తేదేపా మీదకు ఫ్లెక్సీ బాణాలు సందిస్తున్న జగన్

 

షర్మిల తానూ జగన్నన వదిలిన బాణాన్నని గర్వంగా చెప్పుకొన్నారు. ఇప్పుడు జైల్లో కూర్చొన్న జగనన్న తెలుగుదేశం పార్టీ మీదకి ఫ్లెక్సీ బాణాలు సందిస్తున్నట్లు ఉంది. మొదట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ బ్యానర్లలో జూ.యన్టీఆర్ ఫోటోలు పెట్టినప్పుడు అదేదో కాకతాళీయంగా జరిగిందని అందరూ భావించారు. కానీ అది ఆ తరువాత కూడా కొనసాగడంతో వైకాపా ఆశించినట్లే మీడియాలో దానిపై తీవ్ర రాజకీయ చర్చ మొదలయింది. నిన్న మళ్ళీ వైకాపా బ్యానర్లలో స్వర్గీయ యన్టీఆర్ ఫోటోలు పెట్టడం, మళ్ళీ ఈ రోజు జూ.యన్టీఆర్ నటించిన బాద్షా సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చీరాల మోహన్ థియేటర్ వద్ద జగన్ తో ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు, తిరువూరు వెంకటేశ్వర థియేటర్ వద్ద కొడాలి నాని, ఎన్టీఆర్, వైఎస్ జగన్ లు ఉన్న ఫ్లెక్సీలు వెలియడంతో ఇదంతా కాకతాళీయం గా జరగట్లేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టే ప్రయంత్నంలో భాగంగానే ఈ వ్యూహాన్ని అమలు చేస్తునట్లు అర్ధం అవుతోంది.

 

దీనిని ఖండించవలసిన జూ.యన్టీఆర్ కనీసం స్పందించకపోవడంతో ఆయన మౌనాన్ని కూడా సద్వినియోగం చేసుకొంటున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత జోరుగా ఈ వ్యూహాన్ని అమలు చేయడం మొదలు పెట్టింది. తద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో, ముఖ్యంగా ఆ పార్టీకి ఆయువుపట్టయిన కృష్ణా జిల్లాలో తానూ ఆశించిన విధంగా గందరగోళం సృష్టించగలిగింది. ఆ పార్టీలో అంతర్గత విబేధాలు చాలా తీవ్రస్థాయిలో ఉన్నందునే ఇంత జరుగుతున్నపటికీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, నందమూరి సోదరులు బాలకృష్ణ, హరికృష్ణలు స్పందించలేకపోతున్నారని, జూ.యన్టీఆర్ మౌనం వైకాపాకు అర్దంగీకారం తెలియజేసినట్లేనని మీడియాలోవస్తున్నవార్తలు, విశ్లేషణలతో తెలుగుదేశం పార్టీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన విధంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

ఇటువంటి నీచ వ్యూహాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా ప్రయోజనం పొందినప్పటికీ, అది ఆ పార్టీ ప్రతిష్టనే దెబ్బతీయక మానదు. ఇంతవరకు మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా బహుశః ఇంత దిగజారి తన శత్రుపార్టీల నేతలను తమ ప్రచారానికి వాడుకోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, వ్యూహాలు ఏవయినప్పటికీ, తెదేపా చెపుతున్నట్లు ఈ వ్యూహం అద్దాల మేడలో కూర్చొని ఎదుటవాడి మీదకు రాళ్ళు విసురుతున్నట్లుంది. ఇది నిజంగా ఆ భావ దారిదారిద్ర్యమేనని చెప్పక తప్పదు. రేపు జూ.యన్టీఆర్ లేదా హరికృష్ణ, బాలకృష్ణలలో ఎవరయినా దీనిని ఖండిస్తూ మాట్లాడితే, అప్పుడు తెదేపా కోసం వైకాపా తవ్వుతున్న గోతిలో ఆ పార్టీయే పడవచ్చును.

 

ఒకవేళ నిజంగా జూ.యన్టీఆర్ లేదా హరికృష్ణలకు చంద్రబాబు, బాలకృష్ణలపై కోపం ఉన్నపటికీ, తమ నందమూరి వంశానికి ప్రతీకగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీని వీడి జగన్ మోహన్ రెడ్డి తో చేతులు కలిపి ఆ పార్టీలో చేరుతారని కలలో కూడా ఆశించలేము.