కారే కాదు... సైకిల్ కూడా ఉంది... యాదాద్రి వివాదంలో లాజిక్ మిస్సయిన అధికారులు

 

పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వివాదం రాజుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మిస్తోన్న యాదాద్రి ఆలయంలో రాజకీయ నాయకుల చిత్రపటాలు కలకలం రేపాయి. దేవతా విగ్రహాలు, సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర ఉండాల్సిన చోట... పొలిటికల్ లీడర్స్, పార్టీల గుర్తులు, మేనిఫెస్టోలను పెట్టారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారు, అలాగే కేసీఆర్ చిత్రపటాలను ఆలయ ప్రాకారాల్లో చిత్రీకరించడంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి.

అయితే, యాదాద్రి రాతి స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలను చెక్కడంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. ఏ ఆలయంలోనైనా అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సర్వసాధారణమని యాదాద్రి ప్రత్యేకాధికారి కిషన్ రావు తెలిపారు. ఇవి ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కావని, ఫలానా బొమ్మలు చెక్కమని శిల్పులకు ఎవరూ చెప్పలేదని, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా, వాళ్లే స్ఫూర్తిపొంది చిత్రాలను చెక్కారని అన్నారు. అలాగే కేసీఆర్‌పై అభిమానంతోనే ఆయన చిత్రపటాన్ని శిల్పులు చెక్కారని వైటీడీఏ అధికారి కిషన్‌రావు చెప్పుకొచ్చారు. అంతేగాని సీఎం కేసీఆర్ మెప్పు కోసమే చెక్కించామని చెప్పడం సరికాదన్నారు. ఇక కారును ఒక పార్టీ గుర్తు మాత్రమే చూడటం దుర్మార్గమన్న కిషన్ రావు.... రాతి స్తంభాలపై ఒక్క కారు మాత్రమే లేదని, ఎడ్లబండి, సైకిల్, రిక్షా... ఇలా అనేక బొమ్మలు ఉన్నాయన్నారు. అయితే,  కేసీఆర్ చిత్రపటం చెక్కడాన్ని సమర్ధించుకునే ప్రయత్నంచేశారు. అహోబిలం శిలలపై గాంధీ, నెహ్రూ బొమ్మలున్నాయని, ఒకవేళ అభ్యంతరాలుంటే కేసీఆర్ బొమ్మను తీసేస్తామంటూ చెప్పుకొచచారు కిషన్ రావు.

మొత్తానికి యాదాద్రి వివాదాన్ని తెలివిగా శిల్పులపైకి నెట్టే ప్రయత్నం జరిగింది. అయితే, ఇక్కడ అధికారుల తెలివి తక్కువతనం క్లియర్ గా బయటపడింది. ఎందుకంటే, రెండువేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఆలయంలో శిల్పులే తమంతట తాముగా శిల్పాలు చెక్కడం సాధ్యమేనా? పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, అధికారుల నిరంతర పర్యవేక్షణలో యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం జరుగుతుంటే, ఎలాంటి దిశానిర్దేశం లేకుండానే శిల్పులు... వాళ్లకు నచ్చిన చిత్రాలను వాళ్లు చెక్కేస్తారా? అసలు జరిగే పనేనా? కాదని, సామాన్యుడిని అడిగినా చెబుతారు. మరి అధికారులు ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారో..! ఏదేమైనా యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో రాజకీయ నేతల చిత్రాలను చెక్కడంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. బీజేపీ, హిందూసంస్థలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.