జేసీపై ఎంపీగా పోటీ చేయనున్న వైఎస్ షర్మిల!!

 

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పేరు చాలా రోజుల తరువాత మళ్ళీ మొన్న తెరమీదకు వచ్చింది. తన గురించి కొన్ని వెబ్ సైట్లు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షర్మిల గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఆమె రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగనప్పటికీ.. రాజకీయంగా కాస్తో కూస్తో అనుభవం ఉంది. అవినీతి ఆరోపణల కేసులో జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్ర చేసారు. అలాగే వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేసారు. అందుకే వైసీపీ శ్రేణుల్లో షర్మిల మీద సానుకూలత ఉంది. నిజానికి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పోటీకి ఆమె దూరంగా ఉన్నారో లేక జగన్ దూరంగా ఉంచారో తెలీదు కానీ ఆమె మాత్రం ఎన్నికల బరిలో దిగలేదు. తరువాత రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ ఉంచారు. అయితే ఇప్పుడు ఆమె మనసు రాజకీయాలవైపు మళ్లినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట. ఆమె పోటీ పట్ల జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసారు. అయితే ఆ ఎన్నికల్లో విజయమ్మ.. బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఆమె పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో విశాఖపట్నం నుంచి షర్మిలను ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ వైసీపీ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ గెలిచింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక్కడ షర్మిల గెలుస్తుందని నూటికి నూరు శాతం చెప్పలేకపోయినా గెలిచే అవకాశం మాత్రం ఉందని వైసీపీ భావిస్తోంది. ఒకవేళ షర్మిల విశాఖపట్నం నుంచి పోటీ చేయకపోతే.. అనంతపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎంపీగా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సారి కూడా ఆయనే టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవల వైసీపీ పైన, జగన్ పైన జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయనపై తన సోదరి చేత పోటీ చేయించి ఓడించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే జేసీని ఓడించడం అంతా ఈజీ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు షర్మిల విశాఖపట్నం, అనంతపురం కంటే కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ మాత్రం విశాఖపట్నం లేదా అనంతపురం నుంచే బరిలోకి దింపాలని చూస్తున్నారట. చూద్దాం మరి షర్మిల అసలు పోటీ చేస్తారో లేదో. ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడినుంచి పోటీ చేస్తారో ఏంటో.