్సీ చట్టాలను‌ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇది జెడ్పీ ఛైర్మన్ కు నచ్చడం‌ లేదట. అదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైందట. ఆదివాసీల భూములను, ఒక సామాజికవర్గ నేతలు ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. రికార్డులన్నీ ఆదివాసీల పేరిట ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఒక సామాజికవర్గానికి‌ పట్టాలు కట్టబెట్టడానికి ప్రయత్నించారని, విపక్షాల నుంచీ విమర్శలున్నాయి. అయితే, చట్ట ప్రకారం నడుచుకోవాలని, నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇదే జెడ్పీ ఛైర్మన్‌కు నచ్చక, ఎదురుదాడికి దిగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారన్నది జడ్పీ ఛైర్మన్‌ అభ్యంతరం. ఇటీవల నియమాకాలు జరిగిన ఫారెస్ట్ అండ్ జూనియర్‌ పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలను అర్హులైనవారికి వచ్చేలా ‌కలెక్టర్  చర్యలు తీసుకున్నారు. దాంతో భోగస్ ఏజెన్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కించుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. చట్టాలు అమలు చేయడం, ఏజెన్సీ సర్టిఫికెట్ల విషయంలో నిబంధనలు పాటించడమే కలెక్టర్‌ తప్పయినట్టుగా వీరంతా చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల అక్రమార్కులకు అడ్డుకట్ట పడిందట. అయితే ఎవరికి ఉద్యోగాలు, ఏజెన్సీ సర్టిపికెట్లు దక్కలేదో వారి కోసం కలెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ అట్టుడికిన సమయంలో పాలనా వ్యవహారాలను చక్కదిద్దారని మంచి గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్‌పై, అనవసరమైన కామెంట్లు చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కలెక్టర్‌పై... జడ్పీ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఈసడించుకుంటున్నారు. రహస్య అజెండాతోనే ఛైర్మన్, ఆయన బృందం బహిరంగ వ్యాఖ్యలు చేస్తోందని, విపక్ష నేతలు మండిపడుతున్నారు. చట్టం ప్రకారం నడుచుకుంటున్న కలెక్టర్‌ను అభినందించాల్సిందిపోయి, తమకు అనుకూలంగా నడుచుకోవడం లేదన్న అక్కసుతో నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు ఫైరవుతున్నారు. అవినీతి, అక్రమాలకు మడుగులొత్తాలని భావించడం సరికాదంటున్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు ఎదురైనా, కలెక్టర్‌ చట్టం ప్రకారమే నడుచుకోవాలని, ఎవరికీ బెదరాల్సిన అవసరంలేదని ప్రజాస్వామ్యవాదులంటున్నారు.
  ఒకవైపు ఆర్టీసీ సమ్మె, ఇంకోవైపు కేసీఆర్‌ సభ వర్షార్పణం కావడంతో, టెన్షన్‌ పట్టుకున్న టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, మరో ఇద్దరు తెగ టెన్షన్‌ పెడుతున్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచే అయినప్పటికీ... ఓట్ల చీలికతో బీజేపీ, టీడీపీ కూడా ఎంతోకొంత టెన్షన్ పెడుతున్నాయి. అయితే, ప్రధాన పార్టీలే కాకుండా, ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి గుండెల్లో గుబులురేపుతున్నారు. అసలు, వారిద్దరూ అసలు పోటీ కాకపోయినా, వారి గుర్తులు మాత్రం తెగ టెన్షన్ పెట్టిస్తున్నాయి. రోడ్ రోలర్, ట్రాక్టర్... ఈ రెండు గుర్తులూ దాదాపు టీఆర్ఎస్ సింబల్ కారును పోలి ఉంటాయి. ఈ రెండు గుర్తులే ఇప్పుడు టీఆర్ఎస్‌ను తెగ టెన్షన్‌ పెడుతున్నాయి. హుజూర్‌ నగర్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయింది ఎన్నికల సంఘం. అదీ కూడా జాబితాలో టీఆర్ఎస్‌ కారు గుర్తు తర్వాత అవే ఉండటం, అధికారపక్ష