ప్రభుత్వ నిర్మాణాలకు ఎటు చూసినా వైసీపీ రంగులేనట...

ఏపీలో ఇప్పుడంతా రంగుల రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం హయాంలో అక్కడక్కడా స్థానిక నేతల అత్యుత్సాహంతో వాటర్ ట్యాంక్ లు ఆధునీకరించిన స్మశానాల ప్రహరీలకు పసుపు రంగు పులిమి వేశారు. ఇక వైసీపీ వచ్చాక గ్రామ సచివాలయాలకు తమ పార్టీ పతాకం లోని రంగులైన ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులు వేయాలంటూ ఏకంగా అధికారిక ఉత్తర్వులే ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ చిత్రాన్ని కూడా ప్రదర్శించాలన్నారు. రంగుల ఖర్చు ఇతర లెక్కల సంగతి అటుంచితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటని అధికారులు తలలు బద్దలు కొట్టుకుంటారు. జనవరి 10 న ప్రారంభించి మార్చి నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టుకు విన్నవించింది. ఈ సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ భవనాలు ఆస్తులపైనా పార్టీలకు చెందిన రంగులు నేతల చిత్రాల కనిపించవద్దు. మరి ఇప్పటికే రంగులు పూసేసినమ సచివాలయాలు ట్యాంకులను ఏం చేయాలి అనేది ప్రశ్నగా మారింది. పైగా పంచాయతీ భవనాల్లో పోలింగ్ బూతులు కూడా ఏర్పాటవుతాయి. విగ్రహాలు,జెండా దిమ్మెలు అయితే ముసుగులు కప్పేయవచ్చు.

భవనాల చుట్టూ వేసినా ఆకుపచ్చ తెలుపు నీలం రంగులను మరి ట్యాంకులను మూసివేయడం ఎలా? ఎన్నికల నియమావళిని నిక్కచ్చిగా అమలు చేయాలంటే ఆయా రంగులను చెరిపి వేసి మళ్లీ తెల్లరంగు వేయాల్సిందే, అలా వేయటానికి ఖర్చు తీసేయడానికి మరో ఖర్చు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్లీ రంగులు వేయాలి,మళ్లీ మళ్లీ ఖర్చు పెరగనుంది. గ్రామీణ ప్రజలకు పలు రకాల సేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 12,918 గ్రామ పంచాయతీల్లో 12,000 ల పై చిలుకు సచివాలయాలుగా మార్పు చేసింది. పంచాయతీ భవనాలను సచివాలయ భవనాలుగా మార్చే క్రమంలో ఆ భవనాలకు రంగులు వేస్తున్నారు. అది కూడా ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులో ఉండాలంటూ నమూనా ఫోటోలను కూడా ఉత్తర్వులతో పాటు జతచేశారు. ఈ రంగులు అచ్చంగా వైసీపీ జెండాను పోలి ఉన్నాయి. ప్రభుత్వ భవనాలకు రాజకీయ రంగులు వేయాలని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం ఇదే మొదటి సారి.సర్కారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ నిధులతో ఆ భవనాలకు ఈ రంగులు వేయించారు. ఇది వాటికి భారంగా మారింది. దీంతో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కూడా మరో మెమో జారీ చేశారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అన్నింటినీ ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులోకి మార్చాలని అన్ని జిల్లాల ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇలకు ఆదేశాలిచ్చారు. ఆయన ఆదేశాలను అమలు చేసే క్రమంలో గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు వాటర్ ట్యాంకులను వైసీపీ జెండా రంగులోకి మార్చనున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ప్రభుత్వాస్తులన్నీ వైసీపీ జెండా రంగులోకి మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాలకు ఒక పార్టీకి పోలిన రంగులు వేయడం పై అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వ అధికారులు లెక్క చేయటం లేదు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చిన మెమో రద్దయ్యే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉంటే ఎన్నికల నియమావళి వస్తే పరిస్థితి ఏమిటని అందరిలో తలెత్తనున్న ప్రశ్న.