జగన్ అమెరికా టూర్ అభిమానుల్లో ఆవేదన మిగిల్చిందా? డల్లాస్ లో అసలేం జరిగింది?

 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చేశారు. ఎప్పటిలాగే పాలనా వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. అయితే, జగన్ అమెరికా టూర్ పై ప్రవాసాంధ్రులు ఏమనుకుంటున్నారు? అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డల్లాస్ సభ అనుకున్నట్లుగానే సాగిందా? లేక ప్రవాసాంధ్రుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందా? జగన్ అమెరికా నుంచి వచ్చేశాక ఇప్పుడిలాంటి ప్రశ్నలేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే, జగన్ అమెరికా పర్యటనను విజయవంతం చేయడంలో ఆర్గనైజర్లు పూర్తిగా ఫెయిలయ్యారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా డల్లాస్ సభలో జరిగిన తప్పులకు లెక్కే లేదంటున్నారు. సభకి జనం బాగానే వచ్చారు. భోజనాలూ బాగానే పెట్టారు. జగన్ స్పీచ్ కూడా ఆకట్టుకుంది. అయితే, జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు, పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడినవాళ్లకు తీవ్ర అన్యాయం జరిగిందట. పార్టీ కోసం ఫండింగ్ ఇస్తూ, వైసీపీ అధికారంలోకి రావడం కోసం తమ వంతు పాత్ర పోషించిన అభిమానులను ఆర్గనైజర్లు అడ్డుకున్నారట. జగన్ ను కలవకుండా అడ్డంకులు సృష్టించారట. జగన్ బసచేసిన హోటల్ దరిదాపులకు కూడా రానివ్వలేదని తెలుస్తోంది. జగన్ అండ్ వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కే కాదు... కమ్యూనిటీ పెద్దలకు కూడా తీవ్ర అవమానం జరిగిందని చెబుతున్నారు. లక్కిరెడ్డి హనిమిరెడ్డిలాంటి పెద్దలు కూడా గంటల తరబడి హోటల్ రూమ్ దగ్గర పడిగాపులు పడినా, కలవనీయకుండా చేశారట. దాంతో జగన్ అభిమానులు, కమ్యూనిటీ పెద్దలు తీవ్ర మనస్తాపానికి అసంతృప్తికి గురయ్యారని ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడినవాళ్లను కాదని, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చారని మండిపడుతున్నారు.

ఇక డల్లాస్ సభలో స్టేజీపై లక్కిరెడ్డికి కుర్చీవేసిన ఆర్గనైజర్లు, ఆ తర్వాత ఆయనను కుర్చీ తీసేసి, స్టేజ్ పై ఒక మూలన నిలబెట్టారు. దాదాపు గంటపాటు స్టేజీపై నిలబడ్డ ఆ పెద్దాయన... చివరికి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇక కమ్యూనిటీ పెద్దలు పైళ్ల మల్లారెడ్డి, ఆటా హనుమంతరెడ్డిదీ ఇదే పరిస్థితి. కనీసం వీళ్లకి సీట్లు కూడా కేటాయించకపోవడంతో, జనరల్ సీటింగ్ లో ఎవరో లేచి కుర్చీ ఇస్తే కూర్చొని సరిపెట్టుకున్నారు. అలా చోటామోటా నాయకులందరికీ డల్లాస్ సభలో తీవ్ర అవమానం జరిగింది. దాంతో తీవ్ర నిరాశ, అసహనం, కోపానికి గురయ్యారు. ఆర్గనైజర్లంతా కుర్రకారు కావడంతో పెద్దలంటే లెక్కలేకుండా కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించారని అంటున్నారు. ఇక వీవీఐపీలకు, ఎన్నారై కమిటీ సభ్యులకు కనీసం ట్యాగ్ లు ఇవ్వకపోవడంతో ఆర్గనైజర్లతో గొడవలు జరిగాయి. ఎవరికి వాళ్లే పక్కనున్న షాషింగ్ మాల్స్ కు వెళ్లి ట్యాగ్ లు తెచ్చుకుని పెట్టేసుకోవడం తీవ్ర గందరగోళం మధ్య సభ జరిగిందట. అలాగే 10లక్షలపైన డొనేట్ చేసిన వారికి జగన్ తో ఫొటో అన్నారు. చివరికి అది కూడా లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, వందల డాలర్లు ఖర్చు పెట్టుకొని, జగన్ కోసం అమెరికా నలుమూలల నుంచి వస్తే, జగన్ ను కలవనీయకుండా ఆర్గనైజర్లు అడ్డుకున్నారని అభిమానులు రగిలిపోతున్నారు.

అయితే, జగన్ టూర్ లో ఆర్గనైజర్ల అరాచకాలను, లోపాలను ఎత్తిచూపుతూ, తమ బాధను చెప్పుకుంటూ ప్రవాసాంధ్రుల నుంచి వైసీపీకి పెద్దఎత్తున ఈ-మెయిల్స్ వస్తున్నాయట. దీనంతటికీ విజయసాయిరెడ్డే కారణమని ఆరోపిస్తున్నారట. విజయసాయి సూచనల మేరకే ఆర్గనైజర్లు అలా చేశారని, ఇందులో చంద్రగిరి ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందంటూ మండిపడుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైమ్ అమెరికా వెళ్లిన జగన్మోహన్ రెడ్డి... తన స్పీచ్ తో అక్కడ అందరినీ ఆకట్టుకున్నా... ఆర్గనైజర్ల అరాచకాలతో తమ ప్రియమైన నేతను స్వయంగా కలవలేకపోయామనే మాత్రం ప్రవాసాంధ్రులను వెంటాడుతోంది.