ఆటలో అరటి పండు అయిపోయిన వైసీపీ! 

ఇప్పుడు దేశమంతా పార్లమెంట్ వైపు చూస్తోంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలు అవిశ్వాస తీర్మానం చర్చను శ్రద్ధగా వింటున్నారు. ఏపీ ప్రజలకు ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా గురించి టీడీపీ ఏం చెబుతోంది, బీజేపీ ఏం చెప్పబోతోంది ఈ రోజు తేలిపోతుంది. అలాగే, ప్రత్యేక హోదా గురించి ఇంత వరకూ ఒక్కసారి కూడా అధికారికంగా నోరు మెదపని మోదీ ఏమంటారు? అది కూడా తీర్మానంపై చర్చ చివరకొచ్చే సరికి స్పష్టం కానుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు జనం దృష్టిని ఆకర్షిస్తున్న మరో వ్యక్తి జగన్! ప్రధాన ప్రతిపక్ష నేత అయిన ఆయన జనంలో పాదయాత్ర చేస్తున్నారు. సంతోషమే. కానీ, ఆయన ఎంపీలు ఎక్కడున్నారు? కీలకమైన ప్రత్యేక హోదా గురించి అవిశ్వాసం ముందుకొస్తే వారెక్కడా? ఇదీ సామాన్య ఆంద్రా జనం ఆలోచన!

 

 

జగన్ యువ నేత. ఒక విధంగా చెప్పాలంటే… ఏపీ సీఎం చంద్రబాబు జగన్ పుట్టేటప్పటికే పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఆ అపార అనుభవం ఇప్పుడు కళ్లారా కనిపిస్తోంది! జగన్ వయస్సంత అనుభవం వున్న రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు అటు మోదీని , ఇటు జగన్ ని ఏక కాలంలో కార్నర్ చేశారనే చెప్పాలి. హోదా ఇవ్వని పీఎంని అవిశ్వాసానికి గురి చేయటమే గొప్ప విజయం! స్వంతంగా ఇరవై మంది ఎంపీలు కూడా లేని టీడీపీ ఆ పని చేయగలిగింది. ఇది గొప్ప నైతిక విజయమే. మోదీ ఓట్ల సంఖ్యతో బలపరీక్ష నెగ్గవచ్చు. కానీ, జనం ముందు బాబు తన పోరాట పటిమ నిరూపించుకున్నారు. మరి జగన్ సంగతేంటి?

 

 

జగన్ అనుభవ రాహిత్యం గత నాలుగేళ్లలో ఇది రెండోసారి సుస్పష్టంగా కనిపించటం. ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వున్న ఆయన ఇప్పటికీ డెమొక్రటిక్ పాలిటిక్స్ ఒంట బట్టించుకోవటం లేదు. ఆ మధ్య అసెంబ్లీలోకి కోట్లాది ఓటర్లు తమని నమ్మి అందించిన ఎంట్రీని తనకు తానే దూరం చేసుకున్నారు. పాదయాత్ర అంటూ బయలుదేరి అసెంబ్లీని బహిష్కరించారు. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో కాదు. రోడ్లపై ఉద్యమాలు చేయటానికి ఎన్నికల్లో గెలవటం ఎందుకు? ఎన్జీవోలు స్థాపించుకుని కూడా జనం కోసం పోరాడవచ్చు కదా? ఏపీ ప్రజలు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తే దాన్ని అవతలకి విసిరేసి రోడ్డు మీదకొచ్చి మళ్లీ ఓటేయండి అంటూ పాదయాత్ర చేయటం జగన్ కే చెల్లింది!

 

 

అసెంబ్లీ వేదికగా తన అనుభవ రాహిత్యం నిరూపించుకున్న జగన్ తానే కాక తన ఎమ్మెల్యేలు కూడా జనం కష్టాలు ప్రస్తావించకుండా చేసేశారు. ఇప్పుడు అదే తప్పిదం పార్లమెంట్ వేదికగా ఎంపీల చేత చేయించారు. అనేక నియోజకవర్గాల్లో ఓటర్లు వైసీపీ ఎంపీల్ని ఎందుకు గెలిపించారు? తమ గొంతు దిల్లీలో వినిపిస్తారని! కానీ, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా సమస్యపై జనం తరుఫున మాట్లాడాల్సిన సమయంలో జగన్ ఎంపీలు ఏ ఒక్కరూ లేరు! ఇది ఖచ్చితంగా జగన్ దుందుడుకు నిర్ణయం వల్లే! పార్లమెంట్లో టీడీపీ వాదన, బీజేపీ ప్రతి వాదన జరుగుతుంటే వైసీపీ స్వరమే లేకుండాపోయింది. ఇది చేజేతులారా జగన్ చేసుకున్న నిర్వాకం అనక తప్పదు!

 

 

చంద్రబాబువి సహనంతో కూడుకున్న రాజకీయాలు. జగన్ వి అసహనపు ఎదురు దాడులు. సీఎం అవ్వలేకపోయానన్న అసహనం, త్వరగా ఎన్నికలొచ్చి అధికార పీఠంపై కూర్చోవాలన్న అసహనం అతడ్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. పాతికేళ్లు ఎదురు చూసి సీఎం అయిన తన తండ్రి వైఎస్ చరిత్ర అయినా జగన్ ఒకసారి మననం చేసుకోవాలి. లేదంటే, అసెంబ్లీ, పార్లమెంట్ వేదికలుగా జగన్ ప్రజాస్వామ్యాన్ని , ఓటర్లు వేసిన ఓట్లని అపహాస్యం చేయటం… జనం సీరియస్ గా తీసుకుంటారు!