అదనపు జింకుతో ఆరోగ్యం భద్రం

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒకటి తింటే సరిపోదు. ఆ తిండిలో తగినన్ని పోషకాలు ఉండాలి. శరీరంలో జరిగే జీవచర్యలన్నీ కూడా సవ్యంగా సాగిపోయేందుకు అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు అందాలి.  కానీ ప్రస్తుతం మనం తింటున్న ఆహారంలో అలాంటి పోషకాలు లేకుండా పోతున్నాయి. ఫలితంగా పైకి నిగనిగలాడుతున్నామే కానీ, లోపల మాత్రం డొల్లబారిపోతున్నాం. ఆ విషయాన్ని మరో పరిశోధన మరోసారి గుర్తుచేస్తోంది. రోజూ తగినంత జింక్ని తీసుకుంటే మన డీఎన్ఏ సైతం భద్రంగా ఉంటుందని తేలుస్తోంది.

 

అసలు జింక్ ఎందుకు

మనం అంతగా పట్టించుకోకపోయినా కూడా ఒంటికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజం జింక్. రోగనిరోధక శక్తి సన్నగిల్లకుండా ఉండేందుకు, గాయాలు త్వరగా మానేందుకు జింక్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల దగ్గర్నుంచీ తీవ్రమైన గాయాల వరకూ చాలా సందర్భాలలో జింక్ సప్లిమెంట్స్ వాడమని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. పిల్లలు త్వరగా, బలంగా ఎదిగేందుకు కూడా జింక్ అవసరం ఉంది.

 

డీఎన్ఏతో సంబంధం

జింక్ వలన Oxidative stress నియంత్రణలో ఉంటుందన్న విషయం ఇంతకుముందే రుజువైపోయింది. దీని వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ అనే విష పదార్థాలు అదుపులో ఉంటాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అదుపులో ఉంచడం వల్ల కేన్సర్, గుండెజబ్బులు వంటి తీవ్ర అనారోగ్యాలు సైతం మనల్ని దరిచేరవు. ఇప్పుడు ఏకంగా జింక్ వల్ల డీఎన్ఏకి ఏమన్నా లాభం ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం వారు ఆరువారాల పాటు కొందరికి తగు మోతాదులో జింక్ సప్లిమెంట్లను అందించారు. ఈ సమయంలో వారి శరీరంలోని డీఎన్ఏ తీరు ఎలా ఉందో గమనించారు.

 

అరుగు తరుగులు తగ్గాయి

రోజుకి నాలుగు మిల్లీగ్రాముల జింక్ని అదనంగా తీసుకున్నా కూడా అది మన డీఎన్ఏ మీద సానుకూల ప్రభావం చూపుతున్నట్లు తేలింది. మన ఆరోగ్యంలో ముఖ్యపాత్రని పోషించే డీఎన్ఏ దెబ్బతినకుండా ఉండేందుకు, దెబ్బతిన్న డీఎన్ఏ తిరిగి స్వస్థతని పొందేందుకూ కూడా ఈ జింక్ ఉపయోగపడుతోందట. దీని వల్ల శరీరం ఎలాంటి రోగాన్నయినా, క్రిములనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందన్నమాట.

 

ఎందులో లభిస్తుంది

మాంసం, రొయ్యలు, చేపలు, పీతలు వంటి మాంసాహారలో జింక్ సమృద్ధిగానే లభిస్తుంది. ఇక బచ్చలికూర, చిక్కుడు గింజలు వంటి కొన్నిరకాల శాకాహారంలోనూ జింక్ లభించకపోదు. అయితే పాలిష్ పట్టని బియ్యంలో కావల్సినంత జింక్ లభిస్తుందన్న విషయాన్ని మాత్రం చాలామంది పట్టించుకోరు. అదే కనుక పట్టించుకుంటే జింక్ కోసం అటూఇటూ పరుగులు పెట్టాల్సిన పరిస్థితే రాదు!

- నిర్జర.