జగన్‌కి బంపర్ ఆఫర్! స్వీకరించక తప్పదా?

 

2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమిత్ షాకి మిత్రుల అవసరం తెలిసి వస్తోందా? పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బీహార్ కు వెళ్లిన ఆయన నితీష్ తో చర్చలు జరిపారు. టిఫిన్ చేస్తూ, లంచ్ చేస్తూ మీటింగ్ లు నడిపిన షా ఎట్టకేలకు కొంచెం నమ్మకం కలిగించగలిగాడు నితీష్ లో. సీట్ల పంపకం సాకుగా చూపి ఎన్డీఏ నుంచి బయటకు రావాలని భావించారు నితీష్. తన అనుకూలాన్ని బట్టి ఇటు వైపు, అటు వైపు గోడ దూకటం జేడీయూ నేతకి మామూలే. కాకపోతే, ఇప్పుడు మోదీ, షా ఆయనని వదులుకునే స్థితి లేదు. అందకే హుటాహుటిన పాట్నా వెళ్లి చర్చల రాజకీయం చేశారు షా. అయినా కూడా నితీష్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని స్థితి!

 

 

బీహార్ నుంచి తెలంగాణకొచ్చిన అమిత్ షా ఎవ్వరూ ఊహించని విధంగా రామోజీ రావును కలిశారు. ఆయనతో ఏం మాట్లాడారు అన్నది సస్పెన్సే! అయితే, రానున్న ఎన్నికల్లో అన్ని దిక్కుల్లోంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలుండటంతో అమిత్ షా ఈ మధ్య చాలా మంది ప్రముఖుల్నే కలుస్తున్నారు. వారిని తమకు మద్దతు తెలపమని కోరుతున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా కూడా అమిత్ షాతో బేటీ అయ్యారట. కానీ, ఇవన్నిటికంటే కీలకమైన వ్యాఖ్యలు అమిత్ షా హైద్రాబాద్ వదిలి వెళ్లాక వచ్చాయి. పైగా అవి కేంద్రంలోని ఓ మంత్రి చేశారు. ఆయన బీజేపీ వాడు కాకపోవటమే ఇక్కడ ట్విస్ట్!

 

మహారాష్ట్రకు చెందిన రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామ్ దాస్ అథావలే. ఆయన ఎన్డీఏలో భాగంగా కేంద్రంలో మంత్రిగా వున్నారు. ఆయన తాజా వ్యాఖ్యల్లో విస్పష్టంగా జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించారు. అలా వస్తే తాము జగన్ ని ఏపీ సీఎం చేసేందుకు కూడా సహకరిస్తామన్నారు! ఇక్కడ తాము అంటే ఎవరో రామ్ దాస్ అథావలే చెప్పలేదు. మహాలో చాలా చిన్న పార్టీ అయిన రిపబ్లిక్ పార్టీ సహకారంతో జగన్ సీఎం అవుతారా? కాదు! అంటే, అథావలే మాట్లాడుతున్నది మోదీ, అమిత్ షాల గురించేననుకోవాలి! వారి సహకారంతో జగన్ సీఎం అవ్వొచ్చునని చెప్పటం… తీవ్రమైన పరిణామామే! ఇంత బహిరంగంగా జగన్ ను తమ కూటమిలోకి రమ్మనటం 2019 ఎన్నికల ఫీవర్ కారణంగానే అనుకోవచ్చు!

 

 

చంద్రబాబు ఎన్డీఏ నుంచీ వెళ్లిపోతే నితీష్ వచ్చాడని షా అన్నారు ఈ మద్య! అదే సమయంలో కేంద్రంలోని మంత్రి జగన్ ను రమ్మంటున్నారు. సీఎం చేస్తామంటున్నారు. అంటే, చంద్రబాబు లేని లోటు జగన్ చేరికతో పూడ్చుకోవాలని కమలం పెద్దలు డిసైడ్ అయిపోయారా? ఇంచుమించూ అదే అనుకోవాలి! కానీ, ఈ బంపరాఫర్ కి జగన్ ఎలా స్పందిస్తారు? ఇప్పటికే టీడీపీ జగన్ని, విజయసాయిరెడ్డిని మోదీ మనుషులంటూ ప్రచారం చేస్తోంది. అలాగే, ప్రత్యేక హోదా ఇవ్వని హిందూత్వ పార్టీతో జగన్ చేతులు కలిపితే ఆంద్రా ప్రజలు , ముఖ్యంగా, మైనార్టీలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? టీడీపీ క్యాష్ చేసుకోకుండా వుంటుందా? జగన్ ను వెనక్కి పట్టి వుంచే ప్రశ్నలు ఇవే!

 

 

జగన్ కు రాజకీయంగా కొంత డ్యామేజ్ వున్నా రిస్క్ చేసి ఎన్డీఏలో చేరతాడనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన మీద వున్న కేసులే ఇందుకు కారణం అవుతాయని వారి అంచన. మోదీ, షా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వైసీపీని లొంగదీసుకోవచ్చిన అనుమానిస్తున్నారు! చూడాలి మరి… జగన్ ఎన్డీఏలో చేరితే… అది చంద్రబాబుకి, టీడీపికి పెద్ద ప్లస్ పాయింటే అవుతుంది!