జగన్ నిజంగా అరాచకవాదేనా..?

ఒక పార్టీకి అధినేత..అందునా రాష్ట్రానికి ప్రతీపక్షనేత..అలాంటి వ్యక్తి నలుగురిలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి. కానీ జగన్‌లో నిఖార్సైన రాజకీయ నేత లక్షణాలు అణుమాత్రం కూడా కనిపించడం లేదు. ఒంటెత్తు పోకడలు, అనుభవ లేమి, బాధ్యతారాహిత్యం, ముందుచూపు లేకపోవడం వల్లే అధికారానికి దూరమయ్యామని..అయినా సరే తమ అధినేతలో కొంచెం కూడా మార్పు రాలేదని వైసీపీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఎన్నో. తాజాగా జగన్ అనుభవలేమి మరోసారి ఆయనను నవ్వుల పాలు చేసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన లారీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అక్కడి వరకు అది మంచి ఆలోచనే..దానిని అభినందించాల్సిందే. కానీ ఏదో బహిరంగసభకు వెళ్తున్నట్లు భారీ కాన్వాయ్‌, మంది మార్భలంతో వెళ్లేసరికి బాధితులు భయపడిపోయారు. ప్రతిపక్షనేత వారిని ఓదారుస్తుండగా ఆయన అనుచరులు నానా రచ్చ చేశారు.

 

జగనన్నా జిందాబాద్..అంటూ హోరెత్తించారు. దీంతో బాధిత కుటుంబాలకు చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడేమైనా పెళ్లి జరుగుతుందా ఇంతమంది వచ్చారు..ఆ జిందాబాద్‌లు ఏంటీ అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఇది చూసిన వారు అనుభవమున్న  రాజకీయనాయకుడికి..అనుభవలేమికి ఇదే తేడా అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జగన్‌ ఎప్పటికీ పోటీపడలేరని..చంద్రబాబు అయితే వేదికల మీద ఉన్నప్పుడు కానీ..ఇలాంటి సందర్భాల్లో కానీ అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు..ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తమ శ్రేణులకు సూచించేవారని. తన సామాజిక వర్గం నేతలను పక్కన ఉంచుకున్నా.. అంతే స్థాయిలో ఇతర సామాజిక వర్గాల నేతలను పక్కనబెట్టుకుని బ్యాలెన్స్ అయ్యేలా చూసుకుంటారు. అలాంటి చిన్నచిన్న జాగ్రత్తలే ఒక నాయకుడిని జనంలో ఉన్నతంగా నిలబెడతాయి..

 

అయినా 14 మంది చనిపోయి ఆ కుటుంబాలు కొండంత దు:ఖంలో ఉంటే అలాంటి చోట జేజేలు కొట్టించుకోవడం ఏంటీ..తమ అభిమాన నాయకుడిని చూసిన ఆనందంలో అభిమానులు అలాగే ప్రవర్తిస్తారు అనుకుంటే వారిని జగన్ అనుచర గణమే  అక్కడికి వాహనాల్లో తరలించింది. అలాంటి వారు మరి జిందాబాద్‌లు కొట్టక ఏం చేస్తారు. వెళ్లేది ఓదార్పు యాత్రకు అని జగన్ మరచిపోయినట్లున్నారు..అందుకే వారు జిందాబాద్‌లు కొడుతుంటే పులకరించిపోయారు తప్పించి పట్టించుకోలేదు. అందుకే అంటారు ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడని..ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా ఉన్నత స్థాయికి వెళతారని రాజకీయ విశ్లేషకుల టాక్.