పోసాని మాటల వెనుక వైసీపీ ఉందా? పృథ్వీపై జగన్ కి కోపమెందుకొచ్చింది?

ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీకి ఇంటాబయటా కష్టాలు చుట్టుముట్టాయి. సినీ ఇండస్ర్టీలో ఎంతో మంది ఉన్నా ... ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో పడి.... ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని దక్కించుకున్న పృథ్వీ... అంతే వేగంగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారన్న మాటలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. దాంతో, పృథ్వీపై వైసీపీ అధిష్టానమే గుర్రుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎస్వీబీసీలో పృథ్వీ ఒంటెద్దు పోకడలకు అధికారులు, సిబ్బంది నలిగిపోయినట్లు చర్చ జరుగుతోంది. దాంతో, రంగంలోకి దిగిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పృథ్వీకి కళ్లెంవేసే ప్రయత్నం చేశారన్న మాటలు వినబడుతున్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎస్వీబీసీకి తానే సర్వాధికారిలా పృథ్వీ వ్యవహరిస్తున్న తీరు జగన్ వరకు చేరిందంటున్నారు. దాంతో, వైవీ సుబ్బారెడ్డి నేరుగానే పృథ్వీకి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. తాజాగా పోసాని చేసిన కామెంట్స్ పృథ్వీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయన్న చర్చ జరుగుతోంది.

అసలు, ఎస్వీబీసీలో పృథ్వీ చేపట్టిన నియామకాలు పెద్ద రగడకు దారి తీసిందంటున్నారు. ఏకంగా ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో అభిప్రాయభేదాలు తలెత్తాయని అంటున్నారు. దాంతో పృథ్వీ అధికారాలకు కత్తెర వేసిన వైవీ... అతను చేపట్టిన నియామకాలను రద్దు చేసి ఓ రేంజ్ లో షాకిచ్చారని చెబుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన నియామకాలను గుట్టుచప్పుడు కాకుండానే తొలగించినట్లు తెలుస్తోంది. పృథ్వీ ఛైర్మన్ అయిన తర్వాత, 35మందిని ఎస్వీబీసీలో వివిధ పదవుల్లో నియమించారు. ఈ నియామకాల్లో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే విమర్శలు వచ్చాయి. ఇది సీఎం జగన్ కార్యాలయం వరకు వెళ్లడంతో.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కల్పించుకుని 32మందిని ఒకేసారి తొలగించినట్లు తెలుస్తోంది. దాంతో, వైవీకి పృథ్వీకి మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.... సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న కావడంతో, పృథ్వీ సర్డుకుని పోతున్నాడని అంటున్నారు. మరోవైపు, పృథ్వీ చేపట్టిన నియామకాలను రద్దు చేసిన వైవీ సుబ్బారెడ్డి... ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు మెంబర్ల సిఫార్సులతో నియమితులైన ఐదుగురిని మాత్రం మినహాయించడాన్ని తట్టుకోలేకపోతున్నాడట. అదే సమయంలో తాను నియమించినవారందరినీ తీసేయడంతో వాళ్లకి ఏం సమాధానం చెప్పాలో తెలియక పృథ్వీ తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక, పృథ్వీ టార్గెట్ గా పోసాని పేల్చిన డైలాగులు వెనుక కూడా వైసీపీ పెద్దలు ఉన్నారనే మాట వినిపిస్తోంది. పృథ్వీని కంట్రోల్ చేయడానికి, అదే సినీ పరిశ్రమకు చెందిన పోసానిని వైసీపీ సీనియర్లు రంగంలోకి దించారన్న చర్చ జరుగుతోంది. లేదంటే పోసాని ఈ రేంజ్‌లో పృథ్వీపై ఫైర్‌ అయ్యేవారు కాదన్న మాటలు వినపడుతున్నాయి. మొత్తానికి, అటు పార్టీపరంగా, పదవిపరంగా, వ్యక్తిగతంగా ఎదురవున్న సవాళ్లు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు పృథ్వీ. ముఖ్యంగా పోసాని ఘాటు కామెంట్స్ పృథ్వీని బాగా ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. అయితే, పోసానికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చానని పృథ్వీ భావిస్తున్నా, పోసాని మాటల వెనుక అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారమే మింగుడు పడటం లేదంటున్నారు.