కొందరి కోసం లక్షల మందిని దూరం చేసుకుంటున్న జగన్!!

 

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా లక్షకు పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించడం రికార్డు అని ఏపీ ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. సచివాలయాల వ్యవస్థతో తమ పార్టీకి ఇటు యువతలో, అటు గ్రామ ప్రజల్లో బోలెడంత మైలేజ్  వస్తుందని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ప్రజల అభిప్రాయం పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు.. సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీ, ఒకే సామజిక వర్గానికి పెద్ద పీట ఇలా పలు కారణాలు ఉన్నాయి అంటున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. దాదాపు 20 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లక్ష మందికి పైగా (1,26,738) ఎంపిక అయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ లోపంతో ఎక్కువ మంది అర్హతలేని వారు ఉద్యోగానికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, తన సానుభూతి పరులకు ముందే పేపర్ లీక్ చేసి పరీక్ష రాయించారని ప్రచారం జరిగింది. మొదటి 250 ర్యాంకుల్లో ఒకే సామజిక వర్గానికి చెందినవారు 190 కి పైగా ఉండటంతో లీకేజీ అనుమానాలు బలపడ్డాయి. దీంతో స్వల్ప తేడాతో ఉద్యోగం చేజారిన వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అర్హులైన వారిని పక్కనపెట్టి.. తమ పార్టీ సానుభూతిపరులకు, తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్ భావిస్తున్నట్లు సచివాలయాల వ్యవస్థ వల్ల అధికార పార్టీకి మైలేజీ వస్తుందన్న సంగతి పక్కన పెడితే.. బోలెడంత నెగటివ్ ఇమేజ్ వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరీక్ష నిర్వహణ లోపం, ఫలితాలపై కులముద్ర పడటంతో మిగతా కులాల వారిలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 18 లక్షల మందికి పైగా నిరాశ తప్పలేదు. ఎంపికైన లక్షమంది మరియు వారి కుటుంబాలు జగన్ సర్కార్ పట్ల ఎంత సానుకూలంగా ఉంటారో.. అంతకు పదింతలు ఎంపిక కాని లక్షల కుటుంబాల వారు జగన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండే అవకాశముంది. పరీక్ష నిర్వహణ లోపం వల్లే తమకు ఉద్యోగం దక్కలేదని మెజారిటీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అది జగన్ సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంపిక కాని అభ్యర్థులు జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ మీద సోషల్ మీడియా ప్రభావం బలంగా ఉంది. అంతెందుకు వైసీపీ అధికారంలోకి రావడంలో కూడా సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడదే సోషల్ మీడియాలో యువత జగన్ సర్కార్ పై తిరగబడుతోంది. ఇది మరింత ఉధృతమైతే వైసీపీకి తీవ్ర నష్టమని చెప్పక తప్పదు.

ఓ రకంగా సచివాలయ వ్యవస్థ కూడా ఇసుక మాదిరిగానే లక్షల కుటుంబాలపై ప్రభావం చూపి వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనుందని చెప్పాలి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. లారీ డ్రైవర్లు, కూలీలు ఇలా లక్షల కుటుంబాలు పని దొరక్క రోడ్డున పడ్డాయి. వారంతా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సచివాలయ ఉద్యోగాలు దక్కని అభ్యర్థుల కుటుంబాలు కూడా చేరితే.. జగన్ మరింత గడ్డు కాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.