జగన్ ఆ అధికారిణి విషయంలో ఎందుకు అంత శ్రద్ద తీసుకుంటున్నట్టు ?

 

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలని పరిశీలిస్తే ఆయనలోని అనుభవరాహిత్యం, ఎవరి మాటా  లెక్కచేయని తనం రెండూ ముఖ్యంగా కనిపిస్తున్నాయి. పాలనా పరమైన విషయాలలో ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక రకంగా వాటిని సరిదిద్దుకుని మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది, కానీ అధికారుల నియామకాల విషయంలో ఏమాత్రం పక్షపాతం చూపినా అది ప్రతిపక్షాలకు పెద్ద స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. 

కానీ జగన్ తెలిసో తెలీకో, లేదో ఎవరేం చేస్తారన్న ధీమా వలనో కానీ జగన్ అదే తప్పు చేస్తున్నాడు.సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణి శ్రీలక్ష్మి ని ఏపీ సర్వీస్ లోకి తీసుకోని రావటానికి జగన్ ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారో ప్రభుత్వ అధికారులకి అర్ధం కావటం లేదట. ఏకంగా విజయసాయి రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన అమిత్ షా, మోడీలతో మాట్లాడి మరీ ఏపీకి రావటానికి ప్రయత్నిచడం హాట్ టాపిక్ గా మారింది. 

ఆమె విషయంలో విజయసాయితో పంపి మరీ ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారనేది పెద్ద క్వస్చన్ మార్క్ గా మారింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీ లక్ష్మి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైయస్ మరణం తర్వాత జగన్ మీద నమోదైన అక్రమాస్తుల కేసులలో శ్రీ లక్ష్మీ పై ఓబులాపురం గనుల అవినీతి కేసు సిబిఐ నమోదు చేసింది. 

ఇక ఈ కేసులో శ్రీలక్ష్మి రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం సైతం క్షీణించి అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత ఆమెకు క్లీన్ చిట్ లభించగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఆ తర్వాత సైలెంట్ అయిన ఆమె ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కలిసి పనిచేస్తానని జగన్ ను కలిశారు. ఆమె విషయంలో సానుకూలంగా స్పందించిన జగన్ ఏపీ ప్రభుత్వంలో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అధికారిణికి అది కూడా జగన్ కేసులలోనే జైలుకు వెళ్ళిన అధికారిణికి అవకాశం ఇవ్వడం, పట్ల ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేసే అవకాశం ఉంది. అవినీతి అధికారులను ప్రోత్సహించే జగన్ అవినీతి నిర్మూలన అంటూ ప్రకటనలు ఇవ్వడం రెండిటికీ సింక్ కాదని అంటున్నారు. మరి జగన్ ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారో ఆయనకే తెలియాలి.