వైఎస్సార్ కాంగ్రెస్‌ అయితే వేషాలివ్వ‌రా?

రాజకీయాల్లోకి సినిమా తారలు వెళ్లడం తెలుగునాట కొత్త కాదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రతిసారీ రాజకీయాల్లో సినిమా తారల గురించి చర్చ జరుగుతుంటుంది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి అగ్ర నటుల సినిమా ప్రయాణంపై రాజకీయాలు ఎటువంటి ప్రభావం చూపవు. చోటామోటా నటీనటుల అవకాశాలపై రాజకీయాలు ప్రభావం చూపుతాయనేది కొందరి మాట.

 

ప్రస్తుతం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వెంట న‌డుస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్న ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ మాత్రం రాజకీయాల ప్రభావం సినిమా అవకాశాలపై వుండదని చెబుతున్నారు. "ఒక నటుడి అవకాశాలపై అతడి రాజకీయ పార్టీ ప్రభావం వుంటుందంటే నేను నమ్మను. ఈరోజుల్లో ఎవరి దగ్గర టాలెంట్ వుంటే వాళ్ల వెనుక పరుగులు పెడుతున్నారు. ఒకవేళ పరిస్థితి మరీ దిగజారి కొన్ని నెలల పాటు నాకు అవకాశాలు రాలేదనుకోండి... ఏం పర్లేదు. ఖాళీగా ఇంట్లో కూర్చుంటా" అని పృథ్వీ పేర్కొన్నారు. 'వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో వున్నాను. అయితే వేషాలివ్వ‌రా? సరే పర్లేదు' అన్నట్టు మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న మరో నటుడు కృష్ణుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ వుంటేనే అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.