జగన్… నంద్యాల నష్టాన్ని దిల్లీలో పూడ్చుకోవాలనుకుంటున్నారా?

ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా? పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తోంది! అందుక్కారణం… ఇవాళ్టితో ప్రచారం ముగిసి త్వరలోనే ఫలితం తేలనున్న నంద్యాల ఉప ఎన్నిక ఒక్కటే కాదు. మరో కారణమూ వుంది! దిల్లీ నుంచి వైసీపీకి వస్తోన్న గ్రీన్ సిగ్నల్స్! జాతీయ మీడియాలో జగన్ ఎన్డీఏలోకి వచ్చేస్తున్నాడని ఒకటే హడావిడి జరుగుతోంది. ఇటు నంద్యాలలోనూ టీడీపీ, వైసీపీ ఫుల్ లెంగ్త్ వార్ లో తలమునకలయ్యాయి. ఈ రెండూ … 2019 ఎన్నికల నాటికి నెలకొనబోయే పరిస్థితులకి కారణం అవ్వనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…

 

ముందుగా మాట్లాడాల్సింది నంద్యాల ఉప ఎన్నిక. సాధారణంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ హడావిడి వుండదు. చనిపోయిన నాయకుడి కుటుంబం వారే మళ్లీ ఎన్నికైపోతుంటారు. కాని, నంద్యాలలో మాత్రం జగన్ సీన్ మొత్తం మార్చేశారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 2019 ఎన్నికలకు సెమీఫైనల్ అంటూ అనవసర బిల్డప్ తీసుకొచ్చారు. దాంతో టీడీపీ కూడా సీటు తమ చేయి జారిపోకుండా వుండేందుకు సీఎంతో సహా పెద్ద పెద్ద నేతలందర్నీ మోహరించింది! అయితే, ఇప్పుడు అధికార పక్షం కన్నా ప్రతిపక్షానికే నంద్యాల టెన్షన్ ఎక్కువగా పట్టుకుంది…

 

నంద్యాలని ప్రెస్టేజ్ ఇష్యుగా తీసుకున్న జగన్ తన అభ్యర్థిని గెలిపించుకుంటే రానున్న ఎన్నికలకి ఉత్సాహంగా ప్రిపేర్ అవ్వొచ్చు. కాని, ఒకవేళ ఓడిపోతే? ఇప్పుడు ఇదే వైసీపీ నాయకుల్ని భయపెట్టెస్తోంది. ఇప్పుడిప్పుడే రానున్న ఎన్నికల మీద ఆశలు పెరుగుతోంటే… ఈ ఉప ఎన్నిక ఓటమి అనవసర నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుందోమోనని ఆందోళన చెందుతున్నారు! ఇక అధికార పక్షం కాబట్టి… టీడీపీకి గెలిస్తే లాభమే తప్ప ఓడితే మరీ దారుణమైన నష్టమంటూ ఏం లేదనే చెప్పాలి!

 

రాష్ట్రంలోని నంద్యాలలో ఒక యుద్ధం జరుగుతోంటే… దేశ రాజధాని దిల్లీలోనూ పావులు కదుపుతున్నారు జగన్! ఆయన గాలి జనార్దన్ రెడ్డి సాయంతో ఎన్డీఏలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని ఆర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ చెప్పింది. అంతకు ముందే బీజేపి నేత ఒకాయన 2019లో తమకు ఎక్కువ సీట్లు ఎవరిస్తే వారితో ముందుకు పోతామని కుండ బద్ధలు కొట్టారు! అంటే… నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ఎదురై వ్యతిరేక పవనాలు వీచినా… ప్లాన్ బీతో రెడీ అవుతోందన్నమాట వైసీపీ!

 

నంద్యాలలో ఓటమి, తరువాత 2019లోనూ జగన్ సీఎం అవ్వటం సాధ్యం కాదని సంకేతాలు వెలువడితే… ఎన్డీఏలో చేరటం ద్వారా దిల్లీలోనన్నా గిట్టుబాటు అయ్యేలా చూసుకోవటం జగన్ ప్లాన్ లా కనిపిస్తోంది. కమలదళానికి ఏపీలో ఎక్కువ సీట్లు ముట్టజెప్పి 2019లోనూ మోదీ సర్కార్ లో భాగం అయితే ఆంధ్రాలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా కొంత వరకూ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఇప్పటికే అయిదేళ్లు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చిన జగన్ పార్టీ నేతలు ఇంకా మరిన్ని సంవత్సరాలు స్టేట్ లో, సెంట్రల్ లో ప్రభుత్వానికి, అధికారానికి బయట వుండటం దుర్భరంగా ఫీలవుతూ వుండవచ్చు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బీజేపిని ఏపీలో బలపర్చి… దిల్లీలో వైసీపీ గిట్టుబాటు చూసుకోటం!

 

జగన్ ఎన్డీఏ ఎంట్రీ, 2019నాటికి బీజేపి ఎవరితో వుంటుంది… ఇలాంటి అనేక కీలక పరిణామాలకి సమాధానం నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెలువడడంతోనే దొరకవచ్చు!