అప్పుడు రాళ్ల వర్షం.. ఇప్పుడు ఘన స్వాగతం!!

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో ఎక్కడైతే నిరసన ఎదుర్కొన్నారో ఇప్పుడు అక్కడే ఘన స్వాగతం అందుకున్నారు. ఒకప్పుడు ఆయనపై రాళ్ల వర్షం కురిపించిన వారే ఇప్పుడు ఆయనకు పూలతో స్వాగతం పలికారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయనకు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగన్ కి స్వాగతం చెబుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసారు. అయితే గతంలో ఇదే టీఆర్ఎస్ శ్రేణులు జగన్ పై రాళ్ల వర్షం కురిపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అయిన ప్రాంతానికి సమీపంలోనే మానుకోట ఉంటుంది. కొన్ని సంవత్సరాల కిందట మానుకోట లో టీఆర్ఎస్ వారి నుంచి జగన్ తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ అప్పుడు రైలు  మార్గం ద్వారా మానుకోట ప్రాంతానికి వెళ్లారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయిలో ఉండగా జగన్ అప్పుడు మానుకోటకు రావడాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్ ఉన్న రైలు బోగీపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దీంతో జగన్ ఓదార్పు యాత్రను చేపట్టకుండానే వెనుతిరిగారు.

అలాంటి అనుభవాన్ని పొందిన ప్రాంతానికి సమీపంలోనే ఇప్పుడు జగన్ కి ఘన సత్కారం అందింది. గతంలో రాళ్లు విసిరినవారే ఇప్పుడు పూలతో స్వాగతం పలికారు.