కొండకు వెంట్రుకను ముడేసి లాగుతున్నజగన్ పార్టీ

 

లోకం బాధని తన బాధగా అనుకొని మహాప్రస్తానానికి శ్రీకారం చుట్టినవాడు శ్రీశ్రీ. అయన తన మహాప్రస్తానంతో ఆ చంద్రార్కం నిలిచేపోయే కీర్తిని పొందగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన బాధను లోకం బాధగా భావించి జైల్లో ఉన్న తన నాయకుడికోసం మరో ప్రస్తానం చేసిన ఘనత సాధించింది.

 

జైల్లో ఉన్న ఖైదీలను కోటి సంతకాలతో విడిదల చేయించవచ్చుననే ఆలోచన ఆ పార్టీలో ఏమేధావికి కలిగిందోగానీ, కనీవినీ ఎరుగని ఒక వినుత్నమయిన కార్యక్రమానికి పురుడుపోసింది. ఆ మహాయజ్ఞం దిగ్విజయంగా పూర్తిచేసుకొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ కాగితాల కట్టలను మోసుకొనివెళ్లి రాష్ట్రపతికి సమర్పించడానికి ఈ రోజు డిల్లీ బయలుదేరుతోంది. ఈ రోజు సాయంత్రం 6.15గంటలకి రాష్ట్రపతి అపాయింట్మెంట్ పొందిన విజయమ్మ, తన పార్టీకి చెందిన పార్లమెంటు మరియు శాసన సభ్యులతో కలిసి వెళ్లి ఆయనను కలవనున్నారు.

 

అయితే, తమ శ్రమంతా ఏట్లో పిసికిన చింతపండేనని తెలియకనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత శ్రమ పడిందా అంటే కాదనే చెప్పవచ్చును. నాయకుడులేని సైన్యంలా ఉన్న ఆపార్టీ నేతలు, అసలు కదలక మెదలక కూర్చొనేకంటే, ఏదో ఒక దిశలో, తమకు తోచిన దిశలో ముందుకు సాగడం తప్ప ప్రస్తుతం చేయగలిగిందేమీ లేదని గ్రహించడం వల్లనే ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లు కనిపిస్తోంది. పార్టీలో స్తబ్దత పార్టీ కార్యకర్తల దైర్యాన్ని, ఉత్సాహాన్ని కబళించకుండా కాపాడుకొనే ప్రయత్నంగా కూడా దీనిని చూడవచ్చును. ‘ఒక ఐడియాతో జీవితాన్నే మార్చేస్తుంది’ అని అనుకోన్నపటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిన ఈ కోటి సంతకాల ఐడియా జగన్ జీవితాన్నిఎంత మాత్రం మార్చబోదని వారికీ తెలిసే ఉంటుంది. కొండకు వెంట్రుకను ముడేసి లాగితే కదిలితే కొండ కదలవచ్చును, లేదా పోయేది వెంట్రుకే!