టీడీపీ ‘ప్రెషర్’కి తలొగ్గిన వైసీపీ! మోదీకి వ్యతిరేకంగా ఓటు!

భారతదేశం లాంటి పెద్ద దేశంలో ప్రతీ నెలా ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే వుంటుంది. అయిదేళ్లకోసారి పార్లమెంట్ ఎన్నికల జాతర వస్తే, ఆరు నెలలకి ఒకసారి రాష్ట్రాల ఎన్నికల తిరనాళ్లు! ఇక అసెంబ్లీ, పార్లమెంట్ లు కాక ఉప ఎన్నికల హడావిడి కూడా పార్టీలకు, నేతలకు టెన్షన్ పుట్టిస్తూ వుంటుంది. ఇలా ప్రధాని పదవి మొదలు సర్పంచ్ ల ఎన్నిక దాకా మనకు బోలెడు ఎలక్షన్స్! ఇవన్నీ సరిపోవన్నట్టు అడపాదడపా పరోక్ష ఎన్నికల కోలాహలం కూడా వచ్చేస్తుంటుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి మొదలు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల ఎంపిక దాకా మీడియాలో అదో రకం గడబిడ సాగుతుంటుంది. ఇప్పుడు అలాంటిదే మరోటి వచ్చిపడింది! రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక!

 

 

మోదీ స్వంత మెజార్టీతో ప్రధాని అయ్యాక ఏ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానివ్వవద్దని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయి. అలాగైతేనే జనం ముందు తమ పట్టుదల కనిపిస్తుందని కాంగ్రెస్ సహా అన్ని మోదీ వ్యతిరేక పార్టీలు డిసైడ్ అయ్యాయి. రాను రాను అదే కోవలోకి వెళ్లిపోతున్నాయి టీడీపీ, శివసేన లాంటి 2014 నాటి మిత్ర పక్షాలు కూడా! మొత్తంగా ఏ చిన్న ఎన్నిక వచ్చినా ఇప్పుడు మోదీ వర్సెస్ రెస్ట్ అన్నట్టు తయారవుతోంది సంగ్రామం!

 

 

ఆ మధ్య జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు అనుకూలంగానే ఓటు వేసింది. అయితే అప్పటి పరిస్థితులు వేరు. చంద్రబాబు, మోదీ మధ్య దూరం ఇంతగా లేకుండింది. అలాగే, వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడైతే తెలుగు వాడిగా ఆయనకే ఓటు వేసేశారు మన టీడీపీ ఎంపీలు. విచిత్రంగా జగన్ నేతృత్వంలోని వైసీపీ కూడా బీజేపీ నిలిపిన రామ్ నాథ్ కోవింద్ కే మద్దతు తెలిపింది. రాష్ట్రంలో తమ ప్రత్యర్థి అయిన టీడీపీ రామ్ నాథ్ ను సమర్థిస్తే వైసీపీ వ్యతిరేకించాలి. కానీ, విజయసాయి రెడ్డి మార్కు పాలిటిక్స్ పుణ్యామాని జగన్ బీజేపీ అభ్యర్థికే సై అన్నారు. ఇక వెంకయ్యను ఇంతకు ముందే చెప్పుకున్నట్టు తెలుగు పార్టీలు సమర్థించటం ఆశ్చర్యమేం కాదు!

 

 