అభ్యర్థిలో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల నష్టపోయామని, నిరక్షరాస్యులు, వృద్ధులు పొరపడి ట్రక్కు గుర్తుకు ఓటేయడంతో... పదివేల ఓట్లు పడ్డాయని, అందువల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని  అంటున్నారు. ఇప్పుడు హుజూర్ ‌నగర్‌ బైపోరులోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థికి అలాంటి దిగులే పట్టుకుందట. హుజూర్ ‌నగర్‌ బైపోల్ బరిలో మొత్తం 28మంది అభ్యర్థులున్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, నాలుగో నెంబర్‌ అలాట్ చేశారు. ఆయన తరువాత ఐదో నంబర్‌లో రైతుబిడ్డ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అజ్మీర మహేశ్‌ కి... ట్రాక్టర్‌ నడిపే రైతు సింబల్‌ను... అలాగే ఆరో నంబరులో రిపబ్లిక్‌ సేన తరఫున పోటీ చేస్తున్న నిలిచిన వంగపల్లి కిరణ్‌కు రోడ్డురోలర్‌ గుర్తును కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో, తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనని టెన్షన్‌ పడుతున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కారును పోలిన ఆటోరిక్షా, లారీ చిహ్నాలు ఎవరికీ ఇవ్వవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే ఇప్పుడు ఆ గుర్తులను అయితే ఈసీ కేటాయించలేదు. కానీ తాజాగా హుజూర్ నగర్ లో కారును పోలిన రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు మాత్రం ఇద్దరు స్వతంత్రులు దక్కించుకున్నారు. దీంతో అధికారపక్షాన్ని గుర్తుల భయం వెంటాడుతోంది. ఇక గతంలోనూ టీడీపీ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. సైకిల్ ను పోలిన బైక్ గుర్తు, ఆ పార్టీని దెబ్బతీసింది. చాలా కష్టపడి ఈసీతో ఫైట్ చేసి బైక్ గుర్తును ఎన్నికల్లో నిషేధించింది టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తన కారు గుర్తు పోలిన గుర్తులపై పోరాటం మొదలెట్టింది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. పాలేరు..నకిరేకల్, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఓటమి చవిచూసింది. మళ్లీ ట్రాక్టర్, రోడ్‌ రోలర్‌ గుర్తుల రూపంలో బిక్కుబిక్కుమంటున్నాడు టీఆర్ఎస్‌ అభ్యర్థి. అయితే, గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా జనంలో అవేర్‌నెస్‌ తెచ్చేందుకు, గుర్తులపై అవగాహన కల్పిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. కారుకు రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులకు తేడాలను చూపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, హుజూర్ నగర్ లో ఇంటింటికి  వెళ్లి ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రతీ ఓటూ అత్యంత కీలకంగా మారిన హుజూర్ నగర్ ఉపపోరులో... మరి, రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు... టీఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో చూడాలి.
  మీకు ప్రతిరోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? ప్రతిరోజూ రెండు కప్పులకు మించకుండా కాఫీ తాగేతే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ మోతాదుకు మించకుండా కాఫీ తాగితే రక్తనాళాలు సాగే గుణం మెరుగుపడుతుందని, అదే విధంగా గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరి పరిశోధనలో తెలిసినది ఏమిటంటే... రోజుకి మోతాదు మించకుండా ఒకటి, రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటున్నట్లు తెలిపారు. దీనివలన నూతన ఉత్తేజం లభిస్తుందని వారు పేర్కొన్నారు.
