వైసీపీలో విజయసాయి ప్రకంపనలు... జగన్ ఎలా స్పందిస్తారో?

 

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, అమెరికా పర్యటనలో ఉండగా, ఇక్కడ జరగాల్సిన రాజకీయాలన్నీ జరిగిపోయాయి. వరదలు, పోలవరంపై హైకోర్టు నిర్ణయాలు, అమరావతిపై బొత్స సంచలన వ్యాఖ్యలు, పీఎంవో సీరియస్‌గా స్పందించడం, ఇలా అధికారంలోకి వచ్చి వందరోజులైనా పూర్తికాకముందే, ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వ రథసారథి, పార్టీ అధినేత ...దేశంలో లేని సమయంలో, పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి పరువు నష్టం రాకుండా, చూసుకోవాల్సిన సీనియర్లే, మాటల తూటాలు పేల్చడంతో, వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. 

ముఖ్యంగా, వైసీపీ పార్లమెంటరీ నేత, జగన్ రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి... మోడీ, అమిత్ షాపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అమరావతిపై సంచలన ప్రకటనలు, పోలవరం రీటెండర్లు, విద్యుత్ ఒప్పందాల పున:సమీక్ష, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ.. ప్రకంపనలు సృష్టిస్తుంటే, ఈ నిర్ణయాలన్నీ మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే తీసుకుంటున్నామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం అత్యంత వివాదాస్పదంగా మారింది. పీఎంవో వార్నింగ్ తో జగన్ సర్కారు చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బొత్స కామెంట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు.

మరోవైపు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మాటల వాగ్భాణాలు వదిలిన సీనియర్లు... అధికారంలోకి వచ్చాక మాత్రం విపక్షాల విమర్శనాస్త్రాలకు దీటైన వాగ్భాణాలు వదలడంలో ఫెయిలవుతున్నారనే మాట వినిపిస్తోంది. ఇక ఎలాంటి సంక్షోభం తలెత్తినా, రంగంలోకి దిగే ట్రబుల్ షూటర్లు, ఇప్పుడు వెనకబడుతున్నారని అంటున్నారు. అయితే మౌనం, లేదంటే మాటల మంటలే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని, దాంతో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడుతున్నారు. మొత్తానికి అధినేత రాష్ట్రంలో లేనప్పుడు సీనియర్ల ప్రవర్తించిన తీరుపై పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి అమెరికా టూర్ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్ వీటన్నింటిపై ఎలా స్పందిస్తారోనని వైసీపీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు.