మాది చాలా చిన్న పార్టీ: విజయమ్మ

 

ఇంత కాలం కిరణ్ ప్రభుత్వం తమ దయాదాక్షిణ్యాల మీదనే నడుస్తోందని, దానిని జగన్ కనుసైగతో కూల్చేయగలమని భ్రమలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొన్న పెట్టిన అవిశ్వాస తీర్మానంతో తన సత్తా ఏమిటో స్పష్టంగా తెలిసొచ్చింది. ఇంత కాలం వాపును చూసి బలుపనుకొన్న ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా ఉన్న తమ శాసనసభ్యులను బయటకి రప్పించినా కూడా ప్రభుత్వాన్ని కూల్చలేకపోవడంతో నలుగురిలో నవ్వుల పాలయింది. ఆ అక్రోశంతోనే ఆ పార్టీ చంద్రబాబుపై విరుచుకుపడింది.

 

బహుశః చంద్రబాబు ఆ పార్టీకి తన సత్తా ఏమిటో అర్ధం అయ్యేలా చేసేందుకే అవిశ్వాస తీర్మానం విషయంలో చాల ఖచ్చితమయిన నిర్ణయం తీసుకోవడంతో అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణ పాఠం నేర్పింది.

 

ఈ సంఘటనతో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు కూడా పరిస్థితి పూర్తిగా అర్ధం అయినందున, ఆమె ఈ రోజు విద్యుత్ సమస్యపై నిరవధిక నిరాహార దీక్ష చెప్పటే ముందు మీడియా తో మాట్లాడుతూ “మాది చాల చిన్న పార్టీ. తెలుగుదేశం పార్టీ వంటి పెద్ద పార్టీలే ప్రభుత్వాన్ని లొంగ దీయలేన్నపుడు మావంటి చిన్న పార్టీలు చేసే ఈ నిరాహార దీక్షల వలన ప్రభుత్వం దిగివస్తుందని నమ్మకం లేదు. కానీ, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడవలసిన బాధ్యత మాపై ఉంది గనుకనే మేము ఈ రోజు నిరహార దీక్షకు పూనుకోన్నాము” అని ఆమె మీడియాతో అన్నారు.

 

మొత్తం మీద అతివిస్వాసంతో అవిశ్వాసానికి పోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయి ఆత్మన్యూనతా భావంతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి మరో కారణం గత రెండు రోజులుగా హైదరాబాదులో సీబీఐ, డిల్లీలో ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్ చేస్తున్న హడావుడి అని కూడా చెప్పవచ్చును.

 

ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా జగన్ జైలు నుండి విడుదల అవుటాడని అనుకొంటున్న తరుణంలో సీబీఐ అనుబంధ చార్జ్ షీటు దాఖలు చేయడం, యధావిధిగా కోర్టు జగన్ మోహన్ రెడ్డికి మళ్ళీ ఈ నెల 8వరకు రిమాండ్ పొడిగించడం వంటివి ఆ పార్టీ నేతలని, ముఖ్యంగా జగన్ కుటుంబ సభ్యులను చాలా క్రుంగదీస్తున్నట్లు కనిపిస్తోంది.

 

ఇంకా మరో పక్క ‘ఆలూ లేదు, చూలు లేదు కానీ, అల్లుడు పేరు సోమలింగం’ అన్నట్లు ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉండగానే ఆ పార్టీలో చిన్నా పెద్దా నేతలందరూ గ్రూపులుగా విడిపోయి పార్టీ టికెట్స్ విషయంలో గొడవలు పడుతూ మీడియాకు మేతనందిస్తునడటం ఆ పార్టీ అధినాయకులకి మరింత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించింది.

 

ఆ పార్టీ పరిస్థితి మళ్ళీ చక్కబడాలంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అవడం చాల అత్యవసరం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి విడుదల అనుమానమేనని చెప్పవచ్చును. అందువల్ల ఆ పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మేలు. లేదంటే ఆ పార్టీ మరింత సంక్షోభంలోకి కూరుకు పోయే ప్రమాదం ఉంది.