అక్రమ రవాణ చేస్తే 2 ఏళ్ళ జైలు శిక్ష.. ఇసుకపై జగన్ స్పెషల్ ఫోకస్

 

ఇసుక ధరలు, అమ్మకాల, కొరతపై అధికారులతో ఏపీ ప్రభుత్వం సమీక్ష జరిపింది. ఇసుకను ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధమైంది ఆంధ్రా ప్రభుత్వం. ఇసుక అక్రమాలకు పాల్పడినా.. ఎక్కువ ధరకు ఇసుక అమ్మినా.. రెండేళ్లు జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ అక్రమాలకు పాల్పడితే ఆయా రీచ్ లు సీజ్ చేస్తామని తెలియజేసారు. అయితే ఈ నవంబర్ 14 నుంచి నవంబర్ 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం జగన్ చెప్పారు.రెండు రోజుల్లో రేటు కార్డు డిసైడ్ చేసి.. ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ప్రతి జిల్లాలో రేటు కార్డులపై ప్రచారం చేయాలని అధికారులను సూచించారు. ఏపీలో ఇసుక కొరతపై అధికార, ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ విధి విధానాల వల్లే రాష్ట్రంలో ఇంతటి ఇసుక కొరత వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందు కారణంగా రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగం  ఉపాధి లేక రోడ్డున పడిందని..ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జనసేన నేతలు మండి పడ్డారు.

ఇసుక కొరతపై ఇప్పటికే జనసేనాని పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు.చంద్రబాబు దీక్షకు కూర్చోబోతున్నట్లు తెలిపారు. వైసీపీ నేతలు ఇసుక మాఫియా చేస్తున్నారని.. ఇసుక పక్క రాష్ట్రాలకు పంపుతున్నారని టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. వరదల వల్ల ఇసుక సమస్య వస్తే అందుకు ప్రభుత్వం ఎలా కారణమవుతుంది అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.