వైకాపా మడికట్టుకోని ఎందుకు కూర్చోందో

 

రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడగానే వైకాపాకు తగినంత బలం లేకపోయినా, కాంగ్రెస్, తెదేపాలను దెబ్బతీసేందుకయినా తన అభ్యర్ధులను రంగంలో దింపుతుందని అందరూ భావించారు. కనీసం ఒక్క అభ్యర్దినయినా నిలబెట్టి వైకాపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నసీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా నేతలకు వలేసి క్రాస్ ఓటింగ్ కి ప్రోత్సహిస్తుందని అందరూ భావించారు. కానీ తగినంత మంది శాసనసభ్యుల బలం లేనందున తమ అభ్యర్ధులను నిలబెట్టడం లేదంటూ వైకాపా మడి కట్టుకొని కూర్చోవాలనుకోవడం చాలా ఆశ్చర్యకలిగిస్తోంది.

 

ఎదుటవాడివి రెండు కళ్ళు పోతాయంటే తనది ఒక కన్ను పోగొట్టుకోవడానికి కూడా సిద్దపడే వైకాపా ఇంత నీతిగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకు వైకాపా చెప్పిన మరోసాకు కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఇతర పార్టీల బలంమీద ఆధారపడి అభ్యర్థిని నిలబెడితే అది కుమ్మక్కు రాజకీయాల్లో భాగమేనని, విభజనకు అనుకూలంగా మూడు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని న్నది తమ అభిప్రాయమని మైసూరా రెడ్డి ఆరోపించారు.

 

నిరుడు జరిగిన పంచాయితీ, సహకార ఎన్నికలలో వైకాపా తన రాజకీయ ప్రత్యర్దులతోనే కలిసి ఏవిధంగా షేరింగ్ చేసుకొందో అందరికీ తెలుసు. మరిప్పుడు నీతులు ఎందుకు ప్రభోదిస్తుందంటే, బహుశః కాంగ్రెస్ హై కమాండ్ నుండి పోటీకి అనుమతి రాకపోవడం వలననే కావచ్చును. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి వ్యతిరేఖంగా తమ అభ్యర్ధులను నిలబెట్టే ఆలొచనలో ఉన్నారు గనుక, కాంగ్రెస్ తన అభ్యర్ధులను గెలిపించుకోవాలంటే గతేడాది కాంగ్రెస్ లోనుండి వైకాపాలోకి గంపగుత్తగా వెళ్ళిపోయిన కాంగ్రెస్ శాసనసభ్యులందరి మద్దతు అవసరం ఉంటుంది. వారిని కాంగ్రెస్ పార్టీ అనర్హులుగా ప్రకటించినప్పటికీ, నేటికీ వారందరూ కాంగ్రెస్ శాసనసభ్యులుగానే వైకాపాలో కొనసాగుతున్నారు. గనుక, ఇప్పుడు వారి మద్దతు కోరి ఉండవచ్చును.

 

ఒకవేళ వైకాపా తన అభ్యర్ధిని కూడా పోటీలో నిలబెడితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు గనుకనే బహుశః పోటీ చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి పైకి కాంగ్రెస్ పార్టీని, దాని అధిష్టానాన్నిఎంతగా విమర్శిస్తున్నపటికీ, తమ మధ్య జరిగిన రహస్య ఒప్పందం మేరకు దానికి అన్నివిధాల మద్దతు కొనసాగించవచ్చును. కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్ధులకు తగినంత బలం లేనట్లయితే వైకాపా శాసనసభ్యులు వచ్చి వారిని ఆదుకోవచ్చును. ఒకవేళ వైకాపా మద్దతు అవసరం పడకపోతే, వైకాపా యధావిధిగా తన నీతి సూక్తులు వల్లించుకొంటూ, కాంగ్రెస్, తెదేపా, కిరణ్ వర్గాలను విమర్శిస్తూ కాలక్షేపం చేసుకోవచ్చును. మరో రెండు వారాల్లో ఏ సంగతీ తేలిపోతుంది.