అభిప్రాయభేదాలు సహజం.. ఒకరినొకరం చంపుకోము

 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు సిట్ దర్యాప్తు జరుగుతుంటే.. మరోవైపు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో హత్యకు కారణం మీరంటే మీరంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. మీడియాలో కూడా ఈ హత్య గురించి రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత పులివెందులలో మీడియా సమావేశం నిర్వహించారు. సిట్‌ నివేదిక వచ్చే వరకూ మీడియా, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని కోరారు.

'మా నాన్నకు ముందు ప్రజాసేవ, తర్వాతే కుటుంబం. పులివెందులలోని ప్రజలంటే ఆయనకు ఎంతో ఇష్టం. కొంత కాలంగా మా అమ్మకు అనారోగ్యంగా ఉండడంతో నా దగ్గరే ఉంటోంది. నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారు. నాన్న చనిపోవడంతో చాలా బాధ కలిగింది. కానీ మీడియాలో వచ్చినవి చూస్తుంటే ఇంకా ఎక్కువ బాధ కలుగుతోంది. మానాన్న ఎంతో హుందాగా బతికారు. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదని అంటుంటాం. ఈ విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదు. మీడియాలో వస్తున్న వార్తలు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని అనిపించడం లేదా? ఈ కిరాతకమైన పని చేసిన వారిని గుర్తించాలి కదా! వారికి శిక్ష పడాలి. సిట్‌ నిరంతరం ఈ ఘటనపై పని చేస్తోంది. సిట్ బృందం నుంచి ఇంకా ఏ సమాధానం రాకుండా ఏది పడితే అది రాసుకుంటూ పోతే సరైన విచారణ ఎలా జరుగుతుంది. ఇది ఎంత మాత్రం సబబు కాదు. ఆయన బతికున్నప్పుడు ఎలా గౌరవించారో.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. 'ప్రతి కుటుంబంలోనూ పొరపొచ్చాలు ఉంటాయి. మా కుటుంబంలో 700 మంది సభ్యులు ఉన్నారు. అభిప్రాయభేదాలు ఉండడం సహజమే. దీనర్థం ఒకరినొకరం చంపుకుంటామని కాదు. అది మా సంస్కృతి కాదు. మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం. ఏటా మా కుటుంబ సభ్యులు ఒకచోట కలుసుకుంటాం. మా లాంటి కుటుంబం ఎక్కడా ఉండదు.' అని సునీత అన్నారు.