  అనగనగా ఓ చిట్టి పావురం ఉండేది. దానిదో స్వేచ్ఛా జీవితం! ఆకలేస్తే ఇన్ని గింజలు తినడం. ఆశాశంలోకి రివ్వుని ఎగరడం. అలా జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేస్తున్న పావురానికి ఓ అలవాటు మొదలైంది. తన మనసుని ఎవరైనా నొప్పిస్తే ఆ విషయాన్ని సహించలేకపోయేది. ఆ విషయాన్ని గుర్తుంచుకునేందుకు ఓ వింత పద్ధతిని మొదలుపెట్టింది. తన మనసు నొచ్చుకున్న ప్రతిసారీ ఓ గులకరాయిని మూటగట్టుకునేది. తను ఎక్కడికి వెళ్లినా ఆ రాళ్లను కూడా తనతో పాటు తీసుకువెళ్లేది. తరచూ ఆ రాళ్లని చూసుకుంటు కాలక్షేపం చేసేది పావురం. అందులో ఏ రాయి ఏ సందర్భంలో పోగేసిందో దానికి గుర్తే! రోజులు గడిచేకొద్దీ రాళ్ల బరువు కూడా పెరిగిపోయింది. ఇదివరకులా వాటిని మోసుకుంటూ ఎక్కువ దూరం వెళ్లలేకపోయేది పావురం. కానీ దాని అలవాటు మానుకోలేదు సరి కదా… చిన్ని చిన్న విషయాలకే రాళ్లను పోగేయడం మొదలుపెట్టింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా! పావురం ఉండే చోటకి కరువు వచ్చిపడింది. చెట్లన్నీ మలమలా ఎండిపోయాయి. చెరువులన్నీ అడుగంటిపోయాయి. `మనం ఆ కనిపించే కొండల వైపుకి వెళ్లిపోదాం పద నేస్తం` అని మన పావురానికి ఓ నేస్తం సలహా ఇచ్చింది. `నాక్కూడా అక్కడికి వెళ్లాలనే ఉంది. కానీ ఇంత బరువుని మోసుకుని కదల్లేకపోతున్నాను` అని బదులిచ్చింది పావురం. `అలాంటప్పుడు వాటిని మోసుకుంటూ తిరగడం ఎందుకు. అవతల పారేయరాదా` అంది నేస్తం. `పారేయడానికనుకున్నావా నేను పోగేసుకుంది. వీటిలో ప్రతి ఒక్కటీ నా గాయాలకు ప్రతీక` అంది పావురం. `పాత గాయాలను పోగేసుకుంటూ ఉంటే వాటి బరువుతో ముందుకు పోలేవు. నా మాట విని వాటిని వదిలెయ్యి` అంది నేస్తం. `అసంభవ౦. వాటిని వదిలి నేనుండలేను. అవి నా జీవితంలో భాగమైపోయాయి. వాటిని వదులుకోవడమంటే నా గతాన్ని వదులుకోవడమే. అంత ధైర్యం నేను చేయలేను` అంది పావురం.   పావురాన్ని వదిలేసి నేస్తం ఎగిరిపోయింది. పావురం మాత్రం తను పోగేసిన రాళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. కరువు విజృంభించింది. పావురానికి ఎండుగింజలు సైతం దొరకలేదు. నోరు తడుపుకునేందుకు చుక్కనీరు కూడా మిగల్లేదు. అయినా తన గతం తాలూకు బరువుని వదిలి వెళ్లేందుకు దానికి మనసు రాలేదు. అక్కడే ఆ పాత చోటే అర్థంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది.
  అది ఒక చీకటి గది. చీకటంటే అలాంటి ఇలాంటి చీకటి కాదు... చిమ్మ చీకటి. బయట ఉన్న కిటికీలలోంచి కూడా కారు నలుపు రంగు తప్ప మరేమీ కనిపించడం లేదు. అలాంటి గదిలోకి ఓ కుర్రవాడు ప్రవేశించాడు. తడుముకుంటూ తడుముకుంటూ ఓ నాలుగు కొవ్వొత్తులను పోగేసి వెలిగించాడు. కాసేపు ఆ కాంతిలో ఏదో చదువుకున్నాడు. ఇంకాసేపు ఏదో రాసుకున్నాడు. చివరికి అలా చల్లగాలి పీల్చుకుందామని బయటకు వెళ్లిపోయాడు.   కుర్రవాడు అలా బయటకి వెళ్లాడో లేదో కొవ్వొత్తులన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. మొదటి కొవ్వొత్తి అంది కదా... ‘నేను శాంతికి ప్రతిరూపాన్ని. నన్ను ఎక్కువసేపు నిలిపి ఉంచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే నేను త్వరగా వెళ్లిపోతున్నాను. మరో నిమిషంలో ఆరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను,’ అంటూ భగభగా మండిపోవడం మొదలుపెట్టింది. అన్నట్లుగానే మరో నిమిషంలో ఆరిపోయింది.   మొదటి కొవ్వొత్తి అలా ఆరిపోయిందో లేదో, రెండో కొవ్వొత్తి కూడా చిటపటలాడటం మొదలుపెట్టింది. ‘నేను నమ్మకానికి ప్రతిరూపాన్ని. నా అవసరాన్ని ఎవరూ త్వరగా గమనించరు. పైగా శాంతి కూడా లేనిచోట, ఎవరైనా నమ్మకాన్ని ఎలా నిలిపి ఉంచగలరు. అందుకే నేను కూడా ఆరిపోతున్నాను,’ అంటుండగానే వెలుగు తగ్గిపోయి, చివరికి ఆరిపోయింది. రెండో కొవ్వొత్తి ఇలా కొండెక్కిందో లేదో, మూడో కొవ్వొత్తి నసగడం మొదలుపెట్టింది. ‘నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. తమ పక్కనున్న వారితో సైతం ప్రేమగా ఉండేందుకు ఇష్టపడరు. పైగా శాంతి, నమ్మకం లేని చోట నేను మనుగడ సాగించడం చాలా కష్టం. అందుకే నేను కూడా వారి బాటనే అనుసరిస్తాను,’ అంటూ ఏడుస్తూ రెపరెపలాడసాగింది. అలా అటూఇటూ ఊగిసలాడి చివరికి ఆరిపోయింది.   