లోకేష్‌కు జయంతి, వర్థంతికి తేడా తెలియదు

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల సోమవారం ఉదయం వైసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబు పాలన పాతికేళ్లు వెనక్కి నెట్టినట్లు లేదా?. కనీసం మొదటి సంతకాన్ని కూడా ఆయన అమలు చేయలేదు. 87వేల కోట్ల రైతు రుణాలను 24వేల కోట్లకు కురిపించారు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని మంత్రి సునీత అసెంబ్లీలో ప్రకటించలేదా?. పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెట్టడం లేదా?. కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి లాగేసుకోలేదా? అమరావతిలో ఎకరా రూ.4 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.50 లక్షలకు తీసుకున్నారు. రాజధాని భూముల్ని బినామీలకు కట్టబెట్టారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. హైదరాబాద్‌లోని ఇంటి కోసం చంద్రబాబు ప్రజల డబ్బును వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఆరోగ్యశ్రీ లిస్ట్‌ నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రుల్ని తొలగించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి వెళ్తారా?' అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.

'ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.లక్షా 20 వేలు బాకీ పడ్డారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఎక్కడ చూసినా మాఫియా రాజ్యమేలుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలిచ్చారు.. ఈ ఎన్నికల్లో మళ్లీ కొత్త అబద్దాలు, మోసపు హామీలిస్తున్నారు. పాత హామీలు నెరవేర్చకుండా కొత్త మేనిఫెస్టో ఎందుకు?' అని షర్మిల ప్రశ్నించారు. 'బాబు, మోదీ జోడి కలిసి ఏపీకి రావాల్సిన హోదాను ఎగ్గొట్టేశారు. బీజేపీ మన చెవిలో పువ్వులు పెట్టడానికి బాబే కారణం. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని బాబు అన్నారు. హోదాను నీరుగార్చిన చంద్రబాబు.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.' అని మండిపడ్డారు. 'ప్రత్యేక హోదా కోసం జగన్‌ ధర్నాలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టాం. వైసీపీ ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు. ప్యాకేజీ అన్న చంద్రబాబుని యూటర్న్‌ తీసుకునేలా చేసింది జగనే. చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషం. చంద్రబాబుని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుంది.' అని విమర్శించారు.

'చంద్రబాబుకు వెన్నుపోటు, మోసంలో అనుభవం ఉంది. చంద్రబాబు వందలమందిని పొట్టనపెట్టుకున్నారు. చంద్రబాబు హింసావాది, అరాచకవాది. రాజకీయ సినిమాలో పవన్‌ యాక్టర్‌..చంద్రబాబు డైరెక్టర్‌. చంద్రబాబు చెప్పినట్లే పవన్‌ చేస్తున్నారు. డేటా చోరీ గురించి పవన్‌ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు?. పవన్‌ నామినేషన్‌లో పచ్చపార్టీ కేడర్‌ ఉంది. పైకి పొత్తు లేదంటూనే లోపల సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్ కి ఓటేస్తే చంద్రబాబుకి వేసినట్లే.' అని విరుచుకు పడ్డారు. 'బాబు వస్తే జాబ్‌ వస్తుందన్నారు. లోకేష్‌కి జాబ్‌ వచ్చింది. లోకేష్‌కి ఏకంగా మూడు శాఖలు అప్పగించారు. లోకేష్‌కు జయంతి, వర్థంతికి తేడా తెలియదు. ఏ అర్హత ఉందని మూడుశాఖలకు మంత్రిని చేశారు.' అని ప్రశ్నించారు. ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు అని విమర్శించారు.