సమస్యను పరిష్కరించాలంటే!

అనగనగా ఓ జమీందారు. ఆయనకి యాభై గదులున్న ఓ ఐదంతస్తుల మేడ ఉంది. జమీందారుగారికి వింత వస్తువులంటే మహా మోజు. దేశవిదేశాల నుంచి సేకరించిన అరుదైన, వింతైన వస్తువులతో ఆయన యాభై గదులూ నిండిపోయాయి. ఇన్ని వస్తువులున్నా కూడా ఆయనకు వాళ్ల నాన్నగారు ఇచ్చిన గడియారం అంటే చాలా ఇష్టంగా ఉండేది. అది లేనిదే ఆయనకు రోజు గడిచేది కాదు. తను ఎక్కడికి వెళ్లినా ఆ గడియారం ఆయన జేబులో ఉండాల్సిందే. ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఆ గడియారంలో సమయాన్ని చూసుకుంటూ ఉండాల్సిందే!


ఒక రోజు ఆ గడియారం కనిపించకుండా పోయింది. జమీందారుగారు ఉండే యాభై గదులలో ఎక్కడని వెతికేది. ఎంతని వెతికేది. అయినా కూడా జమీందారుగారి నౌకర్లందరూ ప్రతి గదినీ క్షుణ్నంగా గాలించారు. మేడలోని ప్రతి అడుగునీ శోధించారు. అయినా గడియారం కనిపించనేలేదయ్యే. జమీందారుగారి మొహం డీలాపడిపోయింది. ఆ గడియారంలో సమయాన్ని చూసుకుంటుంటే, తన తండ్రే తనని నిర్దేశిస్తున్నట్లు తోచేది.


సాయంకాలమైంది. గడియారాన్ని వెతికేందుకు నౌకర్లు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఆ సమయంలో జమీందారుకి తన గురువుగారు గుర్తుకువచ్చారు. ఎలాంటి క్లిష్ట సమస్యకైనా ఆయన దగ్గర తప్పకుండా సమాధానం దొరికేది. మరి ఈ సమస్యకి ఆయన ఏమన్నా పరిష్కారం సూచించగలడేమో అన్న ఆశ మొదలైంది. గడియారం కనిపించడం లేదా లేకపోతే ఎవరన్నా దానిని దొంగిలించారా? దొంగిలిస్తే ఎవరు దొంగిలించి ఉంటారు? అన్న సందేహాలతో సతమతమవుతూ... జమీందారు తన గురువుగారిని తన మేడకి రప్పించుకున్నారు.


విషయం అంతా విన్న గురువుగారు ‘నేను మేడలోని గదులన్నింటిలోనూ కాసేపు గడిపి వస్తాను!’ అన్నారు. ‘అయ్యా! మా నౌకర్లంతా ఈపాటికే గదులన్నింటినీ జల్లెడ పట్టేశారు. మీరు మళ్లీ వెతకడం వృధా శ్రమ అవుతుంది’ అన్నారు జమీందారు ఒకింత అసహనంగా. అయినా కూడా గురువుగారు పట్టుపట్టి ఒంటరిగా గదులన్నింటినీ చూసివచ్చేందుకు బయల్దేరారు. గంట గడిచింది, రెండు గంటలు గడిచాయి, మూడు గంటలు గడిచాయి... మేడ దిగువున ఉన్న గదిలో గురువుగారి కోసం వేచి ఉన్న జమీందారులో అసహనం పెరిగిపోసాగింది. ఇంతలో గురువుగారి చిరునవ్వుతో ఆ గదిలోకి అడుగుపెట్టడం చూశారు. గురువుగారి చేతిలో తళతళ్లాడుతున్న గడియారం.


‘నాకూ, ఇంతమంది నౌకర్లకూ సాధ్యం కానిది మీరెలా సాధించారు!’ అంటూ నోరువెళ్లబెట్టారు జమీందారుగారు. ‘చాలా తేలిక! నేను ప్రతి గదిలోకీ వెళ్లి కాసేపు ప్రశాంతంగా నిల్చొన్నాను. గడియారానికి ఉన్న లక్షణం చిన్నపాటి శబ్దం చేస్తూ తిరగడం కదా! ఈ రాత్రివేళ నిశబ్దానికి నా ప్రశాంతత తోడైనప్పుడు... ఆ శబ్దం వినిపించకపోతుందా అని ప్రతి గదిలోనూ వేచిచూశాను. చివరికి మీరు రోజూ పడుకునే మంచం కింద ఉన్న ఓ బుట్టిలోంచి తన శబ్దం వినిపించసాగింది. మన సమస్యలు చాలావరకూ ఇలాగే ఉంటాయి నాయనా! సమస్యని ప్రశాంతమైన మనసుతో పరిష్కరించాల్సిన చోట తెగ హడావుడి పడిపోతాము. ఫలితం! మనకి సమీపంలో ఉన్న పరిష్కారం కూడా కనిపించకుండా పోతుంది,’ అంటూ గడియారాన్ని జమీందారుగారి చేతిలో ఉంచి బయల్దేరారు.
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

-నిర్జర