నాలుగో కొవ్వొత్తి మాత్రం నిబ్బరంగా అలాగే నిలిచి ఉంది. కాసేపటికి కుర్రవాడు గది లోపలకి రానే వచ్చాడు. తాను వెలిగించిన మూడు కొవ్వొత్తులూ అలా ఆరిపోవడం చూసి అతనికి బాధ కలిగింది. కానీ నాలుగో కొవ్వొత్తి నిబ్బరం చూసి అంతే ఆశ్చర్యం వేసింది.‘మిగతా కొవ్వొత్తులన్నీ ఆరిపోయినా, నువ్వు మాత్రం ఎలా నిలిచి ఉన్నావు?’ అని నాలుగో కొవ్వొత్తిని అడిగాడు కుర్రవాడు. ‘నేను ఆశకు ప్రతిరూపాన్ని! నేను అంత త్వరగా పరాజయాన్ని ఒప్పుకోను. అసలు పరాజయానికి విరుగుడే నేను కదా! విజయం దక్కేదాకా మీరు పోరాడేందుకు నేను అండగా నిలిచి ఉంటాను. ఇక ఈ చీకటి నాకో లెక్కా! పైగా నన్ను ఉపయోగించి మిగతా కొవ్వొత్తులను కూడా వెలిగించేందుకు సాయపడతాను. నేను ఉన్నంతకాలం శాంతి, నమ్మకం, ప్రేమ అనే గుణాలకు లోటు ఉండదు,’ అని చెప్పింది. కుర్రవాడు ఆ కొవ్వొత్తితో మళ్లీ మిగతా మూడు కొవ్వొత్తులనీ వెలిగించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
  రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై మూడు పిటిషన్ లు దాఖలయ్యాయి. ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాలకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని పిటిషన్లపై ఇరవై ఎనిమిదిన వాదనలు ఉంటాయి. ఇటు ఆర్టీసీ సమ్మె, అటు కార్మికుల నిరసనలు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల సమయంలో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు కాంగ్రెస్ నేతలు. దీంతో ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు పోలీసులు. అయిన ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రగతి భవన్ బాట పట్టిన కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, రాములు నాయక్ ను అరెస్టు చేశారు. బైక్ పై వచ్చి ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు యత్నించిన రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. షబ్బీర్ అలీ, విశ్వేశ్వర్ రెడ్డి సహా పలు కీలక నేతలను ఇంటికే పరిమితం చేశారు పోలీసులు. ఇటు పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డిలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.  మరోవైపు ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో సోమాజిగూడ, బేగంపేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఓ వైపు స్కూళ్ళ రీ ఓపెనింగ్, ఇంకో వైపు బస్సుల కరువు, సొంత వాహనాలతో రోడ్లెక్కడం నిరసనలకు పిలుపు వెరసి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోటెత్తింది. ప్రగతి భవన్ దగ్గర బందోబస్తుతో సికింద్రాబాద్ రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ కన్పిస్తోంది.  ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు ప్రభుత్వం విఛ్చిన్నం చేయాలని కుట్ర చేస్తోందన్నారు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు. కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆయన యూనియన్ లు లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల ముప్పై వ తేదీ వరకు కార్మిక సంఘాలు ఇచ్చిన ఆందోళనల్లో కార్మిక కుటుంబాలు కూడా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. శనివారం ఆందోళనలో వేలు తెగిన కారణంగా హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు పోటు రంగారావు.ఇక సమ్మెలో కార్మికుల కుటుంబాలు పాల్గొని పరిస్థితి ఇంకా ఉధృక్తం కాక ముందే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే కానీ రాష్ట్రనికి  మేలు జరిగే సూచనలు కనిపించట్లేదు.
  హుజూర్ నగర్ పోలింగ్ జరుగుతోంది. మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మూడు వందల రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ పద్మారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, బిజెపి నుంచి రామారావు, టిడిపి నుంచి చావా కిరణ్మయి బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం మూడు వేల మూడు వందల యాభై మంది పోలీసులను వినియోగిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 53 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు సమాచారం. కానీ అధికారికంగా పోలింగ్ శాతం రావాల్సి ఉంది. అయితే తొలి గంటలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ప్రధానంగా నేరేడుచర్ల మండల కేంద్రంలోని చింతబండ లోని ముప్పై ఒకటి, ముప్పై మూడు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయించడంతోటి ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాల బయటనే వేచి చూసిన పరిస్థితి ఉంది. అయితే టెక్నికల్ సిబ్బందిని పిలిపించి ఈవిఎంలను నడిపించే  పరిస్థితిలో అధికారులు ఉన్నారు.  మఠంపల్లి మండలంలో ఒక చోట మాత్రం వెలుతురు సరిగా లేని కారణంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. చింతలపాలెం మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ లోని నూట అరవై ఎనిమిదిలో సరైన వెలుతురు లేక గుర్తులు సరిగా కనిపించటం లేదని చెప్పి ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో దానిని సరిదిద్దే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ గుర్తు ఎక్కడ ఉందనేది చీకటి ఉన్న నేపథ్యంలో మాత్రం సరిగా కనిపించటం లేదని చెప్పే అక్కడ ఒక ఓటర్ ఆరోపణ చేశారు.దానిని సరిచేసే ప్రయత్నాలలో అధికారులు ఉన్నారు.
  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పదహారు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని యాభై యొక్క అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తిపూర్ లోకసభ స్థానాలకు బైపోల్స్ జరుగుతున్నాయి.  నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజా ప్రతినిధులను ఓటు వేసి ఎన్నుకోవటం ఓటర్ల హక్కు అని మోహన్ భగవత్ ఈ సందర్భంగా తెలిపారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇక హర్యానాలోని దాద్రి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుస్తీ క్రీడాకారిణి బబితా ఫోగట్ బలాలీలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి సెల్జా హిస్సార్ లోని యశోదా పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదంపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న టిక్ టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ ఓటువేసారు. బీజేపీ కూటమికి మహారాష్ట్రలో రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ ఫడ్నవీస్ తోనే జనం ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన సతీమణి కంచన్ తో కలిసి నాగపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే బారామతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారీ మహారాష్ట్రలో అధికారంకి వచ్చేది కాంగ్రెస్ ఎన్సీపీ కూటమేనని సూలే ధీమా వ్యక్తం చేశారు.  హర్యాణలోని బాద్ షాపూర్ లో ఉన్న రెండు వందల ఎనభై ఆరువ నెంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించటంతో కొద్ది సేపు పోలింగ్ నిలిచిపోయింది. మహారాష్ట్ర లోని రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో రెండు వందల ముప్పై ఐదు మంది మహిళలే ఉన్నారు. మరోవైపు హర్యానాలోని తొంభై స్థానాలకు గాను పదకొండు వందల అరవై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు. ఇందులో నూట నలుగురు మహిళలు. మహారాష్ట్రలో రెండవసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ తన ప్రధాన మిత్రపక్షమైన శివసేనతో కలిసి బరిలోకి దిగింది. మరోవైపు గత వైభవాన్ని సాధించాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో పోటీలో నిలిచాయి. రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేనతో పాటు పలు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను నిలిపాయి. దాదాపు పద్నాలుగు వందల మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో నిలిచారు.  హర్యాణలో రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండోసారి కూడా విజయ ఢంకా మోగించాలన్న పట్టుదలతో ఉంది. ఐఎన్ఎల్డీ నుంచి వేరుపడి చౌతాలా కుటుంబీకులు స్థాపించిన జన్ నాయక్ జనతా పార్టీ తొలిసారి పోటీ చేస్తూ సత్తాచాటాలి అన్న సంకల్పంతో ఉంది. ఐఎన్ఎల్డీ కూడా పట్టు కోసం ప్రయత్నిస్తోంది. మూడు వందల డెబ్బై ఐదు మంది స్వతంత్రులు ఇక్కడ బరిలో ఉన్నారు.ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తమ పార్టీ నేతల ప్రయత్నాలు సఫలీకృతమైయ్యయా అన్నది వేచి చూడాలి.