కీలకమైన పరోక్ష ఎన్నికల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎలక్షన్స్ తరువాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా వుంటుంది. చెయిర్లో వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు పెద్దల సభని నడిపేది ఈ డిప్యూటీ చైర్మనే. అందుకే, కురియన్ పదవి కాలం ముగిసి నెలలు గడిచిపోయాక ఈ నెల 9న ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. బీజేపీకి రాజ్యసభలో తగిన బలం లేదు కాబట్టి ఏకగ్రీవం ప్రయత్నాలు చేసింది. కానీ, అందుకు ఒప్పుకోని కాంగ్రెస్, తృణముల్ లాంటి పార్టీలు పోటీకే రెడీ అయ్యాయి. ఇక చేసేది లేక బీజేపీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే, ఎన్డీఏ తాజా మిత్రపక్షం జేడీయూ నుంచీ క్యాండిడేట్ ని నిలిపారు. నితీష్ కుమార్ పార్టీ తమ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను బరిలో నిలిపింది. ఈయన గెలుస్తారా అంటే అనుమానమే! గెలిపించుకునే పూర్తి సంఖ్యా బలం బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలకి లేదు. కానీ, తటస్థ పార్టీలు అధికారంలో వున్న తమవైపే మొగ్గు చూపుతాయని మోదీ క్యాంప్ ధైర్యంగా వుంది. మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో టీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీజు జనతాదళ్ లాంటి పార్టీలు రకరకాల మార్గాల్లో మోదీకి సాయమే చేశాయి. కాకపోతే, చిక్కంతా వైసీపీకే వచ్చిపడింది!

 

 

అవిశ్వాసం టైంలో జగన్ ఎంపీలు లోక్ సభలో వుండకుండా రాజీనామాలు చేసి ఇంటికొచ్చేశారు. దాంతో ఓటింగ్ తలనొప్పి వారికి లేకుండా పోయింది. కానీ, రాజ్యసభలో విజయసాయి రెడ్డితో సహా వైసీపీ ఎంపీలందరూ ఇంకా వున్నారు. మరి వీరు బీజేపీ, జేడీయూ అభ్యర్థిగా మద్దతుగా ఓటు వేయాలా వద్దా?  వేస్తే మరోసారి బీజేపీకి సాయం చేశారని టీడీపీ ప్రచారం చేస్తుంది. మీడియాలో పరువు పోతుంది. జనంలోకి తప్పుడు సంకేతాలు పోతాయి. అలాగని ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయక వ్యతిరేకంగా వేస్తే టీడీపీతో సహా కాంగ్రెస్, ఇతర పక్షాలు నిలిపిన మోదీ వ్యతిరేక అభ్యర్థికి సాయం చేసినట్టు అవుతుంది. ఎలా చూసినా వైసీపీకి డ్యామేజే తప్ప లాభం ఏం లేదు! విజయసాయి రెడ్డి తాజా కామెంట్స్ ప్రకారం బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఓటు వేయరట! వ్యతిరేకంగానే ఓటు వేస్తామంటున్నారు! ఇది ఖచ్చితంగా టీడీపీ ప్రెషర్ పాలిటిక్స్ ప్రభావమే. మోదీకి దగ్గరగా వుంటూ ఏ క్షణాన్నైనా ఎన్డీఏలో చేరిపోదామని, వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో మంత్రులు కూడా అవుదామని చూస్తున్న వైసీపీ బ్యాచ్ కి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కూడా కమలానికే మద్దతు పలకాలని అనిపించటం సహజం! కానీ, టీడీపీ లోక్ సభ, రాజ్యసభల్లో హోదా పోరు ఉధృతంగా చేస్తోంది. వైసీపీ అన్ని విధాల వెనుకబడింది. ఇక ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ ఎన్నికలో కూడా చేతులు కాల్చుకుంటే ఆకులు పట్టుకోటం కూడా వృథాయే అని తత్వం బోధపడినట్టుంది. అందుకే, విజయసాయి నిర్ద్వంద్వంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటున్నారు!

 

 

ఈ తాజా రాజ్యసభ ఎన్నికలో తెలుగు పార్టీలైన టీడీపీ, వైసీపీలు పోను టీఆర్ఎస్ మిగిలింది. కేసీఆర్ కి ఇప్పటికే నితీష్ కుమార్ ఫోన్ చేసి తమ పార్టీ అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్ గా గెలిపించమని రిక్వెస్ట్ చేశారట. ఈ మధ్యే మోదీ చేత పొగడ్తలు పొందిన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వరు. కాబట్టి బీజేపీ అభ్యర్థికే ఆయన పార్టీ ఓటుగా భావించవచ్చు! అదే జరిగితే ఎన్డీఏ దిశగా కేసీఆర్ గారి కారు మరింత దగ్గరగా జరిగినట్టే!