సభా సంప్రదాయాన్ని మరిచిన జగన్.. చంద్రబాబు తీవ్ర అసంతృప్తి!

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయం ప్రకారం.. అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి వుండగా.. ఆ సమయంలో విపక్ష నేత చంద్రబాబు రాలేదు. దీంతో స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పే సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విషయమై విమర్శలు గుప్పిస్తుండగా, చంద్రబాబు దీనిపై క్లారిఫికేషన్ ఇఛ్చారు.

ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేనితో తనకు సత్సంబంధాలున్నాయని, ఆయన పేరును చెప్పగానే తనకు సంతోషం వేసిందని బాబు అన్నారు. 2014లో తాము కోడెల శివప్రసాద్ పేరును అనుకున్న సమయంలో విపక్ష నేతకు సైతం విషయం చెప్పి, ఆయన సంతకం తీసుకున్నామన్నారు. అలాగే ప్రస్తుత అధికార పార్టీ తమను అడుగుతారని భావించామని, అయితే ఎవరూ తమను సంప్రదించలేదని చెప్పారు. కనీసం తమలో ఎవరికైనా చెబితే, ప్రపోజ్ చేయాలని అనుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోడియం స్పీకర్ అయినా, కనీసం 'విపక్షనేత రండి' అని పిలవలేదని.. ఇష్టమైతే రండి, లేకుంటే లేదన్నట్టుగా ప్రభుత్వ ప్రవర్తన ఉందని అన్నారు. ఈ విషయాలను తాను ప్రజలకు చెప్పేందుకే క్లారిటీ ఇస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇది మాత్రమే కాదు.. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక సీఎం జగన్‌ వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సభలో ప్రమాణ స్వీకారం చేశాక సీఎం ప్రతిపక్ష బల్లల వైపు వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి వెళ్లడం ఆనవాయితీ. పోయినసారి సభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ వద్దకు వచ్చి కరచాలనం చేసి వెళ్లారు. గతంలో వైఎస్‌ సీఎం అయినప్పుడు కూడా ఇలాగే చంద్రబాబు వద్దకు వచ్చి వెళ్లారు. ఇప్పుడు జగన్‌ అటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. దీంతో వైసీపీ సభ సంప్రదాయాలను పట్టించుకోవట్లేదంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.