  * నడక శరీరంలో ఎముకలు, కండరాలకు మెదడుతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. నడకే కదా అని నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కండరాలు తరిగిపోతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే అలవాటు లేనివాళ్ళ శరీరంలో నిత్యం ఉపయోగించగలిగే కీళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఎక్కువశాతం కీళ్ళు బిగుసుకుపోతాయి. * బరువు తగ్గాలనుకునేవారు నడకకి వెళ్ళేముందు ఏమీ తినకూడదు. ఎందుకంటే, ఓ ముప్ఫై నిమిషాలపాటు నెమ్మదిగా నడవటానికి కావలసిన శక్తి కార్బోహైడ్రేట్స్ నుంచి 45 శాతం, కొవ్వు నుంచి 65 శాతం విడుదలవుతుంది. అంటే నడుస్తుంటే మరింత శక్తి కావాలన్న సంకేతం అందుకున్న శరీరం కొవ్వు నిల్వల్ని కరిగిస్తుంది అన్నమాట. * నడక మంచిది అన్నారు కదా అని మొదలుపెడుతూనే వేగంగా నడవకూడదు. మొదట 5 - 10 నిమిషాలపాటు నెమ్మదిగా నడవాలి. ఎందుకంటే ఏ వ్యాయామానికైనా కాసేపటికీ ముందు నుంచీ శరీరాన్ని సిద్ధం చేయాల్సి వుంటుంది. నెమ్మదిగా వేగాన్ని పెంచుతూ వెళ్ళాలి. ఎంత వేగంగా నడవాలీ అంటే, నడుస్తూ కూడా మాట్లాడటానికి ఇబ్బంది పడనంత వేగం మంచింది. అలాగే నడక ముగించేటప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రిలాక్సింగ్‌గా నడక ముగించాలి. * నిజానికి నడకతోపాటు కొన్ని వేరే వ్యాయామాలూ శరీరానికి అవసరం. ఎందుకంటే, నడక కొన్ని కండరాలపై ఎక్కువగానూ, కొన్ని కండరాలపై తక్కువగానూ ఒత్తిడి పడేట్ట చేస్తుంది. అందుకని వారంలో ఐదురోజులు నడిస్తే, రెండు రోజులు మీకు నచ్చిన వ్యాయామాలను చేయండి. ఈత, యోగా, ఏరోబిక్స్, జిమ్ ఇలా... * రోజూ నడిచే అలవాటు వున్నవారికి గుండె, మెదడుకి సంబంధించిన ఇబ్బందులు 10 నుంచి 20 సంవత్సరాల పాటు వాయిదా పడితీరతాయి అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. * ఎంతసేపు నడవాలి? దీనికి పరిమితి లేదు. 24 గంటల్లో కనీసం 24 నిమిషాలు అన్నది సూత్రం. కాబట్టి 24 నిమిషాలకు తగ్గకుండా వీలునుబట్టి, ఆరోగ్యాన్నిబట్టి ఆ సమయాన్ని పెంచుకోవచ్చు. క్యాలరీలు ఖర్చుకావాలని నడిచేవారు మాత్రం ఎంత దూరం నడిస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని నడక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. * ఇక ఒకసారి నడవటం మొదలుపెట్టాక 12 వారాలపాటు అయినా కొనసాగించాలి. రెండు రోజులో మూడు రోజులో నడిచి మానేస్తే ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా వుంటాయట. * చివరిగా ఒక్కమాట... క్రమం తప్పకుండా మూడు నాలుగు నెలలపాటు నడిస్తే ఎండార్ఫిన్లు విడుదలై మనసుకు ఆనందాన్నిస్తాయి. ఇక అప్పుడు మానేద్దామన్నా మానలేరు. కాబట్టి ఒక్క నాలుగు నెలలపాటు ఓపికపట్టి నడిచారంటే ఇక ఆ తర్వాత ఆ నడకే మిమ్మల్ని ముందుకు నడిపించుకుని వెళ్తుంది. -రమ
Sugarcane Juice has the weight losing properties says experts. Sugarcane juice is low in calories and contains loads of fiber. In addition, this drink does not have cholesterol thus promoting weight loss. Watch our video to know more...  https://www.youtube.com/watch?v=8G6vs33OFyU  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.